ఆ రోజుల్లో ఫ్రెషర్స్ పార్టీ అంటే ఇప్పటిలా హోటల్స్ లో పెళ్ళిళ్ళకి వేసినట్లు సెట్టింగులు, భోజనాలు,డాన్సులు ఉండేవి కాదు . సింపుల్ గా స్నాక్స్ , కూల్ డ్రింక్ ఇచ్చి అందరినీ వాళ్ళ గురించి పరిచయాలు చేసుకొమ్మని చెప్పి , సీనియర్లు కూడా వాళ్ళ గురించి పరిచయాలు చేసుకున్నారు . చీఫ్ గెస్ట్ గా వచ్చిన వాళ్ళు, ప్రిన్సిపాల్ , ఇంకా కొందరు ప్రొఫెసర్లకి మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. మా కాలేజ్ లో చేరిన కొందరు టాప్ రాంకర్స్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కాలేజ్ పేరుతో పాటూ వైద్య వృత్తి యొక్క పవిత్రతని కాపాడాలని కోరారు..
ఇంక పరిచయాల కార్యక్రమం .. ఒక్కొక్కరు స్టేజ్ మీదికి వచ్చి వాళ్ళ గురించి పరిచయాలు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో ఆకాంక్ష, ఆశయం, ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడి దాకా రావటానికి ఎలా ప్రయత్నించారు, ఇక నుండి వాళ్ళ లక్ష్యం అందుకోవటానికి ఏమి చేయాలనుకుంటున్నారో నిర్దిష్టమైన ఆలోచనలను వ్యక్తం చేస్తూ కొందరు మాట్లాడితే మరికొంత మందికి ఎన్నో చెప్పాలనున్నా కంగారు,కొంచెం Shyness , ఏమి మాట్లాడితే ఏమనుకుంటారో అన్న బెరుకుతో చెప్పలేక పోతున్నారు .. దానికి తోడు సీనియర్స్ జోక్స్, కామెంట్స్ కూడా తోడయ్యాయి .
నా వరస వచ్చింది .. ఇప్పటివరకు కనీసం స్కూల్ టైం లో కూడా మా అక్కలు నా కంటే ధైర్యంగా అన్ని పోటీల్లో పాల్గొనే వాళ్ళు ,బహుమతులు కూడా తెచ్చుకునే వాళ్ళు కానీ నేను మాత్రం ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు. చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో డ్రామా వేశాను కానీ అది కూడా అమ్మ స్వాతంత్ర్య వీరుల కధ చెప్తుంటే పడుకునే వింటూ ఉండే మొద్దబ్బాయి పాత్ర ..నాకు మాట్లాడే అవకాశం,అవసరం లేదు కాబట్టి తప్పని పరిస్థితిలో చిన్నక్క టీచర్ కి ఇచ్చిన మాట కోసం ఏదో అప్పటికి అలా అయిందనిపించాను. కానీ ఇప్పడు మాత్రం తప్పదు మాట్లాడటం ..
స్టేజ్ ఎక్కగానే నా గురించి,నా ఫ్యామిలీ గురించి క్లుప్తంగా చెప్పి నాకు ఇష్టమైన వివేకానంద భోధనలు గురించి, ఆయన నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి అని, ఆయన చెప్పిన "బలమే జీవనము బలహీనతే మరణం" నాకు ఇష్టమైన సూక్తి , ప్రపంచమంతా సోదరభావంతో ఉండాలన్న ఆయన ఆకాంక్ష నన్ను ప్రభావితం చేసిందని, వివేకానందుడు చెప్పినట్లు తలచుకుంటే ఏదైనా సాధించగలవు అన్న నమ్మకమే ఈ రోజు నన్ను MBBS స్టూడెంట్ ని చేసిందని, కాబట్టి నేను దేవుడి కంటే ఎక్కువగా ఇలాంటి మహానుభావుల్నే నమ్ముతానని చెప్పి వచ్చేశాను..
రఫీ నన్ను మెచ్చుకుని, భయపడుతూనే బాగా చెప్పావ్ ( నిజమే నాకు కూడా అనిపించింది పర్లేదు బాగానే మాట్లాడానే అని ) పద మన క్లాస్ మేట్స్ లో కొందరిని పరిచయం చేస్తాను అంటూ పక్కకి తీసుకెళ్ళాడు ... రఫీ ఎమ్ సెట్ కోచింగ్ ఫ్రెండ్ సోహిల్ , తమిళ్ నాడు నుండి వచ్చి నాతో పాటూ APRJC లో ఇంటర్ క్లాస్మేట్ సుధాకర్ కలిశారు... ముగ్గురం ఒక బ్యాచ్ అయ్యాము .. ప్రస్తుతానికి అందరికి హాస్టల్ రూమ్స్ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ముగ్గురం ఒకే రూమ్ లో ఉండటానికి వీలు లేదు . కొన్నాళ్ళ తర్వాత ఎవరైనా ఒప్పుకుంటే ఒక్క రూమ్ కే మారొచ్చులే అనుకున్నాము... ఈ లోకంలో స్నేహమే జీవితం,స్నేహమే శాశ్వతం కదా మరి ..
అలా మా 5 సంవత్సరాల MBBS కాలేజ్ జీవితం మొదలయ్యింది.కొత్త సబ్జెక్ట్స్, విషయాలు,మనుషులు, మనస్తత్వాలు,హాస్టల్ పంచాయితీలు,రాగింగ్ చిరాకులు, అంతా కొత్త కొత్తగా ఉంది. క్లాస్ రూమ్ లో పాఠాలతో పాటు, ప్రయోగాలు ఏదేదో నేర్చుకోవాలి చేసెయ్యాలి అన్న ఆత్రం , కొన్నిసార్లు భయాన్ని కలిగిస్తే మరికొన్ని సార్లు విరక్తిని కలిగించే కొన్ని ప్రయోగాలు ఇలా సాగిపోతుంది నా మొదటి సంవత్సరం ..
మన ముందు మంచిగా మాట్లాడి, మెచ్చుకునే వాళ్ళందరూ నిజంగా మంచి వాళ్ళు కాదని,, మనుషుల మాటల్లో, చేతల్లో కనపడని వెటకారం అడుగడుగునా దాగి ఉంటుందని తెలుసుకోలేక పోయాను. ప్రపంచమంతా సోదరభావంతో మెలగాలన్న వివేకానంద భావనలను నేను బాగానే ఒంట బట్టించుకున్నాను కానీ,ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు మనుషులు, పరిస్థితులు ఎలా ఉన్నాయి , ఇప్పుడు పరిస్థితులకి, మనుషులకి ఆ సూక్తులు సరిపడతాయా లేదా అన్న విషయం మాత్రం ఎక్కువ ఆలోచించలేకపోయాను. ఆలోచించకుండా ఏ పని చేసినా దాని పర్యావసానాన్ని అనుభవించక తప్పదు అని ఆలస్యంగా తెలుసుకున్నాను.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి