పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

28, అక్టోబర్ 2011, శుక్రవారం

కాణిపాకం To విష్ణుకంచి - 7 శ్రీపురం గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్ అనగానే ఇంతకుముందు అమృతసర్ లోని సిక్కు దేవాలయమే గుర్తుకు వచ్చేది
కానీ ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అనగానే సుమారు 600 కోట్లు ఖర్చు పెట్టి మన భారత దేశంలో కట్టిన
నారాయణీ పీఠం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దానికి పోటీగా నిలుస్తుందని చెప్పొచ్చు
తమిళనాడులోని వెల్లూర్ కి 6 కిలోమీటర్ల దూరంలో తిరుమలైకొడి లో ఈ శ్రీపురం స్వర్ణ దేవాలయం కొలువై వుంది.
ఇక్కడ కూడా తిరుమల లాగానే స్ట్రిక్ట్ రూల్స్ వున్నాయి. ఫోన్స్ కానీ కెమెరాలు కానీ లోపలి తీసుకెళ్ల కూడదు.
మగవాళ్ళను,ఆడవాళ్ళను వేరు వేరుగా చెకింగ్ చేసిన తర్వాత క్యూ లైన్ లో పంపిస్తారు..
శ్రీచక్రం ఆకారంలో వున్న కారిడార్లో నడుస్తూ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి.దర్శనానికి వెళ్ళే దారి అంతా అందమైన ల్యాండ్ స్కేప్స్,చక్కని సీనరీస్,పార్క్,మంచి కొటేషన్స్ తో వున్న బోర్డులు,వివిధరూపాల్లో వున్న అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ చూస్తూ వెళ్తూవుంటే నడిచిన అలసట తెలియకుండా చేస్తాయి.
ఆలయం సమీపానికి రాగానే ఆ బంగారు ఆలయం వెలుగులు మనల్ని మరోలోకంలోకి
తీసుకెళ్ళినట్లు అనుభూతి చెందుతాము.
చుట్టూ ఆవరించిన నీటిలో మధ్యలో సువర్ణ శోభితమైన ఆ ఆలయాన్ని చూడటానికి
రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా వుంది.
పైగా మేము రాత్రి సమయంలో వెళ్ళటంతో ఆ బంగారు కాంతులకు విద్యుత్ దీపాల కాంతులు తోడై
ఆ అమ్మవారి మణి ద్వీపమే ఈ నేలమీదకి వచ్చిందా అన్నట్లు అనిపించింది..
అమ్మవారి దర్శనం బాగా జరిగింది.ఆ అమ్మవారి మీదనుండి చూపులు మరల్చుకోలేనంత
మనోహరంగా వుంది శ్రీ నారాయణీ మాత..
దర్శనం తర్వాత అక్కడ కారిడార్లోనే అమ్మవారి పూజకి ఉపయోగించే రకరకాల సుగంధ ద్రవ్యాలు,
పూజా సామాగ్రి అమ్మే స్టాల్స్ వున్నాయి..అవి తీసుకున్నాము.
ఇక్కడ తీసుకున్న ధూప్ స్టిక్స్,బత్తీలు అపూర్వమైన సువాసనతో వున్నాయి..
కుంకుమ కూడా మొగలి పూల వాసనతో చాలా పవిత్రమైన భావన కలిగించేలా వున్నాయి..
ఇక్కడ కూడా రకరకాల పిండి వంటలే ప్రసాదాలుగా అమ్ముతారు
అవి కూడా కొన్నాము.. ముఖ్యంగా నాకు నచ్చిన ప్రసాదం శ్రీ మధు అనే లడ్డు ప్రసాదం..
ఇక్కడ ప్రసాదాలన్నీ చాలా బాగున్నాయి.
బయటికి రాగానే శ్రీ అన్నపూర్ణ మండపంలో పుదీనారైస్ ప్రసాదం పెట్టారు...
మొత్తానికి శ్రీపురం వైభవాన్ని మాటలతో వివరించలేము..
దైవానుగ్రహము ఉన్నవారి వలన మాత్రమే ఇటువంటి అద్భుత సృష్టి సాధ్యమవుతుంది.
ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ కృప శ్రీపురంలో నిండి వుందని చెప్పొచ్చు..
ఒక అపూర్వమైన అనుభవం ఈ శ్రీపురం దర్శనం..
అక్కడ నుండి వెల్లూరు వచ్చి భోజనాలు చేసి కంచి బయలు దేరాము..

శ్రీపురం గోల్డెన్ టెంపుల్




కాణిపాకం To విష్ణుకంచి - 6 సాతనూర్ డామ్


తిరువన్నామలై నుండి 30 కిలోమీటర్ల దూరంలో వున్న మరొక చూడదగిన ప్రదేశం సాతనూర్ డామ్..
1958 వ సంవత్సరంలో కట్టిన ఈ డామ్ లో 1960-1980 లలో ఎన్నో సినిమాల షూటింగ్స్ కూడా జరిగేవట.
తిరువన్నామలై నుండి బయలుదేరి డామ్ చేరుకోవటానికి తమిళనాడులోని పల్లెటూర్లు,
పచ్చటి పొలాల మధ్య సాగుతుంది ప్రయాణం ..
ఇక్కడ అందమైన పార్క్ లు,లాన్ లు,అందమైన విగ్రహాలు
బోటింగ్ లతో చాలా ఆహ్లాదకరంగా వుంది..
పిల్లలతో ఎంజాయ్ చేయటానికి చక్కగా ఉపయోగపడే ప్రదేశం.








కాణిపాకం To విష్ణుకంచి - 5 అరుణాచలం (తిరువన్నామలై )

సెప్టెంబర్ 5 ఉదయం రమణ మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరి అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళాము.
అరుణాచలం ఈ దేవుడిని దర్శించుకోవాలని మా చిరకాల వాంఛ...
జెమిని టీవీ లో శివయ్యగా,సన్ టీవీలో అన్నామలై గా వచ్చిన సీరియలో అరుణాచలం గుడిని
చూసి ఈ గుడి ఎంత బాగుంది ఎప్పటికైనా తప్పకుండా చూడాలి అని అనుకునేవాళ్ళం..
మా కోరికను శివయ్య అనుకోకుండా తీర్చటం మా పూర్వజన్మ పుణ్య ఫలం అని చెప్పొచ్చు..

అరుణాచలం
ఎక్కువగా ఋషులు,జ్ఞానులు ఈ అరుణాచలానికి వస్తుంటారని అతిథి ఆశ్రమంలో
మదర్ సౌమ్య చెప్పారు..వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం
పంచభూతాలలో ఒకటైన అగ్నిగా శివుడు వెలసిన క్షేత్రం అరుణాచలం.
అహంకారమనే చీకటిని తొలగించటానికి భగవంతుడు జ్యోతి స్వరూపమై వెలసి,
పర్వతంగా
నిలచిన మహిమాన్వితమైన క్షేత్రం అరుణాచలం.
అరుణాచలం స్వయంగా శివుడే..ఇక్కడ భగవంతుడైన శివుడు పర్వతరూపంలో వున్నాడు..
ప్రతి కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక సంతతి వారు మాత్రమే కొండపైకి వెళ్లి దివిటీలతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు.
ఈ అఖండ జ్యోతి మూడు రోజుల పాటు వెలుగుతుంది.

ఈ కొండపై ఎన్నో ఔషద గుణాలు కలిగిన వనమూలికలు లభిస్తాయి.ప్రతి పౌర్ణమి రోజుకి చంద్రకిరణాలు సోకి
మూలికలు అమృతత్వాన్ని పొంది ఆ మూలికల పైనుండి వీచే గాలిని పీలిస్తే ఎటువంటి వ్యాధులైన నయమవుతాయని నమ్మకం అక్కడ.అందుకే ప్రతి పౌర్ణమికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి చెప్పులు లేకుండా అరుణగిరికి ప్రదక్షిణ చేస్తారట.
భక్తులు ముందుగా సుమారు 16 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన అరుణాచలానికి ప్రదక్షిణ చేసి అప్పుడు
ఆలయంలోకి
వెళ్తారు.
కొందరునడిచి,చేతకానివాళ్ళు వివిధ వాహనాల మీద అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.
మేము కూడా మా వెహికల్ లోనే అరుణాచలం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఆలయానికి బయలుదేరాము..
అరుణగిరి ప్రదక్షిణ
ఆలయానికి వెళ్ళీ వీధులన్నీ చాలా రద్దీగా వున్నాయి.ట్రాఫిక్ చాలాఎక్కువగానే వుంది.
గుడికి కొంత దూరంనుండే ఆలయప్రధాన గోపురం కనపడుతూ వుంది.
దగ్గరికి వెళ్ళేకొద్దీ ఆలయ గోపురం నేలంతా విస్తరించి,గోపుర కలశాలు ఆకాశంలోని మబ్బులను
తాకుతూ మనసును ఏదో తెలియని ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది.
నేను అనుభవించిన ఆ అనుభూతిని నేను మాటల్లో ఇంకా సరిగా చెప్పలేకపోతున్నాను.
ఎంతగా
తలెత్తి చూసినా పూర్తిగా కనపడనంత ఉన్నతంగా ,అపూర్వమైన శిల్పసంపదతో
అలరారుతున్న
ఆ గోపురం అందం నేను వర్ణించలేనేమో ..
ఆలయం ప్రధాన గోపురం
ఇక్కడ నాకు నచ్చిన మరో విషయం అందమైన పూలు,పూల మాలలు..
చాలా తక్కువ రేటుకే గులాబీ, కలువ పూలదండలు ఎంతో అందంగా కట్టి అమ్ముతున్నారు..
మేము కూడా పూలదండలు,పూజా సామాగ్రి కొనుక్కుని ఆలయంలోకి వెళ్ళాము..
ఆలయంలోకి వెళ్ళగానే వెనుక అరుణాచలం దాని ముందే ఆలయ శిఖరాలతో గోపురాలు,
మండపాలు ,అపురూపమైన శిల్పకళా సౌందర్యంతో,పరిశుభ్రమైన ఆలయప్రాంగణం
కన్నులపండువగా అలౌకికమైనఆనందాన్ని కలిగించేలా వుంది.
ఆలయంలోపలి ప్రాంగణం
ముందుగా అరుణాచలేశ్వరుని ఆలయంలోకి వెళ్ళాము అక్కడ గర్భగుడిలో పూజలు చేయించి,
సుమారు పావుగంట గర్భగుడిలో కూర్చున్న మా అందరికీ వొళ్ళంతా చెమటలు పట్టేసాయి..
అప్పుడు అక్కడ పూజారి చెప్పిన స్థల పురాణం ప్రకారం అరుణాచలేశ్వరుడు పంచభూతాలలో
ఒకటైన అగ్నిలింగమని అందుకే అక్కడ ఎప్పుడు అలాగే వేడిగా ఉంటుందని తెలిసింది.
ఇంక అక్కడ పూజ అయిపోగానే స్వామివారి విభూది,కుంకుమ,ప్రసాదాలు తీసుకుని అమ్మవారి

దర్శనానికి వెళ్ళాము.
శివునిలో అర్ధ భాగం కోసం కఠోరమైన తపస్సు చేసి సాధించుకున్న అమ్మవారిని ఇక్కడ
ఉణ్ణామలై (
అపర్ణ )గా పూజిస్తారు.అమ్మవారి దర్శనం కూడా గర్భగుడిలోకి వెళ్లి ప్రశాంతంగా జరిగింది.
చాలా దగ్గరనుండి అమ్మవారిని చూసిన మాకు చాలా సంతోషంగా అనిపించింది.
అక్కడినుండి బయటికి వచ్చి అక్కడ టికెట్ తీసుకుని వెలిగించే దీపాలను అందరం తీసుకుని వెలిగించాము.
ఆలయ ప్రాంగణంలో వున్న అన్ని గుడులలో దర్శనాలు చేసుకుని ఆలయంలో వున్న కోనేరు,
ఆలయంలోనే
వున్నరమణ మహర్షి పూజ చేసిన పాతాళలింగాన్ని కూడా దర్శించుకున్నాము.
ఆలయంలోని కోనేరు
అక్కడే ప్రసాదాలు తీసుకున్నాము...ఇక్కడ ప్రసాదాలు వెరైటీగా వున్నాయి..
జంతికలు ,అరిసెలు,లడ్లు,చెక్కలు ఇలా 4 రకాల పిండివంటలు ప్రసాదాలుగా ఒక కవర్ లో పెట్టి అమ్ముతారు..
అవి కొనుక్కుని అక్కడే వున్న పులిహోర ,ఆరెంజ్ కలర్లో హల్వాలాగా అనిపిస్తున్న స్వీట్ పొంగలిని
కొనుక్కుని తిని ,ప్రశాంతంగా అక్కడే కాసేపు కూర్చుని
అనుకోకుండా మాకు కలిగిన ఈ అదృష్టాన్ని ఆ అరుణాచలేశ్వరుడు మాకు ఇచ్చిన గొప్పవరంగా భావిస్తూ
ఈ మధురానుభూతులను మా గుండెలలో పదిలపరచుకుని ఆ స్వామిని మనసులో నిలుపుకుని
గుడి బయటికి వచ్చాము..
అరుణాచలం ఆలయ నమూనా
బయటికి రాగానే ఆలయం నుండి కార్ దగ్గరికి వెళ్ళే లోపే మా కాళ్ళు మే నేల ఎండల్లో
మనరోడ్ల మీద ఎలా కాల్తాయో అలా కాలిపోయాయి.
కాళ్ళు ఎక్కడ తారు రోడ్డుకు అంటుకుపోతాయో అన్నంత భయం వేసింది.
అంత వేడిగా వుంది ఇక్కడ వాతావరణం...
ఇక్కడ కూడా షాపింగ్ చేసుకుని అరుణాచలేశ్వరుడు,అమ్మవారి ఫోటోలు కొనుక్కుని
మరలా
మా ప్రయాణం మొదలుపెట్టాము.
అరుణాచల స్తోత్రం



కాణిపాకం To విష్ణుకంచి - 4 ( రమణమహర్షి ఆశ్రమం ) తిరువన్నామలై

కాణిపాకం నుండి తిరువన్నామలై (అరుణాచలం) బయలుదేరాము.
ఆంధ్రాబోర్డర్ దాటి తమిళనాడులో ఎంటర్ అవ్వగానే
welcome to tamilnadu అంటూ airtel మాకు స్వాగతం చెప్పింది.
అక్కడి నుండి వెల్లూరు వెళ్లి తమిళ ,ఆంధ్ర సరిహద్దుల్లో వున్న అరుణాచలం క్షేత్రానికి బయలుదేరాము..


అరుణాచలం
వెళ్లి,అక్కడ మేము ఎప్పటినుండో చూడాలనుకుంటున్న,తప్పకుండా వెళ్ళాలి అనుకున్న
రమణ మహర్షి ఆశ్రమం అతిథి ఆశ్రమ్ కి వెళ్ళాము.
రమణ మహర్షి ఆశ్రమం-అతిధి ఆశ్రమ్

అక్కడే
మాకు ఆశ్రమం వాళ్ళు ఇచ్చిన రూమ్స్ తీసుకుని..
మేము వెళ్ళింది మధ్యాహ్నం భోజనం టైం కావటంతో ముందుగా భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము.
భోజనం చాలాబాగుంది తమిళ వంటలు ముఖ్యంగా అవియల్ ( పెరుగులో కూరగాయముక్కలతో చేసిన వంట ),
వడలు చాలా బాగున్నాయి..
ఇక్కడ మౌనం పాటించాలి ,ఎవరి తిన్న అరిటాకులను వాళ్ళే తీసేయాలి
అవియల్

సాయంత్రం ఆశ్రమం స్వామీజీ హంసానంద, మాతాజీ సౌమ్య, ట్రస్టీ రాజు గారితో మాట్లాడే అవకాశం కలిగింది..
వారు మమ్మల్ని ఆశ్రమానికి ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆశ్రమం పేరుకు తగినట్లుగానే అతిధి మర్యాదలు చేశారు..
అరుణాచల క్షేత్రమును మొదటిసారిగా చూస్తున్న మాకు అభినందనలు తెలిపి ఆ క్షేత్ర మహిమను,
భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం గురించి, ధ్యానం గురించి ఎన్నో విషయాలను చెప్పారు..
అరుణాచలం స్వయంగా శివుడే అని భగవంతుడు ఇక్కడ పర్వత రూపంలో కొలువై ఉన్నాడని
ఈ క్షేత్ర సందర్శన అవకాశం రావటం మా పూర్వజన్మ సుకృతం అని అన్నారు..
ఆశ్రమం పరిసర ప్రాంతాలు,ఆశ్రమంలో రమణమహర్షి కొలువై వున్న ధ్యాన మందిరం చాలా ప్రశాంతంగా వున్నాయి.
అక్కడికి వెళ్ళిన వారిని ఆదరించే తీరు చాలా బాగుంది.
ఇక్కడ పేద సాధువులకు అన్నదానం జరుగుతుంది,వైద్య సదుపాయాలను అందిస్తారు.

భగవాన్ రమణ మహర్షి ద్యానమందిరం - అతిధి ఆశ్రమం

ఆశ్రమంలో స్వేఛ్చగా విహరిస్తున్న నెమళ్ళు
ఈ ఆశ్రమం చూడటం నిజంగా ఒక మంచి అనుభవం అని చెప్పొచ్చు.ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో
ధ్యాన సాధన చేయాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణంలో, మనసుకు హాయిని కలిగించేలా వున్న
అతిధి ఆశ్రమం అరుణాచలంలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.
ఆ రాత్రి ఆశ్రమంలోనే వుండి తెల్లవారాక అరుణాచలేశ్వరుని దర్శించుకోవటానికి వెళ్ళాము..

Related Posts Plugin for WordPress, Blogger...