పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, సెప్టెంబర్ 2019, ఆదివారం

మాకు లభించిన అరుదైన శ్రీ అత్తి వరదరాజస్వామి దర్శనం 2019



తమిళనాడులోని కాంచీపురం - కంచి దాదాపు అందరికీ బాగా తెలిసిన ఆలయం.కంచి కామాక్షమ్మతో పాటు ఇక్కడ విష్ణు కంచిగా పిలుచుకునే వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా 108 దివ్యదేశాలలో ఒకటైన  పురాతన విష్ణు ఆలయం. బంగారు బల్లి,వెండి బల్లి ఉన్న ఆలయంగా ప్రసిద్ధి కూడా.మేము 2011 ,2016 రెండుసార్లు వరదరాజ పెరుమాళ్ దర్శనం చేసుకున్నాము.ఈ ఆలయంలో గర్భాలయంలో ఉన్న వరదరాజస్వామిని మహావిష్ణువు అవతారంగా భక్తులు విశ్వసిస్తుంటారు.వరదరాజ పెరుమాళ్‌గా కొలుస్తుంటారు. శ్రీవరదరాజ స్వామి "వరములను ద అనగా ఇచ్చునట్టి శ్రీ నారాయణుడు"


 శ్రీ అత్తి వరదరాజ స్వామి చరిత్ర :
ఈ ఆలయంలో మొన్నటివరకు మాకు తెలియని విశేషం 40 సంవత్సరాలకు ఒకసారి ఉండే "అత్తివరదరాజ స్వామి దర్శనం" 9 అడుగుల పొడవు ఉండే  అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని స్వయంగా  బ్రహ్మదేవుని ఆదేశంతో దేవశిల్పి విశ్వకర్మ అత్తిచెట్టు కాండంతో తయారుచేసినట్లు పురాణాలు చెప్తున్నాయి.పూర్వం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రధాన దైవంగా అత్తివరదరాజ స్వామి  ఎన్నో యుగాలుగా పూజలు అందుకుంటున్న సమయంలో 16వ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన దండయాత్రలో దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తుండగా  స్వామివారి విగ్రహానికి హాని కలుగకుండా ఆలయంలోని ఆనంద పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్నమండపం యొక్క అడుగు భాగంలో ,లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరిచారు.


ఆలయంలో మూలవిరాట్ లేకపోవటంతో ఇప్పుడు ఆలయంలో వున్న వరదరాజ స్వామిని ప్రధాన ఆలయంలో ప్రతిష్టించారు.కొన్నాళ్ళ తర్వాత కోనేరు ఎండిపోవడంతో అత్తి వరదరాజస్వామి ప్రధాన విగ్రహం బయటపడింది. అత్తిచెట్టు కాండంతో చేసిన ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా ఏమీ కాకపోవటంతో దాన్ని తిరిగి ప్రతిష్టించారు.తర్వాత 48 రోజుల పాటు పూజలు  నిర్వహించి మళ్లీ కోనేరులో భద్రపరిచారు. తర్వాత ఇదో సంప్రదాయంగా మారింది.అప్పటి నుంచి పుష్కరిణి  అడుగున భద్రపరిచిన విగ్రహాన్ని 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులపాటు  భక్తులకు దర్శనం కల్పించి మళ్లీ కోనేరులో భద్రపరుస్తున్నారు.ఇలా 1854 నుంచి చేస్తున్నట్లు అప్పటి వార్తా పత్రికల కథనాల ఆధారంగా తెలుస్తోంది.

1892, 1937 లో,చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు దర్శనం ఇచ్చారు. ఈ గుడికి సంబంధించి దాదాపు 362 వరకు కాకతీయులు, తెలుగు చోళులకు చెందిన రాత ప్రతులు లభించాయి.వీటి ఆధారంగా ఆలయ చరిత్ర తెలుస్తుందని చెప్తున్నారు.



ఈ సంవత్సరం అంటే 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు  అత్తివరదరాజ స్వామి దర్శనం జరిగింది. మొదటి 38 రోజులు శయన(పడుకున్న) భంగిమలోను చివరి 10 రోజులు స్థానక (నిలుచున్న) భంగిమలోను స్వామి దర్శనం, ఉచిత దర్శనంతో పాటు 50రూపాయల టికెట్ దర్శనం,ఉదయం 11 to 12 వరకు సాయంత్రం 7 to 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన ఇవీ ఆలయం  ప్రకటించిన స్వామివారి దర్శనం వివరాలు. అత్తివరదరాజ స్వామి దర్శనం గురించి పేపర్లు,టీవీలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం జరిగింది.1979 లో, ఇప్పుడు  2019,మళ్ళీ 2059  లో అంటే 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కలిగే అరుదైన దర్శనం కాబట్టి రికార్డు స్థాయిలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారట.జూన్‌ నెలాఖరున వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో అనంతసరస్సులోని నాలుగుకాళ్లమంటపం దిగువనున్న చిన్నగది నుంచి అత్తివరదర్‌స్వామిని ఆలయ భట్టాచార్యులు భుజాలపై మోసుకొచ్చి వసంతమండపంలో ఉంచిన తర్వాత,జూలై ఒకటి నుంచి 31 రోజులపాటు శయనభంగిమలో సర్వాలంకరణ శోభితులై అత్తివరదర్‌స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుండి  17 వరకు నుంచి స్వామివారు నిల్చున భంగిమలో భక్తవరదుడిలా అభయప్రదాతగా భక్తులకుదర్శనం ఇచ్చారు. 


మా అత్తివరదరాజ స్వామి దర్శనం విశేషాలు 
స్వామి విశేషాలన్నీ తెలిశాక మాకు కూడా అత్తివరదరాజ స్వామిని చూడాలనిపించింది.ముఖ్యంగా మా అమ్మ , నాన్న కోసం కష్టమైనా సరే స్వామి దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాము.ఆగస్టు 9 ఉదయాన్నే గుంటూరు నుండి బయల్దేరి,"తిరుత్తణి వేల్ మురుగన్" దర్శనం చేసుకుని, కంచి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. కంచికి చాలా దూరంలోనే బయటి వాహనాల పార్కింగ్ ఉంది.అక్కడి నుండి తమిళనాడు బస్సులు,ఆటోల్లో ఆలయం దగ్గరికి తీసుకెళ్తున్నారు.మేము కొంచెం ప్రయత్నించి,మా కార్లోనే  దర్శనానికి మొదలయ్యే క్యూలైన్ దగ్గర్లోకి వెళ్ళాము.దగ్గరగా వెళ్ళాక అక్కడ గుట్టలుగా పడివున్న చెప్పులు చూడగానే మా అందరికీ భయం మొదలైంది.ఆ చెప్పులన్నీ అంతకుముందు క్యూలైన్స్ లో జరిగిన తొక్కిసలాటలో వదిలేసిన భక్తులవట.



దర్శనానికి 3 గంటలు పడుతుందని అప్పటికే వెళ్ళివచ్చే వాళ్ళు చెప్తున్నారు.సరేనని ధైర్యం చేసి క్యూలైన్లోకి వెళ్ళాము.ఆలయానికి చాలా దూరంనుండే క్యూ మొదలయ్యింది.ఎటువైపుచూసినా పోలీస్ బందోబస్తు మధ్య క్యూలైన్ ఉంది.ఆలయానికి ఎటువైపు నుండి క్యూ మొదలయిందో కూడా తెలియకుండా ఎటెటో తిప్పుతూ చెక్కలతో క్యూలైన్స్ ఏర్పాటు చేశారు.మంచినీళ్లు, ప్రసాదాలు పంచుతున్నారు.



ఒక్కసారి క్యూలో ఆగిపోతే మనముందే వందమంది ముందుకెళ్ళేలా జనాలు వున్నారు.అంతసేపు క్యూలైన్లో నిలబడటం,అంతదూరం జనాల్లో నడవటం నిజంగా చాలా కష్టం అనిపించినా, అరుదైన స్వామి  దర్శనం కలుగుతుందన్న ఆనందం ముందు ఆ కష్టం చిన్నదే అనిపించింది.మేమందరం తట్టుకున్నాము కానీ మా అమ్మకి B.P. ఉండటంవలన కళ్ళు తిరిగి కాస్త ఇబ్బందిపడింది.క్యూలైన్లలో పిల్లలు,పెద్దవాళ్ళు బాగానే కష్టపడ్డారు.
 
మా అమ్మ,తమ్ముడు,నేను

సుమారు అయిదుగంటలు క్యూలైన్లో నిల్చుని,నడిచిన తర్వాత స్వామివారు వున్న వసంతమండపం దగ్గరికి వచ్చాము.అందమైన అలంకరణతో,అభయముద్రతో నిలుచుని వరాలని ప్రసాదించే అత్తివరదుని దగ్గరినుండి దర్శనం చేసుకున్నామ.40 సంవత్సరాలకు  ఒకసారి,మనిషి  జీవితంలో ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే కలిగే అరుదైన స్వామివారి దర్శనం మాకు లభించటం చాలా అదృష్టం, చాలా సంతోషంగా  అనిపించింది.


ప్రధాన ఆలయంలో దర్శనాలేమీ లేవని చెప్పారు.బయటికి వచ్చాక కూడా పోలీసులు భక్తుల్ని ఎక్కడా ఆగకుండా పంపిస్తున్నారు.వాళ్ళు అలా చేయటం వల్లనే లక్షల సంఖ్యలో వచ్చిన జనాన్ని మేనేజ్ చేయగలిగారు అనిపించింది.బయట అత్తివరదరాజస్వామి వివిధ అలంకారాల్లో తీసిన ఫోటోలు లామినేషన్ చేపించి అమ్ముతున్నారు.అక్కడ కూడా భక్తులు పోటీపడి మరీ వాటిని కొంటున్నారు.మేము కూడా ఆ ఫోటోలు కొనుక్కుని,కంచి కామాక్షమ్మ దర్శనానికి బయలుదేరాము.


కొన్ని విశేషాలు 
ఆలయం చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఇళ్ళముందే వాటర్ బాటిల్స్,కూల్ డ్రింక్స్,టీలు,స్నాక్స్ ఇలా తాత్కాలికంగా బిజినెస్ ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆటోల వాళ్ళు ఊరిబయట ఆపేసిన పార్కింగ్ దగ్గరినుండి గుడిదగ్గరికి ఒక్కొక్క మనిషికి 150,ఇంకా ఎక్కువ కూడా తీసుకున్నారట.దర్శనం తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు కూడా డిమాండ్ చేశారని చాలా మంది చెప్పుకున్నారు.
క్యూలైన్లో భక్తులు తినిపారేసిన ప్రసాదం డొప్పలు ఎప్పటికప్పుడు క్లీన్ చేయక,కొన్ని చోట్ల క్యూ లైన్లో నిలబడటం కూడా ఇబ్బంది అయ్యింది.
అత్తివరదరాజ స్వామిదర్శనం తమిళనాడు మొత్తాన్ని భక్తులతో నింపేసింది అరుణాచలం మొదలుకుని,తంజావూర్,చిదంబరం ఇలా అన్నిచోట్లా విపరీతమైన జనాలు వున్నారు.ఎక్కడికి వెళ్లినా మీకు అత్తివరదరాజ స్వామి దర్శనం అయ్యిందా అని అడిగేవారు.ఎక్కువగా ఆంధ్రా వాళ్ళు కనపడ్డారు.

ఇవీ మా చిన్నిప్రపంచంలో 2019 లో ఎప్పటికీ గుర్తుండే సంతోషకరమైన "అత్తివరదుని" దర్శనవిశేషాలు 
ఓం నమో నారాయణాయ

అత్తివరదరాజ దర్శనం 



Related Posts Plugin for WordPress, Blogger...