గుంటూరు,విజయవాడ జిల్లాల్లో రియల్ 'భూ'మ్ .. ఇది ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న వార్త ... ఒక్క గుంటూరు,విజయవాడ అనే కాదు మొత్తం ఆంద్ర అంతా ఇలాంటి పరిస్థితే వుంది.. తెలంగాణా రాష్రం ఏర్పడుతుంది అన్న దగ్గరి నుండి ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పరుగందుకుందని చెప్పొచ్చు . ఇప్పుడిక రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత, గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుందని ఒక మాట బయటికి వచ్చాక మా గుంటూరు జిల్లాలో చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా స్థలాల రేట్లు, బిజినెస్ గురించే చర్చ. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పడ్డ " భూ కైలాస్ " పరిస్థితి ఇక్కడ కూడా కనపడుతుంది. లక్షలు దాటి కోట్లలో ఈ వ్యాపారం జరుగుతుంది ..
నగరానికి చుట్టుపక్కల ఉన్న పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్స్ గా మారిపోతున్నాయి . ఒకప్పటి మానవుడి ఆహారవసరాలను తీర్చిన పంట పొలాలు నేడు ప్లాట్స్ గా మారిపోయాయి . నడి వూరిలో కాకపోయినా కనీసం మాకంటూ ఇక్కడైనా ఒక స్థలం వుంది అనుకోవచ్చు అనుకునే మధ్య తరగతి వాళ్ళు , ఇప్పుడు స్థలాలు కొని పడేస్తే ముందు ముందు ఇంకా ఎక్కువకే అమ్ముకోవచ్చు అనుకునే వ్యాపారస్తులు ... మొత్తానికి స్థలాల రేట్లు ఆకాశానికి తాకుతూ ఇప్పుడు ఉన్న రేటు ఇంకాసేపటికి లేనట్లుగా డిమాండ్ పెరిగిపోతుంది .
సామాన్య మానవుడికి సొంతిల్లు ఆశ కాదు అవసరం.. తమకంటూ సొంతిల్లు ఉండాలి, ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో ఉన్నా తమ సొంత వూరిలో ఇల్లు కట్టుకోవాలని ,ప్రశాంతంగా ఆ ఇంట్లో గడపాలని ఆశిస్తారు . అద్దె ఎంత పెట్టి ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉన్నా మన సొంతది చిన్నఇల్లైనా స్వర్గమే అనేది మా అమ్మమ్మ .. కానీ ప్రస్తుత పరిస్థితిలో సామాన్యుడికి స్థలం కొనే పరిస్థితి , ఇల్లు కట్టే పరిస్థితి కనపడటం లేదు..ఈ మధ్య "మీలో ఎవరు కోటీశ్వరుడు" షో కి వచ్చేవాళ్ళలో ప్రతి ఒక్కరు సొంతిల్లు మా కల అని చెప్తుంటే నిజంగా సొంతిల్లు కావాలని కోరుకోని వాళ్ళు ఉండరు కదా అనిపించిది ..
"ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" అంటారు. ప్రస్తుతం మధ్యతరగతి వాళ్లలో కూడా ఎవరి పెళ్ళికైనా వెళ్ళి కట్నం ఎంత అని అడగ్గానే 40 లక్షలు, 50లక్షలు అంటున్నారు అమ్మో అంత కట్నమా నువ్వు చేసేది వ్యవసాయమే కదా అనగానే .. ఏముందండీ మా పొలం ఎకరం 25 లక్షలు ఒక రెండెకరాలు పెట్టేశా మా అమ్మాయికి అంటున్నారు .. ఉద్యోగాలు చేసి కష్టపడి , లోన్ లు పెట్టినా 10 లక్షలు కూడా కట్నం ఇవ్వలేని సామాన్య మానవుడికి ఇలాంటివి విన్నా చూసినా ఆశ్చర్యమే కదా మరి ... పాపం ఈ పెరిగిన భూముల రేట్లు ఇలా కట్నం రూపంలో కూడా ఇళ్ళలో చిచ్చులు పెడుతున్నాయన్నమాట.
ఏది ఏమైనా పర్యావరణానికి హాని కలిగేలా పొలాలు , అడవులు తరిగిపోతూ వాటి స్థానంలో జనావాసాలు ఏర్పడుతున్నాయి .. ఇప్పుడది ఇంకా ప్రమాదకర స్థాయికి చేరింది.. పెరుగుట విరుగుట కొరకే అంటారు కానీ ఇక్కడ మాత్రం పెరుగుట పెరుగుట కొరకే .. ఇది స్థలాల యజమానులకు సంతోషం, ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి భారం .. దీనికి ఎవరినీ తప్పు పట్టే పరిస్థితి ఇప్పుడు లేదనుకుంటాను... కానీ కొన్ని సంఘటనల పర్యావసానాలు ఇలా ఉన్నాయన్నమాట..