పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
పురాణాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పురాణాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, అక్టోబర్ 2015, శుక్రవారం

కౌశికుడు -- కొంగ శాపం




కొంతమందికి తమ శక్తుల మీద,తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉంటుంది.ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అది మితిమీరి అహంకారం కాకూడదు.నేనే ఈ లోకంలో మంచివాడిని,లేదా గొప్పవాడిని అనుకుని,తమ శక్తి సామర్ధ్యాలతో  ఎదుటివాళ్ళని నాశనం చేయగలం అనుకునే మనుషులకి పరాభవం తప్పదు.. చిన్నప్పుడు మా అమ్మమ్మ ప్రతి విషయానికి తనకి తెలిసిన పురాణాలు,అప్పటిరోజుల్లో సామెతలు ఉదాహరణలుగా కలిపి చెప్తూ ఉండేది.అహంకారుల గురించి,తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకునే వాళ్ళ గురించి మా అమ్మమ్మ చెప్పిన ఒక కధ..  ఎవరైనా కోపంగా తిట్టటమో,శాపనార్ధాలు పెట్టటమో చేస్తే నేనేమీ అడవిలో కొంగని కాదు నీ శాపాలకి మాడిపోవటానికి అంటుంటారు.అలా కొంగ జపం లాగానే ఈ కొంగ శాపం కధ కూడా ఫేమస్ అన్నమాట. 

పూర్వం ఒక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు అడవిలో చెట్టునీడన కూర్చుని తపస్సు చేస్తున్నాడు.ఇంతలో చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుకున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” - వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అన్న సూక్తిని మరచి, ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూశాడు.అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ అక్కడికక్కడే క్రిందపడి చనిపోయింది.

తన తపశ్శక్తి కి తానే  ఆశర్యపోయిన కౌశికుడు మితిమీరిన గర్వంతో ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు.ఆ ఇంటి ఇల్లాలు బయటికి వచ్చి కౌశికుడిని చూసి భిక్ష తెస్తాను వేచి ఉండమని చెప్పి ఇంట్లోకి వెళ్ళి రాలేదు.ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చి,తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పి “స్వామీ!మిమ్మల్ని చాలా సేపు ఎదురుచూసేలా చేశాను నన్ను క్షమించండి”  అన్నది. 

కౌశికుడు మండిపడ్డాడు.“ఇది క్షమించరాని నేరం” నాలాంటి తపశ్శక్తి సంపన్నుడిని ఇలా అవమానిస్తావా?నేనేమైనా సాధారణ భిక్షగాడిననుకున్నావా?నా శక్తి ఏమిటో నీకు తెలియదు అంటూ ఆమె వైపు కోపంగా చూశాడు.ఆమె కొంగలా మాడిపోలేదు.నేను కోపంగా చూసినా ఎంతకీ ఆమె కొంగలా మలమల మాడిపోలేదే అనుకుంటున్న కౌశికుడిని చూస్తూ ... ఆ ఇల్లాలు అన్నది “స్వామీ! అనవసరంగా కోపం తెచ్చుకోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. అయినా నేను అడవిలో కొంగను కాను మీ తీక్షణ  దృష్టికి మాడిపోవటానికి”. ఆమె అలా అనగానే కౌశికుడు దిగ్భ్రాంతి చెందాడు. ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరగిన వృత్తాంతం ఈమెకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయి,ఆమె పతివ్రతా శక్తిని చూచి నివ్వెర పోయాడు. 

అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు.మీరు తపశ్శక్తి సంపన్నులే కానీ మీ తపశ్శక్తిని నిష్కామ హృదయంతో ధర్మం కోసం కాకుండా  క్షణికమైన ఆవేశంలో మీ స్వార్ధానికి ఉపయోగించి,అల్పజీవిమీద మీ ప్రతాపం చూపారు.మీరెక్కడో అడవిలో కొంగని శపించటం నాకెలా తెలిసిందంటే ఎవరైతే స్వధర్మాన్ని పాటిస్తూ,ఎవరు చేయాల్సిన పనులను వారు సక్రమంగా,సద్భుద్ధితో నిర్వర్తిస్తారో వారు వేదాంత తత్త్వజ్ఞానంతో,అధ్యయనంతో, తపస్సుతో, పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని పొందగలరు అలాగే నేను కూడా.. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః - ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు కదా. అని చెప్పింది.

ఇదీ కౌశికుడి కధ.. దేవుడికి ఒకరోజు ఉపవాసం ఉండి పూజ చేసి,ఏదైనా మనం అనుకున్న పని కాగానే ఆహా నేను ఏది అడిగితే అది దేవుడు చేసేస్తాడు,నా శక్తికి నా శత్రువులు భయపడిపోవాలి,నాకే దేవుడున్నాడు అనుకుని భస్మాసురుడిలాగా భగవంతుడు ఇచ్చిన వరాన్ని ఇతరుల నాశనం కోసం ఉపయోగించే వాళ్ళు ఆరోజుల్లోనే కాదు ఇప్పడూ ఉన్నారు.ఎప్పటికీ ఉంటారు కూడా.ఎంత జ్ఞానం ఉన్నా,తపశ్శక్తి సంపన్నులైనా ధర్మో రక్షతి రక్షితః అని చాటిచెప్పి,తమ శక్తిని,జ్ఞానాన్ని సమాజాన్ని ఉద్ధరించటానికి నిస్వార్ధంగా ఉపయోగించిన ఎందరో మహానుభావులను గుర్తుచేసుకుంటే అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న సామెత గుర్తొస్తుంది.



    23, డిసెంబర్ 2012, ఆదివారం

    పదకవితా పితామహుడు - అన్నమయ్య






    అన్నమయ్య - తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు .వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం.అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణపధంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి.. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి.

    అన్నమయ్య మనుమడు "తాళ్ళపాక చిన్నన్న"  "అన్నమాచార్య చరితము" అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు..అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు
    ఈ రచనే ఆధారం.

    "తెలుగు పదానికి జన్మదినం - అన్నమయ్య జననం"
    సంతానం లేని అన్నమయ్య తల్లిదండ్రులు వెంకటేశ్వరస్వామికి మొక్కుకుని,తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని అన్నమయ్య జన్మగాధ..

    తన 8వ ఏట ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుతుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోతున్న ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది.
    "వేడుకుందామా  వేంకటగిరి వేంకటేశ్వరుని
    అని  కీర్తిస్తూ  యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య..తిరుమల కొండను  సందర్శించి పరవశం తో
    "అదివో అల్లదివో శ్రీ హరివాసము" 
    అంటూ  తిరుమల గిరులను  స్తుతించి,గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ,

    "అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల"
    అని వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే  జీవితం గడపసాగాడు అన్నమయ్య.. అన్నమయ్య చెప్పిన కీర్తనలను ఆయన శిష్యులు గానం చేస్తూ తాళపత్రాలలో భద్రపరచేవారట ..

    అంటూ  లక్ష్మీదేవిని, 
    "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు" అని అలమేలుమంగను 
    "పలుకు తేనెల తల్లి  పవళించెను" అంటూ పద్మావతీదేవిని
    కీర్తించే అన్నమయ్య కీర్తనలను వినటం అమ్మవారికి కూడా చాలా ఇష్టమట. 

    అంటూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్వామిని కీర్తించాడు అన్నమయ్య.ఇప్పటికీ బ్రహ్మోత్సవం అంటే అందరికీ గుర్తొచ్చే పాట ఇది.
    అంటూ మనుషులందరూ పరబ్రహ్మ స్వరూపమే అని, కులమతాల వివక్షను తొలగించే ప్రయత్నం చేశాడు.

     విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు. అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో ప్రసిద్ధమయ్యింది. 

    "ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను" 
    అంటూ అన్నమయ్య స్వామివారి శృంగారాన్ని  గురించి పాడిన పాటను విన్న  నరసింగరాయలు తరువాతి కాలంలో  అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట..రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు.

    "దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివే"
    "అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితినీ"
    అని స్వామివారిలో ఐక్యం అయ్యాడు అన్నమయ్య..

    అన్నమయ్య శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీర్తనా చార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు
      
    అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అన్నమయ్య  కీర్తనలు ఆ దేవ దేవునికే కాదు ఆబాల గోపాలానికి అన్నమయ్య పాటలు ప్రియమైనవే ...అందుకే కదా ప్రతి తెలుగుతల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ,గోరుముద్దలు తినిపిస్తూ...
    "చందమామ రావో జాబిల్లి రావో"
    అంటూ  పాడుతూంది..
    అంటూ జోలపాడి నిద్రపుచ్చుతుంది.

    ఇప్పటికీ తిరుమల గిరివాసుడు అన్నమయ్య మేలుకొలుపు వింటూ నిదురలేచి,జోలపాట వింటూ నిద్రపోతాడట.అన్నమయ్య పాట స్వామి  దైనందిన చర్యలో ఒక భాగమై నిలిచింది.నిధి కాదు హరిపద సన్నిధి చాలా సుఖమని నమ్మి నడచిన పరమభాగవతుడు అన్నమయ్య...అన్నమయ్య పదములు వినగలిగిన మనమూ ధన్యులమే 

     

    ఇందరికి అభయమ్ము లిచ్చు చేయి..



      ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగంటే అన్నమయ్య పాట అనిపించుకున్నతెలుగు పదకవితా పితామహుడు 
    శ్రీ తాళ్ళపాక  అన్నమాచార్యులకు వందనములతో.


     

    19, నవంబర్ 2011, శనివారం

    బాపుబొమ్మల హరివిల్లు - గజేంద్రమోక్షం

    మనుషులు ఎన్ని కష్టాలు వచ్చినా తమకు తాము పరిష్కరించుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు
    ఆ ప్రయత్నంలో గెలిచినప్పుడు కొన్నిసార్లు సమస్యను మనమే తీర్చుకున్నాము అనుకుంటాం..
    మరికొన్నిసార్లు దేవుడా నాకు ఈ కష్టాన్ని తీర్చు అని భగవంతుడిని ప్రార్దిస్తాం.
    మనం అడిగినా అడగక పోయినా మన ప్రతి కష్టంలోనూ ఆ సర్వాంతర్యామి తోడుంటాడు..
    క్షణమైనా మన సమస్య తీర్చి,మనల్ని కాపాడటానికి తోడుండే ఒకే ఒక్క ఆప్తుడు భగవంతుడు.
    ఆపదలో వున్న తన భక్తులను కాపాడటానికి తను ఎలాంటి పరిస్థితిలో వున్నా లెక్క చేయక,
    తన భక్తుడుని కాపాడటమే కర్తవ్యంగా పరుగు పరుగున శ్రీ మహాలక్ష్మితో సహా వచ్చే శ్రీ మహా విష్ణువు
    వర్ణన తో కూడిన గజేంద్రమోక్షం అద్భుతంగా వుంటుంది.

    ఎంతో అద్భతంగా పోతన రచించిన ఈ గజేంద్రమోక్షం మరెంతో అద్భుతంగా తన చిత్రాలతో వర్ణించారు బాపు.
    బాపు బొమ్మల హరివిల్లు పుస్తకంలో గజేంద్ర మోక్షం చిత్రాలు చాలా బాగున్నాయి
    వాటితో కలిపి పోతన భాగవతంలోని గజేంద్ర మోక్షంలో నాకు నచ్చిన,మా అమ్మమ్మ చిన్నప్పుడు
    మాకు నేర్పిన కొన్నిపద్యాలు తాత్పర్యాలతో



    బాపు బొమ్మల హరివిల్లు - గజేంద్రమోక్షం
    పోతన భాగవతం - గజేంద్ర మోక్షం


    సరసిలోనుండి పొడగని సంభ్రమించి
    యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
    భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది
    నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసిపట్టె.

    గజేంద్రుడు తన ప్రియసఖులతో కలిసి ఒక కొలనులో జలకమాడుతుండగా
    కొలనులోని ఒకమొసలి కొలనునుండి బయటికి వచ్చి
    ఊపిరి బిగియపట్టి రొప్పుతూ గజేంద్రుని చెంతచేరి
    రాహువు సూర్యుని మ్రింగుటకై పట్టినట్లుగా
    గజేంద్రుని కాలు గట్టిగా పట్టుకునెను.

    ఏనుగును బంధించుటకు మొసలి, మొసలి పట్టు నుండి తప్పుకొవటానికి ఏనుగు
    ఒకదానినొకటి
    బలంగా లాగుకొనుచుండగా
    నీటిలోపలి మొసళ్ళు ఏనుగు కంటే మొసలి బలమైనదని,
    బయటి ఏనుగులు మొసలి కంటే ఏనుగు బలమైనదని అనుకున్నాయి..
    మొసలి ఎంతో పట్టుదలతో ఏనుగును వదలకుండా పట్టుకుంది.
    గజేంద్రుడు మొసలి పట్టుకున్న తన కాలును విడిపించుకోలేక ఎంతో దిగులు పడుతూ

    ఏ విధముగా నేను దీనిని జయించగలను? ఏ దేవుని ధ్యానించాలి?
    ఎవరిని నాకు తోడుగా పిలవాలి?ఈ మొసలిని అడ్డగించే వారేవ్వరున్నారు?
    దిక్కు లేని నా దీన ధ్వనిని విని నన్ను కాపాడు పరోపకారులగు పుణ్యాత్ములకు
    నే మ్రొక్కెదను వారు నన్ను రక్షించెదరు..
    అని పరి పరి విధములుగా భగవంతుని ప్రార్దిస్తున్నాడు గజేంద్రుడు

    ఎవ్వనిచే జనించు జగ; మెవ్వనిలోపల నుండు లీనమై;
    యెవ్వని యందుడిందుఁ; బర మేశ్వరుఁ డెవ్వడు; మూల కారణం
    బెవ్వఁడ నాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
    డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్.

    ఎవని వల్ల జగములు పుట్టి ,పెరిగి ,నశించుచున్నవో,
    ఎవ్వ
    డన్ని వస్తువులకు ప్రభువో,ఎవ్వడన్నిటికీ మూల కారణుడో,
    ఎవ్వనికి
    మొదలు నడుమ ఆఖరు అనునవి లేవో
    ఎవడు సర్వాత్మ స్వభావుడో అట్టి భగవంతుని నన్ను కాపాడమని వేడుచున్నాను..


    కలఁ డందురు దీనుల యెడఁ
    గలఁ డందురు పరమయోగి గణములపాలం
    గలఁ డందు రన్ని దిశలను
    గలఁడు కలం డనెడువాఁడు గలఁడో లేఁడో.

    దీనులు,యోగుల నందు ...అన్ని దిక్కుల్లోను
    భగవంతుడు
    నిండి ఉన్నాడని పెద్దలు చెప్తారు.
    అట్టి భగవంతుని ఎన్ని విధాలుగా ప్రార్దించినను రాకున్నాడు..
    ఉన్నాడన్న అట్టి భగవంతుడు వున్నాడా లేదా అని సందేహం కలుగుతుంది..


    లావొక్కింతయులేదు; ధైర్యము విలో; లంబయ్యె బ్రాణంబులున్;
    ఠావుల్దప్పెను; మూర్ఛవచ్చెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
    నీవే తప్ప నితఃపరంబెఱుగ మన్నింపందగున్ దీనునిన్
    రావే ఈశ్వర; కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా!

    ఈశ్వరా ఇంతవరకు మొసలితో పోరాడి నా బలమంతా తగ్గినది
    ఇంతవరకు నేను మకరమును జయిస్తాను అనుకున్నాను
    ధైర్యము పోయినది.. ప్రాణములు పైకెగిరి పోతున్నాయి.
    మైకము వస్తుంది దేహం అలసటగా వుంది
    ఈశ్వరా నీవు తప్ప వేరెవ్వరు తెలియదు.
    నేనిదివరకు ఎన్ని అపరాధములు చేసి వున్నను
    వానినెల్ల మన్నించి భగవంతుడా నా వద్దకు వచ్చి నన్ను కాపాడుము


    అలవైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు
    దా
    ,పల మందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలో
    త్పల పర్యంకరమావినోదియగు నా పన్న ప్రసన్నుండు
    వి
    హ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁ గుయ్యాలించి సంరంభియై.

    వైకుంఠపురంలోని ప్రధాన సౌధమునందు కల్పవృక్ష వనమందు,
    అమృత సరోవర తీరమున చంద్రకాంత మణులు,కలువ పూవులు పరచిన పాన్పునందు
    శ్రీ లక్ష్మీ దేవితో గూడ విహరించు చున్నవాడైన శ్రీ నారాయణుడు
    తన భక్తుడగు గజరాజు నొచ్చిన వాడై దేవా నన్ను కావుము
    అని ప్రార్ధించుచుండగా మొరలను విని తత్తరపాటున లేచి


    సిరికిం జెప్పఁడు; శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁడే
    పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణి
    కాం
    తర ధమ్మిల్లముఁ జక్కనొత్తఁడు వివాదప్రోత్థిత శ్రీకుచో
    పరిచేలాంచలమైన వీడఁడు గజ ప్రాణవనోత్సాహియై.

    విధంగా శ్రీ మన్నారాయణుడు తానూ భక్త పరాధీనుడు కనుక
    తన భక్తుడగు గజేంద్రుని ఆపద తీర్చుటకు బయలుదేరి, తొందరలో
    లక్ష్మీదేవికి చెప్పక,శంఖ చక్రములను ధరించక,భటులను కూడా తీసుకొని పోక,
    గరుడుని మీద ఎక్కక,జారిన జుట్టు ముడి వేసుకొనక,
    లక్ష్మీదేవితో అపుడు వాడులాడుచు వేడుకతో తాను పట్టిన లక్ష్మీదేవి పైట కొంగును కూడా వీడక,
    శ్రీదేవి పైటకొంగు నీడ్చుకునే బయలు దేరేను..


    తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్, దాని
    వెన్కను బక్షిమంద్రుఁడు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ
    క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు రా వచ్చి
    రొయ్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

    శ్రీమన్నారాయణుడు అట్లు తత్తరపడి పోవుటకు కారణము తెలుసుకొనుటకు
    లక్ష్మీదేవి అతనిని వెంబడించింది .. లక్ష్మి వెంట అంతఃపురాంగనలందరు,
    వారిని గరుత్మంతుడు వెంబడించెను. గరుత్మంతుడి వెనుక శంఖము,చక్రము
    మొదలగు ఆయుధములన్నీ వచ్చెను.వాటి వెంబడి నారదుడు విష్వక్సేనుడు వచ్చిరి.
    వారి వెంబడి వైకుంఠ పురము నందలి ఆబాలగోపాలము వచ్చిరి..


    రాక్షసులను సంహరించు వాడు,దయా సాగరుడు,యోగీంద్రుల హృదయములనందు
    నివసించు వాడు,భక్తులకు మహిమలను చూపు వాడు,ఆశ్రితులను మన్నించు వాడు,
    ఎల్లప్పుడూ పెళ్లి కూతురివలె శోభించు లక్ష్మీ దేవి పతియగు శ్రీ మహా విష్ణువు
    బాధలోనున్న ఆ గజేంద్రుని కష్టాన్ని చూసి ఆ మకరాన్ని ఖండించుటకు
    తన చక్రాయుధాన్ని పంపెను ..ఆ చక్రాయుధము పోయి ఎలా అయినా సరే గజేంద్రుని జయించి
    గెలుపొందాలన్న పట్టుదలతో వున్న మొసలి యొక్క శిరస్సు తుంచి దానిని సంహరించెను..

    ఆ మొసలి పట్టు నుండి తప్పుకున్న ఆ గజరాజును శ్రీ మహావిష్ణువు తన చేతి స్పర్శతో తాకి
    భయం పోగొట్టగానే రాహువుచే మింగబడి మరల విడువబడిన చంద్రుని వలె గజేంద్రుడు
    బడలిక
    విడచిన దేహముతో తన తోటి ఏనుగులతో చేరి విన సొంపుగా ఘీంకారము చేసినది..

    Related Posts Plugin for WordPress, Blogger...