పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

28, అక్టోబర్ 2011, శుక్రవారం

కాణిపాకం To విష్ణుకంచి - 7 శ్రీపురం గోల్డెన్ టెంపుల్

గోల్డెన్ టెంపుల్ అనగానే ఇంతకుముందు అమృతసర్ లోని సిక్కు దేవాలయమే గుర్తుకు వచ్చేది
కానీ ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అనగానే సుమారు 600 కోట్లు ఖర్చు పెట్టి మన భారత దేశంలో కట్టిన
నారాయణీ పీఠం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దానికి పోటీగా నిలుస్తుందని చెప్పొచ్చు
తమిళనాడులోని వెల్లూర్ కి 6 కిలోమీటర్ల దూరంలో తిరుమలైకొడి లో ఈ శ్రీపురం స్వర్ణ దేవాలయం కొలువై వుంది.
ఇక్కడ కూడా తిరుమల లాగానే స్ట్రిక్ట్ రూల్స్ వున్నాయి. ఫోన్స్ కానీ కెమెరాలు కానీ లోపలి తీసుకెళ్ల కూడదు.
మగవాళ్ళను,ఆడవాళ్ళను వేరు వేరుగా చెకింగ్ చేసిన తర్వాత క్యూ లైన్ లో పంపిస్తారు..
శ్రీచక్రం ఆకారంలో వున్న కారిడార్లో నడుస్తూ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి.దర్శనానికి వెళ్ళే దారి అంతా అందమైన ల్యాండ్ స్కేప్స్,చక్కని సీనరీస్,పార్క్,మంచి కొటేషన్స్ తో వున్న బోర్డులు,వివిధరూపాల్లో వున్న అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ చూస్తూ వెళ్తూవుంటే నడిచిన అలసట తెలియకుండా చేస్తాయి.
ఆలయం సమీపానికి రాగానే ఆ బంగారు ఆలయం వెలుగులు మనల్ని మరోలోకంలోకి
తీసుకెళ్ళినట్లు అనుభూతి చెందుతాము.
చుట్టూ ఆవరించిన నీటిలో మధ్యలో సువర్ణ శోభితమైన ఆ ఆలయాన్ని చూడటానికి
రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా వుంది.
పైగా మేము రాత్రి సమయంలో వెళ్ళటంతో ఆ బంగారు కాంతులకు విద్యుత్ దీపాల కాంతులు తోడై
ఆ అమ్మవారి మణి ద్వీపమే ఈ నేలమీదకి వచ్చిందా అన్నట్లు అనిపించింది..
అమ్మవారి దర్శనం బాగా జరిగింది.ఆ అమ్మవారి మీదనుండి చూపులు మరల్చుకోలేనంత
మనోహరంగా వుంది శ్రీ నారాయణీ మాత..
దర్శనం తర్వాత అక్కడ కారిడార్లోనే అమ్మవారి పూజకి ఉపయోగించే రకరకాల సుగంధ ద్రవ్యాలు,
పూజా సామాగ్రి అమ్మే స్టాల్స్ వున్నాయి..అవి తీసుకున్నాము.
ఇక్కడ తీసుకున్న ధూప్ స్టిక్స్,బత్తీలు అపూర్వమైన సువాసనతో వున్నాయి..
కుంకుమ కూడా మొగలి పూల వాసనతో చాలా పవిత్రమైన భావన కలిగించేలా వున్నాయి..
ఇక్కడ కూడా రకరకాల పిండి వంటలే ప్రసాదాలుగా అమ్ముతారు
అవి కూడా కొన్నాము.. ముఖ్యంగా నాకు నచ్చిన ప్రసాదం శ్రీ మధు అనే లడ్డు ప్రసాదం..
ఇక్కడ ప్రసాదాలన్నీ చాలా బాగున్నాయి.
బయటికి రాగానే శ్రీ అన్నపూర్ణ మండపంలో పుదీనారైస్ ప్రసాదం పెట్టారు...
మొత్తానికి శ్రీపురం వైభవాన్ని మాటలతో వివరించలేము..
దైవానుగ్రహము ఉన్నవారి వలన మాత్రమే ఇటువంటి అద్భుత సృష్టి సాధ్యమవుతుంది.
ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ కృప శ్రీపురంలో నిండి వుందని చెప్పొచ్చు..
ఒక అపూర్వమైన అనుభవం ఈ శ్రీపురం దర్శనం..
అక్కడ నుండి వెల్లూరు వచ్చి భోజనాలు చేసి కంచి బయలు దేరాము..

శ్రీపురం గోల్డెన్ టెంపుల్
Related Posts Plugin for WordPress, Blogger...