పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

18, డిసెంబర్ 2011, ఆదివారం

కన్నెపిల్ల కోరుకునే తలంబ్రాలు..శ్రీరాముడిలా అగ్నిప్రవేశం చేయిస్తాడో?
హరిశ్చంద్రుడిలా అంగడిబొమ్మను చేస్తాడో?
ధర్మరాజులా జూదంలో పణంగా పెడతాడో?
నలుడిలా నట్టడవిలో వదిలిపెడతాడో?

తెలియకపోయినా భర్త అనే మగవాడిని నమ్మి అతనితో జీవితాన్ని పంచుకుంటుంది స్త్రీ ..

అరచేతిలో స్వర్గం చూపించే మోసగాళ్ళు ఎప్పుడూ వుంటారు..
వాళ్ళ చేతిలో మరే యువతీ మరోమారు మోసపోకూడదని
సబల చేసిన ప్రయత్నమే తలంబ్రాలు

పల్లెటూరి నుంచి నగరం వచ్చి దిక్కు తోచని స్థితిలో వున్న రాధికను(జీవిత) మాయ మాటలతో
లొంగదీసుకుంటాడు మధు(రాజశేఖర్)..ఆమెను మోసం చేసి ,వారంరోజుల్లో మన పెళ్లి అని నమ్మబలికి,
పెళ్లి నాలుగు రోజులు ఉందనగా..ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి వెళ్ళిపోతాడు..

పెళ్లి తేదీ రానే వస్తుంది..ఏ క్షణాన అయినా మధు రావచ్చని,పెళ్లి కూతురుగా అలంకరించుకుని సిద్ధంగా వుంటుంది రాధిక.ఇంతలో తలుపు చప్పుడు కాగానే ఆత్రంగా తలుపు తీసిన రాధికకు ఇంటి యజమాని కనపడి ఇల్లు ఖాళీ చేయమంటాడు..రాధిక ఏం చెప్పినా వినకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి వెళ్ళగొడతాడు..

దిక్కుతోచక మధును వెతుక్కుంటూ చివరకు మధు వుండే చోటుకు చేరుకుంటుంది రాధిక.మధు ఇంట్లో లేడని తెలుసుకుని..దాహంతో ఇంటి బయట వున్న పంపు దగ్గర నీళ్ళు తాగబోతుంది.ఇంతలో ఓ చెయ్యి పంపును కట్టేస్తుంది.తలెత్తి చూడగానే ఎదురుగా మధుని చూసిన రాధిక ప్రాణం లేచివస్తుంది.."ఎందుకొచ్చావ్.." అంటాడు మధు ఊహించని ఆ మాట రాధికకు బాణంలా గుచ్చుకుంటుంది."మీ కోసమేనండీ..మీరు తప్ప నాకేవరున్నారు" అంటుంది ప్రాధేయపడుతూ ..తప్పమ్మా... అలాంటి ఆశలేమైనా వుంటే ఒదిలేసుకో.జీవితమంతా నేను ప్రేమిస్తూనే వుంటాను కానీ ...పెళ్లి మాత్రం చేసుకోను.ఐ హేట్ మారేజ్ అంటాడు స్టైల్ గా సిగరెట్ తాగుతూ..

అప్పటికి అర్ధం అవుతుంది రాధికకు తను మోసపోయానని..రాధికకు తను నిలుచున్న భూమి కుంగిపోతున్న ఫీలింగ్..ఏమీ చేయలేని నిస్సహాయతతో మధు వంక అసహ్యంగా చూస్తుంది రాధిక..ఇంతలో ఆ ఇంటి మేడ పైనుండి ఏవండీ..అనే పిలుపు వినిపిస్తుంది పైన పాతికేళ్ళ యువతిఇంకా అక్కడే ఉన్నారెంటండీ..దాంతో మాటలేంటి..?మీరు రండి.." అంటుంది మధుని ఉద్దేశించి,"ఎవరో పిచ్చిది పిచ్చాసుపత్రి ఎక్కడ అంటే...అడ్రెస్ చెబుతున్నా"అంటాడు మధు తడబడుతూ.."వెళుతుంది లెండి మీరు రండి.క్యాంపు కెళ్లాలన్నారు కదా... పెళ్లి సరిగా నాలుగు రోజులుందనగా మీ బాస్ క్యాంపుకు పంపిస్తున్నారు..ఏమన్నా అంటే వుద్యోగం మానేస్తానంటున్నారు..మీరెళ్ళిరండి  మీరొచ్చేసరికి పట్టుచీర కట్టుకుని రెడీగా వుంటాను"అంటుందా అమ్మాయి అమాయకంగా..

ఆ అమ్మాయి పరిస్థితి చూడగానే అయ్యో అంటూ విరగబడి నవ్వుతుంది రాధిక..ఆవేదన,ఆక్రోశం,అసహాయత కలగలిసిన ఆ నవ్వును ఎప్పటికీ మరిచిపోలేము..పిచ్చిదని రాధికను పోలీసులకు పట్టిస్తాడు మధు..
అసహాయస్థితిలో వున్న రాధికను ఒకప్పుడు మధు పక్క ఇంట్లో వుండే ప్రసాద్ (కళ్యాణ్ చక్రవర్తి)కాపాడి సింగర్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించేలా సహాయపడతాడు ..

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాధిక జీవితంలోకి వస్తాడు మధు..తన మాయమాటలతో మళ్ళీ రాధిక జీవితాన్ని
నాశనం చేయాలన్న దురుద్దేశంతో వచ్చిన మధు మోసాన్ని తెలుసుకోలేని రాధిక జరిగినవన్నీ మర్చిపోయి... మధుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది..ఐతే పెళ్లి సమయంలో మధు నిజస్వరూపాన్ని తెలుసుకున్న రాధిక తనలాగా మరో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని మధుని తన చేతులతో తానే అంతం చేయడంతో కధ ముగుస్తుంది..

ఈ సినిమాలో ముక్కుమొహం తెలియని వ్యక్తిని నమ్మటం రాధిక తప్పు అలా నమ్మింది.. కాబట్టే మోసపోయింది అనుకుంటే..ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు,పెద్దలు అందరు ఉండి చేసిన పెళ్ళిళ్ళలో ఎందరు మోసపోవటం లేదు?
కొన్ని సంవత్సరాలపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందరు మోసపోవటం లేదు?సమస్య తెలిసిన వ్యక్తిని నమ్మటమా?తెలియని వ్యక్తిని నమ్మటమా అని కాదు నమ్మకద్రోహానికి గురవటానికి తెలిసిన,తెలియని అన్న బేధం లేదు..జీవితంలో మోసపోయినా,నమ్మకద్రోహానికి గురి అయినా ఆత్మవిశ్వాసంతో జీవించిన రాధిక కధ ఎప్పటికీ ఆదర్శం..

అలాగే మధు లాంటి మగవాళ్ళు వున్న ఈ సమాజంలోనే ప్రసాద్(కళ్యాణ్ చక్రవర్తి ) లాంటి మానవత్వం వున్నమనుషులు కూడా వుంటారు.యాంటీ హీరోగా రాజశేఖర్,తన నటనతో రాధిక పాత్రలో జీవించిన జీవిత హీరోయిన్లుగా "కోడిరామకృష్ణ" గారు తీసిన తలంబ్రాలు సినిమా అన్ని తరాలు చూడదగిన చిత్రం..

ఈ సినిమాలో పాటలు బాగుంటాయి మల్లెమాల గారు రాసిన "నిన్న నువ్వు నాకెంతో దూరం"
పాట నాకు చాలా నచ్చే పాట..

నిన్న నువ్వు నాకెంతో దూరం
32 వ్యాఖ్యలు:

సుభ చెప్పారు...

మీరు చెప్పిన విధానం బాగుంది రాజీ గారూ.

శశి కళ చెప్పారు...

యెప్పటికి ఆడవాళ్ళు గుర్తు ఉంచుకోవాల్సిన కధ....
మంచి విషయాలు చెపుతారు...మీ టేస్ట్ బాగుంటుంది

వనజ వనమాలి చెప్పారు...

ప్రతీకారం తీర్చుకోవడం మినహాయించి.. యెప్పటికి యెదొ ఒక మంచి సందేశాన్ని ఇవ్వడంలొ. ఈ చిత్ర రాజం ని ముందు వరుసలొ ఉంచవచ్చు. నమ్మక ద్రోహం మాములైపొయిన రొజులివి. మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఒకవెళ మోసపొయినా .. ఆత్మసైర్యం తో బ్రతకాలి కూడా .. సాంగ్స్ టేస్త్ లొ..సేం అదే టేస్ట్.బాగా చెప్పారు.

రాజి చెప్పారు...

"సుభ" గారు టపా నచ్చినందుకు ధన్యవాదములు..

రాజి చెప్పారు...

"శశికళ" గారు నిజమేనండీ యెప్పటికీ ఆడవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన కధ..
నా టేస్ట్,నేను చెప్పే విషయాలు నచ్చినందుకు
ధన్యవాదములు..

రాజి చెప్పారు...

"వనజవనమాలి" గారు ఐతే మీకు ప్రతీకారం తీర్చుకోవటం నచ్చదన్నమాట..

"నమ్మక ద్రోహం మాములైపొయిన రొజులివి. మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఒకవెళ మోసపొయినా .. ఆత్మసైర్యం తో బ్రతకాలి కూడా"

మీరు చెప్పిన ఈ మాట నాకు చాలా నచ్చింది..
మీ స్పందనకు ధన్యవాదములు...

జయ చెప్పారు...

ప్రతీకారం వద్దన్నాను కాని శిక్ష ఒద్దని కాదు. ప్రతిఒక్కరూ చట్టాన్ని తమ చేతిలోకి తీసేసుకుంటే ఎలా! అప్పుడు మీ లాంటి జడ్జ్ లెందుకు? తీర్పులో ఆలస్యం జరగకూడదు. బాధితులకి న్యాయస్థానం పట్ల నమ్మకం పెంచగలగాలి. ఆ స్థాయికి న్యాయస్థానాలు పెరగాలి. ఏ సంఘాలూ స్త్రీలని ఆదుకోవు. ఏళ్ళతరబడీ సాగదీస్తున్న అనేక కేసు లు చూస్తున్నా కొద్దీ, చివరికి స్వీయ నిర్ణయాలు, హింసా మార్గాలే పరిష్కారం గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కంటికి కన్ను, పంటికి పన్నూ అనుకుంటూ పోతే చివరికి మిగిలేది అంతా నేరస్థులే. రాబోయే తరానికి ఇదేనా మార్గదర్శకం???

RAAFSUN చెప్పారు...

ఇక్కడొక చిన్న విషయం చెప్పాలి.......

కామెంట్లలో అందరు లేడీసే ఉన్నారు...అయినా పర్లేదు....నా అభిప్రాయం నా అభిప్రాయమే .....

ఆడపిల్లల మీద దాడులు ...మోసాలు......వినడానికి భయంకరంగా ఉన్నాయి కదూ ఈ మాటలు ..!!!

అంతకంటే భయంకరమైన విషయం మనం తెలుసుకోవలిసింది ఏంటంటే...ఆడపిల్లల మీద దాడి కి, మోసపోవటానికి ఆడపిల్లలు, వారి తల్లితండ్రులు ఎంతవరకు కారణం ?? కొంటేనవ్వులతో కవ్వించడం.....తమ అవసరాల కోసం మగ పిల్లలతో స్నేహాలు చెయ్యడం...అనక వేరేవారితో వెళ్ళిపోవడం...ఈరోజు ఒకరిని రేపు ఇంకొకరిని ప్రేమించే ( ప్రేమ అని వాళ్ళు అనుకుంటారు) అమ్మాయిలు ఎంతమంది లేరు మన మధ్య,!! ఎంతవరకు సమంజసం.....?????????

తల్లితండ్రులు ఎందుకు బాధ్యులు అంటే.....మంచి చెడు నేర్పాలిసిన తల్లితండ్రులు...వేరే మగవాళ్ళతో తమ కూతురు డాన్సు చేస్తుంటే చూడటం, చూపించటం, చదువు పేరు మీదా సంవత్సరాల తరబడి ఆడ పిల్లలని ఒంటరిగా వదిలేయడం, ఈ రోజుల్లో చాలా సినిమాలు A కేడర్ లోనివే...అలాంటి ప్రేమ, ముద్దు - ముచ్చట, పారిపోవటం, ఎదిరించటం, లాంటి సినిమాలు అందరు కలిసి చూడటం ,,అభినందించడం, పిల్లలు సంప్రదాయ బద్ధమైన దుస్తులు వదిలి కొత్త పోకడలు ( అర కోర దుస్తులు ) ధరిస్తుంటే ఏమి అనకపోవడం, పైగా..అలాంటివి ఇప్పించటం, అన్ని రకాల మేటిరియల్స్ ఉండే అంతర్జలాల వాడకం పై ఒక కన్ను వేయక పోవడం, డబ్బు, కరీర్ అని పిల్లలను పట్టించుకోక పోవడం...ఇంకా చాలా ఉన్నాయ్ ఇలాంటివి ...ఇవి కారణాలు.....

ఒక మనిషి వేరే మనిషి మీద దాడి చేసేంత పగ పెంచుకున్నాడు అంటే నాకు తెలిసి రెండు కారణాలు ఒకటి ....అతను/ఆమె MENTALLY NOT MATURED / PSYCHO .....రెండవది ఇది ముఖ్యం...వేరే వాళ్ళ మీదా దాడి చేసేంటగా ఇతని మనసు గాయపడటం.......సహజంగా ఏ మనిషి ఎవరిని చంపాలి అనుకోడు...నాణానికి రెండో వైపు కూడా చూడాలి కదా మనం.....

జడ్జి గారు సారీ ...
మీ తీర్పు వింటుంటే...మీరు మల్లి లా చదవలేమో అనిపిస్తుంది..ఏమంటారు?:) :)

P .S : నేను ఎవరి బ్లాగ్ లో అయినా ఏ విషయం మీద అయినా నాణేనికి రెండో వైపు చూపే ప్రయత్నం చేస్తానే తప్ప నాకు ఎలాంటి ఈర్ష్య ద్వేషాలు గాని కుల,మత,వర్గ,వర్ణ,లింగ,భాషా,బేధాలు లేవని మనవి.......ఇతి వార్తః

శ్రేయోభిలాషి,
RAAFSUN

రాజి చెప్పారు...

జయ గారు నేను లాయర్ నే ఐనప్పటికీ కోర్టుల్లో ఏ మాత్రం న్యాయం జరుగుతుందో అందరికీ తెలిసిందే..
సత్వర న్యాయం జరిగినా ఇందులో బాధితులకి
ఏ మాత్రం న్యాయం జరుగుతుందో అందరికీ తెలిసిందే..

ఇంక ఇప్పుడు చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం..
కంటికి కన్ను పంటికి పన్ను అంటే మిగిలేదంతా నేరస్థులే అన్నారు కదా
ఈ పద్ధతి వలన నేరాలు కొంత వరకైనా తగ్గుముఖం పడతాయి,నేరస్థులు నేరం చేయటానికి భయపడతారు అని నా నమ్మకం..
అందరు నా వాదనని ఆదర్శంగా అంగీకరించాలని నేను అనుకోను..

రాజి చెప్పారు...

"RAAFSUN" గారూ మీ స్పందనకు ధన్యవాదములు

మీకు అందరూ కొంటె నవ్వులతో కవ్వించే ఆడపిల్లలు,అబ్బాయిలతో తిరిగే ఆడపిల్లలే కనబడటం మీ వాదనకు కారణం కావచ్చు..
కానీ విజయవాడకు చెందిన ఆయేషా మీరా ఏమి కవ్వించిందని ఆమెని అంత దారుణంగా చంపి ఆ కేస్ ని ఒక చిల్లరదొంగ మీద పెట్టి అసలు నిందితులు తప్పుకున్నారు?
ఎవరిని కవ్వించారని అరకొర దుస్తులు వేసుకున్నరని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళ తల్లిదండ్రులను చంపితే వాళ్ళు ఇప్పటికీ అనాధలుగా బ్రతకలేక వాళ్ళలో ఒక అమ్మాయి చనిపోయింది?
అమ్మాయి తనను కాకుండా వేరే అబ్బాయితో తిరుగుతుందని చంపిన అబ్బాయిలు వున్నారు కానీ అబ్బాయి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని యాసిడ్ పోసిన అమ్మాయిలు ఎవరైనా వున్నారా???
తనని ప్రేమించలేదని అబ్బాయిల్ని నరికిన అమ్మాయిలు వున్నారా???

నేను మళ్ళీ లా చదవటం కాదండీ లాయర్లు రోజూ లా చదువుతూనే వుండాలి కదా...
ఐనా నేను అందరు అమ్మాయిలు మంచివారు,అబ్బాయిలు చెడ్డవారు అని వాదించటం లేదు..

ఎవరో కవ్వించారని , ఎవరో పొట్టి బట్టలు వేసుకున్నారని,A గ్రేడ్ సినిమాలు తీసారని తన మీద తను విచక్షణ కోల్పోయే మనిషి నా దృష్టిలో మనిషే కాదు..

మౌనముగా మనసుపాడినా చెప్పారు...

సినిమా లో రెండు సాంగ్స్ నాకు బాగా ఇష్టం ( నిన్న నువ్వు నాకు ఎంతో దూరం ,ఇది పాట కానే కాదు )

రాజి చెప్పారు...

మౌనముగా మనసుపాడినా గారు
మీ స్పందనకు ధన్యవాదములు...

జయ చెప్పారు...

రాఫ్సన్ గారు, మీరు ఇంత చెప్పినా నాణానికి ఒక వైపే చూసారు. మీరు చెప్పిన అమ్మాయిల శాతం చాలా తక్కువ. రాజీ చెప్పిన లాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. న్యాయం కూడా గొప్ప వారికి అనుకూలంగానే ఉంటోంది. కాబట్టే ఇలాంటి దురాగతాలు పెరిగిపోతున్నాయి.

నిష్పక్షపాతమైన తీర్పు వెంటనే రాగలగాలి.అమలు పరచాలి. అది నా కోరిక.అంతే రాజి!

రాజి చెప్పారు...

"నిష్పక్షపాతమైన తీర్పు వెంటనే రాగలగాలి.అమలు పరచాలి. అది నా కోరిక."
జయ గారు మీరు చెప్పింది నిజమేనండీ..

అందుకే అభిలాష లో చిరంజీవి లాగా అప్పుడప్పుడు
నాకు కూడా ఇలాంటి నేరాలకు
కఠినశిక్షలు అమలుపరిచేలాగా ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది :):)

వామనగీత చెప్పారు...

@పైవారందరికీ నమస్తే..!
కవ్వించే అమ్మాయిలు లేరని ఎవరూ అనలేదు..అక్కడి వరకూ సంతోషం..! మీరు చెప్పిన సంఘటనల గురించి బల్లగుద్ది మరి చెప్పలేను గానీ, అమ్మాయివైపు కూడా తప్పు ఉందని మీరు గుర్తిస్తే బావుంటుంది.
అబ్బాయిలందరికీ అమ్మాయిల చుట్టూ తిరగడం..అందులో ఒకే అమ్మాయి గురించి సంవత్సరాల తరబడి వేధించడం (చాలామంది దృష్టిలో..!).. మాత్రమే చేస్తారనుకోవడం పెద్ద పొరబాటు. ఒక్క అమ్మాయి/అబ్బాయి గురించి సంవత్సరాల తరబడి ప్రేమించమని తిరిగి వెర్రివాళ్లెవరూ ఈ తరంలో లేరు.. ! ఒప్పుకుంటే ఒప్పుకుంటుంది.(కుంటాడు).. లేకపోతే "నెక్స్ట్‌".." అనే విధంగా ఉన్నారిప్పుడి వాళ్లందరూ..! "ప్రేమ" పేరున వెధవ్వేషాలేసే వాళ్లి కొంతమందైతే, "ప్రేమ"కి ఇవ్వాల్సిన విలువ దానికిచ్చి, ఇంట్లో వాళ్లకి ఇవ్వాలసిన విలువ ఇచ్చేవాళ్ళు ఇంకొంతమంది...! అదలా ఉంచండి..!
ఆనక అబ్బాయో/అమ్మాయో దూరం పెట్టిందో/పెట్టాడో అనుకోండి.. అప్పుడు జరిగే సంఘటనలే ఇవన్నీ..! (మీడియాని నమ్మకూడదన్నది నా బలమైన అభిప్రాయం)
మీకు అమ్మాయి మీద జరిగిన దాడులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాటికి ప్రచారం గట్టిగా ఉంటుంది. అబ్బాయిలమీద జరుగుతున్న దాడులు ప్రచారంలో ఉండవు. ఎవరూ తెలుసుకోడానికి ప్రయత్నించరు. ఇది ఇప్పటి అబ్బాయిల దురదృష్టం..!

జయ చెప్పారు...

Well said Raji. I am waiting for your reply:) 'చట్టబద్ధం' గా కఠిన శిక్షలు తప్పకుండా అమలు పరచాలి. విదేశాలే కాదు మనదేశంలో కూడా ఉరిశిక్షలు అమలు చేసారుగా. All the best.

రాజి చెప్పారు...

"వామనగీత" గారూ తప్పు ఒక్క అబ్బాయిలదే
అని ఎవ్వరూ అనరు నేను కూడా అనను..
నేను కేవలం కొందరు మగవాళ్ళ గురించి మాట్లాడితే అందరు మగవాళ్ళని అన్నట్లు కాదు కదా.
నా పోస్ట్ లోనే నేను రాశాను కదా..
"మధులాంటి దుర్మార్గులు వున్నట్లే ప్రసాద్ లాంటి మంచి వ్యక్తులు కూడా వుంటారని"
దయచేసి దాన్ని గమనించండి...
మీ వివరణాత్మక వ్యాఖ్యకు ధన్యవాదములు

రాజి చెప్పారు...

జయ గారు మీరు చెప్పేది అక్షర సత్యమండీ..
చట్టబద్ధంగా అమలు పరిచే శిక్షలే సమాజాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి
కాకపోతే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని అక్కడికక్కడే చంపి పారేయాలని
మన మధ్య జరిగిన ఈ చర్చలో నేనేమైనా తప్పుగా మాట్లాడి వుంటే సారీ..

జయ చెప్పారు...

మనకు 'అనిపించటాలు' వేరు, 'చేసేయటాలు' వేరు కదూ. Once again all the best, dear Raji:)

జయ చెప్పారు...

రాజీ, హారం లో వ్యాఖ్యలు లో నీ కామెంట్స్ టాప్ మోస్ట్ లో ఉన్నాయి. తొందరగా ఒక్కసారి చూసేసుకో:))))

రాజి చెప్పారు...

"మనకు 'అనిపించటాలు' వేరు,
'చేసేయటాలు' వేరు కదూ."
నిజమేనండీ రెండిటికీ చాలా తేడా వుంది..

జయ గారూ...
హారంలో చూశానండీ నా కామెంట్స్ టాప్ మోస్ట్ లో ఉన్నాయి.
Thankyou..

Thankyou So Much For Your Best Wishes

RAAFSUN చెప్పారు...

meerandiriki repu answers istaanu...

nenu ekeebhavinchaledu mee vaadanalato....

రసజ్ఞ చెప్పారు...

నేను ఈ సినిమా పాటలు విన్నాను కాని ఇప్పటిదాకా చూడలేదు ఆగండి ముందు చూసి అప్పుడు వస్తా ఇటువైపు!

రాజి చెప్పారు...

రసజ్ఞ గారూ తప్పకుండా చూసి రండి..
మీ అభిప్రాయం చెబ్దురుగాని..

RAAFSUN చెప్పారు...

అందరికి నమస్కారం,

రాజి గారు, జయ గారు చర్చ కు సిద్ధంకండి...ఒక స్నేహపూరిత వాతావరణం లో చర్చిద్దాం..ఒక CONCLUSION వస్తుందేమో చూద్దాం..బ్లాగ్ వారు అనుమతిస్తే....చర్చ ముందుకు సాగగలదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను...

రాజి చెప్పారు...

"RAAFSUN" గారు నమస్కారం..
నేను నా మనసుకు తోచినదేదో నా బ్లాగ్ లో రాస్తూ వుంటాను..ఆ ప్రయత్నంలో కొందరు స్నేహితుల్ని అలాగే నాకు సలహాలు,సూచనలు ఇచ్చే పెద్దల్ని కూడా పరిచయం చేసుకున్నాను..

ఈ నా చిన్నిప్రపంచం నా అంతరంగానికి అక్షర రూపం అంతే కానీ చర్చా వేదిక కాదు..
ఇక్కడ మనం వాదించుకుని..చర్చించే కంటే ఇలాంటి విషయాలకు మీడియాను వేదిక చేసుకుంటే బాగుంటుందేమొ ప్రజల్లోకి ఇంకా సులభంగా చేరిపోతుంది..
ఇంకా ఎక్కువ మంది తమ తమ అభిప్రాయలను పంచుకునే వీలుంతుంది కనుక ఆ విధంగా ప్రయత్నించగలరు..
ఇంకొక సలహా మీ బ్లాగ్ లో కూడా మీరు ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను అందరితో షేర్ చేసుకోవచ్చుకదా..!

చర్చకు అనుమతించనందుకు అన్యధా భావించవద్దని మనవి
రాజి..

మౌనముగా మనసుపాడినా చెప్పారు...

అయ్యబాబోయి ఏమిటి తెగ కామెంట్స్ తో కొట్టేసుకుంట్టునారు.. ఆ సినిమా తీసినప్పుడు కూడా ఇన్ని విమర్శలు చర్చలు జరగలేదు అనుకుంటాను.. అమ్మయిలు తక్కువ తినలేదు అబ్బాయిలు తక్కువతినలేదు... శాంతి శాంతి శాంతి హి హి హి ధన్యవాదములు...

రాజి చెప్పారు...

"మౌనముగా మనసుపాడినా" గారూ
లేట్ గా చెప్పినా లేటెస్ట్ గా చెప్పిన
మీ CONCLUSION చాలా బాగుందండీ...

ThankYou..

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ఈ సినిమా పెళ్ళయ్యేదాకా నాకు కూడా భలే నచ్చింది :).. ఆ తరువాత నచ్చలేదా అని మీరస్సలు అడగకూడదు :))

RAAFSUN చెప్పారు...

its ok raji gaaru,

i m sorry if i hurt u r feelings...its just a friendly conversation only,

thank you thank you.....

రాజి చెప్పారు...

"ఈ సినిమా పెళ్ళయ్యేదాకా నాకు కూడా భలే నచ్చింది ఆ తరువాత నచ్చలేదా అని మీరస్సలు అడగకూడదు"

"భాస్కర రామిరెడ్డి" గారు అస్సలు అడగనండీ :) :)
మీ స్పందనకు ధన్యవాదములు

రాజి చెప్పారు...

RAAFSUN గారు మీ అభిప్రాయం మీరు చెప్పారు
అంతే కదా..
ఇందులో నేను బాధపడేదేమీ లేదు,
మీరే అన్నారు కదా
"its just a friendly conversation only"

its ok
Thankyou..

Related Posts Plugin for WordPress, Blogger...