పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

3, జులై 2014, గురువారం

Life Is A ClassRoom ..!


జీవితంలో మనిషికి ఎదురయ్యే అనుభవాలకి మించిన గురువు మరొకరు ఉండరు.. లోకంలోని వివిధ రకాల మనుషులు,సంఘటనలు ఎవరికి వారే చెప్పుకోవాల్సిన , నేర్చుకుని, గుర్తుంచుకోవాల్సిన  జీవిత పాఠాలు .. 
  ఈ పాట నాకు నచ్చిన కొటేషన్స్ తో నేను అప్ లోడ్ చేశాను ,,

ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే

ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..

అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
సినిమా - బడ్జెట్ పద్మనాభం
లిరిక్స్ - చంద్ర బోస్

2, జులై 2014, బుధవారం

వంట మరియు తిండి పురాణం

ఈ ప్రపంచంలో మనిషికి కనీసావసరాలు కూడు, గూడు, గుడ్డ ఇది మొన్నటిదాకా మనందరికీ తెలిసిన విషయం.ఐతే ఈ మధ్య వచ్చిన "ఉలవ చారు బిర్యానీ" సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్పిన ఒక మాట   
"ప్రపంచంలో మనిషికి రెండు విషయాలు కామన్ ఒకటి ప్రేమ రెండు ఆకలి" ...  

నిజమే కదా  మనిషి ఆకలికి తట్టుకోలేడు అలాగే తనని ప్రేమించే మనుషులు లేకపోయినా తట్టుకోలేడు.  రెంటికీ మనిషి జీవితం తో ఇంత అవినాభావ సంబంధం ఉందన్న మాట .. 

 తిండి విషయానికి వస్తే కొంత మందికి తినాలని ఉన్నా వాళ్ళు కోరినట్లు వండి పెట్టే  వాళ్ళు ఉండరు .బయట తిందామంటే ఆరోగ్యానికి ఇబ్బంది . ఇలా ఎంత డబ్బున్నా, ఏమున్నా కోరుకున్నవి తినలేని వాళ్ళు కూడా వుంటారు . తినాలనిపించింది ఏదైనా సరే ఏ సందేహం లేకుండా తినేసి ఏ ఇబ్బంది లేకుండా ఉండగలిగే వాళ్ళే నిజమైన అదృష్టవంతులు అనిపిస్తుంది ఒక్కోసారి .

సాధారణంగా వంటని,వంట చేసే వాళ్ళని చులకనగా చూస్తుంటారు ."Cooking Isn't Rocket Science"  అని కూడా అంటుంటారు కొంతమంది. కానీ నాకు మాత్రం కుకింగ్ Rocket Science లాంటిదే .. కొత్త కొత్త ప్రయోగాలు చేయటం, అవి బాగున్నాయా లేదా అని తిన్న వాళ్ళు మన వాళ్లైనా బయటి వాళ్లైనా సరే వంట గురించి వాళ్ళ అభిప్రాయం చెప్పేదాకా ఎలా వుందో ఏమిటో అని వాళ్ళ ఫీడ్ బాక్ కోసం ఎదురు చూడటం,వాళ్ళు మెచ్చుకుంటే సంతోషించటం, బాగా లేదంటే  అంతటితో ఆ ప్రయత్నం విరమించటం  లేదా పట్టుదలతో  మళ్ళీ సాధించటం ..ఈ అనుభవాలన్నీ ఏ శాస్త్రవేత్త అనుభవాలకి తీసిపోవని నా అభిప్రాయం..మా ఇంట్లో శాస్త్రవేత్తలు మాత్రం మా అమ్మ,చెల్లి...

మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ రోజుల్లో మగ వాళ్ళు వంట గది వైపుకి కూడా వెళ్ళకూడదు అలా వెళ్ళటం అవమానంగా భావించే వాళ్ళు . పురాణాల్లో నలుడు,భీముడు ఇలా మగవాళ్ళే వంట చేశారని ఉన్నా ఎందుకనో కొంత కాలం ఆ విషయాన్ని మర్చిపోయి వంట అంటే ఆడవాళ్ళ పనే అన్నట్లు డిసైడ్ అయ్యారు . కానీ తర్వాతి రోజుల్లో వంట మగవాళ్ళకు కూడా హాబీ అయిపొయింది . హాబీ నుండి వృత్తిగా కూడా మారిపోయింది . 

స్టార్ హోటళ్ళ నుండి చిన్న హోటళ్ళలో కూడా మగ వాళ్ళే షెఫ్ లు ఇప్పుడు . హిందీ లో సంజయ్ కపూర్ , మన తెలుగు లో ఐతే ఈ టీ వీ రాజు గారు ఆడవాళ్ళ మధ్యలో సరదాగా తిరుగుతూ వంటచేసేస్తుంటారు. టీ వీ షోలే కాదు ఇళ్ళలో కూడా ఆడుతూ పాడుతూ వంటలు చేసే మగవాళ్ళు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే కదా .. 
 
ఒకప్పుడు చదువు రాని వాళ్ళు, ఇంటర్ లో ఎమ్ సెట్ లో ర్యాంకు రాని  వాళ్ళు హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులు చేస్తారని ఒక అభిప్రాయం ఉంది . కానీ ఇప్పుడు చాలా మంది ఇష్ట పడి ఆ కోర్సులు చేస్తున్నారు . ఎంతోమంది ఆకలిని తీర్చి , ఆరోగ్యాన్ని కాపాడే వంటని వృత్తిగా ఎంచుకోవటం కూడా గొప్పే కదా అనిపిస్తుంది . దేశం మొత్తం లోని సాంప్రదాయ రుచులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వంటలను పరిచయం చేస్తూ కొత్త కొత్త హోటళ్ళు ,రెస్టారెంట్లు  అందరినీ ఆకట్టుకుంటున్నాయి .ఆంధ్రా స్వగృహ ఫుడ్స్, తెలంగాణారుచులు, రాయలసీమ ఘాటు రుచులు, ఇలా వంటల్లో కూడా ప్రాంతీయతని  గుర్తు చేస్తున్నారు .. 

 పండగలంటే పూర్ణాలు,బొబ్బట్లు ,పులిహోర, గారెలు ఇవీ స్పెషల్ వంటలు .. కానీ ఇప్పుడు కొత్త కొత్త వంటలు ఇంట్లోనే రెడీ అవుతున్నాయి .నెట్ లో చూసి, టీవీలో చూసి రక రకాల ప్రయోగాలు చేస్తున్నారు .  బీరకాయ పీచు  పాయసం , అరటి తొక్క పచ్చడి లాంటివి కూడా చేసేసి ఇవే కొత్త ప్రయోగాలు అంటారు కొంత మంది  టీవీలో.. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు మాత్రం వంట ఇలాగ కూడా చేస్తారా అనిపిస్తుంది . 

మన తెలుగు టీవీల్లో వంటలు, వంటల ప్రయోగాలు కాస్త ఆగినట్లున్నాయి  
ఈ మధ్య.. హిందీలొ కొన్ని ఛానల్స్ పూర్తిగా వంటలే వచ్చేవి వున్నాయి వాటిలో చెఫ్ సంజయ కపూర్ zee khana khajana , Food Food ,Active cooking  ఛానల్స్ చాలా బాగుంటాయి .. కొత్త కొత్త ప్రదేశాల వంటలు, పద్ధతులు  తెలుసుకోవచ్చు వీటి ద్వారా

ఇక  నెట్ లోవంటల బ్లాగర్లు కూడా విభిన్న ప్రాంతాల వంటలను పరిచయం చేస్తున్నారు.. ఒకప్పుడు తెలియని వంటని ఫోనులు చేసి మరీ అమ్మల్ని, ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకున్నట్లు ఇప్పుడు బ్లాగులు చూసి నేర్చుకుంటున్నారు..బ్లాగుల్లో వంటలు సులభంగా అర్ధమయ్యేలాగానే ఉంటున్నాయి.వాటిని చూసి నేర్చుకోవచ్చు,చేయొచ్చు కొన్ని బాగానే వస్తాయి .. ఇలాంటివి కొత్తగా వంట నేర్చుకునే వాళ్లకి ఉపయోగకరం కూడా .. 

టీవీలు,బ్లాగులు ఇవేమీ చూడకుండా వంట చేయలేరా,ఇంతకుముందు వాళ్ళు చేయలేదా అనిపిస్తుంది కానీ మనకేమీ నష్టం లేనంతవరకు కొత్త, మంచి విషయాలను చూసి నేర్చుకోవటంలో కూడా తప్పు లేదు కదా... 

ఇవాళ ఉలవచారు బిర్యానీ లో "ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా" పాట  విని ఈ వంట,తిండి పురాణం రాయాలనిపించింది. 

 జన్మమే రుచి చూడటానికి దొరికేరా
ఈ లోకమే వండి వార్చటానికి వేదికరామరొక తిండి పురాణం పాట మిధునంలో .. ఆంధ్రుల ఆవకాయ,గోంగూర నుండి మన పూర్వీకుల వంటలన్నీ వడ్డించారు ఈ పాటలో 

ఆవకాయ మన అందరిదీ 

EAT WELL STAY WELL 


1, జులై 2014, మంగళవారం

భగీరధ ప్రయత్నం


 

భగీరధుడి కధ ఏమిటంటే కపిల మహాముని శాపానికి గురైన తాతలకు శాప విమోచనం చేయటానికి  తపస్సుతో గంగమ్మను మెప్పించి,శివుని సహాయం తో గంగను భూమి మీదకి రప్పించి ,పూర్వీకులకు  సద్గతులు ప్రసాదించిన మహా ముని ..

ఏదైనా అసాధ్యమైన పనిని చేయాల్సి వచ్చినప్పుడు , కష్టపడి ఆ పనిని సాధించినప్పుడు అబ్బ భగీరధ ప్రయత్నం చేయాల్సి వచ్చింది  అంటుంటాము..ఇంతకీ ఈ భగీరధుడి సంగతి అప్పుడప్పుడూ విన్నా పదవ తరగతి దాకా అర్ధం కాలేదు ఈయన సంగతి ..  పదవ తరగతి తెలుగు బుక్ లో ఈ కధ గురించి మా అన్నమ్మ టీచర్ వర్ణించి,వర్ణించి చెప్తుంటే పాఠం అలా మనసులో గుర్తుండిపోయింది .. ఈ పాఠం చెప్తూ మా టీచర్ విద్యార్ధి జీవితం లో ఈ పదవ తరగతి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నదనీ, అందుకే ఈ సంవత్సరం ఈ పాఠం మొదటి పాఠంగా ఉందనీ మీరు కూడా ఆయన లాగనే ప్రయత్నించి గట్టెక్కాలనీ చెప్పేవాళ్ళు.. ఇప్పట్లో ఇన్స్పిరేషన్ పాటలు,పుస్తకాలు చదివితే ఎంత ఉత్తేజం, ఉత్సాహం కలిగి ,వెంటనే ఫేస్ బుక్ లోనూ,బ్లాగుల్లోనూ మనం కూడా అందరినీ  మన శాయశక్తులా ఎలాగ  ప్రోత్సహిస్తామో  అప్పట్లో మా  టీచర్ మాటలు మాకలా అనిపించేవి .. మొత్తానికి ఎక్కువ భగీరధ ప్రయత్నం చేయకుండానే చదువు గట్టెక్కామనుకోండి...


ఇప్పుడింతకీ భగీరధుడు ఎందుకు గుర్తొచ్చాడంటే జూన్ నెలలోనే వస్తాయనుకున్న వర్షాలు ఇంతవరకు కనపడలేదు.  అప్పుడప్పుడు చిన్న జల్లులు పడినా అది వర్షం కింద లెక్క కాదు . ఇప్పటికే రైతులు వర్షం పడుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు . రైతుల సాగు నీరేమో కానీ మన కి తాగు నీరైనా దొరుకుతుందా లేదా అని భయం పట్టుకుంది..   ఒకప్పుడు మా వూర్లో నీళ్ళు ఎప్పుడన్నా ఇబ్బంది ఐతే ఛీ ఛీ ఈ వూర్లో నీళ్ళే రావు అదే సిటీ లో నీళ్ళకి ఇబ్బందే వుండదట  అనుకునే వాళ్లము .. కానీ ఇప్పుడు సిటీల్లో పరిస్థితి చూస్తుంటే మా ఊరిని మేము ఎంతగా అవమానించామో గుర్తొచ్చింది నాకు,మా చెల్లికి ...

మా వూర్లో  నయం నీళ్ళు రాకపోతే పనమ్మాయి పక్కన వుండే బోరింగ్ దగ్గరికి వెళ్లి నీళ్ళు  మోసుకొచ్చి మరీ ఇంట్లో పని చేసి వెళ్ళేది .. కానీ ఇప్పుడు నీళ్ళు  లేకపోతే నేనేమి చెయ్యనమ్మా అంటూ "అహా ఇవాళ పని తప్పింది" అనుకుంటూ హాపీగా వెళ్ళిపోతుంది పనమ్మాయి.. నాకు చూస్తే నీళ్ళు రాకూదదు దేవుడా నాకు హాయిగా వుందని అనుకుంటుందో ఏమో మనసులో అనిపిస్తుంది.. ఛా .. ఐనా అలా మాట్లాడకూడదులె పని వాళ్ళు కూడా మన లాంటి మనుషులే కదా పాపం  ..

వర్షాలు లేక బోర్ లో నీళ్ళు రావట్లేదమ్మా నేనేమి చేయను వచ్చినప్పుడే డబ్బాల్లో పట్టుకోండి అని ఒక వాచ్ మెన్ అంటే .. నీళ్ళు టాంక్ లతో తెప్పించి పోస్తున్నాం సార్ .. అందుకే మైంటెనెన్స్ ఎక్కువ ఇవ్వండి ఈ నెలలో అంటూ మరొక వాచ్ మెన్ ... ఇంక కరెంట్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు .. ఇన్ని సమస్యలు ఎలా తీరాలిరా దేవుడా అనుకుంటుంటే ఇవాళ ఈనాడు పేపర్ లో అనుకుంటాను ఒక స్వామీజీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లో వర్షాలు పడవు అని మరొక బాంబు పేల్చారు ..

అప్పుడు ఎందుకో నాకు భగీరధుడు గుర్తొచ్చాడు..  ఏమిటో అప్పుడు ఆయన తన పూర్వీకుల కోసం పట్టుదల, కఠోర శ్రమలతో తపస్సు చేసి గంగను భూమి మీదకి తెచ్చాడు.. ఇప్పుడు మనకోసం ఎవరు అలా చేస్తారబ్బా అనిపించింది.. ఐతే ఆశ్చర్యం అనిపించేలా సాయంత్రం కల్లా  గుంటూరు ,హైదరాబాద్ రెండు చోట్లా సుమారు రెండు గంటలు పెద్ద వర్షమే పడింది .. మొత్తానికి ఎండలకి  మండిపోతున్న వాతావరణం కొంచెం చల్లబడింది.  
 
ఇవాళ నాకనిపించింది వర్షాల కోసం ఘటాభిషేకాలు ఇంకా ఏవో పూజలతో పాటూ అందరం ఆ భగీరధుడిని కూడా తలచుకుంటే బాగుంటుంది కదా అని 

Related Posts Plugin for WordPress, Blogger...