పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, మే 2014, సోమవారం

కనపడని ఆ నాలుగో సింహం??




"కనిపించే మూడు సింహాలు ధర్మం, చట్టం, న్యాయానికి ప్రతిరూపాలయితే కనపడని నాలుగో సింహమేరా ఈ పోలీస్" 

ఇదేదో  సినిమాలో డైలాగ్ ... చాలా సినిమాల్లో రాజశేఖర్, సాయికుమార్ లు నిజమైన పోలీస్ అంటే ఇలాగ వుండాలి అనే ఒక భావాన్ని కలిగించే వాళ్ళు. కానీ చెడు పట్ల అంత  ఆవేశంగా, నిజాయితీగా వుండే అధికారి నిజజీవితంలో వున్నారా,ఒక వేళ  వున్నా వాళ్ళు చేయాలనుకునే సేవ చేయగలరా అనేది  ఈ సమాజంలో అందరికీ బాగానే  తెలిసి ఉంటుంది.  ... 

పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఏ  స్థాయి అయినా సరే నేను పోలీసుని అని సగర్వగా చెప్పుకునేది  పోలీస్ సర్వీస్ ... కఠిన శ్రమతో,శిక్షణతో  ఉద్యోగం సాధించి ,ఎల్లప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసం,శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటు పడతానని ప్రమాణం చేసి వృత్తిలోకి ప్రవేశించే  పోలీసుల్లో కొందరు ఉద్యోగంలో చేరి,అధికారం,డబ్బు చేతికి రాగానే చేసిన ప్రమాణాలను మర్చి పోయి అవినీతిపరులతో చేతులు కలుపుతున్నారు .. 

అధికారం,సంపాదనే ప్రధాన లక్ష్యంగా పోలీస్ సర్వీస్ ప్రతిష్టకే మాయని మచ్చగా మిగులుతున్నారు.. కొంతమంది ఇలాంటి వాళ్ళ కారణంగా మొత్తం పోలీసులంతా ఇంతే అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేస్తున్నారు .. 'కానిస్టేబుల్' నుండి  'ఐ.పి.ఎస్' వరకు ప్రతి ఒక్కళ్ళు అవినీతి, లంచాలు, నేరస్తులను ప్రోత్సహించటం,బినామీ ఆస్తులను పెంచుకోవటం ఇలాగ ఏదో ఒక వివాదంలో వున్నారంటే వ్యవస్థ పరిస్థితి అర్ధం అవుతుంది .. 

మొత్తం అందరు పోలీసులు  ఇలాగే వున్నారన్నది నా అభిప్రాయం కాదు .. 
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడపిల్లని మోసం చేసి,ఉద్యోగం పోగొట్టుకున్న  ఒక S .I , కష్టం తీర్చమని  స్టేషన్ కి వెళ్ళిన ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తించి టీవీలలో  దర్శనమిచ్చే కొందరు రక్షకభటులు, అలాంటి వారి గురించి మాత్రమే నా ఈ అభిప్రాయాలు ... 

మేము ఈ సమాజానికి సేవ చేయటానికే ఈ సర్వీస్ లోకి వచ్చాము కానీ మేము అనుకున్నట్లు చేయలేకపోవటానికి  మా కారణాలు మాకు ఉన్నాయి అని బాధపడే కొంతమంది నిజాయితీ కలిగిన పోలీసులు కూడా డిపార్ట్ మెంట్ లో లేకపోలేదు. 

ఈ మధ్య వచ్చిన రేసుగుర్రం సినిమాలో అవినీతిని ఎదుర్కున్న పోలీస్ పాత్రను చూస్తె నిజమైన పోలీస్ అంటే ఇలా వుండాలి అనిపించింది .. 

పోలీసులు,రాజకీయ నాయకుల అవినీతి నేపధ్యం లో అల్లు అర్జున్ కథానాయకుడిగా లక్కీ ది రేసర్   కధ  విషయాని వస్తే .. 

రాము(శ్యామ్ ),లక్కీ( అల్లు అర్జున్) అన్నదమ్ములు..  రాము బుద్ధిమంతుడు,మంచివాడు, లక్కీ ఆకతాయి, అల్లరి పిడుగు .. రాము పద్ధతులు,విలువలు పాటిస్తే లక్కీ నా మనసు చెప్పిందే చేస్తా అంటాడు .. పెద్దయ్యాక రాము పోలీస్ శాఖలో అసిస్టంట్ కమిషనర్ అయితే లక్కీ అమెరికాకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు .. ఒకప్పుడు తన ప్రేమను చెడగొట్టాడని లక్కీ ప్రేమించిన స్పందన నాన్నకి లక్కీ గురించి తప్పుగా చెప్తాడు రాము . 

అన్న మీద కోపంతో  శివారెడ్డి అనే రాజకీయ నాయకుడి అవినీతిని బయట పెట్టాలన్న అన్న ప్రయత్నాన్ని చెడగొట్టి జరిగిన తప్పు తెలుసుకుని తన తప్పుని తనే సరి చేసి, ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడి రహస్యాలను బయటపెట్టి,  తెలివిగా మోసగాళ్ళ ఆట కట్టించిన లక్కీ కధే 
ఈ రేసుగుర్రం ... 

సినిమాలో ఎప్పటిలాగే అల్లు అర్జున్ అల్లరి బాగుంది ... నిజాయితీగా ఉండే   పోలీస్ ఆఫీసర్ గా శ్యామ్  నటన బాగుంది ,రాము,లక్కీ అన్నదమ్ములుగా చక్కగా సరిపోయారు .. 

ఉత్తమ అధికారి కిల్ బిల్ పాండే గా  బ్రహ్మానందం నటన బాగుంది :)


కధలో కొత్తదనం,  ట్విస్ట్ లు లేకపోయినా రెండుగంటల పాటు సరదాగా చూడదగిన  సినిమాగా  బాగానే ఉంది .. వాస్తవానికి  దూరంగా వుంది అనుకున్నా సినిమా అంటేనే ఊహా ప్రపంచం కదా... ఇలాంటి సాహసాలు మనం చేయలేకపోయినా హీరో చేస్తే చూసి సంతోషించటం, సినిమాలోనైనా  చివరకు మంచే గెలవాలని కోరుకోవటం సగటు ప్రేక్షకుడికి  అదో సంతోషం ... 

మొత్తానికి   రేసుగుర్రం సినిమా నిజాయితీ కలిగిన పోలీస్ అధికారులు, ప్రజా క్షేమం కోరుకునే ప్రభుత్వం ఈ సమాజానికి  ఎంత అవసరమో గుర్తుచేస్తుంది.    
మనసుంటే మార్గముంటుంది ... మంచి చేయటానికైనా చెడు చేయటానికైనా 




Related Posts Plugin for WordPress, Blogger...