కావ్య వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చిన దగ్గరి నుండి కావ్య నన్ను ఏమి అడగబోతుందా అన్న ఆలోచనే వెంటాడుతుంది.ఉదయాన్నే కాలేజ్ కి వెళ్ళాము అందరం. కాలేజ్ లో ఈ రోజు క్లినికల్ వార్డులో, అవుట్ పేషెంట్ డిపార్ట్ మెంట్లో పేషెంట్స్ తో మాట్లాడి వాళ్ళ ఆరోగ్య సమస్యలు నోట్ చేసుకోవటం, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలి. పేషెంట్స్ ని చికిత్స కన్నా ముందు మన మాటలతో ఎలా సాంత్వన కలిగించాలి ఇలాంటి విషయాలను చాలా చక్కగా వివరిస్తున్నారు మా ప్రొఫెసర్ ఎర్రన్న ..
ప్రశాంతంగా ఆలోచించగలగాలి . ఎదుటి వాళ్ళ ప్రాణాలు మన చేతిలో ఉన్నాయన్న బాధ్యత, ఉండాలి కానీ గర్వం లేకుండా ఉండటమే ఒక డాక్టర్ వృత్తి ధర్మం లో ముఖ్యమైనది .. ఏంటో ఇలా పాఠాలు చెప్తారు కానీ పేషెంట్స్ తో అంత మర్యాదగా,నిదానంగా మాట్లాడుతూ వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ,ఆరోగ్య చరిత్రలు తెలుసుకుంటూ వైద్యం చేయాలంటే రోజుకి ఎంతమందికి వైద్యం చేయగలం,ప్రాక్టికల్ గా ఇవన్నీ సాధ్యమేనా??
మొత్తానికి అవుట్ పేషెంట్ వార్డుకి వెళ్లి BP ఆపరేటస్ తెచ్చుకుని ఒక పేషెంట్ కి BP చూస్తుండగా కావ్య కూడా అక్కడికి రావటం,నా ఆలోచన తన వైపుకి మళ్ళటం అప్రయత్నంగా జరిగిపోయింది.ఈలోగా పేషెంట్ కి మోచేతి పైన పెట్టిన BP కఫ్ (cuff ) బిగుసుకుపోయి పేషెంట్ నొప్పితో పెద్దగా అరుస్తూ అసలే కుర్చీలో కాకుండా స్టూల్ మీద కూర్చున్నాడే మో అలాగే వెనక్కి పడిపోయాడు..
అతనికేమి జరిగిందా అని ఇక్కడ నా గుండె ఆగిపోయింది. వార్డంతా గొడవ గొడవగా అక్కడికి చేరారు.నా ఫ్రెండ్ సోహిల్,రఫీ వెంటనే అతన్ని లేపి కూర్చోపెట్టి మాట్లాడించారు. కొంతమంది పేషెంట్స్ ఎంత పెద్ద జబ్బైనా నిబ్బరంగా ఉటారు కానీ కొంతమంది మాత్రం చిన్న జ్వరానికి కూడా కంగారుపడి,పదిమందిని కంగారు పెట్టి హంగామా చేస్తారు.. ఇతను కూడా అలాంటివాడే అసలే తన గుండెకి ఏదో అయ్యిందన్న భయంలో హాస్పిటల్ కి వచ్చిన ఆయన చేతి దగ్గర కొద్దిగా బిగుసుకోగానే తనకేదో అయ్యిందని భయపడిపోయాడు.
అతనికేమీ ప్రమాదం లేదని తెలుసుకున్నాక ఇప్పుడు నన్ను కాపాడే ప్రయత్నం మొదలుపెట్టారు నా ఫ్రెండ్స్. ఆ పేషెంట్ ని గట్టిగా కసురుతూ అయినా ఇంత చిన్నదానికి అంత గొడవ చెయ్యాలా. BP ఎలా చూడాలో మాకు తెలుసా నీకు తెలుసా అంటూ అతన్ని భయపెట్టి,బుజ్జగించి అక్కడినుండి పంపేశారు. ( పేషెంట్స్ ని అప్పుడప్పుడు నీకు తెలుసా నాకు తెలుసా అని బెదిరించటం కూడా డాక్టర్ ప్రొఫెషన్ లో ఒక స్కిల్ అని తర్వాత తెలిసింది)ఎలాగో మా హెడ్ అక్కడ లేకపోవటం పెద్ద ప్రమాదం తప్పింది.నాకు అందరిముందు తల కొట్టేసినంత పనయ్యింది . ఛీ వెధవ జీవితం ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తాను అని నన్ను నేనే తిట్టుకున్నా కాసేపు.
ఉదయం ఈ క్లాసులు అవ్వగానే లంచ్ కి వెళ్ళాము. మళ్ళీ కాలేజ్ కి రాగానే కావ్య లైబ్రరీకి వెళ్దాం రమ్మంది. లైబ్రరీలో స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారు. ఇందాక జరిగిన విషయం కాస్త సిగ్గుగా అనిపించింది కావ్య ముందు.కానీ తను ఆ విషయం ఏమీ గుర్తులేనట్లే లంచ్ చేశావా మాధవ్ అని,నిన్న నేను మా ఇంట్లో అడిగిన విషయం గుర్తుంది కదా అంది. నేను ఆ విషయం ఎప్పుడు చెప్తావా అనే ఎదురుచూస్తున్నాఅన్నాను.
మాధవ్ నువ్వు మన ఫ్రెషర్స్ డే రోజు నీ గురించి చెప్తూ కొన్ని మాటలు చెప్పావ్ అవి నీకు గుర్తున్నా లేకపోయినా నాకు మాత్రం బాగా గుర్తుండిపోయాయి, ముఖ్యంగా నువ్వు చెప్పావు కదా మనిషి తలచుకుంటే, గట్టి పట్టుదల ఉంటే ఏదైనా చేయగలమని ఆ మాట అన్ని విషయాల్లో సాధ్యమవుతుందా అంది. కావ్య మాటలు వినగానే అప్పటి విషయాలు ఇప్పటికీ గుర్తుంచుకుని నన్ను మెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది.
నా మనసులో అప్పటిదాకా ఉన్న ఉదయం పేషెంట్ బాధ పోయి ఉత్సాహం నిండిపోయింది.మళ్ళీ వివేకానంద బోధనలు మొదలు పెట్టేశాను.. తప్పకుండా కావ్యా చిన్నప్పటి నుండి నాకంటూ సొంత ఆలోచన లేకుండా అమ్మమ్మ,తాత,నాన్నమ్మ,నాన్న,అమ్మ,అక్కలు, అన్న ఇలా అందరి మధ్యలో నేను ఒక చిన్నపిల్లాడిని అనే భావంతో, నా విషయాలు ఏవైనా వాళ్ళే చూసుకుంటార్లె అనే నిర్లక్షంతో పెరిగాను కానీ మా నాన్నకి గిఫ్ట్ గా ఇంటికి వచ్చిన వివేకానంద పుస్తకం చదివాక మనిషి ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను.
ఆ ప్రభావంతోనే మెడిసిన్ లో మొదటిసారి సీట్ రాకపోయినా సొంతగా నానని ఒప్పించి మరీ లాంగ్ టర్మ్ చేసి సీట్ సాధించాను. అందుకే తలచుకుంటే మనం ఏదైనా చేయగలమని నాకు గట్టి నమ్మకం.సరే కావ్యా ఇప్పటికే నిన్ను విసిగించాను .. ఎనీ హౌ అప్పటి మాటలు గుర్తుంచుకుని ఇప్పుడు మెచ్చుకున్నందుకు చాలా థాంక్స్ సరే ఇంతకీ నేనేమి హెల్ప్ చేయగలను నీకు అనగానే కావ్య మా పక్కన టేబుల్ చూపిస్తూ అక్కడొక బ్యాగ్ ఉంది చూడు మాధవ్ అది నా ఫ్రెండ్ శైలుది అందులో తన పర్స్ ఉంటుంది తనకి తెలియకుండా తెచ్చిస్తావా? అంది.
నాకు ఒక్క క్షణం తను ఏమి అడిగిందో అర్ధం కాలేదు, అర్ధం అయిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఛీ ఈ పని చెయ్యటానికా నన్ను ఇంతలా మాట్లాడించింది. అసలు తను నా గురించి ఏమనుకుంటుంది? ఎందుకు ఇలా చేసింది. నేను మరీ అంత వెధవలా కనిపించానా? అందరితో పాటు తను కూడా నన్ను అవమానిస్తుందా అనిపించింది. కానీ ఎక్కడో ఒక మూల కావ్య అలా చేసే అమ్మాయి కాదే అని సందేహం కూడా రాకపోలేదు.ఇటు కావ్య మాత్రం ఏ ఫీలింగ్స్ లేకుండా నేను పర్స్ తెస్తానా, తేనా అన్నట్లు వెయిట్ చేస్తుంది.