ఎందుకో మొదటినుండి ఆడపిల్లల్ని కనీసం పలకరించటాని కూడా సంకోచిస్తాను . 6 నుండి 10 వ క్లాస్ దాకా ఆడపిల్లల్తోతే ఎప్పుడూ నాకు చదువులో పోటీ.. ఒకసారి నేను క్లాస్ ఫస్ట్ వస్తే పంతం పట్టి మరీ అమ్మాయిలు నెక్స్ట్ ఎక్జామ్స్ లో ఫస్ట్ వచ్చేవాళ్ళు . ఇంక ఇంటర్లో బాయ్స్ కాలేజ్ కావటం తో అమ్మాయిలు,పరిచయాలు ఉండవు.ఆ అలవాటే మెడికల్ కాలేజ్ లో కూడా వచ్చింది . అందుకే 1 st year అంతా అయిపోయినా మా క్లాస్ లో అమ్మాయిలెవరో తెలియలేదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా అనిపించలేదు .
పైగా అప్పటికే నా కన్నా పెద్ద వాళ్లైన అన్న,అక్క వాళ్ళ కాలేజ్ లో ఆడపిల్లలు,మగపిల్లల పరిచయాల గురించి తప్పుగా కామెంట్స్ చేయటం, ఇంట్లో ఆ విషయాలు చెప్పగానే మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఎత్తి మరీ వాళ్ళ పెంపకాలు అలాంటివి మీరు అలాంటి పనులు చేయకండి అంటూ ఇచ్చే వార్నింగులు అమ్మాయిలతో అబ్బాయిలు,అబ్బాయిలతో అమ్మాయిలూ మాట్లాడకూడదు,అది తప్పు అన్న భావాన్ని నాలో పెంచాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి ..
కావ్యతో నా పరిచయం అనుకోకుండా జరిగినా .. ఒక మంచి వ్యక్తిని కలిసిన భావం కలిగింది . కావ్య ఫ్రెండ్స్ నలుగురు, అందర్లో కావ్య ఎందుకో ప్రత్యేకంగా అనిపించేది.ఎక్కువగా మాట్లాడదు,ఎవరినీ అనవసరంగా కామెంట్స్ చేయదు, క్రిటిసైజ్ చేయదు , చక్కగా చదువుతుంది .. పిడియాట్రిషియన్ అవ్వాలని తన కోరిక... తనకి తన కుటుంబం అంటే చాలా ఇష్టం, ఎవరన్నా తప్పుగా మాట్లాడినా తప్పుని ఖండించటానికి వెనుకాడదు .అది వాళ్ళ కజిన్ సంపత్ అయినా సరే.. ! మా రూమ్ లో కావ్యని హేమంత్ పరిచయం చేసినప్పటి నుండి కాలేజ్ లో కూడా అప్పుడప్పుడు లంచ్ బ్రేక్ లో , లైబ్రరీలో, ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి కావ్య కనిపిస్తూనే వుండేది .
మాకు అనాటమీ డిసెక్షన్ రోజున ఒక పక్క డిసెక్షన్ జరుగుతుండగానే లంచ్ టైమ్ అయ్యేది. డిసెక్షన్
చేసిన రోజున వెంటనే అన్నం తినాలంటే మాకు ప్రాణం పోయినట్లయ్యేది ..
కాలేజ్ లో హాండ్స్ వాష్ చేసుకోవటానికి ఇచ్చే సబ్బులతో ఎంత శుభ్రం
చేసుకున్నా చేతులు శుభ్రం చేసుకున్నట్లు అనిపించేవి కాదు..కానీ తప్పదు లంచ్
తర్వాత వెంటనే మళ్ళీ క్లాస్ లు ఉండటంతో వెంటనే లంచ్ చెసేయాలి.. ఒక్కోసారి
డిసెక్షన్ లోవి ఏవేవో గుర్తొచ్చి అన్నం తినాలనిపించేది కాదు ..
ఒకసారి ఇలాగే అనాటమీ అయ్యాక నాకెందుకో చాలా చిరాకుగా అనిపించి లంచ్ చెయ్యకుండానే వెళ్లి లాన్ లో కూర్చున్నాను.. ఫ్రెండ్ తో అటు వెళ్తున్న కావ్య నన్ను చూసి వెనక్కి వచ్చింది . లంచ్ చెయ్యలేదా అని అడిగి,నేను చెప్పకముందే ఓహో నాకు అర్ధం అయ్యింది మాధవ్ నీ పరిస్థితి అంటూ తన బాగ్ లో వున్న చిన్ని హాండ్ వాష్ పేపర్ సోప్ తీసి ఇప్పటి నుంచి ఇవి ట్రై చేసి చూడు అంటూ ఇచ్చింది . అక్కడే ఉన్న పంపు కింద చేతులు కడుక్కుని రాగానే నిజంగా చాలా మంచి వాసనతో , ఫ్రెష్ గా అనిపించింది...మనం చెప్పకుండానే మన అవసరాలు,ఇబ్బందులు తెలుసుకునే వాళ్ళుండటం నిజంగా అదృష్టం కదా అనిపిస్తుంది అవి ఎంత చిన్న అవసరమైనా సరే ..
కావ్య అచ్చ తెలుగు అమ్మాయిలాగా అనిపించేది. "అచ్చ తెలుగు అమ్మాయి" అంటే
మరీ లంగా వోణీ వేసుకుని, నడుము దాకా వచ్చే జడలో ముద్దబంతి పూలు
పెట్టుకుని, ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మ పాటలు పాడేంత తెలుగు
అమ్మాయిలాగా కాకపోయినా చక్కగా మంచి లేత రంగు కాటన్ పంజాబీ డ్రెస్ లలో , మెడ
దాకా వచ్చే జట్టుని కొన్నిసార్లు అలా వదిలేసి, కొన్ని సార్లు పోనీ
వేసుకుని, నడిస్తే తన కాళ్ళ కింద చీమలు ఎక్కడ చస్తాయో అన్నంత
నిదానంగా,పద్దతిగా నడుస్తూ ... " ఏ కవులు రాయని కావ్యం.. ఏ శిల్పి చెక్కని
శిల్పం " ఇదే ఎప్పుడు కావ్యని చూసినా నాకు కలిగే భావం .
కొత్త వాళ్ళతో మాట్లాడటానికే ఆలోచించే నేను కావ్య తో మాట్లాడే అవకాశం కోసం
ఎదురు చూసేవాడ్ని .. నా మనసు తెలుసుకున్నట్లు కావ్య కూడా రోజులో
ఒక్కసారన్నా నాతో తప్పకుండా మాట్లాడేది.. జీవితంలో చాలా విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి.. అలా కావ్యతో నా పరిచయం స్నేహంగా ఎప్పుడు మారిందో కూడా నాకు గుర్తు లేదు .. ఏంటి మాధవ్ సంగతి కొత్త ఫ్రెండ్స్ అయినట్లున్నారు అంటూ రఫీ ఒకరోజు ప్రత్యేకంగా నన్ను అడిగేదాకా .. కొన్ని సంగతులు మన గురించి మనకి తెలియక ముందే పక్క వాళ్ళకే బాగా తెలుస్తాయనుకుంటాను ..
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి