పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, మే 2015, గురువారం

కొండపల్లి బొమ్మలు -- కొండపల్లిలో

  
 

"కొండపల్లీ  కొయ్యా బొమ్మ  నీకో బొమ్మా నాకో బొమ్మ" అని చిన్నపిల్లలు పాడుకునే పద్యాల దగ్గరి నుండి,అందమైన అమ్మాయిని కొండపల్లి బొమ్మతో పోల్చే దాకా కొండపల్లి బొమ్మల గురించి తెలియని వాళ్ళు ఉండరేమో..  ఆంధ్రప్రదేశ్ లోని  కృష్ణా జిల్లా,ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన కొండపల్లి గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు.400 సంవత్సరాల నాటిదిగా చెప్తున్న ఈ కళ నిజంగా చాలా ప్రత్యేకంగా, అద్భుతంగా ఉంటుంది. 

ఈ బొమ్మలు ఏదో సులభంగా మౌల్డ్స్ తో చేసేవి కాదు,ప్రతి బొమ్మా దేనికదే చెక్కి,అవసరమైన భాగాలను విడిగా అతికిస్తూ,ఎంతో  ఓపికగా సహజమైన రంగులద్ది తయారుచేస్తారు.ఆ ప్రాంతంలో దొరికే "పొనికి కలప " అనే చెక్కతో చేసే ఈ బొమ్మలు ఎంత పెద్ద బొమ్మైనా సరే చాలా తేలికగా ఉంటాయి. దశావతారాలు, ఏనుగు మావటీ,పెళ్లి పల్లకి,ధాన్యం బస్తాలతో ఉన్న ఎద్దులబండి,తాటిచెట్టు ఎక్కుతున్నమనిషి ఇవి కొండపల్లి బొమ్మల్లో ఫేమస్ అని చెప్పొచ్చు.

ఈ కొండపల్లి బొమ్మలు కళాంజలి,లేపాక్షి లాంటి హస్తకళల విక్రయశాలల్లో దొరుకుతాయి కానీ ఈసారి మాచెల్లి కోరిక మీద  కొండపల్లికి  వెళ్లి మరీ ఈబొమ్మలు తెచ్చుకోవటం ఎప్పటికీ గుర్తుండే ఒక మంచి అనుభవం. 
2 నెలల క్రితం గుంటూరు వచ్చిన మా చెల్లి చూడాలనుకున్న ప్లేసెస్ లో ఈ కొండపల్లి ప్రధానంగా పెట్టుకుని వచ్చింది.కొండపల్లి బొమ్మలు లేపాక్షిలో కూడా దొరుకుతాయి కదే అంటే ఆన్ లైన్ లో కూడా దొరుకుతాయి కానీ నేను అక్కడికి వెళ్లి చూడాలనుకుంటున్నాను అంది. సరే అక్కడ కృష్ణదేవరాయల తో సహా ఎన్నో రాజవంశాల పాలన  కొనసాగిన కొండపల్లి కోట కూడా ఉంది కదా అది కూడా చూసి రావచ్చు అని బయల్దేరాం... 

ముందుగా విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని,అక్కడినుండి మా కార్ డ్రైవర్ అడ్రెస్ అడుగుతూ కొండపల్లి తీసుకెళ్ళాడు.విజయవాడ నుండి త్వరగానే కొండపల్లి వెళ్ళాము.ఎప్పుడో పురాతనకాలంలో పల్లెటూరుని చూసినట్లే అనిపించింది ఆ ఊరిని చూస్తుంటే..కొండపల్లి బొమ్మలకి ఆ వూర్లో ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ లాంటిది ఏమీ లేదని చెప్పారు.ఒక వీధిలో ఇళ్ళ మధ్యలోనే వరసగా అన్నీ షాపులు ఉన్నాయి అద్దాల బీరువాల్లో వాళ్ళు తయారుచేసి పెట్టిన బొమ్మలు పెట్టి ఉన్నాయి.అన్నిబొమ్మలు,వాటిని తయారుచేసే షాపులు,కళాకారుల్ని చూడటం వింతగా,లేపాక్షి లాంటి ఎగ్జిబిషన్స్ లో ఆ బొమ్మల్ని చూడటం కంటే అప్పటికప్పుడు కళాకారుల  చేతుల్లో ప్రాణం పోసుకుంటున్న ఆ బొమ్మల్ని చూడటం చాలా సంతోషంగా అనిపించిది.. 
కొండపల్లిలోమేము బొమ్మలు కొన్న షాపు. 

మేము అక్కడున్న వాటిల్లో ఒక షాప్ లోకి వెళ్ళగానే బొమ్మల్ని వాళ్ళే తయారుచేసి అమ్ముతున్న ఆ షాపతను మేము ఆ బొమ్మల కోసమే కొండపల్లి దాకా వెళ్ళామని తెలుసుకుని, చాలా సంతోషంగా వాళ్ళు తయారు చేసిన బొమ్మలన్నీ చూపిస్తూ, ఎలా తయారుచేస్తారు అనే విషయాల్ని చెప్పాడు. మా తాతల కాలం నుండి మేము నేర్చుకున్నాము కానీ ఇప్పుడు ఈ కళకి ప్రభుత్వం నుండి సరైన సపోర్ట్ లేకపోవటం మూలంగా మా పిల్లలు నేర్చుకోవటానికి, ఈ వృత్తిలో కొనసాగటానికి ఇష్టపడటం లేదు,మేము కూడా వాళ్ళని ఒత్తిడి చేయలేకపోతున్నాము.. షోరూమ్స్ వాళ్ళు బొమ్మలు మా దగ్గర తక్కువ రేటుకి కొని బయట ఎక్కువ రేటుకి అమ్ముతారు,వాళ్ళు ఎంత చెప్పినా కొంటారు కానీ మా దగ్గర బేరాలాడుతారు అంటూ ముందే మమ్మల్ని బేరం ఆడటానికి సందేహించేలా చేసేశాడు. 

  బొమ్మలు ఎలా చెక్కుతారో చూపిస్తున్న 
షాపతను
 

మాకు కూడా అది నిజమే కదా అనిపించింది. అదే ఏ లేపాక్షికో వెళ్తే అక్కడ బొమ్మ మీద ఎంత స్టిక్కర్ వేస్తే  అంతకి సైలెంట్ గా కొంటాము కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర,మన ఇళ్లదగ్గర అమ్మటానికి వచ్చే చిన్న వ్యాపారుల దగ్గర బేరమాడతాము అనుకుని,మాకు నచ్చిన కొన్ని బొమ్మలు సెలక్ట్ చేసుకుని రీజనబుల్ రేట్స్ మాట్లాడుకుని, కొనుక్కుని వచ్చేశాము.ఏ బొమ్మ చూసినా భలే  ఉంది  అనిపించేలా ఉంది ఆ కళాకారుల అద్భుత సృష్టి.  

 మేము బొమ్మలు కొన్న షాప్

 

ఈ ప్రాంతంలో ఏ ఫంక్షన్స్ అయినా గాజు బాక్స్ లో 
సెట్ చేసిన ఈ దశావతారాలు గిఫ్ట్ గా ఇస్తారట.

 

మనం కొన్న బొమ్మల్ని ఇలా సరిపోయే అట్టపెట్టేల్లో
పెట్టి,వాళ్ళే Pack చేసి ఇస్తారు. 

బొమ్మలు తయారుచేసే చెక్కని  ఈ ఫోటోలో చూడొచ్చు.  

విష్ణుమూర్తి దశావతారాలు 
కొండపల్లి బొమ్మల్లో ప్రఖ్యాతి చెందినవి. 


ఈ బొమ్మ చాలా బాగుంటుంది.ముఖ్యంగా ఆ ధాన్యపు
బస్తాలు నిజమైన వాటిలా భలే ఉంటాయి.


ఏనుగు అంబారీ


పెళ్లి పల్లకి

 
బృందావనం లో గోపెమ్మలతో కృష్ణుడు


వస్తున్నప్పుడు సంతోషంగా,నవ్వుతూ మాకు,పిల్లలకి టాటా చెప్తున్న 
ఆ షాపతన్ని చూస్తే హమ్మయ్య మేము అతన్ని మరీ విసిగించి,బాధపెట్టి బొమ్మలు తక్కువ రేటుకి కొనలేదులే అనిపించింది .. :)


కొండపల్లి కోట చూడాలనుకున్నాము కానీ కుదరలేదు.మొత్తానికి మా చెల్లి కోరిక మేరకు ఒక మంచి ఊరిని,,కళని,కళాకారులని ప్రత్యక్షంగా చూసిన సంతోషం కలిగింది..ఇవీ మా కొండపల్లి బొమ్మల కబుర్లు. 


Related Posts Plugin for WordPress, Blogger...