పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

18, డిసెంబర్ 2011, ఆదివారం

కన్నెపిల్ల కోరుకునే తలంబ్రాలు..



శ్రీరాముడిలా అగ్నిప్రవేశం చేయిస్తాడో?
హరిశ్చంద్రుడిలా అంగడిబొమ్మను చేస్తాడో?
ధర్మరాజులా జూదంలో పణంగా పెడతాడో?
నలుడిలా నట్టడవిలో వదిలిపెడతాడో?

తెలియకపోయినా భర్త అనే మగవాడిని నమ్మి అతనితో జీవితాన్ని పంచుకుంటుంది స్త్రీ ..

అరచేతిలో స్వర్గం చూపించే మోసగాళ్ళు ఎప్పుడూ వుంటారు..
వాళ్ళ చేతిలో మరే యువతీ మరోమారు మోసపోకూడదని
సబల చేసిన ప్రయత్నమే తలంబ్రాలు

పల్లెటూరి నుంచి నగరం వచ్చి దిక్కు తోచని స్థితిలో వున్న రాధికను(జీవిత) మాయ మాటలతో
లొంగదీసుకుంటాడు మధు(రాజశేఖర్)..ఆమెను మోసం చేసి ,వారంరోజుల్లో మన పెళ్లి అని నమ్మబలికి,
పెళ్లి నాలుగు రోజులు ఉందనగా..ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి వెళ్ళిపోతాడు..

పెళ్లి తేదీ రానే వస్తుంది..ఏ క్షణాన అయినా మధు రావచ్చని,పెళ్లి కూతురుగా అలంకరించుకుని సిద్ధంగా వుంటుంది రాధిక.ఇంతలో తలుపు చప్పుడు కాగానే ఆత్రంగా తలుపు తీసిన రాధికకు ఇంటి యజమాని కనపడి ఇల్లు ఖాళీ చేయమంటాడు..రాధిక ఏం చెప్పినా వినకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్ళగొడతాడు..

దిక్కుతోచక మధును వెతుక్కుంటూ చివరకు మధు వుండే చోటుకు చేరుకుంటుంది రాధిక.మధు ఇంట్లో లేడని తెలుసుకుని..దాహంతో ఇంటి బయట వున్న పంపు దగ్గర నీళ్ళు తాగబోతుంది.ఇంతలో ఓ చెయ్యి పంపును కట్టేస్తుంది.తలెత్తి చూడగానే ఎదురుగా మధుని చూసిన రాధిక ప్రాణం లేచివస్తుంది.."ఎందుకొచ్చావ్.." అంటాడు మధు ఊహించని ఆ మాట రాధికకు బాణంలా గుచ్చుకుంటుంది."మీ కోసమేనండీ..మీరు తప్ప నాకేవరున్నారు" అంటుంది ప్రాధేయపడుతూ ..తప్పమ్మా... అలాంటి ఆశలేమైనా వుంటే ఒదిలేసుకో.జీవితమంతా నేను ప్రేమిస్తూనే వుంటాను కానీ ...పెళ్లి మాత్రం చేసుకోను.ఐ హేట్ మారేజ్ అంటాడు స్టైల్ గా సిగరెట్ తాగుతూ..

అప్పటికి అర్ధం అవుతుంది రాధికకు తను మోసపోయానని..రాధికకు తను నిలుచున్న భూమి కుంగిపోతున్న ఫీలింగ్..ఏమీ చేయలేని నిస్సహాయతతో మధు వంక అసహ్యంగా చూస్తుంది రాధిక..ఇంతలో ఆ ఇంటి మేడ పైనుండి ఏవండీ..అనే పిలుపు వినిపిస్తుంది పైన పాతికేళ్ళ యువతిఇంకా అక్కడే ఉన్నారెంటండీ..దాంతో మాటలేంటి..?మీరు రండి.." అంటుంది మధుని ఉద్దేశించి,"ఎవరో పిచ్చిది పిచ్చాసుపత్రి ఎక్కడ అంటే...అడ్రెస్ చెబుతున్నా"అంటాడు మధు తడబడుతూ.."వెళుతుంది లెండి మీరు రండి.క్యాంపు కెళ్లాలన్నారు కదా... పెళ్లి సరిగా నాలుగు రోజులుందనగా మీ బాస్ క్యాంపుకు పంపిస్తున్నారు..ఏమన్నా అంటే వుద్యోగం మానేస్తానంటున్నారు..మీరెళ్ళిరండి  మీరొచ్చేసరికి పట్టుచీర కట్టుకుని రెడీగా వుంటాను"అంటుందా అమ్మాయి అమాయకంగా..

ఆ అమ్మాయి పరిస్థితి చూడగానే అయ్యో అంటూ విరగబడి నవ్వుతుంది రాధిక..ఆవేదన,ఆక్రోశం,అసహాయత కలగలిసిన ఆ నవ్వును ఎప్పటికీ మరిచిపోలేము..పిచ్చిదని రాధికను పోలీసులకు పట్టిస్తాడు మధు..
అసహాయస్థితిలో వున్న రాధికను ఒకప్పుడు మధు పక్క ఇంట్లో వుండే ప్రసాద్ (కళ్యాణ్ చక్రవర్తి)కాపాడి సింగర్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించేలా సహాయపడతాడు ..

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాధిక జీవితంలోకి వస్తాడు మధు..తన మాయమాటలతో మళ్ళీ రాధిక జీవితాన్ని
నాశనం చేయాలన్న దురుద్దేశంతో వచ్చిన మధు మోసాన్ని తెలుసుకోలేని రాధిక జరిగినవన్నీ మర్చిపోయి... మధుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది..ఐతే పెళ్లి సమయంలో మధు నిజస్వరూపాన్ని తెలుసుకున్న రాధిక తనలాగా మరో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని మధుని తన చేతులతో తానే అంతం చేయడంతో కధ ముగుస్తుంది..

ఈ సినిమాలో ముక్కుమొహం తెలియని వ్యక్తిని నమ్మటం రాధిక తప్పు అలా నమ్మింది.. కాబట్టే మోసపోయింది అనుకుంటే..ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు,పెద్దలు అందరు ఉండి చేసిన పెళ్ళిళ్ళలో ఎందరు మోసపోవటం లేదు?
కొన్ని సంవత్సరాలపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందరు మోసపోవటం లేదు?సమస్య తెలిసిన వ్యక్తిని నమ్మటమా?తెలియని వ్యక్తిని నమ్మటమా అని కాదు నమ్మకద్రోహానికి గురవటానికి తెలిసిన,తెలియని అన్న బేధం లేదు..జీవితంలో మోసపోయినా,నమ్మకద్రోహానికి గురి అయినా ఆత్మవిశ్వాసంతో జీవించిన రాధిక కధ ఎప్పటికీ ఆదర్శం..

అలాగే మధు లాంటి మగవాళ్ళు వున్న ఈ సమాజంలోనే ప్రసాద్(కళ్యాణ్ చక్రవర్తి ) లాంటి మానవత్వం వున్నమనుషులు కూడా వుంటారు.యాంటీ హీరోగా రాజశేఖర్,తన నటనతో రాధిక పాత్రలో జీవించిన జీవిత హీరోయిన్లుగా "కోడిరామకృష్ణ" గారు తీసిన తలంబ్రాలు సినిమా అన్ని తరాలు చూడదగిన చిత్రం..

ఈ సినిమాలో పాటలు బాగుంటాయి మల్లెమాల గారు రాసిన "నిన్న నువ్వు నాకెంతో దూరం"
పాట నాకు చాలా నచ్చే పాట..

నిన్న నువ్వు నాకెంతో దూరం




Related Posts Plugin for WordPress, Blogger...