ఒకప్పుడు టీవీలో రాధిక సీరియల్స్ పిన్ని, శివయ్య, లక్ష్మి ఇలా అన్ని
సీరియల్స్ వరసగా చూసేవాళ్ళం. తర్వాత అంత ఆసక్తిగా చూసినవి మంజులా నాయుడు సీరియల్సే. రుతురాగాలు, కస్తూరి,చక్రవాకం, మొగలిరేకులు ఇవన్నీ కూడా ఆసక్తిగా మొదలై ఏవేవే మలుపులతో ,ఏదో ఒక ముగింపుతో మొత్తానికి ఏమి జరుగుతుందో చూద్దాం అనిపించేలా ఉండేవి.
ఈ మధ్య సుమారు మూడు సంవత్సరాల క్రితం మొదలైన "శ్రావణ సమీరాలు" సీరియల్ శుభం కార్డు పడింది.ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ విషయంలో నాకొక సందేహం.. సీరియల్ మొదలైన రోజు సూరజ్ నానమ్మ ఇందుని చూపించి నీకు పెళ్ళి సంబంధం తెచ్చాను అని చెప్తుంది. అక్కడ ఇందుని చూసి ఆశ్చర్య పోయిన సూరజ్
"రెండు సంవత్సరాల నుండి కనపడకుండా పోయిన ఇందు ఇప్పుడు కనపడిందని కానీ అర్జున్ ,వీణాధరి ఎక్కడున్నారో తెలియట్లేదు ఇప్పుడు మనం కనిపెట్టాలి " అని పూజానాధ్ తో చెప్పటంతో కథ మొదలవుతుంది.
సీరియల్ మొదలైనప్పటి నుండి అన్ని కారెక్టర్స్ కలిసే ఉన్నాయి. కొన్నాళ్ళు అందరికీ తెలిసేలాగానే ఇందు కనపడకుండా పోయింది, అర్జున్ కనపడకుండా పోయాడు కానీ వీణాధరి మాత్రం కనపడకుండా ఎక్కడికీ వెళ్ళలేదు, చివరి వరకు అందరితో కలిసే ఉండి అందరి ముందే చనిపోతుంది. మరి అర్జున్ ,వీణాధరి ఇద్దరూ రెండేళ్ళు కనపడకుండా ఎక్కడికి పోయారన్నదానికి సమాధానం నాకైతే కనపడలేదు. మేమైతే పాపం వీణాధరి, అర్జున్ని ఎవరేం చేశారా అని ఆసక్తిగా చూసేవాళ్ళం. కానీ ఉండే కొందీ కథ మారిపోతుంది అసలు ending ఎలా ఉంటుందా అని చూశాం .. కానీ సీరియల్ మధ్యలో కూడా ఈ ప్రస్తావన రాకుండానే అయిపోయింది.
సీరియల్ మొదట్లో ఎక్కడో పల్లెటూర్లో బంధువుల ఇంట్లో ఉన్న ఇందుని చూసి గతం గుర్తు చేసుకోవటంతో కథ మొదలవుతుంది.ఇక ఎక్కడా ఆ గతం ప్రస్తావనే రాదు.సూరజ్ ని పెళ్ళి చేసుకుని విడిపోయిన ఇందు కనపడకుండా వెళ్ళిపోయి ఏకంగా అజయ్ తోనే తిరిగొస్తుంది. మరి గతం ఎక్కడ??
జనాలు ఏమి గుర్తుంచుకుంటారులే అని కథ మార్చేశారా లేకపోతే నేనే పొరపాటు పడ్డానా?? డౌట్ తీర్చుకుందామంటే మొదటి ఎపిసోడ్ ఎక్కడా దొరకలేదు. ఎవరైనా ఈ సందేహం తీరిస్తే బాగుండు..
ఈ మధ్య చూడాలనుకోకుండా చూసిన రెండు సినిమాలు పటాస్, టెంపర్. నందమూరి సోదరులు కళ్యాణ్ రామ్, JR ఎన్టీఆర్ లు నటించిన ఈ సినిమాలు రెండూ ఎలాగోలాగా పోలీసులు అయిపోయిన పోలీస్ అధికారుల స్టోరీనే ,ఇద్దరూ ముందు అవినీతి అధికారులు,కానీ కొన్ని పరిస్థితుల వల్ల సినిమా ఇంటర్వెల్ నుండి మంచిగా మారిన పోలీసులు.రొటీన్గా నీతి, నిజాయితీ లకు ప్రతిరూపమైన మంచి పోలీస్ లా అవినీతి నాయకులు, అధికారుల మీద,రౌడీల మీద యుద్ధం ప్రకటించే హీరోల కధల్లా కాకుండా ఆడవాళ్ళ మీద ప్రస్తుతం జరుగుతున్న అఘాయిత్యాలను ఎదిరించే మంచి పోలీస్ అధికారులుగా,మంచి అన్నయ్యలుగా నటించారు. ఆరోజుల్లో నందమూరి తారక రామారావు గారిని ఆంధ్రా ఆడపడుచులు అభిమానంతో అన్నగా పిలుచుకునేవాళ్ళు కదా అలాగే తాత గారి బాటలో నడుస్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా చెల్లెమ్మలకి జరిగిన అన్యాయం కోసం పోరాడి అన్నలుగా పిలిపించుకున్నారు.పటాస్ లో హీరోని అన్నగా పిలుచుకునే ఒక చెవిటి,మూగ అమ్మాయి కొందరి రౌడీయిజానికి బలయిన తర్వాత,సాక్ష్యాలు లేవని బయటికి వచ్చిన నిందితులని సాక్ష్యం లేకుండా ప్రమాదాల్లో చంపేసి,వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు కళ్యాణ్ రామ్.ఇది కొంచెం పాతకధే కానీ.. JR NTR 'టెంపర్' మాత్రం క్లైమాక్స్ లో కధ కొంచెం మలుపు తిరుగుతుంది. ఒక అమ్మాయిని దారుణంగా చంపిన వాళ్లకి శిక్షపడాలని కోరుకున్న ఒక చెల్లెమ్మ కోసం,తను డబ్బు కోసం జైలు నుండి తప్పించిన వాళ్ళే ఈ ఘోరం చేశారని తెలుసుకుని బాధపడి,తప్పు దిద్దుకోవటానికి నిందితులని కోర్టుదాకా తీసుకెళ్ళినా సాక్ష్యాలు లేకపోవటంతో వాళ్ళతో కలిసి తనుకూడా తప్పు చేశానని సాక్ష్యం చెప్పి తనతో సహా నిందితులందరికీ ఉరిశిక్ష పడేలా చేయటం కొంచెం కొత్తగా, అనిపిస్తుంది.
పోలీస్ స్టేషన్ కి అమ్మాయి కనపడట్లేదని తల్లిదండ్రులు రాగానే ఎవరితోటో లేచిపోయుంటుంది అని సింపుల్ గా తీసిపడేసినట్లు మాట్లాడే పోలీసులు అందరు అమ్మాయిలూ అలాగే చేస్తున్నారా లేకపోతె నిజంగానే ఏదైనా ప్రమాదంలో ఉన్నారా అని ఒక్కసారి ఆలోచిస్తే ఎన్నో ప్రమాదాల నుండి ఆడవాళ్ళని కాపాడొచ్చు కదా అనిపిస్తుంది .ఈ ఒక్క విషయమే కాదు ఏ సమస్యనైనా Shall Presume అని కేవలం వాళ్ళ దృష్టితోనే కాకుండా అన్ని విధాలా ఆలోచిస్తే బాధితులకి సరైన న్యాయం జరుగుతుంది. అందుకే ఈమధ్య పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి లేకుండా ఎదుటివారి బాధలు,సమస్యలు ఓపికగా విని వెంటనే తగిన రీతిలో స్పందించేలాగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం అని చెప్పొచ్చు."One Way or Other Police Will Always Protect" ఈ మాట నిజమైతే సమాజానికి మంచిదే కదా.. ఇంక టెంపర్ సినిమాలో మన దేశంలో జరుగుతున్న అవినీతికి అసలైన సాక్ష్యం మన గాంధీ తాత అంటాడు Jr.NTR.నిజమే గాంధీ బొమ్మ ఉన్న నోట్లే కదా అవినీతికి ప్రధాన వనరు అనిపించింది.కోర్టులో ప్రాసిక్యూషన్ లాయర్ కీలకమైన సాక్ష్యాన్ని అవతలి వాళ్లకి ఇచ్చెయ్యటం కోర్టుల్లో ప్రస్తుత పరిస్థితులని తెలియచేస్తుంది. ఈ క్షణాన మేము తప్పు చేసినా మనదేశంలో న్యాయవ్యవస్థ ఈ క్షణంలో ఇప్పటికప్పుడు మమ్మల్ని శిక్షించలేదు అందుకే మేము ధైర్యంగా ఇలాంటి తప్పులు చేస్తున్నాం అనే డైలాగ్ నిజమే కదా అనిపిస్తుంది.
ఈ రెండు సినిమాల్లో హీరోల వ్యక్తిత్వాలు ఎంతటి కఠిన మనస్కుల్లో కూడా కొంచెమైనా మానవత్వం దాగి ఉంటుందేమో అనిపించేలా ఉన్నాయి. కేసులో ముఖ్య సాక్ష్యంగా ఉన్న సీడీ మరో కాపీ లేదనుకుని, ఉరికి కూడా సిద్దపడ్డ హీరోని చివరి క్షణంలో మరో సీడీ కాపీ దొరికి ఉరి ఆపేసి కాపాడటం చిరంజీవి 'అభిలాష' సినిమాని గుర్తు చేసింది.ఇవీ టెంపర్,పటాస్ సినిమాల విశేషాలు...
An event that directly and exclusively results from the occurrence of natural causes that could not have been prevented by the exercise of foresight or caution; an inevitable accident.
మనిషి ముందు చూపుతో కనిపెట్టలేని,ముందు జాగ్రత్తతో ఆపలేని సంఘటనలని,ప్రమాదాలని ఉదాహరణకి వరదలు,భూకంపాలు,సునామీ లాంటి అనేక ప్రకృతి వైపరీత్యాలని Act Of God అంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం చెల్లించకుండా తప్పుకోవటానికి కొన్ని సందర్భాల్లో "Act Of God" Law ని ఉపయోగిస్తుంటారు. ఈ Act Of God గురించి తీసిన హిందీ సినిమా "OH My God". పరేష్ రావల్, అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా, మిథున్ చక్రవర్తి నటించిన ఈ సినిమాలో పరేష్ రావల్ (కాంజీలాల్ మెహతా )పరమ నాస్తికుడు. ముంబయి చోర్ బజార్ లో దేవతా మూర్తులు,పూజా సామగ్రి అమ్మే ఒక వ్యాపారి. దేవుడంటే నమ్మకం లేకపోయినా దేవుడికి సంబంధించిన సామాగ్రిని భక్తులకు తనకి ఇష్టమైన ధరలకు అమ్ముతూ ఉంటాడు. దేవుడే లేడని దైవభక్తిని, భక్తులను ఎగతాళి చేస్తుంటాడు. అతని భార్య సుశీల దైవభక్తురాలు. కృష్ణాష్టమి రోజు పరేష్ రావల్ కొడుకు ఉట్టి కొట్టే ఫంక్షన్ లో ఆడటం చూసి అక్కడికి వెళ్లి కొడుకుని ఆపి,పక్కనే ఉన్న మైక్ లాక్కుని అన్ని ఆలయాల్లో కృష్ణుడు పాలు,వెన్న తాగుతున్నాడని ,ఒక్క గంట మాత్రమే ఈ అవకాశం ఉంటుందని చెప్పగానే అప్పటిదాకా అక్కడున్న జనమంతా ప్రసంగం చెప్తున్న స్వామీజీని ,ఉట్టిని వదిలేసి కృష్ణుడి మందిరాలకి పరుగులు తీస్తారు. దీంతో ఆగ్రహించిన స్వామీజీ నిన్ను దేవుడు శిక్షిస్తాడని శపిస్తాడు. ఇలాంటి శాపాలకి భయపడనని ఇంటికి వచ్చిన కాసేపటికే చోర్ బజార్ లో భూకంపం వలన పరేష్ రావల్ షాప్ ఒక్కటే కూలిపోయిందని టీవీలో న్యూస్ వస్తుంది. భార్యా.బంధువులు అందరు నువ్వు దేవుడిని ఎగతాళి చేసినందుకు ఆ శాపం వలనే ఇలా అయ్యిందని తిడుతూ బాధ పడుతున్నా అవేమీ లెక్క చెయ్యకుండా కూలిపోయిన శిధిలాల్లో ఇన్సూరెన్స్ పాలసీ వెతికి తీసుకుని ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్ళిన పరేష్ రావల్ కి అక్కడ ఆఫీసర్ భూకంపం Act Of God వలన అయ్యింది కాబట్టి కంపెనీ నష్టపరిహారం ఇవ్వదు అంటాడు. పరేష్ రావల్ లో అప్పటిదాకా లేని భయం,బాధ కనపడుతుంది.ఇన్సూరెన్స్ ఆఫీసర్ ని చితక్కొట్టి,నాలో కూడా దేవుడే ఉన్నాడు కదా దేవుడే కొట్టాడనుకో అని చెప్పి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక బాగా ఆలోచించి ఈ నష్టం దేవుడి వలన జరిగింది కాబట్టి దేవుడి మీద కోర్టులో దావా వేస్తానని కోర్టుకి వెళ్తాడు. అక్కడ లాయర్లు ఇతని వింత మాటలు విని మావల్ల కాదంటూ పారిపోతారు. అప్పుడు లాయర్ ఓంపురి ఈ కేస్ నేను చేస్తానని దేవుడికి ప్రతినిధులుగా చెప్పుకునే కొందరు ప్రముఖ స్వామీజీలకి నోటీస్ లు పంపుతాడు.దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు భగవంతుడికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కాబట్టి భగవంతుడి తరపున నష్టపరిహారం కూడా మీరే చెల్లించాలని తన కేస్ తనే వాదించుకుంటాడు పరేష్ రావల్ . ఇతని ఆరోపణలు సమంజసమేనని భావించిన జడ్జ్ కేస్ విచారణకి స్వీకరించగానే ఇలాగే Act Of God వలన నష్టపోయిన వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్తారు. దీంతో స్వామీజీలు,మాతలు,అన్ని మతాలకు చెందిన మతాధిపతుల ఆగ్రహానికి గురవతాడు. వారి భక్తులు ఆగ్రహంతో పరేష్ రావల్ మీద దాడి చేస్తారు.సరిగ్గా సమయానికి అక్షయ్ కుమార్ వచ్చి ప్రమాదంలో ఉన్న పరేష్ రావల్ ని తన బైక్ మీద ఎక్కించుకుని కాపాడతాడు. ఇంటిమీదకి కూడా వెళ్లి భార్యా బిడ్డల మీద కూడా దాడి చేయటంతో అతన్ని వదిలి అందరూ వెళ్ళిపోతారు. చివరికి ఒంటరిగా మిగిలిన పరేష్ రావల్ ఇంటికి కృష్ణ వాసుదేవ్ యాదవ్ (అక్షయ్ కుమార్) గా వచ్చిన గోపాలుడు (భగవంతుడు)నాస్తికుడైన పరేష్ రావల్ తో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నీ చదివించి భగవద్గీతలోని సృష్టించేదీ భగవంతుడే ,నాశనం చేసేది భగవంతుడే అన్న మాటతో కోర్టు కేస్ గెలిపిస్తాడు.. భగవంతుడు ప్రతి మనిషిలో ఉంటాడు కానీ మేమే దేవుడి ప్రతినిధులమని చెప్పుకుని,దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ, విలాసాలని అనుభవిస్తున్న స్వామీజీలు,బాబాలు ఇప్పడు లోకంలో దేవుడి కంటే ఎక్కువయ్యారు. అలాంటి వాళ్ళ గురించి,వాళ్ళని గుడ్డిగా నమ్మి,నష్టపోయే జనం గురించి సంధించిన వ్యంగ్యాస్త్రమే ఈ సినిమా. కొన్ని విషయాలు వాస్తవానికి విరుద్దంగా ఉన్నా కాసేపు సరదాగా చూడటానికి బాగుంది,దేవుడిని నమ్మే భక్తులకు సంతోషం కలిగిస్తుందీ సినిమా. దైవారాధన, మానవశక్తి రెండు కలిస్తేనే కార్యసాధన సాధ్యమంటాడు భగవంతుడు. ఏ కులమైనా,మతమైనా భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉంటాడు.తన భక్తులైనా కాకపోయినా ఈ భూమి మీద జీవరాశి నంతటినీ కాపాడేది భగవంతుడే.. నమ్మిన వారిని వెన్నంటి కాపాడే సర్వాంతర్యామి సర్వకాల సర్వావస్థల్లోనూ ఏ రూపంలోనైనా అవతరిస్తాడని భక్తుల నమ్మకం.ఆ భగవంతుడి మరో రూపం ఈస్వామీజీలు, గురూజీలే ఐతే అందరికీ మంచిదే. అలాగే ప్రకృతి వైపరీత్యాలు Act Of God అని అనకూడదేమో ఎందుకంటే మనిషి తన అవసరాల కోసమో,స్వార్ధం కోసమో చేస్తున్న కొన్ని పనుల కారణంగానే ఈ భూకంపాలు, సునామీలు, వరదల లాంటి భీభత్సాలు సంభవిస్తున్నాయని, దేవుడికి భక్తుడికి మధ్య ఉండాల్సింది భక్తి అనే వంతెన మాత్రమే కానీ బాబాలు, స్వామీజీలు,గురువులనే దళారులు కాదు అనేది అందరూ అంగీకరించాల్సిన నిజం... ఇది సినిమా కాబట్టి సరిపోయింది కానీ నిజంగా దేవుడి ప్రతినిధులమని చెప్పుకునే కొందరు స్వామీజీలని చిన్న మాట అన్నా తట్టుకోలేని వారి అతి విదేయ భక్తులు,శిష్యులు చాలా మందే ఉంటారనుకుంటాను. ఇప్పటి రోజుల్లో అలాంటి స్వామీజీలు, గురువులని ఈ సినిమాలో లాగా చేస్తే "అనుకోకుండా ఒకరోజు" సినిమాలో ఛార్మి లాగా "నీడల్లే తరుముతు ఉంది" అని పాడుకోవాల్సి వస్తుందేమో.. ఇంతకీ ఇప్పుడు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే తెలుగులో కూడా వెంకటేష్,పవన్ కళ్యాణ్ హీరోలు గా "గోపాలా గోపాలా" పేరుతో ఈ సినిమా రాబోతుంది. మన సినిమా ఎలా ఉంటుందో త్వరలోనే చూద్దాం ..
'వసతి వాసయతీతి వా వాసుదేవః' మనలో తానుగా ఉండేవాడూ,తాను మనలో ఉన్న కారణంగా మనల్ని జీవించి ఉండేలా చేసేవాడు ఆ భగవంతుడే..
అబద్ధం చెప్పటం మనిషికి సరదా కాదు,కావాలని ఎవరూ అబద్ధాలు చెప్పరు.. కానీ జీవితంలో ఒక్కసారైనా అబద్ధం చెప్పని మనిషి వుండరేమో.."నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు" అని ఎవరైనా అంటే అంతకు మించిన అబద్ధం ఉండకపోవచ్చు నాకు తెలిసి :)
కొంతమందికి అబద్ధం ఆపద్ధర్మం ఐతే.. మరి కొంతమందికి అబద్దం ఆడటమే హాబీ కూడా కావచ్చు.
వీళ్ళని అబద్ధాల కోరులు అని కూడా అంటారు లెండి..
ఆడవాళ్ళు,మగవాళ్ళు ఇద్దరూ ఆడే అబద్ధాలు వారిమధ్య సంబంధాలను కాపాడుకోవటానికి, అది ప్రేమ, స్నేహం లేదా కుటుంబ సంబంధం ఏదైనా కావచ్చు...లేదా ఇతరులనుండి
రహస్యాలు దాచటానికైనా కావచ్చు. మొత్తంగా ఏదో ఒక విషయంలో ఎపుడో ఒకపుడు
అబద్ధాలు చెప్పేస్తూంటాము ...
ఒక్కోసారి మనకి బాగా కావాల్సిన వాళ్ళు మనకోసం ప్రేమగా వంట చేస్తే అది బాగా లేకపోయినా,
వాళ్లకి నచ్చిన డ్రెస్ మనకు నచ్చకపోయినా , ఇంటికి వస్తున్నామని ముందుగా చెప్పకుండా వచ్చేసి ఇబ్బంది కలిగిస్తూ మీకేమన్నా ఇబ్బందా? అంటే మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం అబ్బే అదేమీ లేదండీ అంటూ ... ఎదుటి వాళ్ళ మనసు బాధపడకూడదని చెప్పే మొహమాటపు అబద్ధాలు,
నువ్వు చాలా అందంగా వున్నావని,నీ ముందు ఎవరైనా తక్కువే అంటూ ఇష్టమైన వాళ్ళను పొగిడేసి,వాళ్ళను సంతోషపెట్టే అందమైన అబద్ధాలు..చిన్నప్పుడు స్కూల్, ఎగ్గొట్టి తాతయ్యనో అమ్మమ్మనో చంపేసే అల్లరి అబద్ధాలు,ఆఫీస్ కి లేట్ గా వెళ్లినప్పుడు హెడ్ కి చెప్పే కట్టుకదల అబద్ధాలు...
ఇంకా మన బ్లాగ్ లోకం లో ఐతే ఏ పోస్ట్ పెట్టినా,అది పూర్తిగా నచ్చినా,నచ్చకపోయినా చాలా బాగుంది అని మెచ్చుకునే అబద్ధాలు..అంటే ఇలాంటి అబద్ధాలు కొత్త వాళ్ళని ప్రోత్సహించి,వాళ్ళు మరింత బాగా రాయటానికి ఉపయోగ పడుతుంటాయి కూడా...నాకు ఈ పరిస్థితి రాలేదు లెండి ఎందుకంటే మన బ్లాగర్లందరూ చక్కగా రాస్తారు కదా అందుకని..
రాజేంద్రప్రసాద్ హీరోగా వంశీ డైరెక్షన్ లో వచ్చిన "ఏప్రిల్ ఒకటి విడుదల" సినిమా అందరికీ తెలిసిందే..
అబద్దాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం (రాజేంద్రప్రసాద్) ఒక అనాధ. రైల్వేలో డాక్టరుగా పని చేసే వసుంధర అతడిని కొడుకులా పెంచుతుంది. విజయనగరం లో పెళ్ళికి వెళ్ళిన దివాకరం భువనేశ్వరి (శోభన) అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి పెళ్ళి కి ఒప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, ఇల్లు సమకూర్చాలని అబద్దాలతో, తన తెలివితేటలతోనూ, ఆ ప్రాంతానికి రౌడీగా చలామణీ అయ్యే తన మిత్రుడు గోపి (కృష్ణ భగవాన్) సహాయంతోనూ డబ్బు సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.
భువన ట్రాన్సుపర్ మీద రాజమండ్రి వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై సంతకం తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా ఏప్రిల్ 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం.
అప్పటి నుండి అతడు నిజాలు చెపుతుండటం వలన ఆతనికి ,ఇంకా ఆ కాలనీలో చాలా మందికి కష్టాలు ప్రారంభమవుతుంటాయి.చివరకు అతడు చెప్పిన నిజాల వలన అతని మిత్రుడు గోపి జైలుకు వెళతాడు. దివాకరంపై పగ పట్టిన గోపి అతడిని చంపేందుకు వెతుకుతూ అతడిని చంపబోతే అతడిని తల్లిలా పెంచిన వసుంధర గోపిని చంపేస్తుంది. తమ పందెంలో గడువు ఆ రోజుతో ముగుస్తుందని తెలిసీ తనను తల్లిలా పెంచిన ఆమె కోసం అతడు ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళతాడు. కాని వసుంధర జరిగినది పోలీసులకు చెప్పి తను లొంగి పోతుంది. ఆపదసమయంలో చేసిన హత్య కనుక ఆమెకు ఎక్కువ శిక్ష పడదు. దివాకరం తను ఓడిపోయాను కనుక ఇక ఎప్పుడూ నీకు కనిపించనని భువనతో చెపుతాడు. అతడి నిజాయితీ అర్ధమయిన భువన అతడితో పెళ్ళికి ఒప్పుకుంటుంది.
ఇదీ సినిమా కధ.. అబద్ధం చెప్పటం హాబీగా పెట్టుకున్న మనిషికి నిజాలే
మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే అది ఎంత ఘోరంగా వుంటుందో సరదాగా చూపించారు..అప్పుడప్పుడు అబద్ధం అనే ముసుగు వేసుకోకపోతే తనకే కాక ఎదుటివారికి కూడా ఎంత ప్రమాదమో ఈ సినిమా చెప్తుంది.
రాజేంద్రప్రసాద్ సరదా నటన, సంభాషణలు,,శోభన సహజమైన అందం,నటన ఇంకా మిగిలిన హాస్యనటుల హాస్యం ఈ సినిమాను హాస్యచిత్రాలలో ఒక క్లాసిక్ గా నిలిచేలా ఇప్పటికీ టీవీలో వస్తున్నా చూడాలనిపించేలా చేయగలిగింది...
ఈ సినిమాలో పాటలు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్.."మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంటా " పాట వింటే చాలు సినిమా అంతా కళ్ళముందు కదులుతూ ఒక చిన్న నవ్వు వచ్చేస్తుంది వెంటనే..
ఈ మధ్య FM లో ఈ పాట వినగానే ముఖ్యంగా ఈ పాటలో ఒక లైన్ ... భోజనానికి పిలిచి, వంట గురించి అభిప్రాయం అడిగిన వాళ్ళతో
"అపార్ధం చేసుకోరుగా ... అనర్ధం చేయ్యబోరుగా యదార్ధం చేదుగుంటది ... పదార్ధం చెత్తగున్నది ఇది విందా నా బొందా ... తిన్నోళ్ళు గోవిందా"
అని వినగానే నాకు అనిపించింది నిజంగా కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడకుండా తప్పించుకోలేము,అది చాలా కష్టం కూడా కదా అని..
"ప్రాణ మాన విత్త హానులదప్పింప కల్లలాడువారుకవులుసుమ్ము" అని,
"వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి" అని ఇలా అబద్ధం విషయంలో మన పెద్దలు కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు...అలాగని పెద్దలే చెప్పమన్నారు కదా అని అదే పనిగా అబద్ధాలు చెప్తూ వుంటే నాన్నా పులి లాగా అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.. ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్ కదా ..!
"పవన్ కళ్యాణ్" మాఅమ్మతోసహామా ఫామిలీ మొత్తానికి అభిమాన నటుడు,ముఖ్యంగా మా చెల్లి రమ్య పవన్ కి పెద్ద ఫ్యాన్..పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే సినిమా హాల్ లోనే చూడాలన్నది మా ఖచ్చితమైన నిర్ణయం..అలాగే చూసే వాళ్ళం కూడా.. కానీ ఖుషి తర్వాత పవన్ సినిమా ఒక్కటి కూడా సరిగా హిట్ కాకపోవటం పవన్ కి ఎంత బాధ కలిగించిందో చెప్పలేను కానీ మాకు మాత్రం చాలా బాధ అనిపించేది.ముఖ్యంగా పంజా సినిమా మరీ నిరాశ కలిగించింది..
పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళ ఓటమిని మర్చిపోయేలా చేసిన సినిమా "గబ్బర్ సింగ్" ..ఆడియో వచ్చినప్పటి నుంచే సినిమా కోసం వెయిట్ చేసిన అభిమానులు ఆనందించేలా వుంది ఈ సినిమా విజయం ..కేవలం పవన్ అభిమానులే కాదు... తమ అభిమాన హీరోల కోసమే మాట్లాడటం కాకుండా, నిజంగా సినిమా బాగుందని మెచ్చుకున్న వాళ్ళు కూడా వున్నారు.. ఇంక మేమందరం సినిమా వచ్చినప్పటి నుండి అదే పనిలో ఉన్నాము.. మా చెల్లి వాళ్ళ ఫామిలీ,తమ్ముడు వాళ్ళు అందరూ రిలీజ్ రోజే చూసేశారు,మేము ఈ రోజే చూశాము.. సినిమా చూస్తున్నంత సేపు సరదాగా,విసుగు లేకుండా గడిచిపోయింది.. దేవిశ్రీ సంగీతం చాలా బాగుంది. స్టోరీ అంతగా లేకపోయినా entertainment కోసం ఈ సినిమా చూడొచ్చు... ఇంక శ్రుతిహాసన్ కి కూడా ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందేమో తన కెరీర్ లో...
పవన్ కళ్యాణ్ సినిమాల్లో గుడుంబా శంకర్,ఖుషి తర్వాత నాకు చాలా నచ్చిన మూవీ గబ్బర్ సింగ్..అప్పట్లో ఖుషీ కూడా ఇలాగే మే నెలలో చూసాము..మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే అప్పటి రోజులు గుర్తుకొచ్చాయి మాకు... "ఆకాశం అమ్మాయైతే" పాట నాకు చాలా నచ్చింది.. ఇంక "కెవ్వు కేక" పాట మా ఇంట్లో మా బుడుగులందరికీ తెగ నచ్చేసింది.. పాట టీవీలో వస్తుంటే , ఎక్కడ వున్నా పరిగెత్తుకుంటూ టీవీ దగ్గరకొచ్చేస్తున్నారు.. "" ఏమి చేస్తాం "జీ టీవీ ఆట - 2" ప్రభావం అనుకుంటా"...
"మేము ట్రెండ్ ఫాలో అవ్వం,సెట్ చేస్తాం" అంటూ,వాళ్ళు అల్లరి చేస్తూ ప్రేక్షకులతో కూడా ఆనందంగా అల్లరి చేయించిన పవన్ & టీం ఈవేసవికి సాధించిన విజయానికి అభినందిస్తూ... నాకు నచ్చిన ఈ పాట ...
నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుండీ ఇష్టమే..చిన్నప్పుడు అంటే నాకు సినిమా చూసే జ్ఞానం వచ్చినప్పటి నుండి అన్నమాట.అలా నేను చూసిన సినిమాలు రెండు విభాగాలు.కొన్ని సినిమాలు మా ఫ్యామిలీ అందరం అంటే అమ్మ,నాన్న,తమ్ముడూ,చెల్లి అందరం కలిసి చూసినవి..కొన్ని సినిమాలు మా అమ్మ,అమ్మ స్నేహితులు, పిన్ని, అత్తయ్యలు,మా చిన్నపిన్ని స్నేహితులు నన్నుతోడుగా తీసుకెళ్ళిన సినిమాలు.(ఏంటో ఆ రోజుల్లో కాలేజ్ కి వెళ్ళే ఆడపిల్లలకి మాలాంటి చిన్న పిల్లలే తోడు సినిమాలకి వెళ్ళాలంటే.)
ఇంక అప్పట్లో కొన్ని ఆడవాళ్ళు మాత్రమే చూసే సినిమాలు ఉండేవి వాటికి మగవాళ్ళు అంతగా వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణకి ఘర్షణ,సింధూరపువ్వు,నీరాజనం,స్వాతి చినుకులు,జీవనజ్యోతి , ఇంకా కొన్ని రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాలు ఇలాంటివన్నీ ఆడవాళ్లకే ప్రత్యేకమైన మ్యాట్నీ సినిమాలు...
ఇంక రెండో విభాగం లో చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ లాంటి యాక్షన్ హీరోల సినిమాలు ఉండేవి.మా చిన్నప్పుడు మా వూరిలో పోకిరి మగపిల్లలు ( మా పెద్దల దృష్టి లో )ఇలాంటి సినిమాలకి వచ్చేవాళ్ళు..అందుకని ఇలాంటి సినిమాలకి వెళ్ళాలంటే నాన్న తప్పనిసరి మాతో పాటూ ... ఇదీ మా సినిమాల విభజన.
ఇంకో సినిమా విభాగం నా ఫ్రెండ్ రాజేశ్వరితో చూసిన సినిమాలు.. వాళ్లకి ఒక సొంత సినిమా హాల్ ఉండేది.ప్రతి ఆదివారం వచ్చి నన్ను సినిమాకి తీసుకెళ్ళకుండా వూర్కునేది కాదు.ఒక్కో సినిమా నెలరోజులు,ఇంకా ఎక్కువ రోజులు కూడా ఆడే ఆరోజుల్లో కొన్ని సినిమాలు కనీసం ఐదారుసార్లన్నా చూసి ఉంటాను దాని గొడవ వల్ల.అలా ఐదారుసార్లన్నాచూసిన వాటిలో చెట్టుకింద ప్లీడర్ ఒకటి..అందుకే ఆ సినిమా నిద్రలో లేపి అడిగినా స్టోరీ అంతా గుర్తుంటుంది.ఎంతైనా అప్పటి సినిమాలు బాగుండేవి.ఇప్పటికీ టీవీలో వస్తున్నా వాటిని చూడాలి అనిపిస్తుంది.
అప్పటి సినిమాల్లో కొన్ని కామన్ విషయాలు చాలా ఉండేవి. అలాంటి వాటిల్లో తప్పిపోయి,కలుసుకునే పాటలు ఒకటి.ఉదాహరణకు ఒక కుటుంబం ఆనందంగా పుట్టినరోజో,పండుగో చేసుకుంటూ పాట పాడుకుంటూ ఉంటారు. సడన్గా రౌడీ వచ్చి అక్కడ విధ్వంసం చేస్తాడు.పాపం కుటుంబం అంతా చెల్లా చెదురై పోతారు.కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పెద్దయ్యి వాళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళు చిన్నప్పుడు పాడుకునే పాట పాడుతూ ఉంటారు..ఇంతలో పక్కనుండి ఇంకెవరో వచ్చి అదే పాట పాడగానే అన్నయ్యా,తమ్ముడూ,అమ్మా,నాన్నా అంటూ అంటూ హ్యాపీగా కలుసుకుంటారు.ఇప్పుడంటే ఎదో కామెడీగా అనిపిస్తుంది కానీ చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూస్తుంటే మళ్ళీ వీళ్లెలా కలుస్తారబ్బా అని ఆలోచిస్తూ చాలా బాధగా ఉండేది :)
నాకొక సందేహం నిజంగా అంత చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లలకి ఆ పాట ఎలా గుర్తుంటుంది??
వీళ్ళు పాడుతున్నప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు విని వాళ్ళు కూడా వచ్చి పాడే ప్రమాదం లేదా??
ఏది ఏమైనా ఆ పాటలు పాడుకున్న వాళ్ళందరూ కలిసి, కధలు సుఖాంతం అయ్యాయి కాబట్టి
ఇప్పుడు ఈ సందేహాలతో నా బుర్ర పాడు చేసుకుని, పక్కన వాళ్ళ బుర్ర కూడా పాడు చేయటం ఎందుకు.
ఇలాంటి తప్పిపోయినప్పుడు పాడుకునే పాటల్లో నాకు గుర్తున్న కొన్ని పాటలు
ఆనాటి హృదయాల ఆనందగీతం - అన్నదమ్ముల అనుబంధం
సంసారమే బృందావనం ఆనంద తీరాల నవనందనం - ముగ్గురు కొడుకులు
అమ్మంటే మెరిసే మేఘం .. కురిసే వానా - ముగ్గురు మొనగాళ్ళు
ఇంకెవరికైనా ఏవైనా కుటుంబ గీతాలు గుర్తుంటే గుర్తు చేయగలరు :)
మా ఇంట్లో నాకు , మా తమ్ముడికి ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం.
ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కార్ లో,మా ఇద్దరి మొబైల్ లో ఇళయరాజా పాటలు తప్పకుండా ఉండాల్సిందే..
అలా మాకు ఇష్టమైన,నేను కలెక్ట్ చేసిన ఇళయరాజా గారి పాటలు
ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడే అభిమానుల కోసం
నా సంగీత ప్రపంచం సరిగమలు...గలగలలు లో ...
"సుందరదాసు" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా "ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా" అనే ఎంకి పాట పాడించారు.. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన సుందరకాండ రామాయణం లోని ఒక భాగం, ఎమ్మెస్.రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి,ఆకాశవాణిలో పాడారు.. ఈ రెండూ వీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.(wiki)
నీరాజనం సినిమాలో ఈయన పాడిన "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా" "పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళ కాంతుల్లో" అంటూ తాజ్ మహల్ అందాన్ని వర్ణించిన ఈ పాట ఎందుకో నాకు చాలా నచ్చుతుంది. సినిమాలో ఇది విషాదగీతం అయినా అందమైన ప్రేమకు ప్రతిరూపంగాచరిత్రలో నిలిచిపోయిన తాజ్ మహల్ లా ఈ పాట కూడా గుర్తుండిపోయింది..
తెలుగు సినిమాల్లో నాకు ఎక్కువగా నచ్చే సినిమాలు...
ఇప్పటికీ, ఎప్పటికీ Ever Green అనిపించుకునే సినిమాలు దర్శకుడు వంశీ గారివి.
ఈయన సినిమాల్లో గోదావరి అందాలను చాలా చక్కగా చూపిస్తారు.
గోదావరి అందాలతో పోటీ పడేలా వుండే కధానాయిక వంశీ సినిమా ప్రత్యేకత.
కధానాయిక పాత్ర,కట్టుబొట్టు చాలా బాగుంటుంది.
కాటుకకళ్ళు ,వాలుజడ,కాటన్ చీర,పెద్ద నల్లటి బొట్టు,చూడగానే వంశీ హీరోయిన్ అని చెప్పగలిగే ప్రత్యేకత
వంశీ వయ్యారి గోదారమ్మ సొంతం ... వీళ్ళలో ప్రత్యేకస్థానం భానుప్రియకే అని నా అభిప్రాయం..
కళాతపస్వి k.విశ్వనాధ్ గారి ప్రతి సినిమా ఒక దృశ్య కావ్యం,కళాఖండం.. విశ్వనాధ్ గారి దర్శకత్వం ఒక ప్రత్యేక శైలిలో వుంటుంది. మన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వుంటాయి ఆయన సినిమాలు.. విశ్వనాథ్ గారి సినిమాల్లో సంగీతం,నాట్యం,నటీనటుల హావభావాలు ఎప్పటికీ చెరగని మధుర జ్ఞాపకాలు..
సిరిసిరిమువ్వ,సిరివెన్నెల,శుభలేఖ ,సూత్రధారులు,స్వాతికిరణం ,శంకరాభరణం,స్వయంకృషి, సాగరసంగమం,స్వాతిముత్యం,సప్తపది,స్వర్ణకమలం,ఆపద్భాంధవుడు .. k.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్నఈ సినిమాలన్నీ అపురూప సుందర దృశ్య కావ్యాలు..
k.విశ్వనాధ్ గారి ప్రతి సినిమాలో కథానాయిక పాత్ర ఎంతో అందంగా,తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, మంచి వ్యక్తిత్వం,కళ్ళతోనే మనసులోని భావాలను పలికించగల నైపుణ్యం విశ్వనాథ్ గారి కావ్యనాయికలకే సొంతం..
బాపు తెలుగు సినీప్రపంచంలో తనకంటూ చెరగని ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా,తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడకపోయినా ఇది గీసింది,తీసింది బాపూ అని గుర్తించగలిగే శైలి ఈయన సొంతం. బాపూ అచ్చతెలుగుసినిమాలుసాధారణకుటుంబాలలోనిసమస్యలు,భార్యాభర్తల అన్యోన్యత, కుటుంబసభ్యుల మధ్యసంబంధాలను,ఎంతోచక్కగాప్రతిబింబిస్తాయి.
నా చిన్నిప్రపంచానికి మహారాణిని...
☺♥♥☺♥♥☺
నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నమ్మకాలు, అభిరుచులు, నాకుటుంబం, స్నేహితులు, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏదో ఒక బంధం వున్న అన్ని విషయాల
♥ నా చిన్నిప్రపంచం ♥
♥ నా అంతరంగానికి అక్షరరూపం ♥
"Life is not a problem to be solved, but a reality to be experience" -- Videos By Raaji - It's Me :)
ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి Guntur To KanyaKumari Road Trip My School Memories - St Ann's Girls high School Hamsala deevi - Mopidevi (Krishna Dist) Tour With My Family