కొన్ని ప్రదేశాలు ,కొన్ని సంఘటనలు , కొందరు మనుషులు , కొన్ని సినిమాలు,కొన్ని పాటలు ఇలా కొన్నిటికి జీవితంలో చాలా గొప్ప స్థానం వుంటుంది .. ఎక్కడ ఎప్పుడు వాటిని చూసినా, విన్నా మనసు గతంలోకి దూసుకు వెళ్ళిపోవటం ఖాయం .. వాటిలో కొన్ని సంతోషించే విషయాలైతేకొన్ని బాధ పెట్టేవి కూడా ఉంటాయనుకోండి..
ఇంతకీ ఇప్పుడు నన్ను అలా వర్తమానం నుండి గతం లోకి లాక్కెళ్ళిన విషయం ఏంటంటే ..సమ్మర్ హాలిడేస్ ఎజాయ్ చేయటం ఒక ఎత్తైతే రాబోయే పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూడటం ఒక ఎత్తు ..మొన్న పదవ తరగతి నుండి డిగ్రీ,ఇంకా రకరకాల పరీక్షా ఫలితాల వరకు పిల్లల ఆత్రుత, హైరానా ..
ఫలితాల కోసం ఎదురు చూసి చూసి కోరుకున్న ఫలితం రాగానే ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్న విద్యార్ధులు వాళ్ళ తల్లిదండ్రులు...
ఇవన్నీ చూసి నా 10 th క్లాస్ రోజులు గుర్తొచ్చాయి.. నాకు అన్ని సబ్జెక్ట్స్ బాగానే వచ్చేవి కానీ లెక్కలు అంటే మాత్రం దేవుడా ఈ గండం ఎలా గట్టెక్కాలా అనేంత కష్టంగా ఉండేది.. లెక్కలు బాగా చేసే వాళ్ళని చూసి అకారణంగా కోపం కూడా వచ్చేది .అలాగే 10 th క్లాస్ దాకా వచ్చాక నేను తీసుకున్న బలమైన నిర్ణయం లెక్కలు లేని సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ తీసుకోవాలని కానీ ఆ పని చేయాలంటే ముందు ఈ పది గట్టెక్కాలి కదా!
మరి అందుకు నా ప్రయత్నం నేను చేయాలి కదా ..
దేవుడి మీద భారం వేసి పరీక్షలకు సిద్ధమవుతుండగా నా ప్రయోజకత్వం తెలిసిన అమ్మా,నాన్న వూరి నుండి మా పెద్దనాన్న పిల్లలైన అన్నయ్యల్ని రంగంలోకి దించారు నాకు లెక్కలు చెప్పటానికి... వాళ్ళు అప్పటికే డిగ్రీలు,పాలిటెక్నిక్ లు చదివేసి వుండటం తో వాళ్ళ మీద అపారమైన నమ్మకంతో ఈ బాధ్యతను వాళ్లకి అప్పగించాడు నాన్న... నాకు లెక్కలు రావని వాళ్లకు చెప్పి అవమానించారనే బాధ,వాళ్ళు చెప్పే లెక్కలు నేను చేయలేకపోతే వాళ్ళ ముందు చులకన అనే బాధ, ఇలా అన్ని రకాల బాధలతో అన్ని పరీక్షలతో పాటు లెక్కల పరీక్ష రోజు రావటం, పరీక్ష రాయటం అన్నీ అయిపోయాయి..
ఇంక సమ్మర్ హాలిడేస్ వూరి నుండి వచ్చిన పిన్ని వాళ్ళ పిల్లలు,మా బంధువుల్లో పిల్లలు,పెద్దల పంచాయితీలతో వేగంగా గడిచిపోయింది. రిజల్ట్స్ రోజు రానే వచ్చింది .. నాకు మాత్రం లెక్కలు పాసవుతాననే నమ్మకం ఎంత గట్టిగావుందో తప్పుతాననే నమ్మకం కూడా అంతే వుంది .. నా పరీక్షల టెన్షన్ నాకంటే అమ్మ,నాన్న,నా లెక్కల గురువులు (అన్నయ్యలకి) ఎక్కువై పోయింది ,, అప్పట్లో రిజల్ట్స్ పేపర్ లోనే వచ్చేవి కదా .. పేపర్ కోసం మా తమ్ముడు ,అన్నయ్య ముందే వెళ్లి పడిగాపులు పడి పేపర్ తెచ్చారు ..
అందరూ ఎంత టెన్షన్ పడుతున్నా హాయిగా నిద్రపోతున్న నాకు మాత్రం ఇవేమీ పట్టలేదు ... ముందుగా వాళ్ళే నా రిజల్ట్స్ చూసి నన్ను నిద్రలేపి చెప్పిన విషయం ఏమిటంటే నేను పాసయ్యానని .. నాకు ముందు నమ్మకం కలగలేదు పేపర్ లో నా నంబర్ చూసే దాకా ..ఒక్క లెక్కల్లోనే తక్కువ మార్కులు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ మంచి మార్కులతో పాసయ్యాను ..
తల్లీ నీ పరీక్షలాగా లేదమ్మా హాయిగా నిద్రపోయావు .. అసలు నిద్రెలా పట్టిందే నీకు .. అంటే నేను నిద్రపోకపోతే మాత్రం జరగాల్సిందే జరుగుతుంది కదా .. అనుకున్నాను మనసులో :) ... ఇంక నేను పాస్ అయినందుకు మా అమ్మా,నాన్న స్వీట్స్ పంచటం, భోజనాలు పెట్టటం ... పదికే ఇంత హడావుడా అని కొందరు నవ్వుకోవటం .. ఇవన్నీ ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది కానీ అప్పుడు అనుభవించిన టెన్షన్ , సంతోషం,మన అనుకున్న వాళ్ళందరూ మన బాధలో, సంతోషం లో తోడుండటం ఇవన్నీ నిజంగా మరిచిపోలేని గొప్ప జ్ఞాపకాలు కదా అనిపిస్తాయి ..
ఎంతైనా
జ్ఞాపకాలే మైమరపు... జ్ఞాపకాలేమేల్కొలుపు..
జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు.