ఈరోజు గాంధీ మహాత్ముని జయంతి.
అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీకి హృదయపూర్వక అభివందనాలతో...
అహింసే ఆయుధంగా సత్యమే జీవన పధంగా స్వజాతిని,స్వదేశాన్ని సత్యాగ్రహం ద్వారా ప్రభావితం
చేసిన మహాత్ముడు మనకందరికీ ఆదర్శం.
మంచితనం,నీతి,నిజాయితీ,పరమత సహనం,శాంతి,సమత,మమత గాంధీ సూత్రాలు.
చెడు మాట్లాడకు
చెడు వినకు
ఈ మూడు గాంధీ మహాత్ముని సిద్ధాంతాలు.
చెడు వినకు
ఈ మూడు గాంధీ మహాత్ముని సిద్ధాంతాలు.
కానీ బాపూ ఈ చెడు అనే దాని గురించి నాకు చాలా సందేహాలు వస్తున్నాయి ఈ మధ్య....నువ్వు తీర్చగలవా?
మా వారి సిద్ధాంతం ప్రకారం మంచి చెడు నువ్వు చూసే దృష్టిలోనే వుంటాయి ఎక్కడో కాదు అంటారు.
కానీ జరుగుతున్న కొన్ని సంఘటనలు నాకెందుకో చెడుగా అనిపిస్తున్నాయి బాపూ...
అది నా తప్పేనంటావా?
ప్రస్తుత కాలంలో మంచి, చెడులకి ఒక్కక్కరి నిర్వచనం ఒక్కోలా వుంటుంది.
"ఒకరికి చెడు అనిపించింది ఇంకొకరికి మంచి అనిపిస్తుంది"
"ఒకరికి మంచి అనిపించింది ఇంకొకరికి చెడు అనిపిస్తుంది"
మరి మంచి చెడులను నిర్ధారించగలిగే వారెవరు?
ఆడవాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని నువ్వన్నావు.
కానీ బాపూ ఇప్పుడు పట్టపగలు కూడా ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి రావాలంటే భయపడే రోజులు వచ్చాయి.
బయటే కాదు బాపూ ఇంట్లో వున్నా రక్షణ లేని రోజులు.
మారిన కాలాన్ని బట్టి ఆడపిల్లలు కూడా మగవారితో సమానంగా చదివి ఉద్యోగాలు చేస్తున్నారు.
కానీ చదువుకునే చోట,ఉద్యోగాలు చేసే చోట ఆడవారికి ఎన్నెన్నో వేధింపులు.
ప్రేమ పేరుతో మోసాలు, వేధింపులు నిరాకరిస్తే దాడులు.
సరే ఎంత చదివించినా పెళ్లి చేయాలి కదా ఆడపిల్లని బయటికి పంపిస్తే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని
భయపడి అమ్మాయికి మంచి సంబంధం చూసి ఎంతో కట్నాలు ఇచ్చి పెళ్లి చేసినా
అక్కడా అత్తా,మామల వేధింపులు,భర్త సాధింపులతో విసిగిపోయిన భార్యలు,భర్తల ఇంటిముందు ధర్నాలు,మౌనపోరాటలు ఎన్ని చేసినా చెవిటి వాడి ముందు శంఖంలా వుంది బాపూ... నేటి ఆడవాళ్ళ పరిస్థితి.
పైగా మగవాళ్ళు ఆడవాళ్ళు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళకే ఎందుకు చట్టాలు సహకరించాలి
అంటూబాధపడిపోవటం...
ఆడవాళ్ళు అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మీరు అన్నప్పుడు
అప్పటి మగవాళ్ళు ఎవరూ ఇలా ఆడవాళ్ళకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని మీతో వితండవాదం చేసి వుండరుకదా...బాపూ
మరి ఇప్పటి వాళ్ళు ఎందుకు ఇలా వున్నారు ?
బాపూ మీరు లాయర్ కూడా కదా నేను కూడా లా చదివినా నాకెందుకో ప్రాక్టిస్ చేయాలనిపించలేదు.
ఈ మధ్య కోర్టుల్లో జరుగుతున్న ఒక్కో సంఘటనా ఒక్కో చెరగని మచ్చగా న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో వున్న నమ్మకాన్ని కోల్పోతుంది.
న్యాయనిర్ణేత అంటే భగవంతుడితో సమానం కానీ ఈ మధ్య ఒక జడ్జి మీద ఒక మహిళా స్టెనో చెప్పు విసిరింది
ఇంత సాహసానికి ఆమె తెగించింది అంటే దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో మరి??
కొందరు జడ్జి లు ఇంక్రిమెంట్ల కోసం LLM చదవాల్సి రావటంతో చదవలేక,ఇంక్రిమెంట్లను వదులుకోలేక
పరీక్షల్లో కాపీ కొడుతూ టీవీ కెమెరాలకు చిక్కారు బాపూ...
పీజీ చదవటానికే ఇన్ని అడ్డదార్లు తొక్కిన వాళ్ళు ఇంక ఈ వుద్యోగం తెచ్చుకోవడానికి ఎన్ని అడ్డదార్లు తొక్కారో అనిపించింది...
ఇంక కోర్ట్ ని దేవాలయంగా భావించాల్సిన న్యాయవాదులు Professional Ethics ని కూడా వదిలేసి కోర్ట్ లో రికార్డులని ధ్వంసం చేసిన సంఘటన ఎంతో దురదృష్టకరమైన సంఘటన.
స్వార్ధం నిలువెల్లా నిండి వున్న ఇలాంటి జడ్జి లు,లాయర్లు ప్రజలకి ఏమి న్యాయం చేస్తారంటారు బాపూ...
ఎందరు దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు ఇది ఒకప్పటి మాట
ఎందరు నిర్దోషులనైనా శిక్షించవచ్చు కానీ ...
డబ్బు,సంఘంలో పలుకుబడి,రాజకీయ నేపధ్యం వున్న ఏ ఒక్క నేరస్తుడికీ శిక్ష పడకూడదు.
ఇది ఇప్పటిమాట...
ఇవన్నీ ఏవో కొన్ని సంఘటనలు మాత్రమే...
అవినీతి,లంచగొండితనం,బంధుప్రీతి,రాజకీయ కుట్రలతో నిండిపోయిన నేటి
సమాజంలో జరుగుతున్న ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో...
ఇదంతా నాకు చెడుగా అనిపిస్తుంది
ఇది నిజంగా చెడేనా లేక నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా???
నా ద్రుక్పధంలోనే తేడా ఉందా ???
ఇది మీ మాట బాపూ..
మరి ప్రస్తుత సమాజంలో చెడుని నిర్మూలించాలి అంటే ఏమి చేయాలి??ఏమి చేయగలం??
మరి ప్రస్తుత సమాజంలో చెడుని నిర్మూలించాలి అంటే ఏమి చేయాలి??ఏమి చేయగలం??