"నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధపెట్టలేరు" అంటారు మహాత్మా గాంధీ..
ఎదుటి వ్యక్తి ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు అదే పనిగా మనం బాధపడుతున్నామంటే
మన మీద మనకు విశ్వాసం లేనట్లే..
సమాజం తమను గుర్తించాల్సినంతగా గుర్తించటం లేదన్న అసంతృప్తి చాలా మందిలో వుంటుంది.
సమాజం మనల్ని గుర్తించటానికి మనం మరింత ఎదగాలేమో,మనదైన రంగంలో
ఇంకా పరిపూర్ణత సాధించాలేమో అని ఎందుకు అనుకోకూడదు?
ఇతరుల్ని చూసి అసూయ పడుతున్నామంటే,మనలో లేని గొప్ప లక్షణాలేవో వాళ్ళలో ఉన్నట్లే కదా!
అవేమిటో తెలుసుకుంటే విజయం మనకు సొంతమైనట్లే.
ఒకసారి బుద్ధుడు తన ప్రియ శిష్యుడైన ఆనందుడిని వెంట పెట్టుకుని భిక్షాటనకి వెళ్ళాడు.
ఓ ఇంటి ముందు నిలబడి భిక్షాం దేహి అని అర్ధించాడు.ఆ ఇంటి ఇల్లాలు కోపంగా ఉన్నట్లుంది.
'అడుక్కు తినటానికి సిగ్గుగా లేదూ కష్టపడి పని చేసుకోవచ్చుగా'అని తిట్టిపోసింది.
బుద్ధుడు మౌనంగా ముందుకెళ్ళాడు.గురువుగార్ని అంతమాట అన్నందుకు,ఆనందుడు చాలా బాధపడ్డాడు.
ఇద్దరూ ఆరామానికి బయలుదేరారు.తన చేతిలోని భిక్ష పాత్రను శిష్యుడి చేతికి ఇచ్చాడు బుద్ధుడు.
కొంత దూరం వెళ్ళాక 'ఈ పాత్ర ఎవరిది' అనడిగాడు 'మీదే గురువు గారూ' అని చెప్పాడు ఆనందుడు.
'నీకే ఇచ్చేస్తున్నా తీసుకో' అని చెప్పాడు.
బుద్ధుడు ఇంకాస్త దూరం వెళ్ళాక 'ఆ పాత్ర ఎవరిది?' అని మరోసారి అడిగాడు .
నాదే గురువు గారూ అన్నాడు ఆనందుడు.
బుద్ధుడు చిరునవ్వు నవ్వి 'చూశావా? ఇదే ప్రశ్న మొదటి సారి అడిగినప్పుడు నాదన్నావు.
రెండోసారి అడిగితే నీదన్నావు.ఏదైనా సరే ఇది నాది అని ఆమోదించాకే నీదవుతుంది.
ఆ ఇల్లాలి తిట్టు కూడా అంతే!మనం వాటిని స్వీకరించకపోతే బాధ పడాల్సిన అవసరమే వుండదు'
అని వివరంగా చెప్పాడు బుద్ధుడు.
నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనల్లో మనం దేనికి స్పందించాలి,దేనిని మనకు సంబంధం లేనిదిగా వదిలెయ్యాలి అన్న విషయాల్లో స్పష్టత వుంటే మన మానసిక ప్రశాంతతను మన నుండి ఎవరూ దూరం చేయలేరు..
ఎవరి మాటల, చేతల ప్రభావం మన జీవితాన్ని నిర్దేశించలేదు.