పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, జూన్ 2014, ఆదివారం

♥ ముచ్చటైన ప్రేమప్రపంచం ♥



సృష్టిలో మనం మాత్రమే విశిష్టమైన,విలక్షణమైన వాళ్ళమని మానవుల  నమ్మకం.ఆలోచనలు,అభిప్రాయాలు,కోరికలు,ఆశలు,ప్రేమలు,కోపాలు,
అలకలు ఇలాంటి ఫీలింగ్స్ అన్ని మనవే అనుకుంటాము .. 

అమ్మ ప్రేమ మనకి మాత్రమే సొంతం .. అమ్మని మనం మాత్రమే ప్రేమిస్తాం అనుకుంటాం.   కానీ అమ్మప్రేమ  జంతువుల్లో కూడా ఉంటుంది .. క్రూర మృగాలు కూడా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి .. అమ్మ అందరికీ అమ్మే అన్నమాట ని నిజం చేస్తాయి .. అలాంటి ముచ్చటైన తల్లీ పిల్లల ప్రపంచంలోకి మనమూ వెళ్దామా ..















20, జూన్ 2014, శుక్రవారం

" భూ కైలాస్ " .. ఎకరం ఎన్ని కోట్లో !! ??





గుంటూరు,విజయవాడ జిల్లాల్లో రియల్ 'భూ'మ్ .. ఇది  ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న వార్త ... ఒక్క గుంటూరు,విజయవాడ అనే కాదు మొత్తం ఆంద్ర అంతా ఇలాంటి పరిస్థితే వుంది.. తెలంగాణా రాష్రం ఏర్పడుతుంది అన్న దగ్గరి నుండి ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పరుగందుకుందని చెప్పొచ్చు .  ఇప్పుడిక  రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత, గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుందని ఒక మాట బయటికి వచ్చాక మా గుంటూరు జిల్లాలో చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా స్థలాల రేట్లు, బిజినెస్ గురించే చర్చ.  ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల  గ్రామాల్లో ఏర్పడ్డ " భూ కైలాస్ " పరిస్థితి ఇక్కడ కూడా కనపడుతుంది. లక్షలు దాటి కోట్లలో ఈ  వ్యాపారం జరుగుతుంది ..

నగరానికి చుట్టుపక్కల ఉన్న పొలాలు రియల్  ఎస్టేట్ వెంచర్స్ గా మారిపోతున్నాయి . ఒకప్పటి  మానవుడి ఆహారవసరాలను తీర్చిన పంట పొలాలు నేడు ప్లాట్స్ గా మారిపోయాయి . నడి వూరిలో కాకపోయినా కనీసం మాకంటూ ఇక్కడైనా ఒక స్థలం వుంది అనుకోవచ్చు అనుకునే  మధ్య తరగతి వాళ్ళు ,  ఇప్పుడు స్థలాలు కొని పడేస్తే ముందు ముందు ఇంకా ఎక్కువకే అమ్ముకోవచ్చు అనుకునే వ్యాపారస్తులు ...  మొత్తానికి స్థలాల రేట్లు ఆకాశానికి తాకుతూ ఇప్పుడు ఉన్న రేటు ఇంకాసేపటికి లేనట్లుగా డిమాండ్ పెరిగిపోతుంది .

సామాన్య  మానవుడికి సొంతిల్లు ఆశ కాదు అవసరం.. తమకంటూ సొంతిల్లు ఉండాలి, ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడో ఉన్నా తమ సొంత వూరిలో ఇల్లు కట్టుకోవాలని ,ప్రశాంతంగా ఆ ఇంట్లో గడపాలని ఆశిస్తారు  . అద్దె ఎంత పెట్టి ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉన్నా మన సొంతది  చిన్నఇల్లైనా స్వర్గమే అనేది మా అమ్మమ్మ .. కానీ ప్రస్తుత పరిస్థితిలో సామాన్యుడికి స్థలం కొనే పరిస్థితి , ఇల్లు కట్టే పరిస్థితి కనపడటం లేదు..ఈ మధ్య "మీలో ఎవరు కోటీశ్వరుడు" షో కి వచ్చేవాళ్ళలో ప్రతి ఒక్కరు సొంతిల్లు మా కల అని చెప్తుంటే నిజంగా సొంతిల్లు కావాలని కోరుకోని వాళ్ళు ఉండరు కదా అనిపించిది .. 

"ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" అంటారు. ప్రస్తుతం మధ్యతరగతి వాళ్లలో కూడా ఎవరి పెళ్ళికైనా వెళ్ళి  కట్నం ఎంత అని అడగ్గానే 40 లక్షలు, 50లక్షలు అంటున్నారు అమ్మో అంత కట్నమా నువ్వు చేసేది వ్యవసాయమే కదా అనగానే .. ఏముందండీ మా పొలం ఎకరం 25 లక్షలు ఒక రెండెకరాలు పెట్టేశా మా అమ్మాయికి అంటున్నారు .. ఉద్యోగాలు చేసి కష్టపడి , లోన్ లు పెట్టినా 10 లక్షలు కూడా కట్నం ఇవ్వలేని సామాన్య మానవుడికి ఇలాంటివి విన్నా చూసినా ఆశ్చర్యమే కదా మరి ...  పాపం ఈ పెరిగిన భూముల రేట్లు ఇలా కట్నం రూపంలో కూడా ఇళ్ళలో చిచ్చులు పెడుతున్నాయన్నమాట.  
ఏది ఏమైనా పర్యావరణానికి హాని కలిగేలా పొలాలు , అడవులు తరిగిపోతూ వాటి స్థానంలో జనావాసాలు ఏర్పడుతున్నాయి .. ఇప్పుడది ఇంకా ప్రమాదకర స్థాయికి చేరింది..  పెరుగుట విరుగుట కొరకే అంటారు కానీ ఇక్కడ మాత్రం పెరుగుట పెరుగుట కొరకే .. ఇది స్థలాల యజమానులకు సంతోషం, ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి భారం .. దీనికి ఎవరినీ తప్పు పట్టే పరిస్థితి ఇప్పుడు లేదనుకుంటాను...  కానీ కొన్ని సంఘటనల పర్యావసానాలు  ఇలా  ఉన్నాయన్నమాట..  





16, జూన్ 2014, సోమవారం

పాటలు .. ప్రశ్నలు




మన సినిమాల్లో హీరో హీరోయిన్లు సంతోషంగా జంటగా పాడుకుంటే అది యుగళ  గీతం, ఇద్దరూ విడి విడిగా ఒకరిని ఒకరు జ్ఞాపకం చేసుకుంటూ పాడితే విరహ గీతం, ఇద్దరూ ఒంటరిగా బాధగా పాడుకుంటే విషాద గీతం..  ఇలా చాలా రకాల పాటలు పాడుతూ వుంటారు. 

 వీటన్నిటికీ భిన్నంగా ఇద్దరూ కలిసి పాడుతూనే విభిన్న భావాలను వ్యక్తం చేస్తూ,ఒకరితో ఒకరు విభేదిస్తూ,ప్రశ్నిస్తూ  పాడుకునే పాటలు కొన్ని ఉంటాయి ... పాత సినిమాల నుండి ఇప్పటిదాకా అలాంటి పాటలు చాలానే వుండి వుంటాయి కానీ నాకు కొన్నే గుర్తొచ్చాయి. అందులో అన్నీ నాకు నచ్చిన,హిట్ సాంగ్సే ఉన్నాయి .. 


"సుమంగళి" 
నాగేశ్వర రావు ,సావిత్రి  పాడుకునే 
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి
కలలే 
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి
మరులే.. 
ఈ పాట టాప్  1 ప్రశ్నల పాటల్లో ఉంటుంది ఎప్పటికీ   :)


కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి




"స్వర్ణకమలం"  
వెంకటేష్ ' పరధర్మం కన్నా, ఏవో కొన్ని లోపాలున్నా స్వధర్మమే అనుసరించదగినది' అంటే  "పరుగాపక పయనించవే తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ" అంటూ భానుప్రియ తన అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్తుంది...   

శివ  పూజకు చిగురించిన సిరి సిరి మువ్వా



"గోరింటాకు" 
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఎందుకీ మౌనం' అని సుజాత అడిగితే 'మనసులో ధ్యానం మాటలో మౌనం'  అని తన ఆలోచనలు తెలియచేస్తాడు శోభన్ బాబు ..  

కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
  



"త్రిశూలం"... 
  భార్యగా గౌరవమైన స్థానాన్ని ఇచ్చిన మీరు రాముడు,దేవుడు అని భార్య  పొగిడితే, నేను రాముడు దేవుడు కాదు 'తోడనుకో నీ వాడనుకో' అని భార్యను ఓదార్చుతూ భర్త  చెప్పే సమాధానం ..

రాయిని ఆడది  చేసిన రాముడివా



"సిరివెన్నెల
కాబోయే జీవిత భాగస్వామి అందంగా ఉండాలి. ఇంకా ఎన్నో మంచి గుణాలు ఉండాలని కోరుకుంటారు కదా మీరు నాలో ఏమి చూసి ఇష్టపడ్డారు అన్న ఆమె ప్రశ్నకి "మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం  నీ రూపం అపురూపం" అంటూ అతడు పాడే  ఈ పాట ఎప్పుడు విన్నా నిజంగా అపురూపంగానే వుంటుంది... 
  
మెరిసే తారలదే రూపం విరిసే పువ్వులదే రూపం 




"మహర్షి" ఒకరు బాధతో,ఒకరు ఆశతో పాడే పాట ఇది . ప్రేమించిన అమ్మాయికి  పెళ్లి అయినా కూడా ప్రేమించే హీరో "నింగీ నేలా తాకే వేళా నీకు నాకు దూరాలేల" అంటే "ఆకాశాన  తీరం అంతే లేని ఎంతో దూరం" అంటుంది హీరోయిన్ .. 

మాటరాని మౌనమిది 
 


  
 "ఖుషీ"

ప్రేమంటే సులువు కాదు అది నీవు గెలవ లేవు అనే హీరోయిన్ తో
నీకోసం ఆకాశాన్ని నేలకు దించుతా అంటున్నాడు హీరో  .. 

 ఈ పాట వీడియోలో పాట మొత్తం రాదు అందుకే ఆడియో పెట్టాను ..

 ప్రేమంటే సులువు కాదురా 
అది నీవు గెలవ లేవురా




"మగధీర" 
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పోలిక నీకేలా 
ఇది హీరోయిన్ సందేహం "అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా"నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మ ..అని  ఆమెపై తనకెంత ప్రేముందో హీరో తెలియచేసే ప్రయత్నం  
పంచదార బొమ్మా బొమ్మా



నాకు నచ్చే మరొక పాట  "రాధా - మధు" మా టీవీ సీరియల్ పాట.ఇది సినిమా పాట కాకపోయినా ఒకరు ఆశావాదిగా "కెరటాలు కోటి సార్లు ఎగిరి గగనాన్ని నేలపైకి తేవా" అంటే ,మరొకరు "ఆ  నింగి నేలా ఎదురెదురుగున్నా రెంటికీ సాధ్యమా వంతెనా" అంటూ పాడే  ఈ పాట చాలా బాగుంటుంది ..

ఆగదేనాడు కాలము ఆగినా గడియారము




15, జూన్ 2014, ఆదివారం

మీలో ఎవరు కోటీశ్వరుడు??


మీలో ఎవరు కోటీశ్వరుడు??

ఈ లోకంలో డబ్బు కావాలని ఎవరికుండదు చెప్పండి . ఎవరైనా డబ్బుదేముందిలెండి అని మాటవరసకు అంటారు కానీ ధనమూలం ఇదం జగత్ అనేది తెలిసిన విషయమే కదా.అందుకే సామాన్యుల కల నిజం చేసి, వాళ్ళను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా  హీరో నాగార్జున చేస్తున్న ప్రయత్నమే "మీలో ఎవరు కోటేశ్వరుడు"  సోమవారం నుండి గురువారం వరకు మా టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే  క్విజ్ షో..

కాబట్టి ఇప్పుడు కోటీశ్వరుడు ఎవరైనా కావచ్చు పురాణాలు,జనరల్ నాలెడ్జ్, చరిత్ర,సైన్స్ ,గతం,వర్తమానం ఇలా ఏదైనా  ఏ విషయంలోనైనా సరే పట్టు ఉండి నిర్ణీత సమయంలో సమాధానం చెప్పగల నేర్పు మీకుంటే మీరే కోటీశ్వరుడు కావచ్చు. హిందీలో అమితాబచ్చన్ యాంకర్‌గా చేసిన  "కౌన్ బనేగా కరోడ్‌పతి" చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉండరేమో .. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు .. హిందీ అయినా సరే అందులో ఒక్కసారన్నా పాల్గొనాలని అప్పట్లో మన వాళ్ళు కూడా ఎంతో  ప్రయత్నించే వాళ్ళు  . 

మా కనకశ్రీ టీచర్ ,వాళ్ళాయన తో కలిసి చాలా సార్లు ఫోన్ చేస్తూ వుండేవాళ్ళు KBC కి ..వాళ్ళింటికి  ట్యూషన్ కి వెళ్లి వాళ్ళని చూస్తూ మేము కూడా కోరుకునే వాళ్లము టీచర్ గారికి అవకాశం  వస్తే బాగుండు అని. పాపం ఆ కోరిక తీరలేదు కానీ రాధిక బంగారం ఇచ్చే ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యి ఫ్యామిలీతో సహా వెళ్లి బంగారం గెలుచుకుని వచ్చారు మా టీచర్ .. అలా అప్పటి నుండే ఈ గేమ్ షోలంటే చాలా ఆసక్తి ఉంది  జనంలో. ఆ మధ్య వచ్చిన  'కో అంటే కోటి' కూడా ఇలాగే ఆదరణ పొంది మధ్యలోనే ఆగిపోయింది 

ఇక ఈ మధ్య ఈ టీవీ లో సుమ చేస్తున్న "కాష్  దొరికినంత దోచుకో" ప్రోగ్రాం లో మామూలు మనుషులకు ప్రవేశం లేదు. కేవలం టీవీ,మూవీ సెలెబ్రిటీలకు మాత్రమే ఇందులో ప్రవేశం .. ఈ విషయం మాత్రం నాకు నచ్చలేదు.  సుమ ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళని స్టూడియోకి పిలిపించి డాన్సులు వేయిస్తుంది కానీ లక్షలు  మాత్రం సెలెబ్రిటీలకు మాత్రమె అంటే ఎలా?? ఇక ఈ కాష్ లో వస్తువులు  కిందికి దొర్లుతుంటే అవి నిజంవా  ఏంటి కొంప తీసి అని చూసేవాళ్ళు  టెన్షన్ పడుతుంటారు.

ఇప్పుడు మా టీవీలో వస్తున్న "మీలో ఎవరు కోటీశ్వరుడు"  గత సోమవారం మొదలుపెట్టి గురువారం దాకా ప్రేక్షకులను టీవీలకు అతుక్కునేలా చేసిందని చెప్పొచ్చు .. కార్యక్రమం అంతా KBC లాగానే వున్నా తెలుగులో రావటం, హీరో నాగార్జున కార్యక్రమాన్ని నడిపించటం ఆసక్తిని కలిగిస్తుంది. 10 లక్షల మంది SMS లు పంపినా 1500 మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేయటం వాళ్ళలో నుండి కేవలం పదిమంది మాత్రమే హాట్ సీట్ కోసం పోటీ పడటం ఒక ఎత్తైతే హాట్  సీట్ దాకా వచ్చినా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో , ఎంత గెలుచుకుంటారో  ఎవరూ ముందే చెప్పలేరేమో. 

పోయినవారం వచ్చిన  కంటెస్టెంట్స్‌ లో టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు,  గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ,ఇంటర్మీడియేట్ అమ్మాయి, కాంపిటీటివ్ ఎక్జామ్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఒకరు,తండ్రి కోరిక మేరకు pg చదువుతున్న బామ్మగారు ఇలా విభిన్న రంగాల వ్యక్తులు ఉన్నారు. రోజూ చదువుతూనే వుంటారు కదా వీళ్ళు ఈజీగానే గెలుస్తారులే అనుకున్నవాళ్ళు కూడా తక్కువ డబ్బుతోనే వెళ్ళాల్సి వచ్చింది . ఇక్కడికి  వచ్చిన వాళ్ళలో చాలామంది కోరిక డబ్బు గెలిస్తే  సొంతిల్లు కట్టుకోవాలని.. నిజంగా సొంతిల్లు కావాలనే కల సామాన్యుల ఆశ  మాత్రమే  కాదు అవసరం కూడా ..  

ఇంక ఇందులో అడిగే ప్రశ్నలు మనకి తెలియనివి వుంటే తెలుసుకోవచ్చు .ఇలా చూసి గుర్తుపెట్టుకున్నవి చాలా రోజులు గుర్తుంటాయి కాబట్టి ఏదైనా  పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్ధులకు,ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లకి ఉపయోగంగా ఉంటాయి ..కొన్ని ప్రశ్నలు చూస్తున్న మనకి ఈజీ అనిపిస్తాయి, అక్కడ కూర్చున్న వాళ్లు సమాధానం చెప్పలేరు. ఇది కూడా చెప్పలేరా అనుకుంటాం కానీ మనం ఆ ప్లేస్ లో ఉంటె అప్పుడు మనం కూడా అంతేనేమో అనిపిస్తుంది మళ్ళీ ..
  
కంటెస్టెంట్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారా, తప్పా అనేది నాగార్జున గారి ఫీలింగ్స్ ని బట్టి చెప్పొచ్చేమో అనిపిస్తుంది . ఎవరైనా తప్పు చెప్పగానే ముందు ఆయనే ఎక్కువ బాధగా ఫీల్ అవుతున్నారు .. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళ టెన్షన్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారు .. ఇప్పటిదాకా అమితాబ్ KBC షో చూడటం వలన కొన్ని చోట్ల ఆయనలా నాగార్జున చేస్తున్నట్లు అనిపించినా, తనదైన స్టయిల్ లో నాగార్జున హుందాగా, సరదాగా అభిమానులను ఆకట్టుకుంటున్నారు .. ఇక  క్విజ్ షో పూర్తిగా అయిపోయేలోపు నాగార్జున గారికి అభిమానంతో  ఎన్ని కానుకలు  వస్తాయో మరి  :) వచ్చిన వాళ్ళు కొందరు నాగార్జున గారిని తెగ పొగిడి ఇబ్బంది పెట్టేస్తున్నారు .. నేను జీవితంలో చూసిన మొదటి సినిమా మీదే అన్నారు ఒకరు .. నిజమేనంటారా ??

మొత్తానికి డబ్బింగ్  సీరియల్స్ చూసి బుర్ర చెడగొట్టుకునే బదులు వారంలో నాలుగు రోజులు "మీలో ఎవరు కోటీశ్వరుడు" చూసి బుర్ర పెంచుకోవచ్చు .. డబ్బు గెలుస్తున్న వాళ్ళను చూసి ఉడుక్కోకుండా మనం కూడా అక్కడికి ఎలా వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ, అలాగే నాగార్జున గారికి మంచి గిఫ్ట్ కూడా ఆలోచించి ఉంచుకోవచ్చు. అందరూ ఇస్తున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా మరి :).  ఈ షోలో అవకాశం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటా రేమో .. అలా కోరుకోవటం తప్పు కూడా కాదు అని నా అభిప్రాయం.. 

ఈ కార్యక్రమం హోస్ట్‌ చేస్తున్న నాగార్జున గారికి,సోమవారం ఆడబోతున్న విజయవాడ బామ్మగారికి, ఈ షో లో పాల్గొనటానికి ప్రయత్నిస్తున్న అందరికి అభినందనలు ... 


14, జూన్ 2014, శనివారం

4 years, 4 months, 4 days ..




నేను బ్లాగ్ రాయటం మొదలుపెట్టి ఇవాల్టికి సరిగ్గా 
"4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు"  పూర్తయ్యింది   :)

బ్లాగంటే ఏంటో తెలియని రోజుల్లో మా "చెల్లి గురువు" గారి సలహాతో, మా అమ్మ ప్రోత్సాహంతో బ్లాగ్ మొదలు పెట్టి మొత్తం 6 బ్లాగులు తయారయ్యాయి ఇప్పటికి.  ఇన్ని సంవత్సరాల నా బ్లాగ్ ప్రయాణంలో కొన్ని బ్లాగు పోస్టులు, కొన్ని కామెంట్లు, కొందరు బ్లాగు మిత్రులు, బ్లాగ్ లోకంలో కొందరు గొప్పవాళ్ళతో పాటు ఒక చిన్న స్థానం..నాకంటూ కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు  ఉన్నాయని ఇంటా , బయటా గుర్తింపుతో  .. 
ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటూ,ఈ లోకంలో మనుషుల గురించి,మనస్తత్వాల గురించి నేను తెలుసుకోవాల్సినవి చాలానే వున్నాయి అని ఆశ్చర్యపోతూ సాగిపోతుంది "నా చిన్నిప్రపంచం" 

బ్లాగ్ పుట్టినరోజు ఫిబ్రవరి లోనే అయిపోయినా ..ఈరోజు బ్లాగ్ మొదలు పెట్టిన రోజుల సంఖ్య, అలాగే 14 తారీకు 2014 సంవత్సరం అన్నీ ఇలా విభిన్నంగా కనపడిన సందర్భంగా నా చిన్నిప్రపంచాన్ని అభినందించాలి అనిపించింది

 ప్రియమైన "నా చిన్నిప్రపంచం" 
"4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు" 
పూర్తి చేసుకున్నందుకు అభినందనలు..  



12, జూన్ 2014, గురువారం

మాటే మంత్రము --- వాగ్భూషణం .. భూషణం..!




*వాగ్భూషణం*
కేయూరాని న భూషయంతి పురుషం ..! హారా న, చంద్రోజ్వాలా..!
న స్నానం.. న విలేపనం... న కుసుమం .. నా లంకృతా మూర్ధజా..
వాణ్యే కా సమలం కరోతి పురుషం ..యా సంశ్రుతా ధార్యతే..!
క్షీయంతే..ఖలు, భూషనాని సతతం ..
వాగ్భూషణం .. భూషణం..!

చేతులకు వేసుకునే గండపెండేరాలు, అలంకార ఆభరణాలు, హారాలు , మంచిగంధ స్నానాలు,పైన పూసుకునే విలేపననాలు, పూలు ఇవన్నీ  కాల క్రమేణా నశించేవే..! కేవలము ..మంచి భాషణం, మంచి మాట ఒక్కటే శరీరానికి శోభనిచ్చేది

వాక్కు లేక మాట  మనిషికి దేవుడిచ్చిన వరం .. ఈ భూమి మీద ప్రాణుల్లో దేనికీ లేని ఇలాంటి అదృష్టం మానవుడి సొంతం.. అందుకే అన్ని ప్రాణుల కంటే "విలక్షణులం" మనం.. వూరికే అనవసరంగా ఏదీ మాట్లాడకూడదు.మనం మాట్లాడే  ప్రతి మాటకు ప్రయోజనం ఉండాలి,పరమార్ధం ఉండాలి , విన్న వాళ్లకు కూడా సమంజసంగా అనిపించాలి .. అతిగా మాట్లాడే వాళ్ళని వసపిట్ట,చిన్నప్పుడు వస ఎక్కువగా పోశారా  అంటుంటారు .. నోట్లో నాలుక వుంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే వుండకూడదు.. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి.

ఎదుటి వాళ్ళను పరుషంగా మాట్లాడటం, నిందలు మోపటం, నిష్టూరాలాడి ఎదుటివారి మనసు నొప్పించటం సరైనది కాదు.. ఎంత శాంత స్వభావులైనా మనం అదే పనిగా మాటలు అంటూ వుంటే పడి  ఉండరన్న విషయం అందరికీ అనుభవమైన విషయమే .. అద్దంలో మనము ఎలా వుంటే అలాగే కనపడినట్లే  మన మాట కూడా... ఎదుటివాళ్ళతో మనం ఎలాగ మాట్లాడతామో అలాంటి మాటలే మనమూ వారి నుండి వినాల్సి వస్తుంది ..   అందుకే ఒకరిని మనం  అనటం ఎందుకు,వారితో తిరిగి మాటలు పడటం ఎందుకు??
  
మన స్వభావానికి,ప్రవర్తనకి మనం తినే ఆహారం కూడా కారణం  అవుతుందట, ఎవరైనా కోపంగా మాట్లాడితే మిరపకాయ తిన్నావా అంటారు .. పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తూ అరిచే  వాళ్ళని కల్లు తాగిన కోతి అంటారు .
మంచిగా మాట్లాడే వాళ్ళని ఎంత తియ్యని మాట చెప్పావు అంటారు... అలాగని సాత్వికాహారం తినే వాళ్ళందరూ మర్యాదగా,మంచిగా మాట్లాడతారు,అలా తినని వాళ్ళు పరుషంగా మాట్లాడతారు అనే రుజువులు ఎక్కడా లేవనుకుంటాను..


నేను నిజాలే మాట్లాడతాను దాని వల్ల ఎవరికి నష్టం, కష్టం కలిగితే  నాకేంటి అంటుంటారు కొందరు .. నిజం మాట్లాడటం మంచి పద్ధతే కాని ఆ నిజం చెప్పటానికి కూడా ఒక పద్దతి వుంటుంది .. మీరనుకున్న ఆ నిజం కొందరికి నిష్టూరంగా అనిపించొచ్చు .. ఆ నిజం  వలన కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ కావచ్చు .. కాబట్టి ఒక మనిషి గురించి ఎవరు ఏమి చెప్పినా విని నమ్మేసి ఆ మనిషి మీద ఒక అభిప్రాయం  ఏర్పరచుకోవటం,ఆ విషయాన్ని సంబధిత వ్యక్తితోనే మాట్లాడి మన సందేహం  తీర్చుకోకుండా ఆ  వ్యక్తి  గురించి మరొక వ్యక్తి దగ్గర మాట్లాడటం చాలా పెద్ద తప్పు ..ఇలా చేయటం వలన లేనిపోని కొత్త సమస్యలు తలెత్తుతాయి .. 

ఇంకా కొందరుంటారు వాళ్ళు చెప్పాలనుకున్నదే చెప్తూ పోతారు కాని ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా,తిరిగి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని పట్టించుకోకుండా నేను మాట్లాడాలి,నువ్వు వినాలి అనే ధోరణిలో మాట్లాడుతూనే వుంటారు .. 

మరికొందరు మనసులో వుండే ఆలోచనలు బయటపడకుండా,మనసులో ఒకటి పెట్టుకుని,బయటకు మరొకటి మాట్లాడుతుంటారు.. నిజంగా ఇలా మనసులో ఏముందో బయటపడకుండా మాట్లాడటం కూడా ఒక గొప్ప "కళ" అనొచ్చేమో ... ఇలాంటి వాళ్ళనే  "నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే రకం" అంటారు .. 

ఇంకొందరు మాట్లాడితే మాటల్లో వెటకారం కొట్టొచ్చినట్లు
కనపడుతుంది .. అలా మాట్లాడటం ఒక గొప్పగా తమకంటే గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఇంకెవరికీ లేనట్లు ఫీల్ అవుతుంటారు .. వెటకారం మరీ ఎక్కువైతే వికటించే ప్రమాదం కూడా వుందని గుర్తిస్తే మంచిది .. 

మాటలు మనిషి ఆలోచనలకు ప్రతిరూపాలు .. కొందరి మాటలు వారిలో అహంకారాన్ని,గర్వాన్ని,అసూయని ప్రదర్శిస్తే,కొన్ని మాటలు మంచితనం, ఆత్మీయతకి మారుపేరుగా అనిపిస్తాయి .. ఒక్కోసారి బెదిరించి ఒప్పించలేని విషయాలు కూడా మంచి మాటలతో ఒప్పించి మెప్పించగలము  ..అలాగని కోపంగా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు,మంచిగా మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోలేము .. కోపంగా మాట్లాడినా  మనకి  మేలు చేసేవాళ్ళు కొందరైతే, తియ తీయని తేనెల మాటలతో గోతులు తీసేవారు మరికొందరు .. కాబట్టి మాటల గారడీకి  మోసపోకుండా జాగ్రత్తపడాలి .. 

కత్తితో  చేసిన గాయం అయినా కొంత కాలానికి మానిపోతుంది కానీ మాటతో చేసిన గాయం ఎప్పటికీ మానకుండా  బాధిస్తూనే ఉంటుందట . అందుకే " జారవలదు  నోరు జాగ్రత్త " అన్నారు పెద్దలు .. వాక్కు భూషణమే కాదు రెండువైపులా పదునున్న ఆయుధం కూడా .. అందుకే మాట్లాడటం నా జన్మ హక్కు కాబట్టి  నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతా అనకుండా ఈ హక్కును ఎంత  జాగ్రత్తగా ఉపయోగించుకుంటే  అంత మంచిది .. 

"ఇతరులు ఏమి చేస్తే, మన మనసు బాధపడుతుందో అలాంటి పనులు మనం ఇతరులకు చేయకుండా ఉండటమే ఉత్తమ ధర్మం" మాటల విషయంలో కూడా ఈ ధర్మాన్ని పాటిస్తే   డబ్బులు  ఖర్చు పెట్టి మరీ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్  క్లాసులు తీసుకోవాల్సిన అవసరం రాదేమో ..  "పలుకే బంగారమాయెనా" అని భక్త రామదాసు రాముడిని అన్నట్లు మాటలను బంగారమంత విలువగా, జాగ్రత్తగా, పొదుపుగా కాపాడుకోవటం మనిషికి అన్ని వేళలా మంచిది .. 

ఇప్పటికే మాటల గురించి చాలా ఎక్కువగా మాట్లాడినట్లున్నాను .. 
ఇక ఉంటాను ఇప్పటికి  .../\...



Related Posts Plugin for WordPress, Blogger...