ఏమి జరుగుతుందా అని చూసే లోపే అమ్మ ఏవేవో పెద్దగా అరుస్తూ బయటికి పరిగెత్తింది.మా కజిన్ ఒకబ్బాయిని ఇంట్లో ఉంచారు ఏవైనా పనులకి ఉపయోగపడతాడని.. ఆ అబ్బాయిని నాన్న కోసం పంపి నేను,చిన్నక్క అమ్మ వెంట పరిగెత్తాము.. అమ్మ సరాసరి మా ఇంటి దగ్గరలోని శివాలయం బావి దగ్గరికి వెళ్లి అందులోకి దూకాలని ప్రయత్నించేంతలో ఎలాగో అక్కడే కూర్చున్న కొంతమంది మగవాళ్ళు పట్టుకుని ఆపారు.ఆ రోజుల్లోమనుషులు ఇప్పటిలాగా ఎవరేమయితే మాకేంటిలే అన్నట్లు ఉండే వాళ్ళు కాదు కాబట్టి మా అమ్మకి హెల్ప్ చేశారు లేకపోతే ఏమయ్యేదో అని తలచుకుంటేనే భయం అవుతుంది..
కాసేపటికి నాన్న,అమ్మమ్మ,తాత అందరు వచ్చి అమ్మని ఇంటికి తీసుకెళ్ళారు. నాన్న,మా పెద్దవాళ్ళు అందరూ కూర్చుని చర్చించుకుంటున్నారు..ఏదో సీరియస్ విషయం అని అర్ధమవుతుంది.రాత్రికి భోజనం చేసి పడుకున్నాము.తెల్లారి మెలకువ వచ్చి చూస్తే అమ్మ కనపడలేదు.. నానమ్మని అడిగితే ఆస్పత్రికి పోయిందిలే మీ నాయన తీసుకెళ్ళాడు అంది.. సరేనని నేను స్కూల్ కి వెళ్లి వచ్చాను. సాయంత్రం అయినా అమ్మ,నాన్న ఇద్దరు రాలేదు.రాత్రికి నాన్న ఒక్కడే వచ్చాడు అమ్మ ఏదని అడిగితే మంచి ట్రీట్ మెంట్ కోసం అక్కడే ఉంచాము వస్తుంది అన్నాడు నాన్న ..
వారం అయినా అమ్మ రాలేదు.. అమ్మతో ఎక్కువసేపు ఇంట్లో ఉండేది నేనే కావటంతో అమ్మ లేని లోటు మాత్రం బాగా తెలుస్తుంది .. ఆ రోజు ఆదివారం ఏమీ తోచక అలా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్దామని వెళ్లాను. అమ్మమ్మకి ఇద్దరు ఆడపిల్లలే కావటంతో మా పెద్దన్నయ్యని కొడుకులాగా చూసుకునేది. ఎప్పటికైనా మా ఇల్లు,మా అమ్మమ్మ ఇల్లు ఈ రెండు ఇళ్ళకి ఏకైక మగదిక్కు మా అన్నయ్యే అని మా అమ్మమ్మ,తాత ల గట్టి నమ్మకం.. మా అన్నయ్య కూడా అప్పటికే బాధ్యతలన్నీ మీద వేసుకుని,పెద్దరికం వచ్చిన పెద్దమనిషి లాగానే ప్రవర్తించేవాడు. అమ్మమ్మ,తాత అన్ని విషయాలు అన్నతో చర్చించేవాళ్ళు.. అలా మా అన్న, పెద్దక్క అమ్మమ్మకి పెంపుడు పిల్లలు అయిపోయారు..
అమ్మమ్మ ఇంటికి వెళ్ళే సరికి అమ్మమ్మ మీ నాయన నా బిడ్డని వేధించి,వేధించి పిచ్చిదాన్ని చేసి,ఇప్పుడు తీస్కపోయి పిచ్చాసుపత్రిలో పడేసి వచ్చాడు .. అదేమని నేను గట్టిగా అడిగితే నలుగురిలో పెద్ద డాక్టరు.. అందరు తక్కువ చేస్తరని ఆగుతున్నా అంటూ అన్నతో చెప్తూ ఏడుస్తుంది.. అప్పుడు నాకు అర్ధం అయ్యింది అమ్మ పిచ్చి హాస్పిటల్ లో ఉందని . ఎందుకో బాధ అనిపించింది. అప్పుడెప్పుడో చూసిన "కృష్ణవేణి" సినిమా గుర్తొచ్చింది . అంటే అమ్మ కూడా ఆ సినిమాలో లాగా అన్నమాట .
వెంటనే పరిగెత్తుతూ ఇంటికి వచ్చి అమ్మమ్మ మాట్లాడిన విషయాలన్నీ నాన్నమ్మ కి చెప్పాను . అక్కడే ఉన్న నాన్న కూడా ఇవన్నీ విని ఆగ్రహంతో ఊగిపోయాడు. నేను వాళ్ళమ్మాయిని పిచ్చిదాన్ని చేశానా వాళ్ళే నాకు పిచ్చి దాన్ని కట్టబెట్టి .. అంటూ అమమ్మ ఇంటికి వెళ్లి చడమడా కడిగేశాడు.. అల్లుడ్ని చాటుగా విమర్శిస్తుంది కానీ ఎదురుగా గౌరవ మర్యాదలకు లోటు చేయని మా అమ్మమ్మ ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయి కళ్ళు తేలేసింది..
అసలిదంతా నాన్నకి ఎలా చేరిందని అలోచించి ఇదంతా ఇందాక వచ్చిన మాధవ్ నిర్వాకమన్నమాట అని"మాదవ్ ఎక్కడ,ఎప్పుడు ,ఎలా మాట్లాడాలో తెలియని అప్రయోజకుడు, లోక జ్ఞానం తెలియని అజ్ఞాని" అని అమ్మమ్మ, అన్న,ఇద్దరు అక్కలు నిర్ణయించేశారు ..మరి వాళ్ళు అప్పటికే అమ్మమ్మ మాటలు అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ మాటలు నాన్నమ్మ దగ్గర మాట్లాడుతూ చాలా తెలివిగల,పద్దతైన పిల్లలుగా పేరు తెచ్చుకున్నారు.
వయసొస్తే తెలివి అదే వస్తుందిలే అనుకున్నాను కానీ వయసుకి,తెలివికి సంబంధం లేదని అప్పుడు తెలుసుకోలేకపోయాను.అలా నా ముందు ఏమీ మాట్లాడకూడదు,ఏ విషయాలు చెప్పుకోకూడదు అని డిసైడ్ అయ్యి ఎప్పుడైనా నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా ఇదిగోయ్యా మాధవ్ ఈ రూపాయి తీస్కపోయి కొనుక్కో పో అని పంపేసేది మా అమ్మమ్మ .. మొదట్లో అర్ధం కాకపోయినా తర్వాత వాళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారని అర్ధం అయ్యి వాళ్ళింటికి వెళ్ళటం తగ్గించాను.
నాన్నమ్మ నాకు చక్కగా వండిపెట్టేది.. మా వూరి వైపు స్పెషల్ ఉగ్గాణి,మిర్చి బజ్జి, చిత్రాన్నం బాగా చేసేది. వడియాలు,అప్పడాలు ఒకేసారి వేయించి డబ్బాలో పెట్టి అప్పుడప్పుడు పెట్టేది. నాన్న నెలకోసారి అమ్మ దగ్గరికి మద్రాస్ దగ్గర వెల్లూర్ వెళ్లి వచ్చేవాడు.వస్తూ మా కోసం క్రీమ్ బిస్కెట్స్, ఇంకా ఏవో తెచ్చేవాడు. అంతదూరం అమ్మని పెట్టాల్సిన అవసరం ఏంటో నాకు అర్ధం కాలేదు. హాయిగా ఇంట్లోనే ఉంచి ట్రీట్ మెంట్ ఇప్పిచ్చొచ్చు కదా అనిపించేది...
మొత్తానికి సంవత్సరం తర్వాత అమ్మ ఇంటికి వచ్చింది . నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు ముందే మా పెద్దల నుండి వార్నింగ్ వచ్చింది అమ్మ దగ్గర అతివాగుడు ఏమీ వాగొద్దని.. పిచ్చి వాళ్ళంటే అందరినీ మీదపడి కొడతారు,ఇంట్లో వాళ్ళందరితో గొడవపడతారు, వస్తువులన్నీ పగలగొడతారు.అమ్మ ఇవన్నీ ఇంతకుముందు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తుందో ఏమో అని అప్పుడప్పుడు భయం వేసేది.. కానీ అమ్మ తర్వాత కూడా మామూలుగానే ఉండేది.
అసలే నిదానంగా ఉండే అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చాక ఏమి మాట్లాడితే మళ్ళీ పిచ్చి హాస్పిటల్ కి పంపుతారో అనే భయంతోనేమో మాట్లాడటం కూడా తగ్గించింది. నేను పెద్దయిన తర్వాత,మెడిసిన చేసిన తర్వాత నాకు అర్ధమయిన విషయం ఏంటంటే చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలనే మా వాళ్ళ అతి జాగ్రత్తతో ఏదో కొంచెం డిప్రెషన్ తో బాధపడుతున్న అమ్మని తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్ లో పడేసి వచ్చారని. ఇంకా మా అమ్మ గట్టిది కాబట్టి పిచ్చి హాస్పిటల్లోనే పిచ్చిది కాకుండా బయటపడింది..
కొంత మంది మనుషులు ఎదుటి వాళ్ళు ఏమైపోయినా వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలనుకుంటారు.తనదాకా వస్తే కానీ తెలియదు కదా ఎవరికైనా .. మొత్తానికి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని చూశాక నాకు ఇవన్నీ గుర్తొచ్చాయి. ఒక మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలన్నా, వేదనతో మిగిలిపోవాలన్నా ప్రధానంగా కావాల్సింది కుటుంబ సభ్యుల సహకారం, ప్రేమాభిమానాలే. అవి దొరకని మనిషి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎప్పటికీ అనాధగా మిగలాల్సిందే.. !
సోమవారం కాలేజ్ కి వెళ్ళగానే నెక్స్ట్ టూ డేస్ కాలేజ్ కి హాలిడే అని చెప్పారు. ఈ రెండు రోజులు ఇంటికి వెళ్దామా అని ఆలోచిస్తుండగా కావ్య వచ్చింది. ఇద్దరం ఒంటరిగానే ఉన్నాము.మా బ్యాచ్ పక్కన లేరు. మాధవ్ ఈ రెండు రోజులు హాలిడేస్ కదా .. ఒకరోజు ఇంటికి రావచ్చుకదా అమ్మ కూడా రమ్మంది అంది.. నాకు కొంచెం ఆశ్చర్యంగా,కొంచె సంతోషంగా అనిపించింది ఇంకేమీ ఆలోచించకుండా సరే అన్నాను...