పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

6, జనవరి 2016, బుధవారం

శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం - మహారాష్ట్ర




"ఛత్రపతి శివాజీ జన్మస్థానం - శివనేరి కోట"  తర్వాత మా ప్రయాణం భీమశంకర జ్యోతిర్లింగ దర్శనానికి. నిండు మనస్సుతో పిలిస్తే పలికే భోళాశంకరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వ జ్యోతిర్లింగంగా భీమానది ఒడ్డున కొలువైన శ్రీ భీమశంకర్. మహారాష్ట్రలోని పూనే జిల్లా ఖేడ్ తాలూకా ఘోడేగావ్ లో పూనేకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న రమణీయ ప్రదేశం.కొత్త ప్రదేశం కాబట్టి దారి తెలియటానికి మా తమ్ముడు ఉపయోగించిన GPS మమ్మల్ని మామూలుగా అందరూ వెళ్ళే దారుల్లో  కాకుండా కొండా కోనల్లో నుండి వెళ్ళే దారిలో తీసుకెళ్లటం కొంచెం టెన్షన్ అనిపించినా మర్చిపోలేని గొప్ప అనుభవం. భీమశంకర్ కి మా ప్రయాణం అంతా కొండలమీద ఘాట్ రోడ్లలో,పచ్చటి పొలాలున్న పల్లెటూర్ల మధ్య నుండి జరిగింది. ఇక్కడ అభయారణ్యాలలో సింహాలు తిరుగుతూ ఉంటాయట.
పచ్చటి అడవులు,లోయలు,కొండల మధ్య మా ప్రయాణం
Dharti sunehri ambar neela 
har mausam rangila 
Aisa des hai mera

భీమశంకర్ వెళ్ళే దారిలో  Dimbhe Dam కనిపిస్తుంది. 
ఈ డామ్ అంబర్  గావ్ కి దగ్గరగా ఉందట. 

భీమశంకర అభయారణ్యం ఇక్కడి నుండి ప్రారంభం అవుతుంది 
 
 "ఢాకిన్యాం భీమశంకరం"
పట్టణ వాతావరణానికి పూర్తి  దూరంగా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో డాకినీ శిఖరాన కొలువైన మహిమాన్విత భీమశంకర పుణ్యక్షేత్రం మార్గం అంతా దట్టమైన అడవుల్లో పచ్చటి ప్రకృతి మధ్య ప్రయాణం తర్వాత భీమశంకర్ చేరుకుంటాము. భీమశంకరుని దివ్య దర్శనమే కాదు,ఇక్కడికి చేరుకోవటానికి చేసే ప్రయాణం కూడా మరిచిపోలేని మధురానుభవమే.సాధారణంగా శివాలయాలు కొండ శిఖరాలమీద మీద ఉంటాయి కానీ భీమశంకరాలయం మాత్రం చుట్టూ పచ్చటికొండల మధ్య లోయలో ఉండటంఇక్కడి ప్రత్యేకత.కిందికి దిగటానికి మెట్లు ఉంటాయి.ఆలయానికి చేరటానికి సుమారు 236 మెట్లు దిగాలి. మెట్లు ఎక్కటమంటే కష్టం కానీ దిగటమే కాబట్టి హాయిగా అలసట లేకుండా దిగి వెళ్ళొచ్చు.ఇక్కడ కూడా మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం డోలీ వాళ్ళు ఉంటారు.మెట్లకిరువైపులా పూలు,పళ్ళు,పూజా ద్రవ్యాలు అమ్ముతూ ఉంటారు.కావలసినవి తీసుకుని దర్శనానికి వెళ్ళాము.మేము వెళ్ళినప్పుడు ఇక్కడ మాతో పాటూ తెలుగు యాత్రికులు ఎక్కువగా కనిపించటం విశేషం.  
కిందికి దిగటానికి మెట్లదారి 
భం భం భోలే శంఖం  మోగెలే
మెట్లదారిలో సాధువు

మెట్లుదిగి కిందికి వెళ్లగానే ఎత్తైన నల్లటి గోపురంతో ప్రాచీనమైన దేవాలయం కనపడుతుంది.భీమశంకరుని పూజలో ప్రతిరోజూ రుద్రాభిషేకం,పంచామృత స్నానం విధిగా జరుగుతాయట. మేము దర్సనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో స్వామికి అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. గర్భాలయం లోపలి వెళ్ళి, శివయ్యని తాకి,నమస్కరించుకోవటం చాలా సంతోషంగా అనిపించింది.శివలింగం మధ్యలో అరలాగా  ఉంటుంది. ఇక్కడ శివయ్యని శివ పార్వతులుగా భావిస్తారని అందుకే శివలింగం రెండు అరలుగా ఉంటుందని అక్కడి పూజారులు చెప్పారు.శివలింగం పానపట్టంలో నుండి ఎప్పుడూ భీమానది నీరు చిన్న ధారగా వస్తూ ఉంటుంది.మహిమాన్విత స్వయంభూ భీమేశ్వరజ్యోతిర్లింగం పార్వతి అమ్మవారితో కలిసి  అర్ధనారీశ్వరుడిగా,గంగారూపిణి అయిన భీమాదేవిచే నిత్యం అభిషేకించబడే గంగాధరుడిగా శివయ్య దర్శనం ఎన్నోజన్మల పుణ్యఫలం. త్రిపురాసుర సంహారంలో శివునికి సాయపడిన పార్వతీదేవి అంశగా కమలజగా ఇక్కడ పూజిస్తారు. ఈ అమ్మవారిని స్వయంగా బ్రహ్మదేవుడు కమలాలతో అర్చించేవాడట అందుకే అమ్మవారిని కమలజాదేవి అని పిలుస్తారు

మేము వెళ్ళినప్పుడు జనం ఎక్కువగా లేకపోవటం వల్ల  గుడి చాలా ప్రశాంతంగా ఉంది. స్వామి దర్శనం చేసుకుని,శివయ్య మాకు కలిగించిన అదృష్టానికి ఆనందిస్తూ బయటికి రాగానే గుడి ముందు గర్భగుడికి ఎదురుగా పెద్దగంట ,శనిదేవుని ఆలయం,రాతి దీప స్థంభం ఉంటాయి. పక్కనే ఒక కోనేరు,ఆ కోనేటి లోపల ఒక వినాయకుని విగ్రహం కూడా ఉంది. కార్తీక,మాఘ మాసాల్లో,శివరాత్రికి ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తారట.
భీమశంకర ప్రధానాలయం
గర్భాలయం ఎదురుగా 1727 నాటి పెద్ద గంట
భీమశంకర దీపమాల

స్థలపురాణం - 
శివుడు ఈ క్షేత్రంలో ఉండటానికి ఇక్కడ రెండు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు దేవతలను, మునులను బాధిస్తూ ఉండేవాడు. వాడి ఆగడాలు భరించలేని మునులు, దేవతలు శివుడ్ని శరణువేడగా శివుడు త్రిపురాసురుడ్ని అంతమొందించాడు.యుద్ధంలో అలసిపోయిన పరమేశ్వరుడు ఈ సహ్రాద్రి పర్వత శ్రేణి ప్రాంతంలో సేద తీరాడట.రాక్షస సంహారం చేసిన శివయ్యను పూజించటానికి అక్కడికే వచ్చిన దేవతలు, మునుల అభీష్టం మేరకు ఆ మహాదేవుడు ఇక్కడ భీమశంకరుడి నామధేయంతో జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి.

కుంభకర్ణుడు కర్కటిలకు పుట్టిన భీమ  నామధేయుడైన రాక్షసుడు తన పూర్వీకుల మరణానికి శ్రీరాముడు, అగస్త్య మహాముని కారణమని భావించి శ్రీహరి సమేతంగా అందర్నీ మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బ్రహ్మ గురించి తపస్సు చేసి, బ్రహ్మ అనుగ్రహంతో అపార బలాన్ని పొందాడు.ఆ వరబలంతో దేవతలను, మునులను వేధించేవాడు.అనంతరం శివభక్తుడైన కామరూపేశ్వరుడ్ని హింసించి కారాగారంలో వేసినా కామరూపేశ్వరు అక్కడే శివలింగాన్ని తయారుచేసుకుని తపస్సు చేసేవాడట.ఇది తెలిసిన భీమ రాక్షసుడు తననే పూజించంని లేకపోతే చంపుతానని కత్తి  దూయగానే కామరూపేశ్వరుడు తనను రక్షించమని శివుడ్ని వేడుకున్నాడట. దయామయుడైన శివుడు కామరూపేశ్వరుడి మొర ఆలకించి శివలింగంలోంచి ఉద్భవించి భీమను అంతమొందించాడట. అనంతరం దేవతలు, మునుల అభీష్టం మేరకు భీమశంకర నామధేయంతో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడట.

శివుడికి, త్రిపురాసురుడికి మధ్య జరిగిన యుద్ధంలో అలసిపోయిన శివుని శరీరం నుంచి స్వేద బిందువులు  పాయలుగా ప్రవహించి కొలనుగా మారింది.దాన్నే భీమానది అంటారు. భీమానది రాయచూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
భీమ నది జన్మస్థానానికి వెళ్ళే దారి

చరిత్ర - 
శివలీలామృతం’, ‘గురుచరిత్ర’, ‘స్తోత్ర రత్నాకరం’ వంటి ధార్మిక గ్రంథాలలో భీమశంకరం మహత్తు గురించి ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ, రాజారామ్ మహరాజ్ తదితర మహనీయులు ఈ క్షేత్రంలోని భీమశంకరుడ్ని దర్శించి స్వామి ఆశీస్సులు పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పూర్వం రఘునాథ్ పీష్వా అనే శివభక్తుడు ఇక్కడొక నుయ్యిని తవ్వించాడు. అనంతరం పీష్వాల దీవాన్ నాడాఫడన్‌వీస్ ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.పూణెకు చెందిన చిమణ్‌జీ అంతాజీనాయక్ క్రీ.శ.1437లో ఈ ఆలయ ప్రాంగణంలో సభామండపాన్ని నిర్మించాడు.

కాలినడకన వస్తున్న మహారాష్ట్ర భక్తులు - దారి పొడవునా ఇలా తులసి కోటను తలమీద పెట్టుకుని భజనలు చేసుకుంటూ,వారి సాంప్రదాయ అలంకరణలో గుడికి వస్తున్న భక్తులు చాలామంది కనిపించారు. 


  
చిన్నప్పుడెప్పుడో  సోషల్ లో చదివిన దట్టమైన అడవుల్లో సహ్యాద్రి  పర్వత  శ్రేణులని,అక్కడ  కొలువైన భీమశంకరుని దర్శనం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా ఆ శివయ్య మాకిచ్చిన వరంగా భావిస్తూ శివయ్య దీవెనలను,చుట్టూ ప్రకృతి అందాలని,అద్భుతాలని మనసులో నింపుకుని,అక్కడి నుండి రావాలనిపించకపోయినా తప్పదు కాబట్టి  మహారాష్ట్రలోని మరో జ్యోతిర్లింగం ఘృష్ణేశ్వరుడి దర్శనానికి బయల్దేరాము. 

 యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాది పదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి

ఓం నమః శివాయ



Related Posts Plugin for WordPress, Blogger...