పంచవటి - నాసిక్ |
"అంతా రామమయం" అనిపించే ఎన్నో ప్రదేశాలు నాసిక్ లో ఉన్నాయి
రామ్ కుండ్
ఇక్కడ గోదావరిని రామ్ కుండ్ అంటారు. ఈ నదిలో వనవాస సమయంలో రాముడు స్నానం చేసేవాడు కాబట్టి రామ్ కుండ్ అనే పేరు వచ్చిందట.ఇక్కడ గట్టుమీద గోదావరి ఆలయం కూడా ఉంటుంది.
పంచవటి
పంచవటి
దండకారణ్యంగా పిలిచే
ఈ ప్రదేశంలో పర్ణశాల నిర్మించుకుని సీతారామ లక్ష్మణులు నివసించిన పంచవటి. ఇక్కడ ఐదు వటవృక్షాలు ఉన్నాయి కాబట్టి పంచవటి అని పేరు
వచ్చింది.ఇక్కడే సీతాగుహ,కాలారామ్ మందిర్,మారీచవధ మ్యూజియం ఉంటాయి. ఎంతో పెద్దగా పెరిగి ఊడలతో విస్తరించి ఉన్న ఐదు వట వృక్షాలను
చూడొచ్చు. ప్రతి వట వృక్షానికి పంచవటి 1,2,3,4,5 ఇలా బోర్డులు పెట్టి
ఉన్నాయి కాబట్టి వట వృక్షాలను తేలికగానే గుర్తించొచ్చు.
కాలారాం మందిర్
కాలారాం మందిర్
వనవాస సమయంలో రాముడు నివసించిన పంచవటికి సమీపంలో నీలమేఘ శ్యాముడిగా రాముడు కొలువైన పురాతన మందిరమే కాలారామ్ మందిర్. Sardar Odhekar of Peshwa ఆధ్వర్యంలో క్రీ.శ. 1788 నుండి క్రీ.శ. 1790 వరకు 12 సంవత్సరాల కాలం పాటూ ,ఆ
రోజుల్లోనే 23 లక్షల రూపాయలు ఖర్చుతో .రామ్ సేజ్ నుండి తెచ్చిన నల్లటి రాళ్ళతో ఈ ఆలయాన్ని నిర్మించారు.గర్భాలయంలో సీతారామ,లక్ష్మణుల నల్లటి విగ్రహాలుంటాయి.
సీతాగుహ
ఐదు వట వృక్షాల మధ్యలో ఒక ఇల్లులాంటి ప్రదేశం లోపలి వెళ్తే సీతాగుహ ఉంటుంది.వనవాస సమయంలో సీతమ్మ ఈ గుహలోనే ఉండేదట.చాలా సన్నటి మెట్లదారి ద్వారా లోపలికి వంగి, దిగుతూ, కొన్నిచోట్ల నేలమీద పాకుతూ కూడా వెళ్ళాలి.లావుగా ఉండేవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు గుహ లోపలికి వెళ్ళొద్దని బయట బోర్డ్ పెట్టారు. కానీ లోపలికి వెళ్ళాక ఎంతలావుగా ఉన్నవాళ్ళకైనా వాళ్లకి తగినట్లుగానే గుహలో దారి ఉన్నట్లుగా అనిపించటం అక్కడి మహిమేమో అనిపించింది.లోపల సీతారామ లక్ష్మణుల అందమైన నిలువెత్తు విగ్రహాలు,సీతమ్మ పూజ చేసినట్లుగా చెప్పే శివలింగం,సీతాదేవి అలంకరణకి ఉపయోగించేదని చెప్పే ఒక చిన్న గది ఉన్నాయి.గుహకి ఒకవైపు నుండి లోపలి వెళ్లి మరో వైపు నుండి బయటికి వస్తాము.అప్పటి గుహకి ఇప్పుడు కొన్ని మార్పులు చేసినట్లుగా అనిపిస్తుంది.పాపం సీతమ్మ బయటి ప్రపంచానికి తెలియకుండా ఇలా ఈ చిన్నగుహలో ఉందన్నమాట అనిపించింది. ఇక్కడి నుండే రావణుడు సీతాదేవిని అపహరించాడట.
సీతాహరణ్ ,మారీచ వధ మ్యూజియం
సీతాగుహలోకి వెళ్ళే దారి |
సీతాగుహ ఎదురుగానే సీతమ్మని రావణుడు అపహరించటం,బంగారులేడి, మారీచవధకి సంబంధించిన కొన్ని చిత్రాలు,విగ్రహాలతో మ్యూజియం ఉంది.1 రూపాయి టికెట్ తీసుకుని లోపలి వెళ్లి చూడొచ్చు. కెమెరాలను లోపలికి అనుమతిస్తారు.
సీతాహరణ్ ,మారీచ వధ మ్యూజియం |
సర్వదేవతా ముక్తిధామ్ -నాసిక్
నాసిక్ లో మరో ముఖ్యమైన ప్రసిద్ధి చెందిన దేవాలయం"ముక్తిధామ్" సకలదేవతా నిలయం. రాజస్థాన్ మకరానా మార్బుల్ తో కట్టిన ఈ ముక్తిధామ్ 165 అడుగుల ఎత్తులో,విశాలమైన ఆవరణలో ప్రశాంతంగా ఎంతో అందమైన దేవాలయం. పారిశ్రామిక వేత్త J.D చౌహాన్ ఈ అపురూప కట్టడాన్ని నిర్మించారట.ముక్తిధామ్ ని బిర్లా టెంపుల్ అని కూడా అంటారట. మందిరం ముందు భాగంలో ఓంకారం,దాని కిందే సప్తాశ్వరధంపై ప్రత్యక్షదైవం,సూర్యభగవానుడు కనిపిస్తాడు.ఆలయం ప్రధాన దైవం శ్రీరాముడు.ఆలయ ముఖమండపం లోపలి వెళ్ళగానే ఎదురుగా సీతారామ
లక్ష్మణులు,ఆంజనేయస్వామి పాలరాతి విగ్రహాలు అందమైన అలంకరణలో మెరిసిపోతూ
ఎంత చూసినా తనివితీరనంత చూడచక్కగా ఉన్నాయి.పక్కనే మరో మందిరంలో చతుర్భుజాలతో,సర్వాలంకార భూషితుడైన లక్ష్మీ ,నారాయణుల పాలరాతివిగ్రహాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు వేణువూదుతూ తన ఇష్టసఖి రాధతో కలిసి ఉన్న పాలరాతివిగ్రహం ఆ కృష్ణయ్య లాగానే జగన్మోహనంగా ఉంది.
ఆలయంలోని చిన్న చిన్న దేవాలయాల్లో బద్రీనాధ్ ధామ్,శ్రీ మహావిష్ణు రూపాలు,వెంకటేశ్వరస్వామి తిరుపతి బాలాజీగా, సత్యనారాయణ స్వామి,పూరీ జగన్నాధుడు,పాండురంగడు సూర్యభగవానుడు చిన్న విగ్రహాలుగా కొలువై ఉన్నారు. పాలరాతి కైలాసగిరి పైన ఆదిదంపతుల దర్శనం,ద్వాదశ జ్యోతిర్లింగాలు,ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వారణాసిలోని ఆలయ నమూనాలో జలాభిషేకం అందుకుంటున్న కాశీవిశ్వేశ్వరుడ్ని శివరూపాలుగా దర్శించుకోవచ్చు. నవగ్రహాలు కూడా వాహన సహితంగా ఇంతకుముందు ఎక్కడా చూడనంత అందంగా పాలరాతితో కొలువైఉన్నారు.గాయత్రీ మాత ,సరస్వతీమాత, కార్తికేయుడు, వినాయకుడు, హనుమంతుడు, దత్తాత్రేయస్వామి, ఎందరో యోగులు,సిక్కుగురువు గురునానక్ ఇలా సర్వదేవతలను ఒకే చోట దర్శించే ముక్తిధామ్ సంపూర్ణ తీర్ధయాత్ర.
మేము ముక్తిధామ్ దర్సనం చేసుకునేటప్పటికి డిన్నర్ టైమ్ కావటంతో ముక్తిధామ్ వెనకవైపు ఉన్న పురోహిత్ హోటల్ కి వెళ్ళాము.హోటల్ పురోహిత్ మహారాష్ట్ర ట్రిప్ మొత్తంలో మాకు నచ్చిన ఫుడ్, ప్లేస్ కూడా.. హోటల్ చాలా నీట్ గా,చక్కని ఇంటీరియర్ డెకరేషన్,భోజనం సర్వ్ చేసే వాళ్ళ పధ్ధతి కూడా బాగుంది.ఇక్కడ గుజరాతీ థాలీ చాలా బాగుంది. ఇంట్లో అతిధులని చూసుకున్నట్లుగా జాగ్రత్తగా గమనిస్తూ అడిగి మరీ ,మనం వద్దు తినలేము అనేదాకా పదార్ధాలను వడ్డించటం ఇక్కడ ప్రత్యేకత అనొచ్చేమో.
ఆత్మీయ స్వాగతం పలుకుతున్న గ్రామీణులు |