పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

23, డిసెంబర్ 2015, బుధవారం

K. G. Maheshwari Photo Art Gallery - Nasik




నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ వెళ్ళే దారిలో ఉన్న ఈ మనీ మ్యూజియంలోనే ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ K.G. మహేశ్వరి గారి చిత్రప్రదర్శన  కూడా ఉంది. మనీ మ్యూజియం విశేషాలు ఈ పోస్ట్ లో చూడొచ్చు
- Money Museum - Nashik

ఇప్పటిదాకా  K.G. మహేశ్వరి ఎవరో కూడా తెలియని మాకు ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకునే అవకాశం  వచ్చింది అనిపించింది. నవంబర్ 2 1922 లో జన్మించిన K.G. Maheswari - కృష్ణగోపాల్. మహేశ్వరి గారికి  చిన్నతనంలో తండ్రి సంగీతం నేర్పించాలని అనుకున్నారట.కానీ ఆడిషన్స్లో  టీచర్ అతని గొంతు సంగీతానికి పనికిరాదని చెప్పటంతో ఆ నిరాశ నుండి  బయటపడటానికి ఫోటోగ్రఫీ హాబీగా చేసుకుని, చిన్నతనం నుండే ఫోటోలు తీయటం సొంతగా నేర్చుకున్నారు.1938 లో ఆయన ఫోటోకి మొదటిసారి Beginners Section లో ప్రైజ్ గెలుచుకున్న తర్వాత ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఎక్కువయ్యింది .ఆయన తన జీవితంలో 70 సంవత్సరాలు ఫోటోగ్రఫీ లోనే జీవితం గడిపారట. 

National and International Exhibitions లో ఎప్పుడూ పాల్గొంటూ ఉండేవారట.ఫోటో ప్రదర్శనలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించేవారు. ఫొటోగ్రఫీలో K.G. మహేశ్వరిగారు గెలుపొందిన వందల సంఖ్యలో బంగారం, వెండి, కాంస్య  పతకాలు, మెరిట్ సర్టిఫికేట్లు షీల్డ్స్ ఆయన తీసిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాల ప్రదర్శన బాగుంది. అందమైన చిత్రాలతో పాటూ వాటి కింద దానికి తగిన టైటిల్,ఆ ఫోటో తీసిన సంవత్సరం  అన్నీ వివరంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆ ఫోటోలలో భావాలు (emotions) సజీవంగా మనకి కనపడతాయి.2014 డిసెంబర్ 5 వరకు జీవించిన ఫోటోగ్రఫీ గురు K.G. మహేశ్వరిగారు ఇప్పటికీ ఆయన చిత్రాల్లో సజీవంగా నిలిచే ఉన్నారు.








K.G . మహేశ్వరీ గారు  బహుమతి గెలుచుకున్న మొదటి ఫోటో 




మా షిరిడీ యాత్ర విశేషాలు



షిరిడీ ఎప్పటినుండో మేము చూడాలనుకున్నా ఆ బాబా అనుగ్రహం మాకు ఇప్పటికి కలిగింది.షిరిడీతో పాటూ మహారాష్ట్ర లోని త్రయంబకేశ్వర్,భీమశంకర్,ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలు,పండరీపూర్,తుల్జాపూర్ చూడటం ఎప్పటి కలో నెరవేరినట్లుంది.షిరిడీతో పాటూ జ్యోతిర్లింగాలు కూడా చూడాలనుకోవటంతో ఒక్కరోజులో షిరిడీ దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేశాము. రాత్రి హైదరాబాద్ లో బయల్దేరి ఉదయానికి షిరిడీ చేరుకున్న మేము రూమ్స్ కి వెళ్ళి అక్కడి నుండి వెంటనే బాబా దర్శనానికి బయల్దేరాము.

బాబా సమాధి మందిరం బంగారు గోపురం
ఆలయానికి వెళ్ళే దారంతా బాబాకి సమర్పించే పూలు,పూలదండలు ప్రసాదాల స్టాల్స్ తో కళకళలాడుతూ ఉంది.బాబా సమాధి మందిరంలో బాబాకి ఇచ్చే గులాబీలు, అందంగా  చక్కని సువాసనతో బాబా కోసమే పుట్టినట్లుగా ఉన్నాయి.గుడి ముందే మన కెమెరాలు,ఫోన్స్ అన్నీ డిపాజిట్ చేసి లోపలి వెళ్ళాలి. 

బాబా ఆలయానికి వెళ్ళే దారి
మేము బుధవారం వెళ్ళటంతో భక్తులు తక్కువగా ఉన్నారు. తక్కువ అనుకున్నా దర్శనం అవ్వటానికి 2 గంటలు సమయం పట్టింది. జనం తక్కువగా  ఉన్నప్పుడే ఇలా ఉంటే ఇక గురువారం,శ్రీరామనవమి,గురుపౌర్ణమి రోజుల్లో పరిస్థితి ఏంటో అనిపించింది.దర్శనం టికెట్ తీసుకుని క్యూ లైన్ నుండి లోపలి వెళ్ళగానే అన్ని గుళ్ళల్లో లాగానే జరగండి జరగండి అంటూ హడావుడి మధ్య సాయి సమాధి మందిరం మెరిసిపోతూ లోపలంతా ఒకసారి చూడాలని ఉన్నా బాబానే ఎక్కువసేపు చూడాలన్న ధ్యాసతో ముందుకు కదులుతూ, మొదటిసారి చూడటం కదా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ,బంగారుహారాలతో పాటూ, రకరకాల రంగురంగుల  పూలదండల అలంకరణలో సింహాసనం మీద చిరునవ్వు చిందిస్తూ  శాంతి స్వరూపుడైన బాబాను మనసారా నమస్కరించుకున్నాము. ఎంత చూసినా తనివితీరని దివ్యమంగళ స్వరూపం ఇప్పటికీ తలచుకుంటే కళ్ళ ముందే ఉంది.బాబావారి సమాధి కూడా రకరకాల పువ్వులతో అలంకరించి"సమాధి నుండే బదులిస్తాను"అన్న బాబా మాట కోసం నమ్మకంతో వచ్చే భక్తులను దీవిస్తుంది.మనం తీసుకెళ్ళిన పువ్వులను,ప్రసాదాలు,శాలువాలను పూజారి తీసుకుని బాబాకి తాకించి  ఇస్తారు,బాబా దీవెనగా ఇచ్చిన పువ్వులు, స్వీట్స్, తీసుకుని,బయటికి రావాలనిపించకపోయినా వచ్చేశాము. 

నిన్నుగని శరణమని సన్నుతించు వేళా ..  జన్మ ధన్యమవుతుంది బాబా
సమాధి మందిరం నుండి బయటకు రాగానే సాయిబాబా షిర్డీలో మొదటిసారి 16 సంవత్సరాల బాల ఫకీరుగా కనపడి,ఆయనకి గురుస్థానంగా చెప్పే వేపచెట్టు దగ్గరికి వచ్చాము.ఆ చెట్టు చుట్టూ గ్రిల్స్ ఉన్నాయి వేపాకు కూడా రాలకుండా జల్లెడ పెట్టేశారు ఎందుకో మరి..! కొందరు భక్తులు రాలిన ఒకటీ రెండు వేప ఆకుల కోసం నానారకాలుగా ప్రయత్నిస్తున్నారు అక్కడ ఉన్నబాబాకి నమస్కరించి విబూధి పెట్టుకుని,ఆలయంలో ఇచ్చిన స్వీట్ బూందీ ప్రసాదం తీసుకుని కాసేపు కూర్చుని ఆలయ ప్రాంగణంలో ఉన్న శివుడు,వినాయకుడు,శనిదేవుని ఆలయాలు కూడా చూసి లెండీ వనానికి వెళ్ళాము.బాబా స్వయంగా నీళ్ళుపోసి మొక్కలు పెంచిన లెండీవనం లో రావిచెట్టు కింద బాబా వెలిగించిన నందాదీపం అఖండదీపంగా వెలుగుతూ ఉంది.ఆ నందాదీపం చుట్టూ ప్రదక్షిణలుచేసి నమస్కరించుకుని,ఔదంబర వృక్షం (మేడిచెట్టు) కింద ఉన్న దత్తాత్రేయుడిని దర్శించుకుని బాబా మ్యూజియంకి వెళ్ళాము.

ఆలయప్రాంగణం మధ్యలో ఉన్న దీక్షిత్ వాడా మ్యూజియంలోపలికి వెళ్ళగానే బాబా విగ్రహాన్ని ప్రతిష్టించకముందు శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడు చిత్రించిన సమాథి మీద ఉన్నబాబా చిత్రపటం కనిపిస్తుంది.బాబా ఉపయోగించిన పాదుకలు, ధరించిన బట్టలు,గ్రామ్ ఫోన్ రికార్డ్,గోధుమలు విసిరిన తిరగలి(విసుర్రాయి), బాబా చేతిలో ఉండే సటకా, చిలుం పీల్చిన గొట్టాలు,బాబా స్నానం చేసిన రాయి, కుర్చీ బహుమతులగా భక్తులు ఇచ్చిన సింహాసనం,రధం,భక్తుల కోసం ఆహారం వండే  పెద్ద రాగిపాత్రలు ,బాబా చిత్రపటాలు,వెండి గొడుగు, దీపాలు, వింజామరలు, మొఖమల్ కఫ్నీ, బిక్షకు వాడిన డబ్బాలు,శ్యామ కర్ణకి చేసిన అలంకారాలు ఇలా ఎన్నోరకాల విలువైన బాబా జ్ఞాపకాలను సంస్థానం వారు జాగ్రత్తగా కాపాడుతున్న ఈ మ్యూజియం ఉదయం 10  గంటల నుంచి సాయంత్రం 6  గంటల వరకు తెరిచి వుంటుందట.ఎంతమంది జనం ఉన్నా గుడిని పవిత్రంగా,శుభ్రంగా కాపాడుకోవటం మాత్రం  సంస్థానం గొప్పదనం అనిపించింది.

బాబా వెలిగించిన ధునిలోని ఊదిని ఆలయ ప్రాంగణంలోనే ప్రసాదంగా ఇస్తున్నారు.లోపలే ధ్యాన మందిరం కూడా ఉంది.నిలువెత్తు బాబా చిత్రపటం ఉన్న ఈ హాల్లో కూర్చుని బాబా పుస్తకాలు చదవుకోవచ్చు.చాలా భాషల్లో  బాబా జీవితచరిత్ర పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.లెండి బాగ్ యెదురుగా ఉన్న భవనంలో (దీక్షిత్ వాడా వెనుక భాగం) సంస్థాన్ వారి పుస్తకాల షాపు ఉంది. యిక్కడ బాబా ఫొటోలు, సచ్చరిత్ర పుస్తకాలు అన్నీ దొరుకుతాయి. అప్పటికి లోపల అన్నీ చూశాము అనిపించాక బయటికి రాగానే దక్షిణ ముఖ హనుమాన్ ఆలయం దర్శించవచ్చు.నల్లని రాతితో నిలువెత్తు ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ప్రత్యేకత.

దక్షిణముఖ హనుమాన్ ఆలయం
సమాధి మందిర్ పక్కనే ద్వారకామాయి ఉంది.బాబా తన  జీవితంలో ఎక్కువ సమయం నివాసమున్న మసీదు ఇది. ఇక్కడ బాబా రోజూ దీపాలు  వెలిగించేవారట. ఇక్కడే బాబా  భక్తులను దీవించి ఊదిని ప్రసాదంగా ఇచ్చే వారట. ద్వారకామాయిలో బాబా వెలిగించిన ధుని ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఈ ధునిలోనుండి వచ్చిన ఊదినే బాబా విభూదిగా ఆలయంలో ఇస్తుంటారు.ఇక్కడ భక్తులు కూర్చుని  ధ్యానం చేస్తూ ఉన్నారు. బాబా  పెద్ద చిత్రపటం, బాబా  కూర్చున్న పెద్ద బండరాయి అన్నీ బాబా సాక్షాత్కారాన్ని కలిగించేలా ఉన్నాయి.బాబా భక్తులకు ప్రసాదాల కోసం గోధుమలు విసిరిన విసుర్రాయి,మసీదులో దక్షిణం పక్కన గోడని ఆనుకుని సాయి స్వయంగా వంట చేసిన పొయ్యి కూడా ఇక్కడ ఉన్నాయి. తిరగలి పక్కనే అద్దాల బీరువాలో గోథుమల బస్తా ఉంటుంది. బాలాజి పాటిల్ నేవాస్కర్ సాయిని నిష్కల్మషంగా సేవించిన భక్తుడు. తనకు పండిన పంటనంతా బళ్ళమీద తెచ్చి బాబాకి సమర్పించేవాడు. తరువాత బాబా యెంత ఇస్తే అంత తీసుకునేవాడట. ఇందుకు గుర్తుగా వారి బాలాజీ వంశీకుల కుటుంబ సభ్యులు కూడా నేటికీ సమర్పించే గోథుమల బస్తా యిక్కడుంచుతారట.

ద్వారకామాయి మసీదు - ధుని
ద్వారకమాయికి మసీదు దగ్గరలోనే చావడి ఉంటుంది.షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి నీళ్ళు వచ్చేసి అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి పొడి స్థలం లేకపోవటంతో భక్తులంతా బాబాను చావడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగివచ్చారు.  అప్పటినుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామాయిలోను, చావడిలోను నిద్రిస్తుండేవారు.చావడిలో ఉత్తరం గోడకి ఆనుకొని బాబా చిత్రపటం ఉంటుంది. బాబా చావడిలో నిద్రించేముందు రోజు శేజ్ ఆరతి, ఉదయం కాకడ ఆరతికి ఈ పటం ఉన్న చోటనే కూర్చొనేవారు. దీనిని గుజరాత్ లోని నౌసారి గ్రామానికి చిందిన అంబారాం అనే 18 సంవత్సరాలు యువకుడు చిత్రించాడు. చావడికి మథ్యలో గ్రిల్స్ ఉండి రెండు భాగాలుగా ఉంటుంది. బాబా తూర్పుభాగంలో నిద్రించేవారు. స్త్రీలు బాబాని యివతలనిండే దర్శించుకోవాలి, సాయి నిద్రించే ఆ భాగంలోకి  ప్రవేశించడానికి అనుమతిలేదు. యిప్పటికీ ఆ ఆచారం అలా పాటిస్తూనే ఉన్నారు.స్త్రీలు,పురుషులు వేర్వేరుగా చావడిని దర్శించుకోవాలి.ప్రతి గురువారం పల్లకీలో బాబా చిత్రపటం, సట్కా ,పాదుకలు ఉంచి ద్వారకమాయి నుంచి చావడి దాకా ఊరేగింపుగా తీసుకెళ్తారు.బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే ఊరేగింపుని "పల్లకి ఉత్సవం" లేదా "చావడి ఉత్సవం"గా పిలుస్తారు.
 
శ్రీ చావడి 
చావడి కూడా చూశాక బయటికి రాగానే చుట్టుపక్కల ఏ షాప్ లో చూసినా బాబా ఫోటోలు ,విగ్రహాలు పుస్తకాలు,కాలెండర్స్ , డైరీలు ,ఎక్కడచూసినా కనిపించే పాలకోవా ప్రసాదం ఇలా అంతా  బాబామయం.బాబా విగ్రహాలు రకరకాల ఆకారాలు,సైజుల్లో చాలా బాగున్నాయి.ఇక్కడ షాపింగ్ అంతా కలర్ ఫుల్ గా ఉంది.






"నా అనుమతి లేనిదే యెవరూ షిరిడీలో కాలు మోపలేరు" అన్నారు బాబా. అంటే మనం షిరిడీ వెళ్ళగలిగామంటే ఆయనే  మనలని రప్పించుకున్నారని అర్ధం.ఆ సాయినాధుని దయ ఎప్పటికీ మాయందు ఉంటుందన్న నమ్మకంతో,బాబాను సంతోషంగా, మనసారా ధ్యానిస్తూ బాబా దగ్గరినుండి శని సింగణాపూర్ బయల్దేరాము.శని సింగణాపూర్ షిరిడీకి గంట ప్రయాణం.షిరిడి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాకుండా వెళ్లరట.భక్తులు పోసే నువ్వుల నూనె పైప్ లైన్స్ ద్వారా వేదిక మీద ఉన్న శనీశ్వరునికి అభిషేకం జరిగేలా చేసిన ఏర్పాటు బాగుంది.అక్కడ కొబ్బరి బర్ఫీ ప్రసాదం కొనుక్కుని అప్పటికే చీకటిపడటంతో మా రూమ్స్ ఉన్న సాయీ ఆశ్రమ్ చేరుకున్నాము.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాదిరాజ యోగిరాజ 
పరబ్రహ్మ సచ్ఛిధానంద సమర్థ సద్గురు 
సాయినాధ్ మహారాజ్ కి జై

Related Posts Plugin for WordPress, Blogger...