నేను-నా జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నేను-నా జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
23, నవంబర్ 2018, శుక్రవారం
మా ఊరు - మా స్కూల్ - మా జ్ఞాపకాలు - My School Memories
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
మావూరు,
My Youtube Channel Videos
21, జనవరి 2015, బుధవారం
సర్కస్ హై భాయి సర్కస్ హై --యే దునియా ఏక్ సర్కస్ హై
ఈ పాట 1989 లో DD లో ప్రసారమైన సర్కస్ సీరియల్ టైటిల్ సాంగ్ . చిన్నప్పుడు టీవీ కొన్న కొత్తలో హిందీలో మాత్రమే ప్రోగ్రామ్స్ వచ్చే DD ఛానల్ కి చాలా రుణపడి ఉన్నామని చెప్పొచ్చు :) ఎందుకంటే చదివిన దాని కంటే ఎక్కువ ఈ ఛానల్ చూడటం వలన కూడా హిందీ అర్ధం చేసుకోవటం బాగా వచ్చిందని నా అభిప్రాయం. అప్పట్లో హిందీ అర్ధం అయినా కాకపోయినా ప్రతి ఆదివారం ఉదయం రామాయణం,భారతంతో పాటూ తర్వాత వచ్చే జంగిల్ బుక్, స్టోన్ బాయ్, మాల్గుడి డేస్, టిప్పుసుల్తాన్, మధ్యానం వచ్చే అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ సినిమాలు, రేణుకా సహానీ- సురభి,ఏక్ చిడియా అనేక్ చిడియా లాంటి పాటలు చూడటం రోజంతా అదేపనిగా ఉండేది..
అలాంటి రోజుల్లో వచ్చిన సీరియలే ''సర్కస్''. ఇప్పటి ఎందరో అభిమానుల అభిమాన హీరో షారుక్ ఖాన్ మొదట తెలిసింది ఈ సీరియల్ ద్వారానే అనుకుంటాను.షారుక్ ఖాన్ ''ఫౌజి'' అనే ఇంకో సీరియల్ కూడా బాగుండేది. సర్కస్ స్టోరీ అంతా గుర్తులేదు..షారుక్ ఖాన్ ఒక సర్కస్ కంపెనీ యజమాని కొడుకు.కొంతకాలం సర్కస్ వాళ్ళతో పాటూ కలిసి ఉంటాడు.ఆ సమయంలో సర్కస్ కళాకారుల జీవితం లోని సుఖ దుఖాలు,సంతోషాలు,బాధలు ఇలా సర్కస్ గురించి మనకి బయటికి తెలియని ఎన్నో సంగతులు ఈ సీరియల్లో చూపించారని గుర్తు.
ఇప్పుడింతకీ ఈ సీరియల్ ఎందుకు గుర్తొచ్చిందంటే SAM ఆఫ్రికన్ సర్కస్ మాచిన్నికన్నకి చూపించాలని సంక్రాంతి రోజు వెళ్ళాము. ఆఫ్రికా, చైనా, మణిపురి,ఇంకా వేరే రాష్ట్రాల కళాకారులు కొంచెం ప్రమాదకరంగానే అనిపించే ఫీట్స్ చేశారు.ఎప్పటిలాగే సైకిల్ విన్యాసాలు, జిమ్నాస్టిక్ రింగ్స్,కత్తులతో విన్యాసాలు,పిచ్చి పనులు చేస్తూ నవ్వించాలనుకునె జోకర్లతో పాటు,ఏనుగు, పులి లాంటి పెద్ద జంతువులు లేవు కానీ సర్కస్ లో ఎప్పుడూ చూడని మేక,గొర్రెలు,పొటేలు కొంచెం కామెడీగా అనిపించాయి. మణిపురి అబ్బాయి కళ్ళకు గంతలు కట్టుకుని పదునైన కత్తితో పక్కన వాళ్లు చేతిలో పట్టుకున్న,పొట్ట మీద పెట్టిన కీరా కట్ చేయటం చేస్తున్నవాళ్ళకెలా వుందో కానీ చూడటానికే కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది.
సర్కస్ చూస్తున్నంత సేపు ఎంత ట్రైన్ అయినా కానీ వీళ్ళు బ్రతుకుతెరువు కోసం ఎంత నిర్లక్ష్యంగా ప్రమాదం అంచున ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారు అనిపించింది.వాళ్లకి సర్కస్ ఒక ప్రమాదకరమైన జీవితమైతే మనకి అదొక వినోదం.సర్కస్ చూస్తున్నప్పుడు ''వికసించే పూలు ముళ్ళు విధి రాతకు ఆనవాళ్ళు,ఒకరి కంట పన్నీరైనా వేరొకరి కంట కన్నీరు'' పాట ఎందుకో గుర్తొచ్చింది .. మొత్తానికి ఈ సర్కస్ ఇలా నా చిన్నతనంలో DD ఛానల్ రోజుల్ని గుర్తు చేసింది.
ఈ ప్రపంచమే ఒక సర్కస్ అందులోమనుషులందరూ నిత్యం సర్కస్ చేసే ఆర్టిస్ట్ లే .. అనే ఈ సర్కస్ సీరియల్ టైటిల్ సాంగ్ బాగుంటుంది.
సర్కస్ హై భాయి సర్కస్ హై
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
Something Special
24, మే 2014, శనివారం
జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు...
కొన్ని ప్రదేశాలు ,కొన్ని సంఘటనలు , కొందరు మనుషులు , కొన్ని సినిమాలు,కొన్ని పాటలు ఇలా కొన్నిటికి జీవితంలో చాలా గొప్ప స్థానం వుంటుంది .. ఎక్కడ ఎప్పుడు వాటిని చూసినా, విన్నా మనసు గతంలోకి దూసుకు వెళ్ళిపోవటం ఖాయం .. వాటిలో కొన్ని సంతోషించే విషయాలైతేకొన్ని బాధ పెట్టేవి కూడా ఉంటాయనుకోండి..
ఇంతకీ ఇప్పుడు నన్ను అలా వర్తమానం నుండి గతం లోకి లాక్కెళ్ళిన విషయం ఏంటంటే ..సమ్మర్ హాలిడేస్ ఎజాయ్ చేయటం ఒక ఎత్తైతే రాబోయే పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూడటం ఒక ఎత్తు ..మొన్న పదవ తరగతి నుండి డిగ్రీ,ఇంకా రకరకాల పరీక్షా ఫలితాల వరకు పిల్లల ఆత్రుత, హైరానా ..
ఫలితాల కోసం ఎదురు చూసి చూసి కోరుకున్న ఫలితం రాగానే ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్న విద్యార్ధులు వాళ్ళ తల్లిదండ్రులు...
ఇవన్నీ చూసి నా 10 th క్లాస్ రోజులు గుర్తొచ్చాయి.. నాకు అన్ని సబ్జెక్ట్స్ బాగానే వచ్చేవి కానీ లెక్కలు అంటే మాత్రం దేవుడా ఈ గండం ఎలా గట్టెక్కాలా అనేంత కష్టంగా ఉండేది.. లెక్కలు బాగా చేసే వాళ్ళని చూసి అకారణంగా కోపం కూడా వచ్చేది .అలాగే 10 th క్లాస్ దాకా వచ్చాక నేను తీసుకున్న బలమైన నిర్ణయం లెక్కలు లేని సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ తీసుకోవాలని కానీ ఆ పని చేయాలంటే ముందు ఈ పది గట్టెక్కాలి కదా!
మరి అందుకు నా ప్రయత్నం నేను చేయాలి కదా ..
దేవుడి మీద భారం వేసి పరీక్షలకు సిద్ధమవుతుండగా నా ప్రయోజకత్వం తెలిసిన అమ్మా,నాన్న వూరి నుండి మా పెద్దనాన్న పిల్లలైన అన్నయ్యల్ని రంగంలోకి దించారు నాకు లెక్కలు చెప్పటానికి... వాళ్ళు అప్పటికే డిగ్రీలు,పాలిటెక్నిక్ లు చదివేసి వుండటం తో వాళ్ళ మీద అపారమైన నమ్మకంతో ఈ బాధ్యతను వాళ్లకి అప్పగించాడు నాన్న... నాకు లెక్కలు రావని వాళ్లకు చెప్పి అవమానించారనే బాధ,వాళ్ళు చెప్పే లెక్కలు నేను చేయలేకపోతే వాళ్ళ ముందు చులకన అనే బాధ, ఇలా అన్ని రకాల బాధలతో అన్ని పరీక్షలతో పాటు లెక్కల పరీక్ష రోజు రావటం, పరీక్ష రాయటం అన్నీ అయిపోయాయి..
ఇంక సమ్మర్ హాలిడేస్ వూరి నుండి వచ్చిన పిన్ని వాళ్ళ పిల్లలు,మా బంధువుల్లో పిల్లలు,పెద్దల పంచాయితీలతో వేగంగా గడిచిపోయింది. రిజల్ట్స్ రోజు రానే వచ్చింది .. నాకు మాత్రం లెక్కలు పాసవుతాననే నమ్మకం ఎంత గట్టిగావుందో తప్పుతాననే నమ్మకం కూడా అంతే వుంది .. నా పరీక్షల టెన్షన్ నాకంటే అమ్మ,నాన్న,నా లెక్కల గురువులు (అన్నయ్యలకి) ఎక్కువై పోయింది ,, అప్పట్లో రిజల్ట్స్ పేపర్ లోనే వచ్చేవి కదా .. పేపర్ కోసం మా తమ్ముడు ,అన్నయ్య ముందే వెళ్లి పడిగాపులు పడి పేపర్ తెచ్చారు ..
అందరూ ఎంత టెన్షన్ పడుతున్నా హాయిగా నిద్రపోతున్న నాకు మాత్రం ఇవేమీ పట్టలేదు ... ముందుగా వాళ్ళే నా రిజల్ట్స్ చూసి నన్ను నిద్రలేపి చెప్పిన విషయం ఏమిటంటే నేను పాసయ్యానని .. నాకు ముందు నమ్మకం కలగలేదు పేపర్ లో నా నంబర్ చూసే దాకా ..ఒక్క లెక్కల్లోనే తక్కువ మార్కులు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ మంచి మార్కులతో పాసయ్యాను ..
తల్లీ నీ పరీక్షలాగా లేదమ్మా హాయిగా నిద్రపోయావు .. అసలు నిద్రెలా పట్టిందే నీకు .. అంటే నేను నిద్రపోకపోతే మాత్రం జరగాల్సిందే జరుగుతుంది కదా .. అనుకున్నాను మనసులో :) ... ఇంక నేను పాస్ అయినందుకు మా అమ్మా,నాన్న స్వీట్స్ పంచటం, భోజనాలు పెట్టటం ... పదికే ఇంత హడావుడా అని కొందరు నవ్వుకోవటం .. ఇవన్నీ ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది కానీ అప్పుడు అనుభవించిన టెన్షన్ , సంతోషం,మన అనుకున్న వాళ్ళందరూ మన బాధలో, సంతోషం లో తోడుండటం ఇవన్నీ నిజంగా మరిచిపోలేని గొప్ప జ్ఞాపకాలు కదా అనిపిస్తాయి ..
ఎంతైనా
జ్ఞాపకాలే మైమరపు... జ్ఞాపకాలేమేల్కొలుపు..
జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు.
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
నేను...
6, మార్చి 2013, బుధవారం
ఆడించి అష్టా చెమ్మా ఓడిద్దామా...
అష్టా చెమ్మా వెనకటి రోజుల నుంచీ చాలా ఫేమస్ ఆట. అప్పట్లో ఇళ్ళల్లో ఆడవాళ్ళు, అరుగుల మీద చేరిన జనాలు ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ అష్టా చెమ్మా కి అభిమానులే. నా చిన్నప్పుడు పిన్ని వాళ్ళు , అమ్మ వాళ్ళు అష్టా చెమ్మాఆడుతుంటే చూడటం సరదాగా ఉండేది. అమ్మమ్మ వాళ్ళింట్లో ప్రత్యేకంగా ఈ ఆట కోసం ఒక బండని కేటాయించి దాని మీద అష్టా చెమ్మా గడులు చెక్కించారట మా తాతయ్య..
ఈ ఆట ఆడుతున్నప్పుడు పోటీ చూడాలి... అవసరమైన పందాలు వేసుకుని, గడులు దాటి పంట అవుతున్న వాళ్ళు సంతోషిస్తుంటే ఓడిపోయిన వాళ్లకి ఉక్రోషం తన్నుకుని వస్తుంది . ఒకళ్ళ మీద ఒకళ్ళకి పంతాలుకోపాలు పెరిగి పోతుంటాయి. కొట్టుకునేదాకా వచ్చేది వ్యవహారం. కొంత మంది ఎప్పుడు ఎంత పందెం కావాలో అంత అవసరమైన పందాలు వేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మాత్రం గెలవటం కష్టం. వీళ్ళని తొండి చేస్తున్నారు అని కూడా అనే వాళ్ళు .. ఇలా అన్ని పనులు, నిద్రాహారాలు మానుకుని మరీ ఈ ఆటలు ఆడేవాళ్ళు.
వెనకటి కాలమే కాదు మా రోజుల్లో కూడా చాక్ పీస్ తో అష్టా చెమ్మా గడులు గీసుకుని గవ్వలు, చింత పిక్కలతో అష్టా చెమ్మా ఆడుకునే వాళ్లము. సమ్మర్ హాలిడేస్ లో వూరి నుండి వచ్చే పెద్దమ్మ కూతురు,మా పెద్దక్క సంధ్య ఈ ఆటలని ఆడించేది. తనకేమో పల్లెటూర్లో ఈ ఆటలు ఆడటం,గవ్వల్ని,చింత పిక్కల్ని ఎలా పట్టుకుంటే ఎంత పందాలు పడతాయి అన్న విషయాల్లో బాగా అనుభవం ఉంది.. మాకు కొత్తగా నేర్చుకున్న సరదానే కానీ టాలెంట్ లేదు ... ఇంకేముంది అది వరసగా అన్ని ఆటలు గెలిచేది .. మమ్మల్ని ఓడించిందన్న ఉక్రోషం తో ఒక్కోసారి మా చేతిలో దెబ్బలు కూడా తినేది పాపం ..
ఐతే ఈ అష్టా చమ్మా, పాము పటం ( Snakes and Ladders ), పచ్చీస్ ఇలాంటి ఆటలు ఇంట్లో ఆడకూడదు మంచిది కాదు అని ఆడనిచ్చే వాళ్ళు కాదు పెద్దవాళ్ళు.. రాను రాను ఈ ఆటలన్నీ మూలన పడ్డాయి దాదాపు మర్చిపొయ్యాము కూడా. మా ఇంట్లో ఇప్పటికీ గవ్వలు,ఆటలో పెట్టే పిన్స్ అన్నీ కలెక్షన్ లలో మిగిలి ఉన్నాయి.. ఇప్పుడు వాటితో ఆడాలన్న తీరికా లేదు, కోరికా లేదు..
ఆటలు,పాటలు, చదువులు అన్నీ నెట్ ప్రపంచంలోనే అయిపోయిన ఈ రోజుల్లో నలుగురితో కలిసి కూర్చుని చేసే పనులు చేయటం కుదరదు కదా అందుకే మన పక్కన ఉన్న మన మనుషుల్ని వదిలేసి ఎక్కడో పక్క దేశం లో ఉన్నవాళ్ళని ఆడించి వాళ్ళని ఓడించాలని నిర్ణయించుకున్నాను.
"king.com" ఈ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనతో పాటు మెంబర్స్ అయిన అన్ని దేశాల వాళ్ళతో ఆడి వాళ్ళని ఓడించవచ్చు.. కంప్యూటర్ గేమ్స్ ఆడటం నాకు చాలా ఇష్టమైన హాబీ ఈ సైట్ లో " Ludo " లేదా " పచ్చిస్ " నాకు నచ్చిన ఆట .. ఈ ఆట నలుగురితో కలిసి ఆడాలి.. ఇక్కడ కూడా మన వాళ్ళ లాగానే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ భాషల్లో తిడుతూనో , పొగుడుతూనో కామెంట్స్ ఇస్తుంటారు .. అలాగే నేను కూడా :-).. ఈ ఆట ఆడుతుంటే నాకు చిన్నప్పటి మా అష్టా చెమ్మా పోటీలు గుర్తుకొస్తాయి... కలర్ ఫుల్ గా,సరదాగా ఉండే ఈ Ludo చాలా బాగుంటుంది.
ఒక్క Ludo మాత్రమె కాదు చాలా రకాల స్ట్రాటజీ, పజిల్ ,అన్ని రకాల గేమ్స్
చాలా బాగుంటాయి...
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు
23, జనవరి 2013, బుధవారం
కొత్త సంవత్సరం లో కొత్త కొత్తగా ...
కొత్త సంవత్సరం కొత్త కొత్తగా ...వచ్చేసింది చిన్న చిన్నగా పాతపడిపోతుంది కూడా.. కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా ఎప్పుడూ ప్రత్యేకమే, ప్రతిసారీ పండగే. పాత సంవత్సరం వెళ్ళిపోతూ, కొత్త సంవత్సరం వస్తుంది అనగానే ఎంతో ఉత్సాహం, ఎన్నో వేడుకలు ... కొత్త సంవత్సర సంబరాల్లో నాకు బాగా నచ్చేవిషయం రాబోయే సంవత్సరం మంచి చేయాలని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవటం, మనకు,మన వాళ్లకు ఈ సంవత్సరం ఆనందంగా,శుభంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం చాలా బావుంటుంది. ఒక గతం గడిచిపోయింది, అది కలిగించిన బాధలను, ధుఃఖాలను ఇక్కడే మర్చిపోయి, కొత్త తలపులతో, సరికొత్త ఆశలతో అందమైన భవిష్యత్తు కోసం నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించాం ...
కొత్తసంవత్సరం లో నాకు ఎక్కువగా నచ్చేది కొత్త డైరీలు,గ్రీటింగులు మనం మన వాళ్లకి ఇచ్చినా,మనవాళ్ళ నుండి మనం అందుకున్నా చాలా సంతోషంగా అనిపించే వాటిలో ఈ డైరీలు,గ్రీటింగులు ఫస్ట్ ప్లేస్ లో వుంటాయి.న్యూ ఇయర్ వస్తుందనగానే షాపింగ్ లిస్టులోకి ఈ డైరీలు కూడా చేరిపోతాయి. నాకు మాత్రం ప్రతి సంవత్సరం మా తమ్ముడు ఇచ్చే డైరీ,కొత్త పెన్ తోనే సంవత్సరం మొదలవుతుంది.. ఆస్వాదించిన అనుభూతులను, బాధపెట్టిన చేదు జ్ఞాపకాలను, గడిచిపోయిన కాలాన్ని పదిలంగా దాస్తూ ,రాబోయే కాలానికి ఆహ్వానంగా మంచి డైరీని అందుకోవటం సంతోషంగా అనిపిస్తుంది.కొత్త డైరీ చూడగానే చిన్నప్పుడు స్కూల్ రీఓపెన్ కాగానే కొత్తపుస్తకాలు కొనుక్కుని,జాగ్రత్తగా అట్టలు వేసుకుని, కొన్నాళ్ళ పాటు భద్రంగా దాచుకునే రోజులు గుర్తొస్తాయి.
ఇంకా కొత్త సంవత్సరంలో కొత్తగా ఇంట్లో చేరేవాటిలో కేలండర్లు కూడా ముఖ్యమైనవే..ఏ షాప్ కి వెళ్ళినా వాళ్ళ షాప్ పేరుతో ప్రింట్ చేయించి ఇచ్చే కాలెండర్లు,అలాగే ఈనాడు,సాక్షి,స్వాతి వాళ్ళు ఇచ్చే కాలెండర్లు ఇంట్లో ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి.ఒకప్పుడైతే కేలండర్లను గోడలకు తగిలించే వాళ్ళు కానీ ఇప్పుడలా కాదు..అవసరమైనప్పుడు తిథిలు, ముహూర్తాలు, పంచాంగం చూడటం కోసం బుక్ రాక్ లో నుండి వెతికి తెచ్చుకోవటమే..
ఇలా కొత్త సంవత్సరంతో పాటూ చాలా కొత్త కొత్త వస్తువులు,విషయాలు జీవితంలోకి చేరుతుంటాయి.. కాలంతో పాటూ పాతపడుతుంటాయి..ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త వస్తువులు,కొత్త పనులు,కొత్త బంధాలు,బాధ్యతలు కొత్త సంతోషాలు,కొత్త సమస్యలు,సవాళ్లు ఇలా జీవితం కొత్త కొత్తగా సాగిపోతుంది...
ఈ సంవత్సరం నా చిన్నిప్రపంచంలో నాకు నచ్చిన కొన్ని కొత్త విశేషాలు...
ఈ కొత్త సంవత్సరం లో సంక్రాంతి అయిపోగానే శ్రీశైలం వెళ్ళటం చాలా సంతోషంగా అనిపించింది. శ్రీశైలం వెళ్ళగానే సాయంత్రం దర్శనం, ఉదయం పూజలు అన్నీ బాగా జరిగాయి.
శ్రీశైలం లో స్వామివారికి,అమ్మవారికి చేయించిన
అభిషేకం,కుంకుమ పూజ ప్రసాదాలు..
అక్షరాలై నిలవబోయే అనుభవాలు
కొత్త డైరీలు
కాలప్రవాహంలో రోజుల్ని దాటుకుంటూ
ముందుకు సాగిపోయే కాలెండర్లు
శ్రీశైలం శిఖరం దగ్గర ఉండే "రాజా షాపింగ్ సెంటర్" మాకు చాలా నచ్చే షాప్.ఇక్కడ అన్ని రకాల హెర్బల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. పెర్ఫ్యూమ్స్,సోప్స్ ,బ్యూటీ ప్రొడక్ట్స్,మంచి మ్యూజిక్ కలెక్షన్ సి డి లు,పిల్లల ఇంపోర్టెడ్ ఆట వస్తువులు ఇలా ఇక్కడ షాపింగ్ మాకు చాలా ఇష్టం, ఈసారి తీసుకున్న వాటిలో
వెరైటీ సోప్ బాక్స్ ల్లో ఉన్న బాత్ సోప్స్,
చామ్ రాజ్ టీ బాక్స్ కొత్తగా అనిపించాయి..
మా బృందావనం లో ఈ కొత్త సంవత్సరం కొత్తగా
పూచిన పువ్వులు,కాయలు..
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
నేను...,
మా ఇల్లు
7, ఏప్రిల్ 2012, శనివారం
ప్రయాణ సాధనములు ... వివిధ రకములు...!

ఒక పని లేని మధ్యాహ్నం నెట్ లో,బ్లాగుల్లో తిరిగీ తిరిగీ విసిగి పోయి,అలసి పోయి అలా చల్లగాలికి
కూర్చుందామని మా బాల్కనీలో కూర్చున్నాను..
అక్కడ కూర్చుని రోడ్డున వస్తున్న వివిధ రకాల వాహనాలను చూడగానే, ఒక ఆలోచన వచ్చింది.
అంతే... వెంటనే కెమేరా తెచ్చుకుని, వాళ్ళందరినీ నా కెమెరాలో,ఆ తర్వాత ఇప్పుడు
నా చిన్ని ప్రపంచంలో బంధించేస్తున్నాను..
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
నేను...,
మా ఇల్లు,
Something Special
4, డిసెంబర్ 2011, ఆదివారం
Thankyou ఫ్రెండ్స్ & ఫ్యామిలీ ...
అన్నట్లుగా జరిగింది నా పుట్టినరోజు..
ఉదయాన్నే కుటుంబ సభ్యులందరి శుభాభినందనలతో మొదలైన నా పుట్టినరోజు
రోజంతా బంధువులు,స్నేహితుల శుభాకాంక్షలతో, నా ప్రియమైన వాళ్ళందరి మధ్య
BirthDay సెలెబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషాన్ని కలిగించింది.
ముఖ్యంగా నా పుట్టినరోజుకి ప్రత్యేక అతిధులు మా చెల్లి,మరిది గారు లీవ్ లేకపోయినా
వీలు కల్పించుకుని వచ్చి నా పుట్టినరోజుని ఒక మరిచిపోలేని రోజుగా గుర్తుండిపోయేలా చేశారు..
జీవితంలో ఏమి సాధించినా, సాధించకపోయినా,సంపాదించినా,సంపాదించకపోయినా
"నిన్ను నిన్నుగా ప్రేమించుటకు,నీ కోసమే కన్నీరు నింపుటకు... నేనున్నానని నిండుగా పలికే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము" అన్న మాట ఎంతో నిజం కదా..
అలా నా జీవితంలో ప్రతి సుఖంలో,కష్టంలో,గెలుపు, ఓటముల్లో తోడుండే
నా చిన్నిప్రపంచం లో అతి ముఖ్య భాగమైన నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు..
With Love : Sister & Brother In Law



ఇంక ఈ సంవత్సరం నా పుట్టినరోజుని మరింత అద్భుతమైనదిగా మార్చింది
నా చిన్నిప్రపంచం,నా చిన్ని ప్రపంచంలో నా "బ్లాగ్ స్నేహితులు"...
నా చిన్నిప్రపంచం బ్లాగ్ లో ,నాకిష్టమైన పాటలు సరిగమలు...గలగలలు బ్లాగ్ లో పోస్ట్ చేస్తూ వున్నాను..
అప్పుడప్పుడు కొంతమంది బాగుందని కామెంట్స్ ఇచ్చేవారు.
నా బ్లాగ్ మొదలు పెట్టినప్పటి నుండి నాకు ఎక్కువ కామెంట్ ఇచ్చి,నన్ను ప్రోత్సహించే వాళ్ళు
''మనస్వి- జయ'' గారు, ''సాహితి - మాలా కుమార్'' గారు ... ఇద్దరు దాదాపు నేను పెట్టే ప్రతి టపాలో
వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేసే వారు..
తర్వాత ''వనజ వనమాలి'' గారు ఎక్కువగా నా చిన్నిప్రపంచానికి వచ్చేవారు,
నాభావాలను మెచ్చుకునే వారు..
ఇప్పుడు ''కడలి - సుభా గారు'' , ''నవరసజ్ఞ భరితం - రసజ్ఞ'' గారు,
"శర్కరి - జ్యోతిర్మయి"గారు, ''ఎందుకో?ఏమో!'' గారు నాచిన్ని ప్రపంచంలో కొత్త అతిధులు..
నా ప్రతి టపాలో వాళ్ళ అభిప్రాయాలను నాతో పంచుకునే స్నేహితులు..
నా పుట్టిన రోజుకి కూడా నేను బ్లాగ్ లో పోస్ట్ పెట్టాను..కానీ నేను ఊహించనంత అభిమానం
నా బ్లాగ్ మిత్రుల నుండి లభించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడూ కామెంట్ ఇవ్వని వాళ్ళు కూడా
నాకు BirthDay శుభాకాంక్షలు చెప్పి నాకు ఎంతో సంతోషాన్ని కలిగించారు..
పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటమే కాదు నాబ్లాగ్ గురించి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియచేశారు..
నా ఈ బ్లాగ్ మిత్రుల అభిమానం,శుభాభినందనలు
నా పుట్టిన రోజుని మరువలేని రోజుగా గుర్తుండిపోయేలా చేశాయి..
నా బ్లాగ్ ఫ్రెండ్స్ లో పెద్దల దీవెనలతో,స్నేహితుల శుభాకాంక్షలతో,అభినందనలతో...
నా ఫ్రెండ్ 'సుభా' గారి 'సుభా'కాంక్షలతో పాటు అందించిన దీవెనల చిరుకానుక తో నా పుట్టినరోజు మరపురానిది..మధురమైనది గా నిలిచిపోయింది..
అప్పుడప్పుడు కొంతమంది బాగుందని కామెంట్స్ ఇచ్చేవారు.
నా బ్లాగ్ మొదలు పెట్టినప్పటి నుండి నాకు ఎక్కువ కామెంట్ ఇచ్చి,నన్ను ప్రోత్సహించే వాళ్ళు
''మనస్వి- జయ'' గారు, ''సాహితి - మాలా కుమార్'' గారు ... ఇద్దరు దాదాపు నేను పెట్టే ప్రతి టపాలో
వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేసే వారు..
తర్వాత ''వనజ వనమాలి'' గారు ఎక్కువగా నా చిన్నిప్రపంచానికి వచ్చేవారు,
నాభావాలను మెచ్చుకునే వారు..
ఇప్పుడు ''కడలి - సుభా గారు'' , ''నవరసజ్ఞ భరితం - రసజ్ఞ'' గారు,
"శర్కరి - జ్యోతిర్మయి"గారు, ''ఎందుకో?ఏమో!'' గారు నాచిన్ని ప్రపంచంలో కొత్త అతిధులు..
నా ప్రతి టపాలో వాళ్ళ అభిప్రాయాలను నాతో పంచుకునే స్నేహితులు..
నా పుట్టిన రోజుకి కూడా నేను బ్లాగ్ లో పోస్ట్ పెట్టాను..కానీ నేను ఊహించనంత అభిమానం
నా బ్లాగ్ మిత్రుల నుండి లభించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడూ కామెంట్ ఇవ్వని వాళ్ళు కూడా
నాకు BirthDay శుభాకాంక్షలు చెప్పి నాకు ఎంతో సంతోషాన్ని కలిగించారు..
పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటమే కాదు నాబ్లాగ్ గురించి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలియచేశారు..
నా ఈ బ్లాగ్ మిత్రుల అభిమానం,శుభాభినందనలు
నా పుట్టిన రోజుని మరువలేని రోజుగా గుర్తుండిపోయేలా చేశాయి..
నా బ్లాగ్ ఫ్రెండ్స్ లో పెద్దల దీవెనలతో,స్నేహితుల శుభాకాంక్షలతో,అభినందనలతో...
నా ఫ్రెండ్ 'సుభా' గారి 'సుభా'కాంక్షలతో పాటు అందించిన దీవెనల చిరుకానుక తో నా పుట్టినరోజు మరపురానిది..మధురమైనది గా నిలిచిపోయింది..
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
నేను...
17, ఏప్రిల్ 2011, ఆదివారం
మల్లెపూలజడ
నిన్న నిదురించే తోటలోకి బ్లాగ్ లత గారు తన మల్లెపూలజడ తీపి గుర్తులను పోస్ట్ చేసారు.ఈ పోస్టింగ్ చూసిన వెంటనే
నాకు నా పూలజడ గుర్తుకు వచ్చింది.
వెంటనే అమ్మ నాకు చిన్నప్పుడు పూలజడతో తీయించిన ఫోటో వెతికేసి,ఇప్పుడు బ్లాగ్‌లో పెట్టేస్తున్నాను.
మా నాన్న వాళ్ళ వూరి దగ్గర మంచి మల్లె మొగ్గలు (అక్కడ మంచి పూలు దొరుకుతాయి ) ,కనకాంబరాలు తెప్పించి,ఇంటి దగ్గర పూలజడ వేసేవాళ్ళని ముందుగానే మా అత్తయ్య వాళ్ళ అమ్మాయితో మాట్లాడించి,మా పెద్దమ్మ కూతురు సంధ్యక్క ని తోడు తీసుకుని వెళ్లి ,సుమారు ఎంతసేపు పట్టిందో గుర్తులేదుకానీ కదలకుండా కూర్చోపెట్టి నాకు పూలజడ వేయించింది అమ్మ.
తర్వాత మా చెల్లికి కూడా పూలజడ వేయించాలని చాలా అనేది అమ్మ.. కానీ తనది U Cut Hairstyle కావటంతో అమ్మ కోరిక తీరలేదు.
తన నిశ్చితార్ధం రోజున కూడా వాళ్ళ అత్తగారు జడ వెయ్యమని ఎంత గొడవ చేసినా సవరం పెట్టినా అది నిలవకుండా పడిపోయింది పాపం...
అందుకే మాచెల్లి పెళ్లి ఎలాగూ సమ్మర్లో కాబట్టి మల్లెపూలజడ వేయించాలని తీవ్ర ప్రయత్నంలో ( జడ పెంచటానికి ) వున్నాము..తన పూలజడని కూడా త్వరలోనే నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను...
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
Summer Specials...
15, డిసెంబర్ 2010, బుధవారం
నా చిన్నారిస్నేహం...

నిన్న మాఇంటికి అనుకోని అతిధి వచ్చింది.తను నాచిన్నప్పటి ఫ్రెండ్ రాజేశ్వరి.St'anns girls high school లో నేను 6th class లో జాయిన్ అయినప్పటినుండి తను నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్.మా స్నేహం 6th నుండి 10th వరకు ఒకే స్కూల్లో ఎంతో సరదాగా వుండేది.10th తర్వాత నేను మా వూర్లో,తను తెనాలిలో ఇంటర్ జాయిన్ అయ్యాము అయినా కొన్నాళ్ళు మా friendship కంటిన్యూ అయ్యింది.వాళ్ళ ఫామిలీ గుంటూరు షిఫ్ట్ అవ్వటం,తనకి పెళ్లి కావటం,నేను లా లో జాయిన్ అవ్వటం వీటన్నిటి తర్వాత మా స్నేహానికి పూర్తిగా బ్రేక్ పడినట్లే అయింది.
మళ్ళీ ఇన్నాళ్ళకి మా అమ్మావాళ్ళింటికి నాకోసం వచ్చిన తనని చూసి నాకు చాలా సంతోషంగా,ఆశ్చర్యంగా కూడా అనిపించింది.తను మలేషియాలో ఉంటున్నానని ,ఒక పాప అని ప్రస్తుతం వాళ్ళ అమ్మ వాళ్ళింటికి గుంటూరు వచ్చానని,ఇంకా 3,4 నెలలు ఇండియాలోనే ఉంటానని చెప్పింది.కనీసం 10 సంవత్సరాలుగా ఫోనులో కూడా మాట్లాడుకోని మేమిద్దరం మాట్లాడుకోవటానికి చాలా విషయాలు వున్నా,తను వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళే పని ఉండటంతో మళ్ళీ కలుద్దామని అనుకున్నాము.సృష్టిలోమధురమైనది,జీవితంలో మరువలేనిది స్నేహం అని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుందేమో...
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
స్నేహం
9, మే 2010, ఆదివారం
అమ్మ అన్నది ఒక కమ్మని మాట

అమృతానికి అర్పణకీ ఆది పేరు అమ్మ
ఆలయాన ఆ దేవుని ప్రతిరూపం అమ్మ
ఇలలో స్వర్గాన్ని సృష్టించేది అమ్మ
ఈ లోకం గుడి చేరగ తొలి వాకిలి అమ్మ...
ఆలయాన ఆ దేవుని ప్రతిరూపం అమ్మ
ఇలలో స్వర్గాన్ని సృష్టించేది అమ్మ
ఈ లోకం గుడి చేరగ తొలి వాకిలి అమ్మ...
అమ్మ లేని ప్రపంచం లేదు.అలాగే నా చిన్ని ప్రపంచంలో నా బంధువు, నా స్నేహితురాలు,నా గురువు అన్నీ ముందుగా అమ్మే.
ఎప్పుడు నా వెంట వుంటూ ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అమ్మ
చిన్నప్పటినుండి నా డ్రెస్ డిజైనర్ కూడా అమ్మే.తనే సొంతగా నా డ్రెస్‌లు డిజైన్ చేసి కుట్టేది.
ఫాబ్రిక్ పైంట్ చేసేది.ఆ డ్రెస్ లు బాగున్నాయని నా ఫ్రెండ్స్ మెచ్చుకుంటే చాలా గర్వంగా వుండేది.
ఇది మా అమ్మ కుట్టింది అని గొప్పగా చెప్పేదాన్ని.
ప్రతి విషయంలో అమ్మ సలహా నాకు తప్పనిసరి.
మనం చేసినా చేయకపోయినా అన్ని పనులు నేర్చుకుని వదిలేయాలి అని చెప్పేది మా అమ్మ.
అప్పుడు అమ్మ అట్లా నేర్పింది కాబట్టే ఇప్పుడు నేను అన్ని పనులు ఎవరి సహాయం లేకపోయినా చేసుకోగలుగుతున్నాను అనుకుంటాను.
నా హాబీలలో మంచి పాటలు వినడం,పుస్తకాలు చదవటం,పూజలు చేసుకోవటం,
ఇల్లు అందంగా సర్దటం ఇలాంటివన్నీ అమ్మ నుండి నేను నేర్చుకున్నవే.
నాకు,మా తమ్ముడికి,చెల్లికి మీరు ఎప్పుడు ఒకరిని ఒకరు వదిలి పోకూడదు, కలిసి వుండాలి.
ఒకరి పై ఒకరు ప్రేమగా వుండాలి అని చెప్తూ వుంటుంది మా అమ్మ.
మా మధ్య వున్న ప్రేమాభిమానాలకు మూలం మా అమ్మ.
పిల్లల క్షేమాన్ని కోరుకుని వాళ్ళ అభివృద్ధికి పాటుపడే అమ్మ దీవెనే మనకి శ్రీరామరక్ష.
మన కోసం అహర్నిశలు శ్రమించే అమ్మకి మనం ఇచ్చే బహుమతి మన ప్రేమ ఒక్కటే.
మన అవసరాలను తీర్చి మనల్ని మనిషిగా తీర్చిదిద్దిన అమ్మకి ఆమె అవసరంలో మనం ఉన్నామన్న ధైర్యాన్ని కలిగించాలి.
నా కోసం నా పిల్లలు ఏదైనా చేయగలరు అని అమ్మ అనుకునేలా చేయగలగాలి.
చిన్నప్పుడు సలహాలుగా అనిపించిన అమ్మ మాటలు పెద్దయ్యాక చాదస్తంగా అనిపించకూడదు.
మన కోరికలు తీర్చిన అమ్మకి కూడా కోరికలు వుంటాయి వాటిని తీర్చాల్సిన బాధ్యత పిల్లలది.
మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న అమ్మని మనం కూడా అలాగే చూడాల్సి వచ్చిన రోజున అమ్మని నిర్లక్ష్యం చేయకపోవటం మనం అమ్మకి ఇచ్చే గొప్ప బహుమతి.
మా అమ్మ కోరికలను,ఆశయాలను తీర్చగలిగే శక్తిని,అమ్మని ఆనందంగా ఉండేలా చేయగలిగే పరిస్తితులను భగవంతుడు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ
అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నేను వర్షంలో తడిచి ఇంటికి వచ్చినప్పుడు
గొడుగు తీసుకుని వెళ్ళొచ్చు కదా అన్నాడు తమ్ముడు
వర్షం ఆగిన తర్వాత రావచ్చు కదా అని సలహా ఇచ్చింది చెల్లి
జలుబు చేస్తే గానీ అప్పుడు తెలుస్తుంది నీకు ఇది నాన్న బెదిరింపు
కానీ
నా తల తుడుస్తూ అమ్మ అంది ఈ వెధవ వర్షం ఇప్పుడే రావాలా
నువ్వు ఇంటికొచ్చేదాకా ఆగొచ్చు కదా... అని.
అమ్మ ప్రేమ అంటే ఇదే కదా..
అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు
లేబుళ్లు:
అమ్మ,
నేను-నా జ్ఞాపకాలు
14, ఏప్రిల్ 2010, బుధవారం
మావూరి తిరునాళ్ళ
చెన్నకేశవస్వామి,లక్ష్మీదేవి అమ్మవారు.
గుంటూరుజిల్లాలోని మాచెర్ల .
చరిత్రప్రసిద్ధి చెందిన మాచెర్ల పట్టణం నాగార్జునసాగర్ కి 28 km దూరంలో వుంది.
మా వూరిలో చెన్నకేశవస్వామి గుడి ప్రసిద్ధి చెందిన ఆలయం.
ఈ ఆలయం చంద్రవంక నదీపరివాహక ప్రాంతంలో వుంది.
ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఘనంగా జరుగుతాయి.
చైత్ర పౌర్ణమినాడు స్వామివారి కల్యాణం జరుగుతుంది.
చెన్నకేశవస్వామి రధోత్సవం ఎంతో కన్నులపండుగగా వుంటుంది.
రధోత్సవం రోజు ఇక్కడికి చాలామంది భక్తులు,యాత్రికులు వస్తారు.
చిన్నప్పుడు మా అమ్మమ్మ పిల్లలందరినీ రధం చూడటానికి తీసుకు వెళ్ళేది.
రధోత్సవం టైములో ఇసుకవేస్తే రాలనంత జనం వుండేవాళ్ళు.
ఆడవాళ్ళు అందరు అక్కడదగ్గరలో వున్న డాబాలు,మిద్దెలు ఎక్కి, ఎండని కూడా లెక్క చేయకుండా రధం కోసం ఎదురు చూసే వాళ్ళు.
మా అమ్మమ్మ కూడా మమ్మల్ని తీసుకుని వెళ్లి తెలిసిన వాళ్ళ ఇంటి మీద ఎక్కించేది రధం చూడ్డానికి.
దేవుడి రధం మాట ఎలా వున్నా అక్కడ ఎండకి ,దాహానికి మాకు దేవుడు అక్కడే కనిపించేవాడు.
రధం అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ తిరునాళ్ళ కొట్లు ఉండేవి.
చిన్నప్పుడు దేవుడిదర్శనం కంటే తిరునాళ్ళలో షాపింగ్ చేయటం మాకు చాలా సంతోషం కలిగించే విషయం.
నాన్న మమ్మల్ని రధోత్సవం అయిపోయిన రెండు రోజుల తర్వాత గుడికి (షాపింగ్ ) తీసుకుని వెళ్ళేవాడు.
దేవుడి దర్శనం కాగానే బయటకు వచ్చి అవసరం వున్నా లేకపోయినా తమ్ముడు,చెల్లి, నేను పోటి పడి ఏవేవో కొనుక్కునే వాళ్లము.
తిరునాళ్ళ స్పెషల్ పంచదారబెండ్లు,చిలకలు అంటే మా అమ్మకి చాలా ఇష్టం.నాన్న తిరునాళ్ళ జరిగినన్ని రోజులూ ఆ స్వీట్స్ తెచ్చేవాడు.
ఆ విధంగా మా చిన్ననాటి తిరునాళ్ళ ఒక మధుర జ్ఞాపకం.
ఇప్పుడు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఒక రోజు ఆనవాయితీగా గుడికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది మా తిరునాళ్ళ సరదా.
ఏది ఏమైనా కొన్ని సరదాలు,జ్ఞాపకాలు మాత్రం ఎన్నడూ మారవు,మర్చిపోలేము..
చెన్నకేశవస్వామి గుడి గాలిగోపురం.
ఆలయం లోపలి స్థంభాలపై శిల్పకళ.
చెన్నకేశవస్వామి గుడి,స్వామివారి రధం.
రాజి
లేబుళ్లు:
నేను-నా జ్ఞాపకాలు,
మావూరు














