పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

24, డిసెంబర్ 2016, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 23
ఇప్పటిదాకా జరిగిన మొత్తంకథ ఈ లింక్ లో  చదవచ్చు..  

http://raji-rajiworld.blogspot.in/search/label/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE%20%3F%3F%20--%E0%B0%92%E0%B0%95%28%E0%B0%B0%E0%B0%BF%29%20%E0%B0%95%E0%B0%A7


క్లుప్తంగా ఇప్పటిదాకా జరిగిన  కధ .. 

బాగా చదివి,గవర్నమెంట్ సీట్లు తెచ్చుకోలేక కష్టపడి నాన్నసంపాదించిన డబ్బునంతా బెంగుళూరు యూనివర్సిటీకి ఫీజుల రూపంలో ఖర్చుపెట్టించిన అన్న,ఇద్దరు అక్కల్లా కాకుండా నాన్న ఆశయానికి, నాన్నకి  ఏకైక వారసుడిగా డాక్టర్ అవ్వాలని, దేవుళ్ళ కి మారు రూపాలైన మా పెద్దల దీవెనలతో,వివేకానంద స్ఫూర్తితో ఎంసెట్ లో చాలా మంచి ర్యాంకు తెచ్చుకుని మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయిన దగ్గరి నుండి  సీనియర్లు, తోటి క్లాస్ మేట్స్ టీజింగ్ లు ఎదుర్కుంటూ కాలేజ్ కి వెళ్తున నాకు కావ్య పరిచయం ఒక గొప్ప మార్పు,ఒక మంచి మలుపు.కావ్య మాధవ్ నువ్వు చాలా పద్ధతిగా చెడ్డ అలవాట్లు లేకుండా ఉంటావు,నీలాగా మా అన్న హేమంత్ ని కూడా మార్చు,అని చెప్పటంతో హేమంత్ ని ఎలాగైనా మంచి మార్గంలో పెట్టాలి అనుకుని,హేమంత్ రూమ్ లోనే చేరిపోయాను.కాలేజ్లో పరిస్థితి అలాగుంటే ఇటు మా ఇంట్లో మా అన్నకి,కజిన్ భార్యకి అక్రమ సంబంధం ఉందని, మా పెద్దలే మాట్లాడటం,మా చిన్నక్క కొన్నాళ్ళు కనపడకుండా ఎటో పోయిందని మా పెద్దల పెంపకం గురించి మా బంధువుల ఇళ్ళల్లో చెవులు కొరుక్కోవటం, ఇలాంటివన్నీ కొంచెం బాధ అనిపించినా, ఇంకో సంతోషం మా అన్నకి ఎంగేజ్ మెంట్ కావటం.ఎంగేజ్ మెంట్ అయ్యి మళ్ళీ కాలేజ్ కి వెళ్ళగానే నాకోసం అక్కడ మరో సంతోషం కావ్య తనంతట తానుగా నన్ను  వాళ్ళ ఇంటికి పిలవటం,నాకోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పటం,నామనసులో ఏవేవో  ఆలోచనలు కలిగించాయి.

ఇక ప్రస్తుత కథ చదవండి... 

కావ్య వాళ్ళింటికి వెళ్లిన నాకు కావ్య  ప్రవర్తన చాలా సంతోషాన్ని కలిగించింది.నాతో స్నేహాన్ని మించిన ఫీలింగ్ ఎదో తన మనసులో ఉన్నట్లు నాకనిపించింది.అప్పటినుండి నా రూమ్మేట్స్ ఏమన్నా లెక్కచేయకుండా నేనొక్కడినే కావ్య ఇంటికి వెళ్ళటం,ఇద్దరం కాలేజ్ లో కలిసినప్పుడు మాట్లాడుకోవటం నాకంతా కొత్తగా సంతోషంగా, కాలమిలా సాగిపోనీ అన్నట్లు సమయం సంతోషంగా గడిచిపోతుంది.ఈలోగా కాలేజ్ బెంగుళూరు,ఊటీ టూర్ అనౌన్స్ చేశారు కాలేజ్ లో అంతా వెళ్తున్నారు నేను కూడా వెళ్లాలని నాన్నతో చెప్పి, డబ్బులు తెప్పించుకున్నాను. డబ్బు తీసుకుని వచ్చిన నాన్న ఎవరెవరు వెళ్తున్నారు?ఎప్పుడు వెళ్తున్నారు లాంటి వివరాలన్నీ కనుక్కొని నాకు జాగ్రత్తలు చెప్పి,వెళ్లిపోయారు. టూర్ కి వెళ్లేరోజు రానే వచ్చింది.కావ్య తన ఫ్రెండ్స్ తో ,నేను మా రూమ్మేట్స్ తో బస్సుదగ్గరికి చేరుకున్నాము.ఆరోజుల్లో విహారయాత్రలంటే  ఎదో తెలియని  ఉద్విగ్నత,  పైగా కావ్యతో కలిసి చేస్తున్న ప్రయాణం ఇంకొంచెం ఎక్కువ సంతోషంగా అనిపించింది.కానీ నాకా క్షణం తెలియదు నా జీవితమంతా నాకు ఇష్టం లేకపోయినా  ఇలాగే యాత్రల్లోనే  గడిచిపోతుందని.

బస్సులోకెక్కాక ఇక అంతా పాటలు, అల్లరి అప్పట్లో వచ్చిన సినిమా పాటలు,సొంత కవిత్వాలు  పాడుతూ హాయిగా ప్రయాణం సాగిపోతుంది.అప్పుడప్పుడు నాకు రెండు సీట్ల ముందు తన ఫ్రెండ్ అనితతో కూర్చున్న కావ్యని  గమనిస్తూ ఉన్నాను.తను బస్సులో ఎవరి గొడవ పట్టించుకోకుండా ఇయర్ ఫోన్స్ తో వాక్ మాన్ లో పాటలు వింటూ కూర్చుంది.కావ్యకి ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం.నాకు అప్పటిదాకా ఏ పాటలు అంత ప్రత్యేక ఇష్టం లేదు కానీ అప్పుడప్పుడు కావ్య చెప్తుంటే ఈమధ్యే కొన్ని తెలుసుకుంటున్నాను.ప్రయాణం మధ్యలో ఉండగా కావ్య ఫ్రెండ్ అనితకి వాంతులు మొదలయ్యాయి.సీట్లో కూర్చోలేక అవస్థ పడుతున్న తనని సీట్లో పడుకోబెట్టిన కావ్య, నాపక్క సీట్ ఖాళీగా ఉండటంతో అక్కడికొచ్చి కూర్చుంది. కావ్యతో అంత దగ్గరగా నా ఊటీ ప్రయాణం నేనిప్పటికీ మర్చిపోలేనిది. పక్కనే కూర్చున్న కావ్యతో ఎదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏం పాటలు వింటున్నావు కావ్యా? అని అడగ్గానే  నువ్వు కూడా విను మాధవ్ మంచి పాట! అంటూ ఇయర్ ఫోన్ ఒకటి తన చెవిలో ఉంచుకునే రెండోదినాకు ఇచ్చింది. "కన్నులకు చూపందం కవితలకు ఊహందం చిరునవ్వు చెలికందం సిరిమల్లి సిగకందం" అనే పాట చాలా సున్నితంగా వినిపిస్తుంది.ఆపాట అందం ఎలా ఉన్నా కావ్యతో కలిసి ఒకే వాక్ మాన్ లో ఆ పాటలు వినటం మాత్రం నాకు ఎప్పటికీ అందమైన జ్ఞాపకం. 

అలా హాయిగా సాగిన ప్రయాణం బెంగుళూరు,మైసూర్,ఊటీ అన్నీ చూసుకుంటూ  నేను కావ్య,అనిత,షాజహాన్ ఇంకా కొందరం బాచ్ గా తిరుగుతూ, అక్కడక్కడా ఆగుతూ గుర్రాలెక్కి, ఫోటోలు,గ్రూప్ ఫోటోలతో,ఆ ఫోటోల వెనక నేను రాసుకున్న టూర్ విశేషాలు నాజీవితంలో ఒక అందమైన అనుభవం.టూర్ అంతా మా రూమ్మేట్స్ నన్ను కావ్య గురించి ఏదోఒకటి అంటూ టీజ్ చేస్తూనే ఉన్నారు.అందుకే ఈ టూర్లో వాళ్లకి నేను కొంత దూరంగానే ఉన్నాను.సరదాగా గడిపిన ఆ టూర్ తర్వాత మళ్ళీ  కాలేజ్,రూమ్,చదువు రొటీన్ లైఫ్ మొదలయ్యింది.ఇంతలో మా రూమ్మేట్,కావ్య (కజిన్) అన్నయ్య హేమంత్ పుట్టినరోజు వచ్చింది.ఈసారి నా బర్త్ డే మన రూమ్ లోనే సెలెబ్రేట్ చేసుకుందాము.మా పిన్ని(కావ్య వాళ్ళఅమ్మ ),కావ్య కూడా మన రూమ్ కే  వస్తానన్నారు అని హేమంత్ చెప్పగానే ఈరోజంతా కావ్య ఇక్కడే ఉంటుందన్నమాట అని నాకు చాలా సంతోషంగా అనిపించింది.మధ్యానానికి కావ్య ,ఆంటీ మా రూమ్ కి వస్తూనే చాలారకాల వెజ్,నాన్ వెజ్ డిషెస్ అన్నీ రెడీ చేసి తీసుకొచ్చారు.

నాకు కొందరి ఇళ్లలో వంట ఎప్పటికీ ఆశ్చర్యమే!!మా నాన్న పేరుకే డాక్టర్ కానీ మాఇంట్లో  రోజూ మామూలుగా  వండుకునే అన్నం, పప్పులు,పండగలకి పులిహోర,పూరీలు తప్ప వెరైటీ వంటలేమీ వండరు.చిన్నప్పుడెప్పుడో  మా నాన్న రైల్లో మద్రాస్ టూర్ తీసుకెళ్తే కూడా ఇంట్లోనే వండుకున్న పూరీలు,కొబ్బరిపచ్చడి  డబ్బాల్లో పట్టుకొచ్చింది మానాయనమ్మ. ఎప్పుడన్నా ఏమన్నా తినాలనిపిస్తే ముందుగానే వేయించిన అప్పడాలు,వడియాలు ఒక డబ్బాలో పెట్టి అవి రెండు తీసి ఇచ్చేది. పులిహోరకి కావాల్సిన చింతపండు పేస్ట్ ముందుగానే కలిపి ఉంచి ఎప్పుడంటే అప్పుడు పులిహోర కలిపి పెట్టేది.మా అమ్మని పిచ్చి హాస్పటల్లో ఉంచినప్పుడు చూట్టానికి మద్రాస్ వెళ్లొస్తూ మానాన్న క్రీమ్ బిస్కట్స్ పాకెట్స్ తెచ్చేవాడు.నాయనమ్మ వాటిని దాచి అప్పుడప్పుడు నాకు,అక్కలకి  పెట్టేది .అదే మాకు బ్రహ్మాండం గా అనిపించేది.మా అమ్మకి నాన్ వెజ్ అంటే ఇష్టమే కానీ మా నాయనమ్మ ఇంట్లో దాన్ని నిషేధించడంతో మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లి తినొచ్చేది.కానీ ఎప్పుడన్నా మా క్లాస్మేట్స్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మలు చాలా నీట్ గా రకరకాల వంటలు చేసి పెట్టేవాళ్ళు.అప్పుడు ఆలోచించే వాడ్ని మా ఇంట్లో ఎందుకిలాలేదు అని? 

ఆరోజు హేమంత్ పుట్టినరోజు స్పెషల్స్ ఆంటీ చాలా బాగా చేశారు.భోజనాలయ్యాక కాసేపు కబుర్లు చెప్పుకుని సాయంత్రం పార్టీ కి రెడీ అయ్యాము.డాబా మీదే కేక్ కటింగ్ ఏర్పాట్లు చేశాము.కావ్య హేమంత్ కి ఎదో గిఫ్ట్ ఇచ్చింది.తర్వాత అక్కడే  కొంచెం పక్కగా నించున్న నా దగ్గరికి వచ్చి రెండు చేతుల్లో Friends Forever అని రాసి ఉన్న heart పట్టుకున్న ఒక చిన్న టెడ్డీని ఇచ్చి మాధవ్ ఇది నీకే.. ఇందాక గిఫ్ట్ షాప్ లో కనిపించింది. బాగుందని కొన్నాను అంటూ ఇచ్చింది.నాకు ఆ టెడ్డీ heart లో friends అనే మాటకంటే forever అనే మాటే నా కళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది.కావ్య నాకోసం గిఫ్ట్ తెచ్చిందన్న ఆనందంలో కొంచెంసేపు మాటలు రాలేదు.కాలం ఆగదు కదా చీకటి పడిపోయింది,కావ్య,ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అందరూ వెళ్లిపోయారు.ఆరాత్రంతా కావ్య ఆలోచనలతో ఆ టెడ్డీని చూస్తూ నిద్ర కూడా రాలేదు.నేను కన్ఫర్మ్ అయిపోయాను కావ్యకి నేనంటే ఇష్టమని. 

నా మనసుకేమయింది  అని పాడుకునేలోపే ఎక్జామ్స్ వచ్చేశాయి.మా రూమ్మేట్స్ ట్యూషన్స్ పెట్టించుకుని,నేను ట్యూషన్స్ లేకుండానే పరీక్షలు రాసేశాము.సెలవుల్లో కావ్య తన బంధువుల ఇంటికి వాళ్ళ తమ్ముడు,చెల్లితో కలిసి వెళ్తున్నానని చెప్పింది. ఇక ఒక్కడినే ఇక్కడ ఉండి ఏమి చేస్తాంలే అని కావ్యకి చెప్పి,మా వూరు బయల్దేరాను. ఎప్పట్లాగే  ఇంట్లో నాన్న,నానమ్మ ఉంటే, మిగతా వాళ్లంతా హైదరాబాద్ లోనే ఉన్నారు.రెండురోజులు కాగానే పెద్దక్క, అమ్మ, అమ్మమ్మ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చారు.వాళ్ళ వాలకం చూస్తే ఎదో పెద్ద విషయమే చర్చించటానికే వచ్చినట్లుగా అనిపించింది.అది నిజమే అని తెల్లారిన తర్వాత తెలిసింది.మా ఇంట్లో ఏ విషయమైనా ముందు మా అమ్మమ్మ ఇంట్లో చర్చించి,ఆ తర్వాత మా నాన్న ముందు ఆ విషయాన్ని పెడుతుంటారు.ఈరోజు కూడా అలాగే మా అమ్మమ్మ ఇంట్లో సమావేశం.ఇంతకీ విషయం ఏంటంటే మా పెద్దక్కకి పెళ్లి సంబంధం.MBBS లో సీటు రాక డొనేషన్ కట్టి,ఎదో ఒక డాక్టర్ చదివిన మా పెద్దక్క ధ్యేయం ఎంత కట్నమైనా ఇచ్చి,ఖచ్చితంగా అమెరికా  మొగుడే కావాలని.అందులో భాగంగానే హైదరాబాద్ లో  BTech చదివి,ఎదో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లోపనిచేస్తూ,అతనికి కూడా  అమెరికా వెళ్లాలనే కోరిక ఉన్నా ఆర్ధిక స్థోమత లేని ఒక  సంబంధం వచ్చిందట.ఇప్పుడు పెద్దక్క ఎంత డబ్బైనా ఇచ్చి,అతన్నే పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్లాలని డిసైడ్ అయిపొయింది కానీ ఎక్కువ కట్నం అంటే  మా నాన్న, నాన్నమ్మ ఒప్పుకుంటారా అన్నదే సందేహం.నాన్నకి ఈ విషయం చెప్పే బాధ్యత ఎప్పటిలాగే మా అన్నయ్య మీద పడింది.అన్నయ్య నాన్నతో మాట్లాడటం,నాన్న కూడా ఇప్పటికే అమెరికాలో ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ కట్నమివ్వాలి,అదే వీళ్లయితే తక్కువకే ఒప్పుకుంటారు,మనమే అమెరికా పంపినట్లు ఊర్లో కూడా గొప్పగా ఉంటుందని  నాన్నమ్మని ఒప్పించి, పెళ్లికి ఒప్పుకున్నారు. 

ఇక మాప్రయాణం హైదరాబాద్ కి.ఈసారి నాన్న,నాన్నమ్మ తో సహా అందరం వెళ్లి పెళ్లి మాటలు మాట్లాడి కట్నం నిశ్చయం చేసుకున్నారు.ఇంతకీ ఆ సంబంధం కుదిర్చింది మా వాళ్ళందరూ మా అన్నతో అక్రమసంబంధం అంటకట్టిన మా కజిన్ భార్యే అని నాకు తర్వాత తెలిసింది.పాపం మా వదిన (కజిన్ భార్య) అంత అభిమానంగా మా అక్కకి తన ఇష్టానికి తగిన సంబంధం కుదిరిస్తే మా వాళ్లంతా తనని గురించి ఎంత హీనంగా మాట్లాడారు అని బాధ అనిపించింది.మా పెద్దక్క పెళ్ళి కుదిరింది సరే,మరి మా అన్నకి ఎంగేజ్ మెంట్ అయ్యింది కదా మరి అన్న పెళ్ళెప్పుడని సందేహం కూడా వచ్చింది.హైదరాబాద్ లో ఉండగానే  Medical Dictionary కొత్తదేదో వచ్చిందట,నువ్వు తీసుకుని నాకు కూడా తీసుకురా మాధవ్ అది ఇక్కడ దొరకడంలేదు అంటూ హేమంత్ ఫోన్ చేసాడు.సరేనని షాపుకి వెళ్తే నా వరకు ఐతే నాదగ్గర డబ్బులు ఉన్నాయి కానీ, ఇంకో రెండోదానికి లేవు.సరే అని కాయిన్ బాక్స్ నుండి అన్నకి ఫోన్ చేశాను.విషయం వినగానే అన్న అక్కడినుండి మా వదిన (కజిన్ భార్య) వాళ్ళ ఇల్లు దగ్గరే కదా నువ్వు అక్కడికెళ్లి తెచ్చుకో నేను తర్వాత తనకి ఇస్తాను అన్నాడు. సరే మా కజిన్ ఉంటాడు కదా అని వాళ్ళింటికి వెళ్ళాను.మా కజిన్ లేదు మా వదిన (కజిన్ భార్య) మాత్రమే ఇంట్లో ఉంది.ఆవిడని అడగటం నాకు ఇష్టంలేకపోయినా మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ రావాలి కదా అని అన్న పంపిన విషయం చెప్పగానే దాందేముంది మాధవ్ ఉండు ఇస్తాను కూర్చో అంటూ లోపలికెళ్ళి డబ్బు తెచ్చి తను కూడా కూర్చుంది.

మామూలుగా అన్ని విషయాలు అడుగుతూ మాటల్లో కావ్య విషయం కూడా వచ్చేసింది.మాధవ్ నువ్వు  కూడా ఆడపిల్లలతో మాట్లాడతావా?చాలా సైలెంట్ గా ఉంటావు కదా? అంటూ నీతో కొన్ని విషయాలు చెప్తాను.ఈ విషయాలన్నీ నేనింతవరకు మీవాళ్ళకి ఎవరికీ చెప్పలేదు.నీద్వారా తెలిస్తే బాగుంటుంది వెళ్ళి అన్నీ చెప్పు. అంటూ ఇక మొదలుపెట్టింది.మీ అమ్మమ్మ, నాన్నమ్మ,అమ్మ,పల్లెటూరి నుండి వచ్చారు కదా ప్రస్తుతం  సొసైటీ ఎలా ఉందో తెలియదు,ఆడవాళ్లు,మగవాళ్ళు కొంచెం సరదాగా ఉంటే చాలు అక్రమ సంబంధాలు అంటారు.మీ ఇద్దరు అక్కలు చదువుకున్నా, చిన్నప్పటి నుండి చాదస్తంగా పెంచిన మీ నాన్నమ్మ దగ్గర వాళ్ళ సరదాలేమీ తీరకపోయుండొచ్చు, అందుకే  పక్కన వాళ్ళమీద నిందలు వేయటం వాళ్ళకొక సరదా.సంతోషంగా ఉన్నవాళ్ళని చూసి ఎదో ఒకటి  అని వాళ్ళ బాధచూసి ఆనందించటం వాళ్ళ సైకాలజీ.నిన్నకాకమొన్న నాలుగువేల జీతంతో ఉద్యోగం వచ్చిన మీ అన్నకంటే ఎక్కువ పొజిషన్లో ఉండి ,ఆస్తులు ఉన్న మేము డబ్బుకోసం మీ అన్నని మోసం చేస్తున్నామని,నాకు,మీ అన్నకి అక్రమసంబంధం అని,మీ పెద్దవాళ్లంతా మాట్లాడారని, మీ అన్నకి కాబోయే భార్య తరుపు బంధువులు చెప్తే  నాకు తెలిసింది.మీ అన్న ఎంగేజ్మెంట్ లో మీ వాళ్ళే వాళ్లతో చెప్పారట. 

వినగానే మీ వాళ్లనే ఇంటికి వచ్చి నిలదీద్దామనుకున్నాను. కానీ మీ పెద్దక్క పెళ్ళి మాటలు జరుగుతున్నఇంట్లో నేను గొడవచేయటం బాగోదని ఆగిపోయాను.మీ పెద్దక్క పెళ్ళి కుదిర్చింది నేనే.నాఇంటికొచ్చి,మీ పెద్దక్క గంటలు గంటలు ఆ అబ్బాయితో ఫోన్లలో మాట్లాడేది.ఆ సినిమా యాక్టర్ కట్టించిన హాస్పటల్ లో డాక్టర్ గా ప్రయివేట్ ప్రాక్టీస్ చేస్తున్న మీ పెద్దక్క అక్కడున్న మగ డాక్టర్లతో సినిమాలు, షికార్లు,షాపింగులకి వెళ్తే ఎదో సరదాగా కొలీగ్స్ తో  వెళ్ళినట్లా?ఇక మీ చిన్నక్క ఇంట్లో అన్న ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ జరుగుతుంటే బంధువులందరి ముందే ఎటు వెళ్లిందో తెలియకుండా వెళ్ళిపోతే మీ అమ్మమ్మ స్నేహితుల ఇళ్ళకి వెళ్ళింది అంటూ సర్దిచెప్తుంది.మీ ఇంట్లో వాళ్ళు చేస్తే తెలియని తనం,అదేపక్కన వాళ్ళు చేస్తే తప్పా??మాధవ్ నువ్వు వాళ్లందరిలో కొంచెం వేరుగా,ఆలోచన ఉన్నవాడిగా  అనిపిస్తావు అందుకే నీతో చెప్తున్నా.నువ్వింకా చిన్నవాడివేమీ కాదు కదా నీకు అన్ని విషయాలు తెలుసు.ఈమాటలన్నీ మీవాళ్ళకి చెప్పు.. అంటూ నేనడిగిన డబ్బు నాచేతిలో పెట్టింది. ఆవిడని చూస్తే కొంచెం బాధగానూ, మా అక్కల్ని అవమానపరిచిందని కొంచెం ఆవేశంగాను అనిపించింది. అసలే మా పెద్దలు నాకు దైవ సమానులు వాళ్ళని ఎవరేమన్నా విని తట్టుకునే శక్తి నాకు లేదు.ఇప్పుడీ మాటలన్నీ ఇంట్లో ఎలా చెప్పాలో ఆలోచించుకుంటూ బుక్ మాత్రం మర్చిపోకుండా తీసుకుని,ఇంటిబాట పట్టాను. 

ఇంటికి రాగానే మా పెద్దలందరి ముందే అన్న కజిన్ దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చుకున్నావా? అనడిగాడు.నేను డబ్బులు తెచ్చుకున్న విషయంతోపాటూ కజిన్ భార్య అన్న మాటలన్నీ పూస గుచ్చినట్లు చెప్పగానే ముందు అందరూ పూనకాలు వచ్చినట్టు ఆవేశంతో ఊగిపోయారు,తర్వాత మా అన్న రియాక్షన్ ఏంటా అని భయంతో గమనిస్తున్న సమయంలో ఇక మా అన్న శివమెత్తిన సత్యంలా లేచాడు.నా వెనక మీరింత పని చేస్తారా?నా గురించి ఇలా నీచంగా ఆలోచిస్తారా?అంటూ ఆవేశంతో ఊగిపోయి ఇప్పుడే నేను వెళ్లి కజిన్తో,వదినతో మాట్లాడి సారీచెప్పి వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు.అప్పటిదాకా అన్న ఏమంటాడో అని భయంతో బిక్కచచ్చిన అమ్మ, అమ్మమ్మ,ఇద్దరు అక్కలు అందరూ అన్న అలా బయటికి వెళ్ళిపోగానే,ఇక వాళ్ళ నోటికి పని చెప్పి,అసలు నిన్నెవడు వెళ్ళమన్నాడ్రా దానింటికి?వీడి డబ్బులే అక్కడ పెట్టి దానితో నీకిప్పించాడా అంటూ అన్నముందు నోరు కూడా ఎత్తని వాళ్ళు అన్న వెనక ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు.వాళ్ళు అన్నని అలా అవమానిస్తుంటే నాకు కూడా చాలా కోపం వచ్చింది.వీళ్లదే తప్పు అనిపించింది.అందరి ఆవేశాలు తీరేదాకా తిట్టుకున్నాక ఇప్పుడు చివరిగా వచ్చిన ఆలోచన అన్నకి కాబోయే భార్య వాళ్లకి ఈ విషయం తెలిసింది ఇప్పుడు పెళ్లి సంగతి ఏంటి?మా అందరికీ తెలుసు ఇది చిన్నక్క పనేనని! మాకజిన్ భార్య మీద కోపంతో ఎంగేజ్మెంట్ రోజు ఎవరితోనో చెప్పిందన్నమాట.కానీ ఈ విషయం అన్నకి తెలిస్తే అక్కని క్షమిస్తాడా? అనే బాధ మా పెద్దలకంటే నాకే ఎక్కువైపోయింది. 

"ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు" పాట ఎక్కడినుండో వినిపిస్తుంది నిజమా నా భ్రమా ??


Related Posts Plugin for WordPress, Blogger...