దూరం నుండి కొండమీద కనిపిస్తున్న కోట
ఈ మధ్య ఒక కొటేషన్ చదివాను మన పూర్వీకులు చరిత్రలు సృష్టించటానికి ప్రయత్నిస్తే ఇప్పటిరోజుల్లో మన చరిత్రలు ఇతరులకి తెలియకుండా చేరిపేయటం ఎలా అని ఆలోచిస్తున్నామట.ఏచరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం అంటుంటారు కానీ రాజుల చరిత్రలు చదువుతుంటే రాజ్యం వీరభోజ్యం అన్నమాట నిరూపించుకుంటూ,ప్రజలని కన్న బిడ్డలుగా పాలింఛి,పరమత సహనాన్ని చాటిన రాజులు కొందరైతే,ఇతర మతాలవారిని నానా కష్టాలు పెట్టి,నిరంకుశ పాలనతో చెడ్డపేరు తెచ్చుకున్నవారు కొందరు. రాజులే పోయినా రాజ్యాలు పోయినా అప్పటి ఎందరో రాజుల చరిత్రలకు మౌనసాక్ష్యాలు ఇప్పుడు శిధిలమై పోయిన కోటలు. జున్నార్ లో శివాజీ మహారాజ్ జన్మించిన శివనేరి కోట తర్వాత మేము మహారాష్ట్రలో చూసిన మరో కోట దౌలతాబాద్ (దేవగిరి) కోట.
కోట ప్రవేశద్వారం
ఎల్లోరా వెళ్ళే దారిలోనే ఔరంగాబాద్ కి 15 కి.మీ దూరంలో ఇండియాలో ఉన్న దుర్భేద్యమైన కోటల్లో ఒకటిగా పేరొందిన సుప్రసిద్ధ దౌలతాబాద్ (దేవగిరి) కోట ఉంది.ఈ కోట మొత్తం ఎత్తు సుమారు 183 మీటర్లు(600 అడుగులు).ఎత్తైన కోన్ ఆకారం కొండమీద కట్టిన ఈ కోట వెళ్ళే దారిలో చాలా దూరం నుండే కనిపిస్తూ ఉంటుంది.దౌలతాబాద్ చరిత్ర 12వ శతాబ్దం నాటిది.ఆకాలంలో దేవగిరి దక్కన్ పీఠభూమిలోని హిందూ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది.దేవగిరి అంటే దేవుళ్ళు నివసించే కొండ అని అర్ధం.యాదవ రాజ వంశానికి చెందిన గొప్ప యోధుడిగా పేరొందిన రాజా భిల్లమరాజు ఈ దేవగిరి కోటని నిర్మించారు.ఇది రాళ్ళని చెక్కి నిర్మించిన శత్రు దుర్భేద్యమైనకోట.దేవగిరిని 1296 లో ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ హస్తగతం చేసుకున్నాడు.యాదవులు, దక్కన్ బహుమనీ సుల్తానులు,మొఘల్స్, మరాఠాలు, నిజాంలు ఇలా ఎందరో ఆక్రమించి పరిపాలించిన ఈ కోట 1724 A.D.వరకు హైదరాబాద్ నిజాం పాలకుల ఆధీనంలో ఉంది.పాలకులు మారినప్పుడల్లా వారికి అనుకూలంగా మార్పులు,చేర్పులు చేసిన ఈ కోటలో ఎన్నో కట్టడాలున్నాయి.
మహమద్ బిన్ తుగ్లక్ (1325-1251)
దేవగిరిని దౌలతాబాద్(సంపదల నగరం)గా పేరు మార్చి, రాజధాని మధ్యలో ఉండటం వలన ఉత్తర, దక్షిణ రాజ్యాలకు అనుకూలంగా ఉంటుందని 1327-1329 మధ్య కాలంలో రాజధానిని ఢిల్లీనుండి దౌలతాబాద్ కి మార్చి పౌరులందరూ అక్కడికి తరలి వెళ్లాలని ఆజ్ఞాపించాడు.700 మైళ్ళ ప్రయాణంలో అష్టకష్టాలు పడ్డ ప్రజలు అనేకమంది మార్గమధ్యంలోనే మరణించారు.పరిస్థితులు అనుకూలించక కనీసం రెండు సంవత్సరాలు కూడా అక్కడ ఉండలేక మళ్ళీ రాజధానిని ఢిల్లీకి మార్చాడు.ఇదొక వృధా ప్రయాసగా, పిచ్చిచేష్టగా చరిత్రలో మిగిలిపోయినా దేవగిరి మాత్రం దౌలతాబాద్ గా స్థిరపడింది. సుల్తానులందరిలో మత,సాహిత్య,తత్త్వశాస్త్ర యుద్ధవిద్యలలో ప్రావీణ్యం కలిగి, దురదృష్ట మేధావి గా పేరుపొందిన మహమద్ బిన్ తుగ్లక్ చరిత్రలో నిలిచిపోయిన సంఘటన దౌలతాబాద్ రాజధాని మార్పు.అందుకే ఇప్పటికీ ఎవరైనా పనికిరాని పనులు చేస్తే పిచ్చి తుగ్లక్ పనులు అంటుంటారు .
తానీషా - చీనీ మహల్
గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ (తానీషా ) -1672-87 హిందువులైన మాదన్నను ప్రధానమంత్రిగాను,
అక్కన్నను సైనికాధికారిగాను నియమించి ఆనాటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు
(1658-1707) ఆగ్రహానికి గురయ్యాడు. దీనికితోడు మహారాష్ట్ర రాజ్యాధిపతి
ఛత్రపతి శివాజీతో ఆయన చేసుకున్న సంధి మరింత ఆగ్రహాన్ని కలిగించింది.1687 ఫిబ్రవరి 7న ఔరంగజేబు స్వయంగా గోల్కొండ కోటను ముట్టడించి,1687 అక్టోబర్ 3న కోట తలుపులు తెరిపించి అబుల్ హసన్ (తానీషా)ని బందీగా చేసి తెచ్చి,దౌలతాబాద్ కోటలో బంధించాడు.13 సంవత్సరాల పాటు దౌలతాబాద్ కోటలో బందీగా జీవించి 1700లో అక్కడే మరణించాడు తానీషా.గోల్కొండ నవాబులందరిలో ప్రజాభిమానం పొందిన తానీషాను బంధించిన చీనీ మహల్ ఈ కోటలో ఉంది.
హరపాలదేవుడు
కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ చేసిన దండయాత్రను ఎదిరించి పోరాడిన యాదవరాజు హరపాల దేవుడిని బందీగా పట్టుకుని బతికుండగానే అతని చర్మం వొలిచి చర్మాన్ని,శరీరాన్ని దేవగిరి కోటగుమ్మానికి వేలాడదీసిన ఒళ్ళు గగుర్పొడిచే రక్త చరిత్ర కూడా ఈ కోటకుంది.
కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ చేసిన దండయాత్రను ఎదిరించి పోరాడిన యాదవరాజు హరపాల దేవుడిని బందీగా పట్టుకుని బతికుండగానే అతని చర్మం వొలిచి చర్మాన్ని,శరీరాన్ని దేవగిరి కోటగుమ్మానికి వేలాడదీసిన ఒళ్ళు గగుర్పొడిచే రక్త చరిత్ర కూడా ఈ కోటకుంది.
కోటలోకి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.ఎత్తైన కోట గోడలు నున్నగా నల్లటి గట్టి రాళ్ళతో శత్రువులు ఎక్కి లోపలికి ప్రవేశించలేనట్లుగా ఉంటాయి.కోట లోపలికి ప్రవేశించే ద్వారాలకి బలమైన చెక్క తలుపులు, తలుపులకి బలమైన ఇనుప మేకులతో ఏనుగులు కూడా లోపలి ప్రవేశించలేనంత గట్టిగా ఉంటాయి.
మహాకోట్ ప్రవేశ ద్వారం
కోటలో ఎక్కువగా కనపడేవి ఫిరంగులు(cannons) మిలటరీ స్ట్రాటెజీతో నిర్మించిన
ఈ కోటలోకి ప్రవేశించగానే చుట్టూ అమర్చిన ఫిరంగులు కనిపిస్తాయి
A watchtower |
ఇక్కడి నుండి ముందుకి వెళ్ళగానే ఒకవైపు భరతమాత గుడి కనిపిస్తుంది. ఈ ఆలయం యాదవరాజులు హిందూ ఆలయంగా,సుల్తాన్లు మసీదుగా ఉపయోగించారట.ఇప్పుడీ ఆలయంలో భరతమాత విగ్రహం ఉంది.ఈ ఆలయం మొత్తం 150 స్తంభాల మీద, చాలా విశాలమైన ఆవరణలో ఉంది.
భరతమాత ఆలయం
భరతమాత ఆలయానికి సమీపంలో ఉన్న హాథీ లేక్
Hathi Haud - 47.75 m in length, 46.75 m in width and 6.61 m in depth.
ఇక్కడి నుండి కొంచెం ముందుకి రాగానే చాంద్ మినార్ కనిపిస్తుంది.చూడటానికి కుతుబ్ మినార్ లాగా కనిపించే 210 ft (70 m) ఎత్తున్న చాంద్ మినార్ ను 1435 A.D. లో గుజరాత్ పై విజయానికి గుర్తుగా అల్లా ఉద్దిన్ బహమనీ / అహ్మద్ షా 2 నిర్మింపచేశాడు. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళటానికి అనుమతి లేదు.
చాంద్ మినార్
ఇక్కడి నుండి ముందుకు వెళ్ళగానే వచ్చే ద్వారం కాలాకోట్
ఇది దాటిన తర్వాత చీనీ మహల్ కనిపిస్తుంది. గోల్కొండ చివరి సుల్తాన్ తానీషా,బీజాపూర్ చివరి సుల్తాన్ సికందర్ లను ఔరంగజేబ్ ఈ చీనీమహల్ లోనే బందీలుగా ఉంచాడట.ఈ కట్టడానికి బ్లూ కలర్ చైనా పింగాణీ టైల్స్ తాపడం చేయించారు కాబట్టి చీనీమహల్ / China Palace అనే పేరు వచ్చింది.
చీనీమహల్ / China Palace
చీనీ మహల్ మీద అంటించిన చైనా టైల్స్
ఇక్కడ ఉన్న మరో వింత.. పొట్టేలు తలతో ఉన్న ఫిరంగి. - Mendha Tope (Ram's Head Cannon). ఎత్తైన ఒక బురుజు మీద 180 డిగ్రీస్ లో చుట్టూ తిరిగేలా(Rotate) అమర్చిన ఈ ఫిరంగి మీద Kila - Shikan Tope i.e.the fort breaker cannon అని రాసి ఉంటుంది.చాలా దూరంలో ఉన్న శత్రువుల మీద కూడా దాడిచేయగల ఈ ఫిరంగిని ఔరంగజేబ్ మహమద్ హుసేన్ అరబ్ (artisan) అనే అతనితో తయారు చేయించాడని దీనిమీద రాసి ఉంటుంది.
Mendha Tope (Ram's Head Cannon)
మేము ఎల్లోరా చూసి దౌలతాబాద్ కోటకి వచ్చేటప్పటికే సాయంత్రం అయ్యింది.అక్కడి గార్డులు 6 గంటల వరకు మాత్రమే లోపల ఉండాలని చెప్పటంతో ఇంకా పైకి వెళ్ళకుండా కాలా కోట్ నుండి తిరిగి వెనక్కి వచ్చేశాము.
ఇంకా పైకి కోటలోకి వెళ్తే 40 అడుగుల లోతు కందకం,దానిమీద ఇనప వంతెన ఉంటుంది.యాదవరాజులు నిర్మించిన అసలు దేవగిరి కోట ఇక్కడే మొదలవుతుంది.కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా కోటచుట్టూ కందకం అందులో మొసళ్ళు,విషసర్పాలు ఉండేవట.ఇనప వంతెన దాటిన తర్వాత ఇక్కడి నుండి చీకటి దారి వస్తుంది.దీన్ని Gate Of Andheri అంటారు.ఈదారి అంతా చీకటిగా ఉంటుంది.టార్చ్ ఉంటె వెళ్ళొచ్చు లేదా అక్కడ కాండిల్స్ పట్టుకుని దారి చూపించే వాళ్ళు ఉంటారట.అప్పట్లో రాజులు శత్రువులని కోటలోకి రాకుండా,శత్రువుల నుండి తప్పించుకోవటానికి ఇలాంటి ఏర్పాట్లు చేశారు.ఈ దారికి చివరిలో ఇనపకుంపటి లాంటిది ఉంటుంది.శత్రువులు వచ్చినప్పుడు దానిలో మంట వెలిగిస్తే ఆ మార్గమంతా చాలా వేడి వ్యాపించి అందులో ఎవ్వరూ నడిచి వెళ్ళే వీలు లేకుండా పోయేది. పైన దుర్గా cannon , కాలాపహాడ్ cannon ఉన్నాయి.వినాయకుడి గుడి,జనార్ధన స్వామి పాదుకలు,దత్త పాదుకలు,శివలింగం ఉన్నాయి.
ఒక మొఘల్ మందిరం బారాదరి ఉంటుంది.దీన్ని షాజహాన్ (A.D1627-1658). 1636 లో నిర్మించాడు.13 హాల్స్ ఉన్న ఈ బారాదరిని అప్పటి రాజులు వేసవి విడిదిగా ఉపయోగించేవారట.
"బారాదరి" కింద నుండి తీసిన ఫోటో
కోటని పూర్తిగా చూడలేకపోయమని కొంచెం ఫీల్ అయినా చిన్నప్పుడు
చదివిన దానికంటే ఇప్పుడు ప్రత్యక్షంగా చరిత్రజరిగిన ప్రదేశాన్ని చూడటం,ఒకప్పుడు
అక్కడ ఆధిపత్యం కోసం జరిగిన పోరాటాలని గుర్తుచేసుకోవటం,అప్పట్లో
వాళ్లు ఇక్కడ నడిచారు,ఇలా కొండలమీద కోట కట్టుకుని ఇన్ని మెట్లు ఎలా
ఎక్కేవారో?ఇంతింత పెద్ద రాళ్ళను అంత ఎత్తుకి ఎలా చేర్చారో? అనుకుంటూ ఒకప్పటి వారి
వైభవాన్ని,యుద్ధ వ్యూహాల్లో వాళ్ళ ఆలోచనాశక్తిని ఊహించటానికి ప్రయత్నించటం కూడా ఆనందమే
అనిపిస్తుంది.అంతంత కోటలు కట్టుకుని,ప్రశాంతత లేకుండా జీవితమంతా
తిరుగుబాట్ల నుండి,ఆక్రమణల తప్పించుకోవటానికి పోరాడుతూనే ఉన్న చక్రవర్తుల చరిత్ర
గుర్తొస్తే రాజుల సొమ్ము రాళ్ళపాలు అని కొంచెం బాధ కూడా కలుగుతుంది.
కోట ద్వారాల పక్కన శిల్పాలు
మహారాష్ట్రలో ఎక్కడ చూసినా జామకాయలు చాలా ఎక్కువగా కనిపించాయి,బాగున్నాయి కూడా.
కోటలో మేము ...