పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

1, ఏప్రిల్ 2017, శనివారం

మా తమిళనాడు యాత్రా విశేషాలు - బృహదీశ్వరాలయం - తంజావూరు

శ్రీరంగం నుండి రాత్రికి తంజావూర్ వచ్చి అక్కడే స్టే చేసి,తెల్లవారుఝామునే ఆలయానికి బయలుదేరాము. అప్పటిదాకా విపరీతమైన మే నెల ఎండలలో మాడిపోయిన మాకు ఆరోజు చిరుజల్లులతో చల్లటి వాతావరణం చాలా సంతోషంగా అనిపించింది.వర్షం మరీ పెద్దది కాదు కాబట్టి వర్షంలోనే ఆలయానికి వెళ్ళాము. 2010కి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బృహదీశ్వరాలయం ఎన్నో అద్భుతాలకు,విశేషాలకు నిలయం. పేరుకి తగినట్లు పెద్ద కోటగోడలలాంటి ప్రాకారాలు,విశాలమైన పెద్ద ఆవరణ,పెద్ద నంది,అత్యంత పెద్దదైన ఆలయ శిఖరం ఎంతచూసినా ఆశ్చర్యంగా అనిపించేంత  పెద్ద శివయ్య, ఎటు చూసినా  అందమైన శిల్పకళ అంతా అద్భుతం.

ఆలయ ప్రధాన ప్రవేశద్వారం 


రెండవ ప్రాకారం 

చెన్నైకి 314 కి.మీ,తిరుచురాపల్లికి 56 కి.మీ  దూరంలో తంజావూరు జిల్లా,తంజావూర్ పట్టణంలో భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందిన తంజావూరు బృహదీశ్వరాలయం ఉంది.దీనిని బిగ్ టెంపుల్, పెరియకోవిల్, పెరుఉదయార్ కోవిల్,రాజరాజేశ్వరం అని కూడా అంటారు.ఈ ఆలయంలోని శివుడు శ్రీరాజరాజేశ్వరుడు, అమ్మవారు శ్రీ బృహన్నాయకీ దేవిగా కొలువయ్యారు.అతిపురాతనమైన ఈ ఆలయాన్ని మహాశివభక్తుడైన చోళరాజు రాజరాజచోళుడు 10 వ శతాబ్దం,1003-1010 A.D లో నిర్మించాడు.1987 లో Great Living Chola Temple గా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఆలయం గుర్తింపు పొందింది. ఆలయ లోపలి ప్రాంగణం  500 అడుగుల పొడవు,250 అడుగుల వెడల్పుతో,బయటి ప్రాకారాలు మొత్తంతో కలిపి 793 అడుగుల పొడవు,393 అడుగుల వెడల్పుతో ఉంటుంది.

ఆలయం లోపలి  ప్రాంగణం 


216 అడుగుల ఎత్తుతో  పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం/విమానగోపురం మీద 80 టన్నుల బరువున్న గ్రానైట్  (కుంభం) శిఖరాగ్రాన్ని నిర్మించారు.ఇంత బరువున్న ఈనిర్మాణాన్ని పైకి చేర్చటానికి ఈ ఆలయం నుండి  నాలుగు మైళ్ళ దూరం నుండి ఏటవాలుగా ఒక రాతివంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో రాతిని ఈ శిఖరంపైకి చేర్చారని తెలుస్తుంది.ఈ ఆలయ నిర్మాణం గురించి అన్నీ ఊహలే నిజంగా ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనేది  ఇప్పటికీ మిస్టరీ అనే చెప్తారు. ఆలయ ప్రధాన విమాన గోపురం మీద తమిళనాడు రాష్ట్ర  నృత్యమైన భరతనాట్యం  108 ముద్రలు,భంగిమల శిల్పాలు చెక్కి ఉంటాయి.

ప్రధాన ఆలయ గోపురం 


ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో పూర్తి గ్రానైట్ రాయితో నిర్మించారు.ఆలయం చుట్టుపక్కల 60 కి.,మీ లోపల ఎక్కడా కూడా గ్రానైట్ కొండలు  లేవట.దూరంగా ఎక్కడో చెక్కించిన రాతి నిర్మాణాలను ఇక్కడికి ఏనుగులతో తెప్పించి ఆలయాన్ని నిర్మించారని తెలుస్తుంది.అందుకే ఈ ఆలయ ప్రాంతంలో ఎక్కడా రాతి ముక్కలు, కానీ, రాతిని  చెక్కిన గుర్తులు కానీ కనిపించవు.చెక్కిన రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చుతూ ఆలయాన్ని నిర్మించారు.రాయిని ,రాయిని  అతికించటానికి మధ్యలో  సున్నంలాంటివేమీ వాడకపోవటం విశేషం.అన్నిరకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్న ఈరోజుల్లో కట్టిన నిర్మాణాలకంటే అలాంటివేమీ లేకుండా 1000 సంవత్సరాల క్రితం అంత అద్భుతమైన నిర్మాణం ఎలా సాధ్యమయ్యిందా అనిపిస్తుంది.

ఆలయ ప్రాకారం లోపలి నుండి 

చుట్టూ ప్రాకారాల మధ్యలో ఆలయం ఉంటుంది.ప్రాకారాలను దాటి,లోపలికి వెళ్ళగానే ముందుగా విశాలమైన ఆవరణలోని నందిమండపంలో బృహహదీశ్వరునికి తగినట్లు 25 టన్నుల బరువున్న ఏకశిలతో నిర్మించిన 19 అడుగుల పొడవు,8 అడుగుల వెడల్పు ,12 అడుగుల ఎత్తుతో నందీశ్వరుడు దర్శనమిస్తాడు.  భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాల్లో మొదటిది లేపాక్షి నంది,రెండవది ఈ నంది.

నందిమండపం బయటి నుండి 
నందిమండపం లోపలి నుండి
నందిమండపంలో అందమైన  చిత్రకళ

నందీశ్వరుని దర్శించుకుని,నందిమండపం ముందున్న ధ్వజ స్తంభం దాటి ముందుకి వెళ్ళగానే ఆరు అడుగులు ఎత్తుండే పునాది మీద ఆలయం కనపడుతుంది.ఆలయాన్ని సుమారు వందగజాల పొడవు,యాభై గజాల వెడల్పుతో నిర్మించారు.ఆలయ శిఖరం  మొత్తం చూడాలంటే పూర్తిగా తల పైకెత్తి చూడాల్సిందే. ప్రవేశద్వారం దగ్గరనుండి గర్భాలయం వరకు విశాలమైన మండపాలు వరసగా ఉంటాయి.అన్ని మండపాల్లో అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది.

ఆలయ ధ్వజస్థంభం 
ప్రధాన ఆలయం 

గర్భాలయంలో నల్లరాతితో పదహారడుగుల ఎత్తు,ఇరవై ఒక్క అడుగుల వెడల్పుతో,శివలింగం మీద నాగపడగలతో చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో అనిపించేంత పెద్దగా బృహదీశ్వరుడనే పేరుకు తగినట్లుగా శ్రీరాజరాజేశ్వరుడు దర్శనమిస్తాడు.నర్మదా నదీగర్భం నుండి వెలికితీసిన రాయితో రాజరాజచోళుడు స్వయంగా తానే  దగ్గరుండి శిల్పులతో ఈ శివలింగాన్ని చెక్కించి,ఏనుగులతో మోయించి తెచ్చారట.స్వామికి అభిషేకం చేయాలంటే పక్కనే ఎత్తుగా ఉన్న మెట్లపైకి ఎక్కి చేయాలి.మేము వెళ్ళినప్పుడు జనం చాలా తక్కువగా ఉండటంతో మేము చాలాసేపు ఉండి,స్వామి దర్శనం చేసుకున్నాము.తమిళనాడు ఆలయాల్లో పూజారులు డబ్బు ఎక్కువ అడగరు.10 రూపాయలు కానుక ఇచ్చినా గోత్రనామాలతో పూజచేసి,విబూధీ,కుంకుమ ప్రసాదంగా ఇస్తారు.

శ్రీ బృహదీశ్వరుడు 
జటాజూట ధారి శివా  చంద్రమౌళీ నిటాలాక్ష నీవే సదా మాకు రక్ష
శ్రీ బృహదీశ్వరుడు,శ్రీ బృహన్నాయకి అమ్మవారు 

గర్భగుడి నుండి బయటికి 

గర్భగుడి నుండి బయటికి రాగానే ప్రధాన ఆలయం వెనక భాగంలో విఘ్నేశ్వరుడు,నటరాజమూర్తుల ఆలయాలు, బృహన్నాయకి అమ్మవారి ఆలయం,కుమారస్వామి ఆలయం,చండికేశ్వర ఆలయం ఉంటాయి.అన్ని ఆలయాల్లో, ప్రధానాలయం గోపురం మీద ఎంతచూసినా తరగనంత,ఏమున్నాయో కూడా తెలియనన్ని శిల్పాలు ఉంటాయి.పెద్ద ద్వారపాలకుల విగ్రహాలు ప్రతి ఆలయ ప్రవేశద్వారాలకి రెండువైపులా కనిపిస్తాయి.ఆలయప్రాంగణం మొత్తం నడవటానికి ఇబ్బంది లేకుండా నీట్ గా బండరాళ్లు పరిచి ఉంటాయి.పచ్చగడ్డితో లాన్స్,పార్కులు ఉంటాయి. చిరు జల్లులలో తడిసిన ఆలయం చాలా అందంగా అద్భుతంగా ఉంది.మేము ఆలయం మొత్తం  తిరిగి చూడటానికి, దర్శనాలు చేసుకోవటానికి వర్షం ఏమాత్రం ఆటంకం కలిగించకపోగా,చల్లగా జల్లుల్లో ఆలయంలో తిరగటం మర్చిపోలేని  అనుభూతి.ఆరోజు తమిళనాడు ఎలక్షన్ కూడా కావటంతో మాతో  పాటూ చాలా కొద్దిమంది  మాత్రమే ఉన్నారు.ఉదయాన్నే ప్రశాంతమైన,చల్లని వాతావరణంలో అక్కడ ఎంత సమయం ఉన్నా ఇక బయటికి  వెళదాం అనిపించలేదు. 

కుమారస్వామి ఆలయం 

ద్వారపాలకులు 

ప్రతిచోటా అందమైన,అద్భుతమైన శిల్పకళ

ఐరావత ద్వారాలు 

ఆలయాల వివరాలు 

ఆలయం ప్రాంగణం మొత్తం చాలా శివలింగాలు ఉన్నాయి. 
దాదాపు 252 శివలింగాలు ప్రతిష్టించబడినట్లు అంచనా. 

ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల స్టాల్. మేము కూడా ప్రసాదాలు కొన్నాము. 
చల్లటి ఉదయం ఇక్కడ వేడిగా పులిహోర,రవ్వకేసరి  చాలా బాగుంది 

ఆలయంలో మా అమ్మ  

మా తమ్ముడు

అమ్మ,నేను 

బృహదీశ్వరాలయం ఎంత అద్భుతంగా ఉందో,మేము వెళ్లినరోజు జల్లులతో వాతావరణం కూడా అంతే ఆహ్లాదంగా ఉంది అక్కడే చాలాసేపు ఉన్న,బయటికి రావాలనిపించలేదు.తప్పదు కాబట్టి మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ అద్భుతాన్ని చూస్తూ బయటికి వచ్చేశాము.మేము తంజావూర్ వెళ్లినరోజే తమిళనాడులో ఎలెక్షన్స్ జరుగుతున్నాయి.వర్షంలో కూడా వెళ్లి ఓట్ వేయటం కనిపించింది.ఇప్పుడు ఈ ఫ్లెక్సీ చూస్తే అనిపిస్తుంది.తమిళనాడులో ఇంత రాజకీయ కల్లోలం జరుగుతుందని మనం ఆరోజున అనుకున్నామా  అని..

ఆలయం బయట ఎలక్షన్ ఫ్లెక్సీ 

ఎలక్షన్స్ కారణంగా Thanjavur Art Gallery and Museum క్లోజ్ చేసి ఉంది.తప్పకుండా చూద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు.


ఆలయం ముందున్న తంజావూర్ ఆర్ట్స్ షాపులోకి వెళ్ళాము.నిజంగా అక్కడి బొమ్మలు, తంజావూర్ పెయింటింగ్స్ అన్నీ చాలా అందంగా,కళాత్మకంగా  ఉన్నాయి.వీటిని ఆన్ లైన్ లో కూడా కొనుక్కోవచ్చు.

తంజావూర్ Arts 





రాజులకే రాజైన ఆ రాజరాజేశ్వరుని కోసం రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వరాలయం నిజంగా అద్భుతం.దక్షిణభారత శిల్ప సౌందర్యానికి ప్రతీక.ఈ ఆలయంలో అన్ని ఆలయాల్లాగా రకరకాల రంగులు వేయకపోవడం వలన అప్పటి పురాతన వైభవాన్ని అలాగే నిలిపి ఉంచినట్లు అనిపిస్తుంది.బృహదీశ్వరాలయ దర్శనం చాలా సంతోషంగా,ఎప్పటికీ గుర్తుండే మంచి జ్ఞాపకంగా అనిపిస్తుంది.

PRIDE OF INDIA - Thanjavur Big Temple



Related Posts Plugin for WordPress, Blogger...