పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

10, ఏప్రిల్ 2012, మంగళవారం

పనికిరాని విద్య లేదు ... పనికిరాని మనిషీ లేడు ...!


అన్ని
విద్యలకు హృదయమే నిలయం. హృదయ వికాసం కలిగించి,మానసిక వికాసం,వివేకం,సత్సంస్కారం కలిగించే విద్య ఒకటైతే,హృదయంతో సంబంధం లేకుండా కేవలం భౌతిక సుఖాలకు,విలాసాలకు పనికి వచ్చేది లౌకిక విద్య.ఈ లౌకిక విద్యకు డబ్బు,అవసరాలతోనే సంబంధం..ఇప్పటి ప్రపంచంలో కావాల్సింది ఈ విద్య కాబట్టే ఎన్నో రకాల ఉపాధి కోర్సులు పుట్టుకొస్తున్నాయి.

ప్రతి చదువులోనూ,ఉద్యోగం లోనూ ఇష్టపడి చేసేవి,కష్టపడి చేసేవి రెండూ ఉంటాయి.కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక చదువు చదువుతారు,ఉద్యోగం చేస్తారు..కానీ కొందరు వాళ్ళు ఏది చదవాలనుకుంటే అదే చదువుతారు,ఏ ఉద్యోగం చేయాలనుకుంటే అదే చేస్తారు.చేసే పనిని ప్రేమించాలి...అప్పుడే అందులో విజయాన్ని సాధిస్తారు ఎవరైనా.

పిల్లలు చిన్నప్పుడు పాటలు పాడితే,డాన్స్ చేస్తే సంతోషిస్తాం,ఎంకరేజ్ చేస్తాం ..కానీ అదే పిల్లలు పెద్దయ్యి మేము డాన్స్ చేస్తాము,పాటలు పాడతాం అంటే ప్రోత్సహించే పెద్దలు ఎంతమందో ఉండరు.పిల్లలు డాక్టర్లు,ఇంజినీర్లు మాత్రమే కావాలి కానీ ఇలా తైతక్కలాడటమేమిటి అని పక్కింటి పిల్లలతో,బంధువుల పిల్లలతో పోల్చి వాళ్లకి ఇష్టం లేకపోయినా మనకిష్టమైన స్కూళ్ళల్లో కోర్సుల్లో చేర్చివాళ్ళను బలవంతంగా మనమేమి చెయ్యాలనుకుంటున్నామో అదే చేస్తాం.

కొంతమంది దృష్టిలో కొన్ని మాత్రమే పనికి వచ్చే విద్యలు,కొన్ని మాత్రమే పనికి వచ్చే ఉద్యోగాలుమిగతా వాళ్ళంతా పనికిరాని వాళ్ళు.

నేను చదివిన ఒక కధ :

అర్జునుడు పాశుపతాస్త్రం సాధించిన తర్వాత ఇంద్రుడి ఆహ్వానం మేరకు అమరావతి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ విలాసాల్లో మునిగి తేలకుండా,గంధర్వుల దగ్గర నృత్యం నేర్చుకున్నాడట.అప్పటికే అర్జునుడు సకల విద్యల్లో ఆరి తేరి ఉన్నాడు కానీ ఒక్కో విద్య ఒక్కో చోట ఉపయోగపడుతుందనే ముందు చూపుతో నాట్యం కూడా నేర్చుకున్నాడు.
విద్యతోనే అర్జునుడు అజ్ఞాతవాసం సమయంలో తనను ఎవరూ గుర్తుపట్టకుండా విరాట రాజు కొలువులో బృహన్నలగా,నాట్యాచార్యునిగా జీవించాడు. సమయంలో అర్జునునికి అంతకుముందు నేర్చిన అస్త్ర విద్యలేమీ పనికి రాలేదు,పైగా వాటిని ప్రదర్శిస్తే అతను అర్జునుడని అందరికీ తెలిసి పోయేది..

కాబట్టి ఏ చదువు పనికి రానిది కాదు,ఏ వృత్తీ చిన్నవి కాదు.గొప్ప చదువులు చదివితేనే గొప్ప వారు కాలేరు.కొత్త ఆలోచనలు చేసి కొత్త రంగాల్లోకి ప్రవేశించి,విజయం సాధించిన వాళ్ళందరూ గొప్ప గొప్ప చదువు చదివిన వాళ్ళేమీ కాదు.
ఎవరు చదివే చదువు పట్ల వాళ్లకి గౌరవం వుండాలి,చేసే వృత్తి పట్ల అంకిత భావం ఉండాలి.అప్పుడే చదివిన చదువుకి ఒక అర్ధం..అంతే కానీ
డొనేషన్స్ కట్టి చదువుకుని, డబ్బు తిరిగి వసూలు చేయాలనుకుని, వృత్తితో వ్యాపారం చేసేవాళ్ళు,
లంచం కట్టి ఉద్యోగం తెచ్చుకుని ఆ డబ్బును తిరిగి సంపాదించాలని అవినీతికి పాల్పడే వాళ్ళు,
గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయటం నామోషీగా భావించే వాళ్ళు,తమని నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేసే వాళ్ళు ,
డబ్బు పోగేసుకునే యంత్రాల్లాగా మారిపోయిన డాక్టర్లు,ఇంజినీర్లు,లాయర్లు, ఇంకా
ఇలాంటి వాళ్ళు ప్రతి వృత్తిలో ఉన్నారు. మంచి,చెడు,మోసం అన్ని రంగాల్లో ఉన్నాయి ఇవి కేవలం కొందరికే పరిమితం కాదు.మోసం చేసారన్న కారణం తో ఎవరినైనా బహిష్కరించాలి అనుకుంటే మొత్తం ఈ ప్రపంచాన్నే బహిష్కరించాల్సి వస్తుందేమో..

మంచి, చెడు లని ఎవరు నిర్ధారించగలరు?? మనకి మంచి అనిపించింది ఇతరులకు చెడు అనిపించొచ్చు.మనకి చెడు అనిపించింది ఇతరులకు మంచి అనిపించొచ్చు... ఎవరిలోనో కోరుకునే మార్పుమనలోనేరావాలి.ఎవరినోనిందించి,సంస్కరించాలి అనుకునే వాళ్ళు ముందు వాళ్ళ ఇంటి నుండే ఈ సంస్కరణలను అమలుచేయ గలగాలి.

ఏ విద్య అయినా వృత్తి అయినా మనిషికి సంస్కారాన్ని నేర్పాలి,సమాజానికి ఉపయోగపడాలి,ఎదుటి మనిషిని గౌరవించటం నేర్పాలి.అప్పుడే ఆ విద్యకు,వృత్తికి సార్ధకత.
విద్య వల్ల వినయం రావాలేగానీ.. అహంభావం కాదు..!!


Related Posts Plugin for WordPress, Blogger...