తన వక్రబుద్ధి కారణంగా రాజు కాలేక,తన అవిటితనం వల్ల రాజు కాలేకపోయానని, సోదరుడి మీద,సోదరుడి కొడుకు మీద ద్వేషం పెంచుకుని, తన కొడుకుని రాజు చేయాలని తపనపడి,కుతంత్రాలు చేస్తూ, సోదరుడి భార్య దేవసేనని కొడుకు హింసిస్తుంటే "చిత్ర హింసలకేమీ లోటు లేదు కదా" అని దేవసేనని వెటకారంగా పరామర్శిస్తూ, భల్లాల దేవుడి విగ్రహం ప్రజల మీద పడుతున్నప్పుడు ఏమీ కంగారు పడకుండా,బాధ పడకుండా "వందడుగుల విగ్రహం వంద మందినైనా బలికోరదా" అంటూ నవ్వే బిజ్జలదేవుడు పాత్రలో నాజర్ చక్కగా సరిపోయారు. కొడుకు మీద అమితమైన ప్రేమతో, పుత్రోత్సాహంతో గుడ్డివాడైన దృతరాష్ట్రుడి పాత్ర ఈ బిజ్జలదేవుడిది అనిపిస్తుంది.
రానా,ప్రభాస్ పేరుకే సోదరులైనా, మహాభారత కాలం నుండి ఉన్న సోదరుల పోరు వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంది. అప్పటిలాగే ఇప్పుడు కూడా మంచికి,చెడుకి జరిగే పోరాటం వీరి కధ .ఇలాంటి పోటీలు,పోరాటాలు,కుతంత్రాలు అప్పటి పురాణాలు, రాజుల కాలంలోనే కాదు ఇప్పటి సామాన్య మానవుల్లో కూడా సర్వసాధారణం అయిపోయింది. అన్నదమ్ముల పిల్లల మాటకేమో కానీ సొంత వాళ్ళు కూడా పాండవుల్లా ఒక్క మాట మీద నిలబడే రోజులు ఇప్పుడు లేవంటే అతిశయోక్తి కాదేమో.. ప్రభాస్ శివుడిగా అల్లరిగా , బాహుబలిగా గంభీరంగా , రానా క్రూరుడైన భల్లాలదేవుడిగా బాగా నటించారు. చిన్నప్పుడు టీవీ లో చూసే టిప్పు సుల్తాన్, మృగనయని సీరియల్స్ లో ఉండే రాజుల్లాగా ఇద్దరూ చాలా బాగున్నారు.
శత్రుదేశపు రహస్య గూఢచారిని పట్టుకునే ప్రయత్నంలో భల్లాల దేవుడికి తనకి కట్టుకున్న తాడు కొసని అప్పగించి లోయలోకి దూకే బాహుబలిని చూసి అన్నదమ్ములిద్దరికీ ఇప్పటికింకా విరోధం రానట్లుంది, ఒకరికొకరు బాగానే సహాయం చేసుకుంటున్నారు అనుకునేలోపే ఆ తాడు పట్టుకోకుండా వదిలేస్తున్న భల్లాలదేవుడిని చూస్తే ఇప్పటికే రాజ్యం కోసం పోటీ మొదలయ్యిందన్నమాట అనిపిస్తుంది. అసూయ మనిషితో ఎంతటి ఘోరాన్నైనా చేయిస్తుంది అనటానికి సాక్ష్యం భల్లాలదేవుడి పాత్ర.
అనుష్క - దేవసేన తనేనా అనిపించేంత డీ గ్లామ రైజ్డ్ పాత్రలో, చేతులు, కాళ్ళకి సంకెళ్ళతో ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండి కూడా భల్లాల దేవుడిని నిర్లక్ష్యంగా చూస్తూ,అతన్ని నాశనం చేయటానికి బాహుబలి వస్తాడని నమ్మకంతో భల్లాల దేవుడి చితి కోసం కట్టెపుల్లలు ఏరుతూ తను అనుకున్నది జరిగి తీరుతుందని ఎదురుచూస్తుంటుంది. బాహుబలి పేరు కూడా అందరూ మర్చిపోయారు అన్న భల్లాల దేవుడి కళ్ళముందే ప్రజలంతా బాహుబలిని తలచుకుంటూ ,సంగీత నృత్య కళాకారులు ఉత్సాహంగా ఆడి పాడుతున్న సమయంలో దేవసేన ఆనందం చూస్తే ఆ తల్లి నమ్మకాన్ని నిజం చేయటానికే దేవుడు (శివుడిని) బాహుబలిని బతికించాడేమో అనిపిస్తుంది. కట్టప్ప తనని తప్పిస్తానన్నా వినకుండా కొడుకు వస్తాడని ఎదురుచూసే దేవసేన నమ్మకాన్ని చూస్తుంటే, మనిషి జీవితంలో అన్నీ కోల్పోయినా ఇంకా సాధిస్తామనే నమ్మకానికి, ఆశ కి ఉన్న గొప్పతనం ఇదేనేమో అనిపిస్తుంది.
కట్టప్ప విశ్వాసపాత్రుడైన సైన్యాధికారి, అలాగే బానిస కూడా. రాజు లేని రాజ్యం మీద శత్రు దేశాలు తిరుగుబాటు చేసినప్పుడు శివగామికి అండగా ఉంటూ రాజ్యాన్ని కాపాడిన కట్టప్ప కధ 2 nd పార్ట్ లోపూర్తిగా తెలుస్తుందేమో. మనసులో బాహుబలి అంటే అభిమానం ఉన్నా, తప్పనిసరి పరిస్థితుల్లో దుష్టుడైన రాజు దగ్గర కూడా విశ్వనీయమైన బానిసగా ఉంటున్న కట్టప్ప పాత్ర ఒక రాజ్యానికి కానీ, మనిషికి కానీ ఇలాంటి నమ్మకమైన మనిషి అవసరం చాలా ఉంది అనేలా ఉంది.
ఇక అందరికంటే ఎక్కువగా అందరూ మెచ్చుకున్న పాత్ర శివగామి. రమ్యకృష్ణ సింపుల్ గా ఉన్నా ఒక మహారాణి, రాజమాత అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేలా ఉంది.రమ్యకృష్ణ స్క్రీన్ మీద కనిపించినంత సేపు తననే చూడా లనిపించే మేకప్, నటన,గంభీరంగా మాట్లాడే విధానం అన్నీ చాలా బాగున్నాయి.రాజు లేని రాజ్యాన్ని కాపాడే ధీరవనితగా, సొంత కొడుకనే స్వార్ధం లేకుండా, తనబిడ్డతో పాటూ పాలిచ్చి,బాహుబలిని కూడా సమర్ధుడిగా, వీరుడిగా పెంచుతుంది. శత్రువుతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరు వీరోచితంగా యుద్ధం చేశారు అని కాకుండా ఎవరు మానవత్వంతో, నాయకుత్వ లక్షణాలతో అందరినీ కలిపి నడుపుతూ యుద్ధం చేశారనే నిశిత దృష్టి తో రాజుకి కావాల్సిన అర్హతలున్న బాహుబలిని రాజుని చేసి తన బుద్ధికుశలతని, నిష్పక్షపాతాన్ని,రాజనీతిని చాటుతుంది.తను చనిపోతూ కూడా ధైర్యంగా బిడ్డని కాపాడుతుంది. ఈ రోజుల్లో తమవాళ్ళు అనుకున్న వారికి తగిన అర్హతలు లేకపోయినా పదవులు,అధికారాలు కట్టపెట్టే వాళ్ళకి అప్పట్లో శివగామిలాంటి రాజమాతలు ఆదర్శమైతే బాగుంటుంది కదా..ధీరత్వం,మాతృత్వం,రాజతంత్రం,నిస్వార్ధం ఇలా ఎన్నో ఉత్తమ గుణాలతో రాజమౌళి సృష్టించిన శివగామి పాత్ర చాలా బాగుంది.
కొడుకు మీద ప్రాణాలు పెట్టుకుని పెంచిన తల్లిగా రోహిణి పాత్ర బాగుంది.కొడుకు కోసం శివలింగానికి అభిషేకం చేస్తు కష్టపడుతుందని, తల్లి కోసం శివుడినే గంగమ్మ దగ్గరికి తీసుకెళ్ళిన కొడుకుని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతూనే, నా కోరిక తీరుతుందా,కొడుకు కోరిక తీరుతుందా అని అమాయకంగా అడిగే తల్లిగా ఆరాటం,, అమ్మమొక్కు కోసం తల్లి మీద మీద ప్రేమతో ఆ శివయ్యనే కదిలించిన సన్నివేశం చాలా బాగుంది. తల్లిప్రేమ శివుడితో అంత కష్టమైన పనిని కూడా చేయించింది అనిపిస్తుంది.
వెనకటిరోజుల్లో గొప్పవాళ్ళని కారణజన్ములు అన్నట్లు ప్రతి మనిషి పుట్టుకకి ఒక కారణం ఉంటుందట. ఆ కారణం వల్లనే శివుడి కి కూడా ఆ కొండ మీదకి వెళ్ళాలనే కోరిక కలిగిందేమో, కానీ ఎంత ప్రయత్నించినా జలపాతం ఎక్కటం సాధ్యం కాదు, అప్పుడు అతనికి ఒక చెక్క మాస్క్ కనిపించి కొండ ఎక్కటానికి ప్రేరణ కల్గిస్తుంది. మొత్తానికి కొండెక్కి తన ఊహాసుందరినిచూస్తాడు.ఊహాసుందరిగా తమన్నా పరిచయం చాలా అందంగా ఉంది.. తమన్నా( అవంతిక) దేవసేనని భల్లాల దేవుడి దగ్గరి నుండి విడిపించటానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారుల్లో సభ్యురాలు...ప్రభాస్ మొదటిసారి చూసినప్పుడు వెనక రాజభటులు తరుముతుంటే పరిగెత్తుతూ వస్తున్న తమన్నాని చూసి ఇప్పుడు ప్రభాస్ వెళ్లి కాపాడతాడేమో అనుకునే లోపే తమన్నా తన యుద్ధ ప్రావీణ్యాన్ని చూపి ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ సినిమాలో తమన్నా పాత్ర 2011 లో వచ్చిన " ఉరిమి" సినిమాలో జెనీలియా పాత్రలాగా అనిపించింది. ఆ సినిమాలో కూడా అప్పటిదాకా వచ్చిన సినిమాల్లో అల్లరిపిల్లలాగా నటించే జెనీలియాని యుద్ధవీరురాలిగా చూపించారు.
సినిమాలో అవంతిక,శివుడి ప్రేమ గురించి ఎన్నో రకాల కామెంట్స్ వచ్చాయి. కొందరికి నచ్చింది,కొందరికి నచ్చలేదు. అప్పటిదాకా గొప్ప లక్ష్యం కోసం తిరుగుతున్న అవంతిక ప్రభాస్ ని చూడగానే ప్రేమలో పడటం
చాలా మందికి నచ్చలేదు..లక్ష్యాల కోసం తపించే వాళ్ళందరూ ప్రేమించకూడదని,పెళ్లి చేసుకోకూడదని
ఎక్కడా రూల్ లేదు కదా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తమ లక్ష్యాన్ని సాధించటానికి అండగా ఉంటూ, బాధ్యతలు పంచుకునే వ్యక్తిని జంటగా కోరుకోవటంలో తప్పులేదని నా అభిప్రాయం...అప్పటిరోజుల ప్రకారం అది గాంధర్వ వివాహం అని కూడా అంటారేమో. ప్రభాస్ తమన్నా మేకప్ మార్చుతున్నప్పుడు తను పెట్టుకున్న మాస్క్ అతని దగ్గర కనిపించేదాకా ప్రభాస్ తో యుద్ధం చేస్తూనే ఉంటుంది.మాస్క్ చూశాక తన కోసం ఎంతో కష్టపడి, ప్రమాదకరమైన కొండ ఎక్కి వచ్చాడని తెలుసుకుని, అప్పుడు అతన్ని ఇష్టపడుతుంది.అమ్మాయిలూ,అబ్బాయిలు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవటం ప్రేమలోభాగం కదా !
శివగామి,దేవసేన , అవంతిక ముగ్గురిని ఈ మధ్య సినిమాల్లో తమకంటూ నటించే అవకాశం లేని హీరోయిన్స్ లాగా కాకుండా ఎవరి పాత్రలో వాళ్ళని ఉన్నతంగా, ధైర్యశాలిగా చూపించటం రాజమౌళి ప్రత్యేకత.
కాలకేయుడు, అతని సైన్యం మనుషులు ఇలా కూడా ఉంటారా అనేంత వికృతంగా తయారుచేశారు.కాలకేయుడి రూపమంత వికృతంగానే ఉన్నాయి మాటలు,చేష్టలు కూడా.శివగామిని అనకూడని మాటలు అని చావు కొని తెచ్చుకున్న కాలకేయుడి లాంటి వికృత బుద్ధి ఉన్న మనుషులు ఈ సినిమాలోనే కాదు బయట కూడా కనపడుతూనే ఉంటారు.కాలకేయుడి గ్యాంగ్ కోసం కనిపెట్టిన వింత భాష కూడా బాగుంది.
యుద్ధం సీన్ చాలా బాగుంది. యుద్ధంలో అనుసరించిన వ్యూహాలు అప్పట్లో రాజులు ప్రాణాలకి తెగించి మరీ ఇలా యుద్ధాలు చేసేవాళ్ళు కదా అనిపించేలా ఉన్నాయి. భల్లాల దేవుడికి మంచి ఆయుధాలు ఇచ్చి,బాహుబలికి అవసరమైనవి ఏమీ ఇవ్వకపోయినా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలా గెలవాలో చూపించిన యుద్ధతంత్రాలు బాగున్నాయి. .వందల సంఖ్య లో వస్తున్న సైనికుల మీద గుడ్డలు వేస్తే తప్పించుకుని పైకి రాలేరా అనుకునేంతలోనే చమురుతో తడిపిన ఆ గుడ్డతో పాటే శత్రు సైనికులను కాల్చేయటం,తమ రాజ్య ప్రజలనే ఎదురుగా పెట్టినా రానా వాళ్ళని కూడా చంపుకుంటూ పోతే,ప్రభాస్ యుక్తితో వాళ్ళని కాపాడటం,శత్రు దేశపు జెండా ఎగరగానే నిరుత్సాహంతో పారిపోతున్న సైనికులని మళ్ళీ ధైర్యం చెప్పి యుద్ధం చేయించిన బాహుబలి పాత్ర నిజమైన నాయకుడు, నాయకత్వ లక్షణాలు అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా ఉంది.చివరగా బాహుబలి చేతిలో చావబోతున్నకాలకేయుడ్ని తనే చంపానన్న గొప్ప పేరు కోసం భల్లాల దేవుడి ప్రయత్నం అతని కుతంత్రాలకి ఉదాహరణ.
"ధీవరా"పాట, చిత్రీకరణ,ఈ పాటలో ప్రభాస్ కొండ ఎక్కటానికి చేసే ప్రయత్నం బాగా చిత్రీకరించారు. "పచ్చబోట్టేసిన పిల్లగాడా" పాట బాగుంది.ఈ పాట సినిమాలో సగమే ఉంది.. "ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది" కీరవాణి స్వరంలో బాగుంది.పాటల్లో,యుద్ధంలో, ఇంకా వేరే సన్నివేశాల్లో కూడా వినిపించే సంగీతం బాగుంది.చివరిగా ఒక చోటికి చేరిన కట్టప్ప, కొండజాతి వాళ్ళు, తిరుగుబాటుదారులు,దేవసేన,బాహుబలి గతం తెలుసుకున్న అందరి మొహాల్లో విషాదంతో పాటూ ఎలాగైనా కలుసుకున్నామన్న సంతోషం, అమరేంద్ర బాహుబలికి ఏమి జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రుత స్పష్టంగా కనిపిస్తూ వాళ్ళతో పాటూ మనకి కూడా గతంలో ఏమైందో తెలియలేదే అనే ఫీలింగ్ తో సినిమా అయిపోతుంది.
చాలామంది ఈ సినిమాలో చాలా లోపాలు,తప్పులు ఉన్నాయన్నా ,రాజులు,యుద్ధాల సినిమాలు పూర్వకాలం నుండి ఉన్నా ఇప్పటి రోజుల్లో ఇలాంటి సినిమా తీయటం నిజంగా ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పొచ్చు.యుద్ధంలో వాడే ఆయుధాలు,గుర్రాలు,ఏనుగులు ఇలా ప్రతి ఒక్కటీ సొంతగా సృష్టించి,ఎన్నో ప్రయోగాలతో ఈ సినిమా పూర్తవ్వటానికి సంవత్సరాల పాటు రాజమౌళి టీమ్ పడ్డ కష్టం కూడా సామాన్యమైనదేమీ కాదు. గ్రాఫిక్స్,విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్ అద్భుతంగా నిజంగా అప్పటి రోజుల్ని చూస్తున్నామేమో అనిపించేలా ఉన్నాయి. .ఈ మధ్య కాలంలో వస్తున్న ఒక్క హీరో వేల మంది రౌడీల్ని కూడా చితక్కొట్టే కధల్లా కాకుండా, మన చరిత్రలో ఒకప్పుడు నిజంగానే జీవించిన ఇలాంటి వీరుల కధతో వచ్చిన బాహుబలి సినిమా నాకు నచ్చింది..Waiting For బాహుబలి పార్ట్ 2
ఈరోజుల్లో వస్తున్న సినిమాల్ని ఒక్కసారి చూడటమే కష్టం .. కానీ వాళ్ళు ముందుగానే చూసినా మాకోసం రెండోసారి కూడా సినిమా చూసిన మా చెల్లి, మరిది గారికి కూడా ఈ సినిమా రెండోసారి చూస్తున్నట్లు విసుగనిపించలేదు అని చెప్పటం బాహుబలి మ్యాజిక్ అనొచ్చేమో .... ఇప్పుడు నచ్చలేదు అంటున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ రాబోయే బాహుబలి పార్ట్ 2 - "బాహుబలి : The Conclusion" కూడా తప్పకుండా చూస్తారని నాకనిపిస్తుంది.
బాహుబలి : The Beginning