పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

14, ఏప్రిల్ 2010, బుధవారం

మావూరి తిరునాళ్ళ


చెన్నకేశవస్వామి,లక్ష్మీదేవి అమ్మవారు.

గుంటూరుజిల్లాలోని మాచెర్ల .

చరిత్రప్రసిద్ధి చెందిన మాచెర్ల పట్టణం నాగార్జునసాగర్ కి 28 km దూరంలో వుంది.
మా వూరిలో చెన్నకేశవస్వామి గుడి ప్రసిద్ధి చెందిన ఆలయం.
ఈ ఆలయం చంద్రవంక నదీపరివాహక ప్రాంతంలో వుంది.

ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో ఘనంగా జరుగుతాయి.
చైత్ర పౌర్ణమినాడు స్వామివారి కల్యాణం జరుగుతుంది.
చెన్నకేశవస్వామి రధోత్సవం ఎంతో కన్నులపండుగగా వుంటుంది.
రధోత్సవం రోజు ఇక్కడికి చాలామంది భక్తులు,యాత్రికులు వస్తారు.

చిన్నప్పుడు మా అమ్మమ్మ పిల్లలందరినీ రధం చూడటానికి తీసుకు వెళ్ళేది.
రధోత్సవం టైములో ఇసుకవేస్తే రాలనంత జనం వుండేవాళ్ళు.
ఆడవాళ్ళు అందరు అక్కడదగ్గరలో వున్న డాబాలు,మిద్దెలు ఎక్కి, ఎండని కూడా లెక్క చేయకుండా రధం కోసం ఎదురు చూసే వాళ్ళు.

మా అమ్మమ్మ కూడా మమ్మల్ని తీసుకుని వెళ్లి తెలిసిన వాళ్ళ ఇంటి మీద ఎక్కించేది రధం చూడ్డానికి.
దేవుడి రధం మాట ఎలా వున్నా అక్కడ ఎండకి ,దాహానికి మాకు దేవుడు అక్కడే కనిపించేవాడు.
రధం అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ తిరునాళ్ళ కొట్లు ఉండేవి.

చిన్నప్పుడు దేవుడిదర్శనం కంటే తిరునాళ్ళలో షాపింగ్ చేయటం మాకు చాలా సంతోషం కలిగించే విషయం.
నాన్న మమ్మల్ని రధోత్సవం అయిపోయిన రెండు రోజుల తర్వాత గుడికి (షాపింగ్ ) తీసుకుని వెళ్ళేవాడు.
దేవుడి దర్శనం కాగానే బయటకు వచ్చి అవసరం వున్నా లేకపోయినా తమ్ముడు,చెల్లి, నేను పోటి పడి ఏవేవో కొనుక్కునే వాళ్లము.

తిరునాళ్ళ స్పెషల్ పంచదారబెండ్లు,చిలకలు అంటే మా అమ్మకి చాలా ఇష్టం.నాన్న తిరునాళ్ళ జరిగినన్ని రోజులూ ఆ స్వీట్స్ తెచ్చేవాడు.
ఆ విధంగా మా చిన్ననాటి తిరునాళ్ళ ఒక మధుర జ్ఞాపకం.

ఇప్పుడు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఒక రోజు ఆనవాయితీగా గుడికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది మా తిరునాళ్ళ సరదా.
ఏది ఏమైనా కొన్ని సరదాలు,జ్ఞాపకాలు మాత్రం ఎన్నడూ మారవు,మర్చిపోలేము..


చెన్నకేశవస్వామి గుడి గాలిగోపురం.



ఆలయం లోపలి స్థంభాలపై శిల్పకళ.



చెన్నకేశవస్వామి గుడి,స్వామివారి రధం.

రాజి
Related Posts Plugin for WordPress, Blogger...