పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, ఆగస్టు 2011, బుధవారం

బాపుబొమ్మల హరివిల్లు - లీలాజనార్దనం

లీలాజనార్దనం
కందుకూరి రుద్రకవి




పదహారవ శతాబ్దానికి చెందిన రుద్రకవి జనార్ధనాష్టకమును రచించారని పరిశోధకుల అభిప్రాయం.
శ్రీ కృష్ణదేవరాయలి ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఇతనొకడని అంటారని నేను నెట్ లో తెలుసుకున్న సమాచారం.
వేమన పద్యాలకి వినురవేమ అని వున్నట్లు ఈయన రాసిన జనార్దనాష్టకం "కందుకూరి జనార్దనా" అంటూ ముగిసే ఎనిమిది పద్యాలు
నాకు ఈ జనార్దనాష్టకం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే "బాపు బొమ్మల హరివిల్లు"
పుస్తకంలో ఈ జనార్ధనాష్టకంలోని అష్టవిధ నాయికలను బాపు గారు ఎంతో అందంగా చిత్రీకరించారు.
అందమైన నాయికలను వర్ణించిన ఆ జనార్ధనాష్టకానికి లీలాజనార్దనం అనే టైటిల్ తో బాపు వేసిన ఈ అష్టవిధనాయికల బొమ్మలు మరింత అందాన్ని ఆపాదించాయి..

స్వాధీనపతిక
చెప్పినట్లువిని,కోరినట్లు జరుపు మగడు కల స్త్రీ



సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ
జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా
మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

విప్రలబ్ద
చెప్పిన ప్రదేశానికి ప్రియుడు రాక మోసం చేయగా రాయబారం పంపిన స్త్రీ



ఆనపెట్టిన రాకపోతివి ఆయెఁబో అటుమొన్ననూ
పూని పిలువఁగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ
నేను చూడఁగఁ గడచిపోతివి నీటుచేసుక నిన్ననూ
కానిలేరా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

విరహోత్కఠిత
సంకేత స్థలమునకు ప్రియుడు రానందున విరహముచే చింతించు స్త్రీ



నిన్నరాతిరి చవికెలోపల నీవుచెలి కూడుంటిరా
ఉన్నమార్గము లన్నియును నే నొకతెచేతను వింటిరా
విన్నమాత్రము కాదురా నిను వీధిలోఁగనుగొంటిరా
కన్నులారా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

అభిసారిక
తనను తాను బాగా అలంకరించుకుని ప్రియుని కోసం సంకేత స్థలమునకు పోవు స్త్రీ



దబ్బు లన్నియుఁ దెలిసికొంటిని తప్పుబాసలు సేయకూ
మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ
ఉబ్బుచేసుక తత్తఱంబున నొడలిపైఁ జెయివేయకూ
గబ్బితనమున, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ఖండిత నాయిక
ప్రియునియందు పరస్త్రీ సంగమ చిహ్నములను చూసి అసూయపడు స్త్రీ



బిత్తరంబున మొలకకెంపులు పెదవి నెవ్వతె ఉంచెరా
గుత్తమైనమిటారిగుబ్బలగుమ్మ యెవ్వతె మెచ్చెరా
చిత్తగించక జీరువారను చెక్కి లెవ్వతె నొక్కెరా
కత్తిగోరుల, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

కలహాంతరిత
భర్తను అవమానించి తర్వాత పరితపించు స్త్రీ



అండబాయక కూడియుంటిమి ఆయెఁబోయెను నాఁటికి
ఖండిమండిపడంగ నేటికి? కదలు మెప్పటిచోటికి
ఉండరా నీమాటలకు నే నోర్వఁజాలను మాటికి
గండిదొంగవు దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ప్రోషిత పతిక
కార్యసిద్ధికై భర్త దేశాంతరము వెళ్ళగా ఆందోళనపడు స్త్రీ



అలుక లన్నియుఁ దీఱ నివు నాయండ కెప్పుడు వస్తివి
పిలిచి నవరత్నాలసొమ్ములు ప్రేమతో నెపుడిస్తివి
వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు మెస్తివి
కలసి వేడుక దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

వాసక సజ్జిక
ప్రియుడు ఇప్పుడే వస్తాడని పడకగదినీ,తనను అలంకరించుకును స్త్రీ



జంటనేత్రములంటి చూచితె జాజిపూవులు పూచెరా
మింటిత్రోవను జూచుచుండఁగ మేఘవర్ణము గప్పెరా
కంటిలో నొకపండువెన్నెల కాయుచున్నది యేమిరా
కంటిలేరా! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ప్రవత్యుత పతిక


మధ్యా - ధీర


అష్టవిధ నాయికలు మాత్రమే కాక బాపు లీలాజనార్ధనంలో
ప్రవత్యుత
పతిక, మధ్యా - ధీర
ఈ రెండుకూడా వున్నాయి.


30, ఆగస్టు 2011, మంగళవారం

బాపు బొమ్మల హరివిల్లుకు స్వాగతం ...





బాపు గారి బొమ్మలు నచ్చని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు వుండరేమో నాకు తెలిసి..
నాకు మాత్రం చాలా ఇష్టం బాపు బొమ్మలు..
బాపు గారి బొమ్మలు చూడగానే ఈ బొమ్మలు బాపు బొమ్మలు అని చెప్పగలిగేంత విలక్షణ శైలి బాపు బొమ్మల ప్రత్యేకత
చాలా తక్కువ గీతలతో ఎంతో అందమైన బొమ్మలను సృష్టించే బాపు బొమ్మ ఒక్కొక్కటి ఒక్కో అందాన్ని ఒలికిస్తాయి..
అలాంటి బాపు బొమ్మలన్నీ ఒకే చోట కనిపిస్తే అంతకంటే కన్నుల పండుగ ఇంకేముంటుంది?
మా చెల్లికి పైంటింగ్ ,డ్రాయింగ్ హాబీ కదా తను బాపు బొమ్మలు చాలా చక్కగా వేసేది..
అలా తను వేసిన బాపుబొమ్మలు చూసిన మా మరిది గారు
మా చెల్లికి బాపు బొమ్మల హరివిల్లు పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు.



ఈ పుస్తకంలో బాపు గారి బొమ్మల్లో కొన్నింటిని చాలా చక్కగా మంచి ఫోటో ప్రింట్ తో ప్రింట్ చేయించారు.
ఇంటీరియర్ డెకరేషన్ కోసం మనకి ఇష్టమైన బొమ్మలను మనకి ఇష్టమైన సైజు లో ఆర్డర్ ఇస్తే పంపిస్తారట.
హరివిల్లు నాకు చాలా నచ్చింది.నాకు నచ్చిన కొన్ని బొమ్మలను ఫోటో తీసుకున్నాను.
నా చిన్నిప్రపంచాన్ని బాపు గారి బొమ్మల హరివిల్లుతో
మరింత రంగులమయం చేసుకోవటానికి హరివిల్లులోని నాకు నచ్చిన కొన్ని బాపుబొమ్మలు..
ఇంకా చాలా వున్నాయి అవన్నీ ఒక్కొటిగా నా చిన్నిప్రపంచంలో అలంకరిస్తాను..







29, ఆగస్టు 2011, సోమవారం

ఉరుమి - THE WEAPON

ఈ మధ్య చూసిన సినిమాల్లో నాకు చాలా నచ్చిన సినిమా "ఉరుమి". భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న గొప్ప వ్యక్తిగా తెలిసిన వాస్కోడిగామా మరో రూపాన్ని పరిచయం చేసిన సినిమా ఉరుమి.

పుట్టిన భూమి మీద దేశభక్తీ,అభిమానం లాంటి ఫీలింగ్స్ లేని ఒక యువకుడు తన పూర్వీకుల భూమిని ఒక విదేశీ మైనింగ్ కంపెనీకి అమ్మాలనే ఆలోచనతో ఇండియా రావటంతో కధ మొదలవుతుంది.పదిహేనో శతాభ్దంలో కేరళలో వాస్కోడిగామా దుర్మార్గానికి బలైన కొత్వాల్ ఆర్య కొడుకు కేలు ( పృద్విరాజ్) వాస్కోడిగామను అంతం చేయాలన్న పట్టుదలతో తమ జాతివారు తమ ప్రాణాలను కాపాడుకోవటం కోసం సేకరించిన బంగారంతో ఉరిమి అనే ఆయుధాన్ని తయారుచేసుకుని చిరక్కల్ రాజు ఆస్థానంలో చేరి, ఆటవికులకు యుద్ధవిద్యలు నేర్పి వారి సహకారంతో చివరికి వాస్కోడిగామాను అంతం చేయటం సినిమా కధ క్లుప్తంగా...

ఒకప్పుడు విదేశీయుల ఆక్రమణల నుండి మన భూమిని తప్పించటానికి మన పూర్వీకులు ఎంతో కష్టపడ్డారు
అలాంటి వీరుల వారసులుగా మనం మళ్ళీ మన భూమిని వివిధ కారణాలు చెప్పుకుని విదేశీయులకి అప్పగించటం సమంజసమేనా అన్న ప్రశ్నతో మొదలైన ఈ సినిమా ఆలోచింపచేస్తుంది..

స్వాతంత్ర్యోద్యమం అంటే గాంధీ,నెహ్రు,భగత్ సింగ్ లాంటి నాయకులు మాత్రమే సామాన్యంగా గుర్తుకు వస్తారు కానీ
ఎటువంటి విద్య,విజ్ఞానం లేని ఎంతో మంది అనాగరికులకు నాయకత్వం వహించి విదేశీయులను ఎదిరించిన పోరాడిన వీరులు ఎందరో వున్నారని ఈ సినిమా గుర్తు చేసింది.ఈ సినిమా చూస్తే నాకు అల్లూరి సీతారామరాజు, ఇంకా మా పల్నాడులో ప్రసిద్ధి చెందిన కన్నెగంటి హనుమంతు లాంటి వీరులు గుర్తుకు వచ్చారు.ఎందరో ఇలాంటి వీరుల పోరాటాల ఫలితమే కదా మన స్వాతంత్ర్యం అనిపించింది.

కొత్వాల్ గా ఆర్య యాక్షన్ బాగుంది.హీరో పృథ్విరాజ్ యుద్ధవీరుడి పాత్ర కు చాలా చక్కగా సరిపోయాడు.మంచి నటనతో ఆకట్టుకున్నాడు.ఎక్స్ ప్రెషన్స్ ,యాక్షన్ సీన్స్ చాలా చక్కగా చేశాడు..ప్రభుదేవా హీరోకి మంచి స్నేహితుడి పాత్రలో నటించాడు.ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జెనీలియా గురించి ఎప్పుడు అల్లరిపిల్లలాగా నటించే జెనీలియా యుద్దవిద్యలో ఆరితేరి శత్రువులను ఎదిరించే చురుకైన యువరాణి పాత్రలో జెనీలియా నటన బాగుంది..


నిత్యామీనన్ చాలా ముద్దుగా ,అందంగా అమాయకమైన యువరాణి పాత్రలో బాగా నటించింది .
విద్యాబాలన్ ఆ రోజుల్లో కేలుకి మార్గదర్శకత్వం చేసిన యక్షిణిగా,ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్ గా చేసిన గెస్ట్ రోల్ బాగుంది.



సంతోష్ శివన్ దర్శకత్వం,సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.కేరళ అందాలను,గ్రీనరీని చాలా చక్కగా చూపించారు.
ఎక్కడా డబ్బింగ్ సినిమా చూస్తున్నట్లుగా అనిపించలేదు..మొదటి నుండి చివరిదాకా అప్పటి పరిస్థితులను కళ్ళకి కట్టినట్లు చూపించారు...కొంతమంది అనుకున్నట్లు ఇది కేరళలో జరిగిన కధ కాబట్టి తెలుగు వాళ్లకి అంతగా నచ్చదు అనటంలో వాస్తవం లేదు ఎందుకంటే ప్రాంతం ఏదైనా అది మన భారతదేశంలో ఒక భాగమే కాబట్టి..
మొత్తానికి ఈ సినిమా డిగ్రీ కోసం హిస్టరీ చదివిన నాలాంటి ఎంతోమంది హిస్టరీ స్టూడెంట్స్ అందరు
తప్పకుండా తెలుసుకుని తీరవలసిన మన భారతదేశ చరిత్ర ఇంకా ఎంతో వుందని తెలియచేస్తుంది .

కదనం కదనం జీవిత పయనం



 

సరదాగా ఈ సమయం ...


రండి రండి రండి దయ చేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ అంటూ ఆత్మీయంగా ఆహ్వానించిన
మా చెల్లి,మా మరిది గారి ఆహ్వానం మేరకు పోయిన వారం చెల్లి వాళ్ళింటికి హైదరాబాద్ వెళ్ళాము అందరం.
శనివారం,ఆదివారం,సోమవారం మాత్రమే అనుకున్న మా వీకెండ్ ట్రిప్ మళ్ళీ ఈ శనివారం వరకు
అంటే వారం రోజులు కంటిన్యూ అయింది..

మా చెల్లి,మరిదిగారి అతిధి మర్యాదలతో,వాళ్ళ అభిమానం మధ్య వారం రోజులు చాలా తొందరగా అయిపోయినట్లు అనిపించింది.
వాళ్ళే ఇంకా చిన్నవాళ్లైనా.. అతిధులుగా మాకు మర్యాదలు చేయటం
ఇంట్లో విషయాల గురించి ఇద్దరు చర్చించుకుని అన్నీ పద్దతిగా చేసుకోవటం,
వాళ్ళ
ముచ్చటైన కొత్త కాపురం మాకు చాలా చూడముచ్చటగా అనిపించాయి..

ఈ వారంరోజులు మాతో పాటు వర్షం కూడా హైదరాబాద్ ని వదలలేదు..
చిన్నచిన్న తుంపరలతో..అప్పుడప్పుడు కొంచెం వర్షం ఎక్కువగా, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది..



బయటికి వెళ్ళాలన్న ఇంటరెస్ట్ ఎవరికీ లేదు,దానికి తోడు వర్షం కూడా ఉండటంతో ఎక్కడికీ వెళ్ళలేదు.
బయటికి ఎక్కడికీ వెళ్ళలేదు కదా కనీసం సినిమాకన్నా వెళదాం అనుకుని ఏ సినిమాకి వెళ్ళాలా అని చర్చ జరిపి,దగ్గరలో ఏ హాల్ లో ఏ సినిమానో తెలుసుకుని అన్నిట్లో ఏవేవో దడ,కందిరీగ లాంటి వింత పేర్ల సినిమాలు వున్నాయని తెలుసుకుని చివరికి ఇంటికి దగ్గరలోనే "ఉరుమి" సినిమా కి వెళదాం అనుకుని ఆ సినిమాకి వెళ్ళాం

అది మలయాళం సినిమా కదా ఎలా వుంటుందో ఏమిటో అనుకుంటూనే వెళ్ళినా ఈ సినిమాకి వెళ్ళకపోతే కచ్చితంగా ఒక మంచి సినిమా మిస్ అయ్యే వాళ్లము అనిపించింది సినిమా చూసిన తర్వాత.ఈ సినిమా అందరికీ నచ్చింది ..

మా చెల్లి తను కొత్తగా నేర్చుకున్న వంటలన్నీ మాకు చేసి పెట్టింది..కొత్త ప్రయోగాలైనా చాలా చక్కగా వున్నాయి.
నెట్ పుణ్యమాఅని చాలా కొత్త వంటలు నేర్చుకుంది తను..
మా మరిది గారు తన బిజీ వర్క్ లో వుండి కూడా మా కోసం టైం స్పెండ్ చేశారు..
ప్రస్తుతం హైదరాబాద్ లో ఇఫ్తార్ సందడి ఎక్కువ కదా మా మరిదిగారు కూడా
మాకు కొన్ని ఇఫ్తార్ స్పెషల్స్ తెచ్చారు..

హలీం & ఫ్రూట్ సలాడ్



వెరైటీగా కుండ ఐస్ క్రీం



ఖర్జూరాలు



నర్సరీకి వెళ్లి పూలమొక్కలు,మాకిష్టమైన ఫుడ్ లాండ్ కి వెళ్లి షాపింగ్ చేసుకుని మమ్మల్ని వదలలేక ఫీల్ అవుతున్న మా చెల్లిని..తనని బుజ్జగిస్తున్న మా మరిది గారికి జాగ్రత్తలు చెప్పి..
ఇంక
వాళ్ళని వదిలి రానని మాకు టాటా చెప్తూ మారాం చేస్తున్న మా పింకీని పట్టుకుని
మధ్య
మధ్యలో పూల మొక్కలు చూడగానే మాఅమ్మ వాటిని కొంటూ,
మా తమ్ముడు, డ్రైవర్ వాటిని జాగ్రత్తగా కార్లో పెడుతూ ఇంటికి చేరుకున్నాము..
మొత్తానికి ఈ వారం చాలా సరదాగా,సంతోషంగా గడిచిపోయింది..

భద్రరమ్య
మీ ఆత్మీయ ఆహ్వానానికి,మరియు మీ ఆతిధ్యానికి చాలా చాలా థాంక్స్.
Be happy forever


21, ఆగస్టు 2011, ఆదివారం

కృష్ణాష్టమి శుభాకాంక్షలు .



చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు పట్టుదట్టి
సందిట కడియాలు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు...!!



కృష్ణాష్టమి శుభాకాంక్షలు .


15, ఆగస్టు 2011, సోమవారం

సుఖదాం వరదాం మాతరం .. వందేమాతరం


ఇప్పుడంటే ఆగస్ట్ 15 వస్తేనే దేశభక్తి,దేశ భక్తీ గీతాలు గుర్తుకు వస్తున్నాయి కానీ చిన్నప్పుడు
ప్రతిరోజూ స్కూల్ కి వెళ్ళగానే ముందు చేసే పని అసెంబ్లీ...
మా st'anns స్కూల్ లో ప్రతి రోజు క్రమం తప్పకుండా ఉదయం 8 నుండి 9 దాకా అసెంబ్లీ జరగాల్సిందే
మేమందరం ప్రేయర్ సాంగ్ తర్వాత వందేమాతరం తర్వాత ఏదో ఒక తెలుగు దేశభక్తి గీతం పాడాల్సిందే..
అందులో నాకిష్టమైన పాటలు
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
తేనెల తేటల మాటలతో మనదేశ మాతనే కొలిచెదమా,
సారే జహాసే అచ్చా...
ఈ పాటలు నాకు చాలా ఇష్టం
దాని తర్వాత జనగణమన ఇది మాత్రం చాల గట్టిగా,ఫాస్ట్ గా పాడేసే వాళ్ళం ఎందుకంటే
దీనితో అసెంబ్లీ అయిపోతుంది కదా అందుకని ...
ఇంక చిన్నప్పుడు ఆగస్ట్ 15 అంటే మాత్రం చాలా సరదాగా వెళ్లి జెండా వందనం చేసి మా సిస్టర్స్ ఇచ్చే చాక్లెట్స్ తినేసి తరవాత హాయిగా సెలవుని ఎంజాయ్ చేసే వాళ్ళం..
స్వాతంత్ర్య దినోత్సవం కోసం పాటలు వెతుకుతుంటే ఈ పాటలు కనిపించి నా చిన్నన్నటి స్కూల్ రోజులను గుర్తు చేశాయి..

అందరికీ 65వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


వందేమాతరం ..వందేమాతరం ..
సుజలాం
సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం
మాతరం వందేమాతరం ...

శుభ్రజ్యోత్స్న
పులకిత యామినీమ్
ఫుల్లకుసుమిత
ద్రుమదళ శోభినీం
సుహాసినీం
సుమధురభాషినీ
సుఖదాం
వరదాం మాతరం .. వందేమాతరం



తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా

భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవన యానం చేయుదుమా



మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు



సారే జహాసే అచ్చా హిందూస్తా హమారా హమారా

14, ఆగస్టు 2011, ఆదివారం

అమ్మా నాన్నకు పెళ్లిరోజు శుభాకాంక్షలు...


మా ప్రియమైన అమ్మా నాన్నకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరపుకోవాలని కోరుకుంటూ
భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించమని ప్రార్ధిస్తున్నాము..

మా హృదయపూర్వక వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు

నా చిన్నిప్రపంచం 









13, ఆగస్టు 2011, శనివారం

రక్షాబంధన్ శుభాకాంక్షలు



అనుబంధాన్ని పంచుకుని, ఆత్మీయతను పెంచుకుని, కష్ట సుఖాల్లో ఒకరికి
ఒకరం తోడుగా నిలిచిన మన రక్తసంబంధం ఎప్పటికీ నిలవాలని...
పెళ్ళిళ్ళ ద్వారా కొత్త బంధాలు,సంబంధాలు ఎన్ని ఏర్పడినా జీవితాంతం నీవు మాకు అండగా మేము నీకు తోడుగా వుండాలని,మన అనుబంధాన్ని,ప్రేమానురాగాలను భగవంతుడు పదిలంగా కాపాడాలని...
నిన్ను భగవంతుడు తన చల్లని చూపులతో దీవించి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించి కాపాడాలని దేవుడిని ప్రార్ధిస్తూ


తమ్ముడూ నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనకు దేవుడు రక్ష
మన అనుబంధాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ
రక్షాబంధన్ శుభాకాంక్షలు
అక్క:రాజి


అన్నా నీ చిట్టి చెల్లిగా నా క్షేమాన్ని కోరుకుని ,
నా
ప్రతి కలా కోరికా నిజమవ్వటానికి సహకరించిన నీ ప్రతి కల,కోరికా నిజమవ్వాలని ..
నిన్ను
భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ ...
రక్షాబంధన్ శుభాకాంక్షలు
చెల్లి: రమ్య










Rakhi bhai behan ka hai pyar
By:Raaji



Related Posts Plugin for WordPress, Blogger...