పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

9, నవంబర్ 2014, ఆదివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 11



పడుకున్న నాకు బయట మాటలు వినిపించి మెలకువొచ్చింది. ఎవరా చూద్దామని బయటికి రాగానే ఎదురుగా మా అమ్మమ్మ తరుపు దగ్గరి  బంధువులు పద్మాక్షి వదిన, అన్నయ్య కనపడ్డారు. నాకు మా వదిన పద్మాక్షి పేరు వెరైటీగా అనిపిస్తుంది . కామాక్షి,మీనాక్షి లాగా పద్మాక్షి ... పద్మాక్షి అంటే పద్మముల వంటి నయనములు (పద్మనయన) కలదని అర్ధమట. వదిన నిజంగా పేరుకు తగినట్లు ఉంటుంది.. అన్నయ్య ఒక గవర్న్ మెంట్ బ్యాంక్ లో మేనేజర్ గా జాబ్ చేస్తున్నాడు. వాళ్లకి ఒక పాప,బాబు .సొంత ఊరినుండి ఎప్పుడో హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ హ్యాపీగా సెటిలయినట్లే.

నన్ను చూడగానే మాధవ్ ఎలా ఉన్నావ్,కాలేజ్ విశేషాలేంటి అంటూ ఆప్యాయంగా పలకరించారు అన్న,వదిన. మాటల్లో తెలిసిన విషయం ఏంటంటే మా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మా అన్న,వదిన వీళ్ళకి అన్ని రకాల సహాయం చేస్తూ తోడుగా ఉంటున్నారని,అందువల్లే మా వాళ్లకి కొత్త ప్రదేశం అనే సమస్య లేకుండా పోయిందని అర్ధమయ్యింది. పద్మాక్షి వదినని చూస్తే  నాకు అప్రయత్నంగానే కావ్య వాళ్ళమ్మ గుర్తొచ్చింది. కావ్య ఏమి చేస్తుందో అనుకుని మళ్ళీ నన్ను అంత అవమానించిన మనిషితో నాకెందుకులే అనిపించింది.

కాసేపు కూర్చుని ఆ కబుర్లు,ఈ కబుర్లు వూరిదగ్గర బంధువుల విషయాలు ఇలా లోకాభిరామాయణం అంతా  మాట్లాడాక దసరా షాపింగ్ కి అమ్మని, అమ్మమ్మని తీసుకెళ్ళారు అన్నా,వదిన. ఇక్కడికొచ్చాక అమ్మలో చాలా మార్పు వచ్చింది. మా ఇంట్లో నాన్న,నాన్నమ్మ ముందు మాట్లాడకుండా మౌనంగా వుండే అమ్మ ఇక్కడ బాగానే అందరితో కలిసిపోయి మాట్లాడుతూ సరదాగా షాపింగ్ లకి, పక్క న ఇళ్ళల్లో చిన్న చిన్న పార్టీలకి వెళ్తుందని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది.ఎంతైనా సిటీ జీవితం వేరు.ఎవరి పనులు వాళ్ళవి ,ఎవరి లోకం వాళ్ళది. అనుభవించగలిగిన వాళ్లకి అంతా  స్వేచ్చ ,సంతోషమే..

అందరూ వెళ్ళాక నేనొక్కడినే ఇంట్లో ఉన్నాను. టీవీ చూస్తూ కాసేపు కూర్చున్నాక అక్కడే టీపాయ్ మీద వాక్ మాన్ కనపడింది. పెద్దక్క దనుకుంటాను. ఇప్పుడు సెల్ ఫోన్ లాగా అప్పట్లో చదువుకునే,ఉద్యోగాలు చేసే యువతరం దగ్గర తప్పకుండా వాక్ మాన్ వుండేది. అందులో ఇష్టమైన పాటలు లిస్టు రాసుకుని వెళ్లి మరీ ఆడియో కాసెట్లు  రికార్డ్ చేయించి అవే పాటలు అరిగిపోయే దాకా వినేవాళ్ళం.. నా వాక్ మాన్ రూమ్ లోనే మర్చిపోయ్యి వచ్చాను సరే   కాసేపు పాటలు విందామని  వింటుంటే అన్నీ ఇంగ్లీష్ పాటలే . పెద్దక్కకి అమెరికా వెళ్లాలని తెగ పిచ్చి .పెళ్ళంటూ చేసుకుంటే అమెరికాలో ఉద్యోగం చేసుకునే వ్యక్తినే చేసుకోవాలని ఒక గట్టి కంకణం కూడా కట్టుకుంది. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు పాటలు కూడా ఇంగ్లీష్ వే  వింటుందన్నమాట..

రెండు మూడు ఇంగ్లీష్ పాటలయ్యాక  "బావలు సయ్యా మరదలు సయ్యా"  అంటూ పాట  వస్తుంది . అమ్మ నాయనో ఇదేంటి ఈ పాట .. మేము ఇప్పటిదాకా వింటే " దొరకునా ఇటువంటి సేవా " అని పాడుకునే భక్తి  పాటలో లేకపోతే  "ఓ నాన్నా నీ మనసే వెన్నా" లాంటి సెంటిమెంట్ పాటలు వింటాం, చూస్తాం కానీ ఇదేంటీ ఘోరంగా ఈ పాట? ఆ ఆడియో రికార్డింగ్ షాప్ వాడు పొరపాటున రికార్డింగ్ డాన్స్ పాట మా అక్క కాసేట్ లో రికార్డ్ చేసినట్లున్నాడు లేకపోతే ఇలాంటి పాటలు ఉంటాయని కూడా అక్కకి తెలుసా పాపం అనుకుని టక్కున పాట  ఆపేసి అక్క కోసం ఎదురు చూస్తున్నా ఈ విషయం చెప్పాలని.

ఒక గంటలో అక్క ఇంటికి రాగానే  మొహమాటపడుతూనే ఈ విషయం అక్కకి చెప్పా .. దానికి అక్క పెద్దగా నవ్వి ఏంటి మాధవ్ చిన్నపిల్లాడిలా మాట్లాడతావ్.. "బావలు సయ్యా మరదలు సయ్యా" నాకు చాలా ఇష్టమైన పాట స్పీడ్ గా, రిధమ్ తో చాలా బాగుంటుంది. అందుకే కావాలని చెప్పి రికార్డ్ చేయించా. అయినా నా వాక్ మాన్ ఎందుకు తీశావ్  అది నాకు అన్నయ్య అమెరికా నుండి వాళ్ళ ఫ్రెండ్ తో తెప్పించాడు తెలుసా ? పాడయితే రిపేర్ చేయించటం కూడా కుదరదు  అంటూ అంతెత్తున ఎగిరింది అక్క నామీద .ఆ దెబ్బకి రికార్డింగ్ డాన్స్ పాట సంగతి మర్చిపోయ్యా. మరే ఇంతోటి వాక్ మాన్ నాకు వాడటం రాక పాడు చేస్తాను .. నాకు తెలియదా వాక్ మాన్ గురించి అని కోపం వచ్చింది. కానీ కాసేపటి తర్వాత  ఛీ అక్కేదో మామూలుగా అంటే నేను కోపం తెచ్చుకోవటం తప్పు . ఎంతైనా పెద్దక్క  కదా .. !! ఇంట్లో వాళ్ళ మీద ఎవరన్నా కోపం తెచ్చుంటారా ? అని నాకు నేనే సర్ది  చెప్పుకున్నాను.

ఈలోగా బయటి వెళ్ళిన అందరూ వచ్చారు. అన్న రాలేదు. ఇంకా అన్న రాలేదేంటి అనగానే మా చిన్నక్క అందుకుని  ఆయనగారు అప్పుడే ఎందుకొస్తారు మధ్యలో ఎన్నెన్ని పనులు అంటూ మా నాన్నమ్మ లా రాగం తీసింది.దానికి మా వాళ్ళంతా నవ్వులు నాకేమీ అర్ధం కాలేదు.. నాకే విషయాలు చెప్పరు కదా వీళ్ళు . సాయంత్రానికి  అందరూ టీవీ దగ్గర చేరారు "అంతరంగాలు అనంత మానస చదరంగాలు" అంటూ మొదలెట్టి "ఓ విధీ విచిత్రాల నిధీ"  దాకా చూస్తూ కధల్ని,నటుల్ని కామెంట్ చేస్తూ చూస్తున్న వాళ్ళని చూస్తే  అంత నచ్చకపోతే అలా కామెంట్స్ చేస్తూ చూడటం ఎందుకు వేరే ప్రోగ్రామ్స్ చూడొచ్చు కదా అనిపించింది .. ఎదుటి వాళ్ళని ఏదో విధంగా విమర్శించటం మనుషుల జన్మహక్కనుకుంటా...

కాసేపటికి అన్న వచ్చాడు  మాధవ్ నీకు పండక్కి బట్టలు అంటూ ప్యాకెట్ అందించాడు. తీసి చూడగానే ఎప్పటిలాగే బారు చొక్కా, లూజు ప్యాంటు ఈ డ్రెస్ వేసుకుంటే  ఏదో సినిమాలో బాబుమోహన్ డ్రెస్ లా ఉంటుందని అన్నకి చెప్పాలనుకుని కూడా వద్దులే పాపం మళ్ళీ అన్న ఫీల్ అవుతాడు అనుకుని బట్టలు లోపల పెట్టటానికి వెళ్లాను. అన్న భోజనం చేస్తూ అమ్మమ్మతో అంటున్నాడు ఈ దసరాకి కారు కొనాలనుకుంటున్నాను. ముందు కొంచెం డబ్బు మీరు కట్టండి మిగతాది ఇన్స్టాల్ మెంట్స్ లో నేనే కట్టుకుంటాను అన్నాడు అమ్మమ్మతో. అప్పంటే మీ నాయన  ఏమంటాడో నాయనా అంది అమ్మమ్మ అందుకే ఇప్పుడు నువ్వు ఇవ్వు నేను తర్వాత ఇప్పిస్తా అన్నాడు అన్న. మొత్తానికి ఈ దసరాకి అన్న కార్ కొంటున్నాడన్నమాట. నాకు అన్నని చూస్తే చాలా గర్వంగా,సంతోషంగా అనిపించింది .

అదే మాట చిన్నక్కతో అనగానే నీ మొహంలే ఆయనేమన్నా కారు సొంతగా కొంటున్నాడా నువ్వంత గర్వించటానికి .ముందు అమ్మమ్మ అప్పు ఇస్తుంది తర్వాత కొన్నాళ్ళకి నేను నెల నెలా ఫైనాన్స్ వాళ్లకి అప్పు కట్టలేను నానా అంటే అప్పుడు నాన్నే చచ్చినట్లు మిగతా డబ్బు ఇస్తాడు. అది ఆయన గారి ప్లాన్ అంటూ మహా కచ్చగా తన మనసులో మాటల్ని నాదగ్గర వెళ్ళగక్కింది .. అమ్మబాబోయ్ "నువ్వు డ్రాప్ చేస్తే కానీ కాలేజ్ కి వెళ్లను"  అని మా అన్న ముందు అనే చిన్నక్కేనా ఇలా మాట్లాడుతుంది అనిపించింది. మళ్ళీ అంతలోనే ఏదోలే కోపతాపాలు మనుషులకి కాకపొతే మానులకి వస్తాయా ఎంతైనా చిన్నక్క కదా .. !!  అనుకుని ఆ విషయం మర్చిపోయాను .


  కొంతమంది మనుషుల నోటి ప్రభావమో,లేకపోతే అంతబాగా ఆలోచిస్తారో తెలియదు కానీ, కొన్ని మాటలు వందశాతం నిజమవుతాయని చెప్పటానికి  అన్న కారు గురించి మా చిన్నక్క నాతో చెప్పిన మాటలు ఉదాహరణ.. రెండు సంవత్సరాల తరవాత కారుకి కట్టాల్సిన అప్పు కోసం ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మారిన మా అన్న ఇంటి అడ్రెస్, ఫోన్ నెంబర్ కోసం మా వూరిలో ఇంటికి ఫోన్ చేయటం, అప్పుడు ఇంట్లోనే ఉన్న నేను నన్ను కాబట్టి అడిగారని గొప్పగా అన్న కొత్త ఫోన్ నంబర్,అడ్రెస్ చెప్పటం .. ఆ నెంబర్ పట్టుకుని  వాళ్ళు డబ్బు కోసం అన్నని నిలదీయటం తప్పని పరిస్థితిలో నాన్న మిగతా అప్పు కట్టటం , అంతా ఆరోజు చిన్నక్క చెప్పింది చెప్పినట్లే జరిగింది. కానీ ఇక్కడ నింద  మళ్ళీ నా మీదే పడింది. ఫైనాన్స్ కంపెనీ వాళ్లకి నా ఫోన్ నెంబర్ ఎందుకు చెప్పావురా ఆ మాత్రం తెలియదా అంటూ .. అన్న నా మీద విరుచుకు పడ్డాడు.

నువ్వు కావాలని నెంబర్ మార్చావని తెలియక వాళ్లకి చెప్పేశాను అయినా  నువ్వు అప్పు కట్టేసి ఉంటావనుకున్నాను,అందుకే వాళ్లకి నెంబర్ చెప్పాను చెప్పకూడదని నాకు తెలియలేదు అన్నాను..నాకు అర్ధం కాని విషయం ఎప్పటికైనా అప్పు కట్టాలి కదా.. అంటే నేను నెంబర్ చెప్పకపోతే అన్న వాళ్లకి  ఎప్పటికీ అప్పు కట్టేవాడు కాదా? అది తప్పు కాదా ?? అలా మా అన్నకి కారు, నాకేమో తెలివి తక్కువగా ఫైనాన్స్ కంపెనీ వాళ్లకి అన్నని పట్టించాననే అపనింద  మిగిలిపోయింది..  ఏంటో ... ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎందుకు మాట్లాడాలో ( మా అమ్మమ్మ బాషలో లోకజ్ఞానం ) నాకు ఎప్పటికైనా తెలుస్తుందో లేదో .. ??

కధ  మరీ  ఎక్కడికో ముందుకు వెళ్లిపోయింది  కదా..  వస్తున్నా వెనక్కి .మళ్ళీ దసరా పండగ రోజున హైదరాబాద్ లోని మా అన్న ఇంటికి.


Related Posts Plugin for WordPress, Blogger...