పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, అక్టోబర్ 2015, శుక్రవారం

కౌశికుడు -- కొంగ శాపం




కొంతమందికి తమ శక్తుల మీద,తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉంటుంది.ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అది మితిమీరి అహంకారం కాకూడదు.నేనే ఈ లోకంలో మంచివాడిని,లేదా గొప్పవాడిని అనుకుని,తమ శక్తి సామర్ధ్యాలతో  ఎదుటివాళ్ళని నాశనం చేయగలం అనుకునే మనుషులకి పరాభవం తప్పదు.. చిన్నప్పుడు మా అమ్మమ్మ ప్రతి విషయానికి తనకి తెలిసిన పురాణాలు,అప్పటిరోజుల్లో సామెతలు ఉదాహరణలుగా కలిపి చెప్తూ ఉండేది.అహంకారుల గురించి,తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకునే వాళ్ళ గురించి మా అమ్మమ్మ చెప్పిన ఒక కధ..  ఎవరైనా కోపంగా తిట్టటమో,శాపనార్ధాలు పెట్టటమో చేస్తే నేనేమీ అడవిలో కొంగని కాదు నీ శాపాలకి మాడిపోవటానికి అంటుంటారు.అలా కొంగ జపం లాగానే ఈ కొంగ శాపం కధ కూడా ఫేమస్ అన్నమాట. 

పూర్వం ఒక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు అడవిలో చెట్టునీడన కూర్చుని తపస్సు చేస్తున్నాడు.ఇంతలో చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుకున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” - వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అన్న సూక్తిని మరచి, ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూశాడు.అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ అక్కడికక్కడే క్రిందపడి చనిపోయింది.

తన తపశ్శక్తి కి తానే  ఆశర్యపోయిన కౌశికుడు మితిమీరిన గర్వంతో ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు.ఆ ఇంటి ఇల్లాలు బయటికి వచ్చి కౌశికుడిని చూసి భిక్ష తెస్తాను వేచి ఉండమని చెప్పి ఇంట్లోకి వెళ్ళి రాలేదు.ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చి,తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పి “స్వామీ!మిమ్మల్ని చాలా సేపు ఎదురుచూసేలా చేశాను నన్ను క్షమించండి”  అన్నది. 

కౌశికుడు మండిపడ్డాడు.“ఇది క్షమించరాని నేరం” నాలాంటి తపశ్శక్తి సంపన్నుడిని ఇలా అవమానిస్తావా?నేనేమైనా సాధారణ భిక్షగాడిననుకున్నావా?నా శక్తి ఏమిటో నీకు తెలియదు అంటూ ఆమె వైపు కోపంగా చూశాడు.ఆమె కొంగలా మాడిపోలేదు.నేను కోపంగా చూసినా ఎంతకీ ఆమె కొంగలా మలమల మాడిపోలేదే అనుకుంటున్న కౌశికుడిని చూస్తూ ... ఆ ఇల్లాలు అన్నది “స్వామీ! అనవసరంగా కోపం తెచ్చుకోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. అయినా నేను అడవిలో కొంగను కాను మీ తీక్షణ  దృష్టికి మాడిపోవటానికి”. ఆమె అలా అనగానే కౌశికుడు దిగ్భ్రాంతి చెందాడు. ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరగిన వృత్తాంతం ఈమెకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయి,ఆమె పతివ్రతా శక్తిని చూచి నివ్వెర పోయాడు. 

అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు.మీరు తపశ్శక్తి సంపన్నులే కానీ మీ తపశ్శక్తిని నిష్కామ హృదయంతో ధర్మం కోసం కాకుండా  క్షణికమైన ఆవేశంలో మీ స్వార్ధానికి ఉపయోగించి,అల్పజీవిమీద మీ ప్రతాపం చూపారు.మీరెక్కడో అడవిలో కొంగని శపించటం నాకెలా తెలిసిందంటే ఎవరైతే స్వధర్మాన్ని పాటిస్తూ,ఎవరు చేయాల్సిన పనులను వారు సక్రమంగా,సద్భుద్ధితో నిర్వర్తిస్తారో వారు వేదాంత తత్త్వజ్ఞానంతో,అధ్యయనంతో, తపస్సుతో, పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని పొందగలరు అలాగే నేను కూడా.. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః - ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం పాటించడమే మేలు కదా. అని చెప్పింది.

ఇదీ కౌశికుడి కధ.. దేవుడికి ఒకరోజు ఉపవాసం ఉండి పూజ చేసి,ఏదైనా మనం అనుకున్న పని కాగానే ఆహా నేను ఏది అడిగితే అది దేవుడు చేసేస్తాడు,నా శక్తికి నా శత్రువులు భయపడిపోవాలి,నాకే దేవుడున్నాడు అనుకుని భస్మాసురుడిలాగా భగవంతుడు ఇచ్చిన వరాన్ని ఇతరుల నాశనం కోసం ఉపయోగించే వాళ్ళు ఆరోజుల్లోనే కాదు ఇప్పడూ ఉన్నారు.ఎప్పటికీ ఉంటారు కూడా.ఎంత జ్ఞానం ఉన్నా,తపశ్శక్తి సంపన్నులైనా ధర్మో రక్షతి రక్షితః అని చాటిచెప్పి,తమ శక్తిని,జ్ఞానాన్ని సమాజాన్ని ఉద్ధరించటానికి నిస్వార్ధంగా ఉపయోగించిన ఎందరో మహానుభావులను గుర్తుచేసుకుంటే అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్న సామెత గుర్తొస్తుంది.



    Related Posts Plugin for WordPress, Blogger...