పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

13, సెప్టెంబర్ 2014, శనివారం

నాలో నేనేనా ?? -- ఒక(రి) కధ - 1





సంతోషం,భయం,కంగారు,ఆత్రుత ఇలా అన్నీ కలిసి మనసు ఏదో ఏదో గందరగోళంగా ఉంది ... ఈ రోజు కాలేజ్ లో మొదటిరోజు .. సంవత్సర కాలంగా నేను ఎదురుచూసిన రోజు. ఎమ్ సెట్ మొదటి ప్రయత్నంలో మంచి ర్యాంకు రాలేదని నాన్న డొనేషన్ తో  చదివిస్తానన్నా..  ఇప్పటికే ఇద్దరు అక్కల్ని,అన్నని డొనేషన్ కట్టి  కర్ణాటకలో చదివించిన నానకి మళ్ళీ నా వల్ల  కష్టం కాకూడదని లాంగ్ టర్మ్  కోచింగ్ తీసుకుని మరీ ఎమ్ సెట్ లో 500 ర్యాంకు తెచ్చుకుని డాక్టర్ అవ్వాలన్న నా కోరిక తీర్చుకునే అవకాశం తెచ్చుకున్నాను. 

ఇక్కడ నేను గర్వంగా ఫీలయ్యే ఇంకొక విషయం ఇదే కాలేజ్ లో మా నాన్న గారు మెడిసిన్ చదివారు .. అందుకే నాన్నని డాక్టర్ని చేసిన ఈ కాలేజ్ నే నేను కౌన్సిలింగ్ లో సెలెక్ట్ చేసుకున్నాను .నానమ్మకి,నానకి నమస్కారం చేసి,అమ్మకి బాయ్ చెప్పి కాలేజ్ కి బయల్దేరాను . కాలేజ్ దగ్గరవుతున్న కొద్దీ ఏవో  తెలియని ఫీలింగ్స్ .."ఎన్నాళ్ళొ వేచిన ఉదయం పాట" కూడా గుర్తొచ్చింది విశాలమైన ఆవరణ, సమున్నతమైన కట్టడాలతో  స్వాగతం పలికింది మా కాలేజ్ . అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసిన  నాన నన్ను  లోపలికి  వెళ్ళమన్నాడు..

నాతో  పాటూ కొత్తగా చేరిన  స్టూడెంట్స్ అందరూ ఎవరి కంగారులో వాళ్ళున్నారు . వాళ్ళలో ఇంతకుముందు ఇంటర్లో,   స్కూల్ టైం లో ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ కనపడగానే  పోగొట్టుకున్న వస్తువేదో  దొరికినంత సంబరపడిపోతూ ఉద్వేగంగా, సంతోషంగా పలకరించుకుంటున్నారు .. అంతే  కదా  ఎంతైనా కొత్త ప్లేస్ లో మనకి తెలిసిన వాళ్ళు కనపడితే ఆ సంతోషమే వేరు .. 

నాకు ఎవరు ఫ్రెండ్స్ అవుతారో,నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేరా అని  నేను ఆలోచిస్తూ ఉండగానే అందరూ  క్లాస్ రూం కి వెళ్లాలని కబురొచ్చింది . క్లాస్ రూం కి వెళ్లేముందు నానకి చెప్పి వెళ్లాలని బయటికి వచ్చి నాన కోసం చూస్తే  కనపడలేదు . సరేననుకుని క్లాస్ కి వెళ్దామని లోపలి వచ్చేసరికి అందరూ వెళ్లి పోయారు .. ఎటువైపు వెళ్ళాలో తెలియక అక్కడే ఉన్న ఒకతన్ని  అడిగాను క్లాస్ రూం ఎక్కడ అని..  అతను చాలా హడావుడిలో ఉండి  కూడా పాపం నాతో  పాటూ వచ్చి కొంచెం ముందుకు వెళితే 1st  ఇయర్ క్లాస్ రూం వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు .

నేను తనకి థాంక్స్ చెప్పి అతను చూపించిన వైపు వెళ్లాను .చుట్టూ పచ్చని చెట్లు,వాటి మధ్యలో శుభ్రమైన దారులతో క్యాంపస్ వాతావరణం మనసుకు హాయి కలిగించేలా ఉంది. కాస్త దూరం వెళ్ళగానే రూమ్ కనిపించింది. కొంచెం బెరుకు బెరుకు గానే లోపలి అడుగు పెట్టాను.. అంతా  నిశబ్దంగా ఉంది అసలు నేను ఎక్కడికి వచ్చానో తెలియలేదు. లోపల  ఇంకా ఏదో రూం వున్నట్లు, మాటలు వినిపించినట్లు అనిపించి అటువైపు వెళ్లాను ..

అంతే  అక్కడ దృశ్యం చూసి అలా నిలబడిపోయాను.హార్ట్ బీట్ పెరిగింది .. గుండాగినంత పనయ్యింది. అప్పటిదాకా పై ప్రాణాలు పైనే పోవటం అంటే వినటమే కానీ తొలిసారిగా ఆ ఫీలింగ్ ఎలా వుంటుందో అనుభవంలోకి వచ్చింది ... ఇంతలో వెనకనుండి ఎవరో నన్ను గట్టిగా పట్టుకున్నారు ... అంతే "లావొక్కింతయు లేదు" అని చిన్నప్పుడు నానమ్మ నేర్పిన పద్యం ఠక్కున గుర్తొచ్చింది....   హమ్మో ... !


Related Posts Plugin for WordPress, Blogger...