పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, మే 2015, గురువారం

కొండపల్లి బొమ్మలు -- కొండపల్లిలో

  
 

"కొండపల్లీ  కొయ్యా బొమ్మ  నీకో బొమ్మా నాకో బొమ్మ" అని చిన్నపిల్లలు పాడుకునే పద్యాల దగ్గరి నుండి,అందమైన అమ్మాయిని కొండపల్లి బొమ్మతో పోల్చే దాకా కొండపల్లి బొమ్మల గురించి తెలియని వాళ్ళు ఉండరేమో..  ఆంధ్రప్రదేశ్ లోని  కృష్ణా జిల్లా,ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన కొండపల్లి గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు.400 సంవత్సరాల నాటిదిగా చెప్తున్న ఈ కళ నిజంగా చాలా ప్రత్యేకంగా, అద్భుతంగా ఉంటుంది. 

ఈ బొమ్మలు ఏదో సులభంగా మౌల్డ్స్ తో చేసేవి కాదు,ప్రతి బొమ్మా దేనికదే చెక్కి,అవసరమైన భాగాలను విడిగా అతికిస్తూ,ఎంతో  ఓపికగా సహజమైన రంగులద్ది తయారుచేస్తారు.ఆ ప్రాంతంలో దొరికే "పొనికి కలప " అనే చెక్కతో చేసే ఈ బొమ్మలు ఎంత పెద్ద బొమ్మైనా సరే చాలా తేలికగా ఉంటాయి. దశావతారాలు, ఏనుగు మావటీ,పెళ్లి పల్లకి,ధాన్యం బస్తాలతో ఉన్న ఎద్దులబండి,తాటిచెట్టు ఎక్కుతున్నమనిషి ఇవి కొండపల్లి బొమ్మల్లో ఫేమస్ అని చెప్పొచ్చు.

ఈ కొండపల్లి బొమ్మలు కళాంజలి,లేపాక్షి లాంటి హస్తకళల విక్రయశాలల్లో దొరుకుతాయి కానీ ఈసారి మాచెల్లి కోరిక మీద  కొండపల్లికి  వెళ్లి మరీ ఈబొమ్మలు తెచ్చుకోవటం ఎప్పటికీ గుర్తుండే ఒక మంచి అనుభవం. 
2 నెలల క్రితం గుంటూరు వచ్చిన మా చెల్లి చూడాలనుకున్న ప్లేసెస్ లో ఈ కొండపల్లి ప్రధానంగా పెట్టుకుని వచ్చింది.కొండపల్లి బొమ్మలు లేపాక్షిలో కూడా దొరుకుతాయి కదే అంటే ఆన్ లైన్ లో కూడా దొరుకుతాయి కానీ నేను అక్కడికి వెళ్లి చూడాలనుకుంటున్నాను అంది. సరే అక్కడ కృష్ణదేవరాయల తో సహా ఎన్నో రాజవంశాల పాలన  కొనసాగిన కొండపల్లి కోట కూడా ఉంది కదా అది కూడా చూసి రావచ్చు అని బయల్దేరాం... 

ముందుగా విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని,అక్కడినుండి మా కార్ డ్రైవర్ అడ్రెస్ అడుగుతూ కొండపల్లి తీసుకెళ్ళాడు.విజయవాడ నుండి త్వరగానే కొండపల్లి వెళ్ళాము.ఎప్పుడో పురాతనకాలంలో పల్లెటూరుని చూసినట్లే అనిపించింది ఆ ఊరిని చూస్తుంటే..కొండపల్లి బొమ్మలకి ఆ వూర్లో ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ లాంటిది ఏమీ లేదని చెప్పారు.ఒక వీధిలో ఇళ్ళ మధ్యలోనే వరసగా అన్నీ షాపులు ఉన్నాయి అద్దాల బీరువాల్లో వాళ్ళు తయారుచేసి పెట్టిన బొమ్మలు పెట్టి ఉన్నాయి.అన్నిబొమ్మలు,వాటిని తయారుచేసే షాపులు,కళాకారుల్ని చూడటం వింతగా,లేపాక్షి లాంటి ఎగ్జిబిషన్స్ లో ఆ బొమ్మల్ని చూడటం కంటే అప్పటికప్పుడు కళాకారుల  చేతుల్లో ప్రాణం పోసుకుంటున్న ఆ బొమ్మల్ని చూడటం చాలా సంతోషంగా అనిపించిది.. 
కొండపల్లిలోమేము బొమ్మలు కొన్న షాపు. 

మేము అక్కడున్న వాటిల్లో ఒక షాప్ లోకి వెళ్ళగానే బొమ్మల్ని వాళ్ళే తయారుచేసి అమ్ముతున్న ఆ షాపతను మేము ఆ బొమ్మల కోసమే కొండపల్లి దాకా వెళ్ళామని తెలుసుకుని, చాలా సంతోషంగా వాళ్ళు తయారు చేసిన బొమ్మలన్నీ చూపిస్తూ, ఎలా తయారుచేస్తారు అనే విషయాల్ని చెప్పాడు. మా తాతల కాలం నుండి మేము నేర్చుకున్నాము కానీ ఇప్పుడు ఈ కళకి ప్రభుత్వం నుండి సరైన సపోర్ట్ లేకపోవటం మూలంగా మా పిల్లలు నేర్చుకోవటానికి, ఈ వృత్తిలో కొనసాగటానికి ఇష్టపడటం లేదు,మేము కూడా వాళ్ళని ఒత్తిడి చేయలేకపోతున్నాము.. షోరూమ్స్ వాళ్ళు బొమ్మలు మా దగ్గర తక్కువ రేటుకి కొని బయట ఎక్కువ రేటుకి అమ్ముతారు,వాళ్ళు ఎంత చెప్పినా కొంటారు కానీ మా దగ్గర బేరాలాడుతారు అంటూ ముందే మమ్మల్ని బేరం ఆడటానికి సందేహించేలా చేసేశాడు. 

  బొమ్మలు ఎలా చెక్కుతారో చూపిస్తున్న 
షాపతను
 

మాకు కూడా అది నిజమే కదా అనిపించింది. అదే ఏ లేపాక్షికో వెళ్తే అక్కడ బొమ్మ మీద ఎంత స్టిక్కర్ వేస్తే  అంతకి సైలెంట్ గా కొంటాము కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర,మన ఇళ్లదగ్గర అమ్మటానికి వచ్చే చిన్న వ్యాపారుల దగ్గర బేరమాడతాము అనుకుని,మాకు నచ్చిన కొన్ని బొమ్మలు సెలక్ట్ చేసుకుని రీజనబుల్ రేట్స్ మాట్లాడుకుని, కొనుక్కుని వచ్చేశాము.ఏ బొమ్మ చూసినా భలే  ఉంది  అనిపించేలా ఉంది ఆ కళాకారుల అద్భుత సృష్టి.  

 మేము బొమ్మలు కొన్న షాప్

 

ఈ ప్రాంతంలో ఏ ఫంక్షన్స్ అయినా గాజు బాక్స్ లో 
సెట్ చేసిన ఈ దశావతారాలు గిఫ్ట్ గా ఇస్తారట.

 

మనం కొన్న బొమ్మల్ని ఇలా సరిపోయే అట్టపెట్టేల్లో
పెట్టి,వాళ్ళే Pack చేసి ఇస్తారు. 

బొమ్మలు తయారుచేసే చెక్కని  ఈ ఫోటోలో చూడొచ్చు.  

విష్ణుమూర్తి దశావతారాలు 
కొండపల్లి బొమ్మల్లో ప్రఖ్యాతి చెందినవి. 


ఈ బొమ్మ చాలా బాగుంటుంది.ముఖ్యంగా ఆ ధాన్యపు
బస్తాలు నిజమైన వాటిలా భలే ఉంటాయి.


ఏనుగు అంబారీ


పెళ్లి పల్లకి

 
బృందావనం లో గోపెమ్మలతో కృష్ణుడు


వస్తున్నప్పుడు సంతోషంగా,నవ్వుతూ మాకు,పిల్లలకి టాటా చెప్తున్న 
ఆ షాపతన్ని చూస్తే హమ్మయ్య మేము అతన్ని మరీ విసిగించి,బాధపెట్టి బొమ్మలు తక్కువ రేటుకి కొనలేదులే అనిపించింది .. :)


కొండపల్లి కోట చూడాలనుకున్నాము కానీ కుదరలేదు.మొత్తానికి మా చెల్లి కోరిక మేరకు ఒక మంచి ఊరిని,,కళని,కళాకారులని ప్రత్యక్షంగా చూసిన సంతోషం కలిగింది..ఇవీ మా కొండపల్లి బొమ్మల కబుర్లు. 


19, మే 2015, మంగళవారం

S/O సత్యమూర్తి - Pious Obligation Of A Son



Doctrine of Pious Obligation -

The moral liability of sons to pay off and discharge their Father's Non-Avyavaharika Debts. 


ఒక మనిషి అప్పు తీసుకుని,తీర్చకపోవటం చట్టం దృష్టిలో నేరమే కాదు, దేవుడి దృష్టిలో పాపం కూడా. అలా ఎవరి దగ్గరైనా అప్పుచేసిన మనిషి అప్పు తీర్చకుండానే చనిపోతే ఆ పాపం వలన అతనికి స్వర్గంలోకి ప్రవేశం ఉండదు కాబట్టి,తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి తప్పించే వాడే  కొడుకు కాబట్టి ఆ అప్పు తీర్చి,తండ్రిని పాపవిముక్తుడ్నిచేసే "పవిత్రమైన బాధ్యత"ను (Pious Obligation)  కొడుక్కి అప్పగించింది Family Law .. తండ్రి ఆస్తుల మీద హక్కే కాదు  అప్పులకు  బాధ్యత కూడా కొడుకు తీసుకోవటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం... Pious Obligation కేవలం అప్పులకు సంబంధించినదే కాదు తండ్రి చేసిన పాపం , పుణ్యం అన్నిటిలో బాధ్యతా తీసుకోవటమే..

అలాంటి ఒక పవిత్రమైన బాధ్యతను నిర్వర్తించిన ఒక మంచి కొడుకే  విరాజ్ ఆనంద్ S/O సత్యమూర్తి."విలువలే ఆస్తి" గా బ్రతికే తండ్రికి తగిన కొడుకు. అందరిలాగా మానాన్న నాకు అనుభవించటానికి బోల్డంత ఆస్తి ఇచ్చాడు అనకుండా బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు అంటాడు.అలా అనటమే కాదు అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోయిన తండ్రి బాధ్యతల్ని కూడా బాధతో కాకుండా ఆనందంగానే  స్వీకరిస్తాడు. 

తండ్రి చనిపోయేనాటికి ఆస్తులు,అప్పులు సమానంగా ఉన్నాయి. IP పెట్ట మన్న కొందరి సలహాని కాదని తన తండ్రిని ఎవరు గుర్తు పెట్టుకున్నా గొప్పవాడిగానే గుర్తుంచుకోవాలని అప్పుల్ని తీర్చేసి,తల్లి,మతిస్థిమితం లేని అన్న,వదిన వాళ్ళ పాపతో కుటుంబ బాధ్యత మొత్తం తనొక్కడే తీసుకుని చిన్నఇంటికి మారిపోతాడు.ఇక అక్కడి నుండి జీవితం కోసం పోరాటం మొదలు పెడతాడు విరాజ్.వెడ్డింగ్ ప్లానర్ గా వెళ్లి,అక్కడ సమంత పరిచయం అయ్యి,ప్రేమించి,తన తండ్రి  మీద గొడవల్లో ఉన్న ఆస్తి అమ్మాడన్న నిందని తొలగించటానికి తమిళనాడులో రౌడీ ఉపేంద్ర దగ్గరికి వెళ్లి,ప్రాణాలకు తెగించి మరీ అక్కడ తను అనుకున్నది సాధించటమే కధ...

సినిమాలో కొన్ని పాత్రలు మనం నిజజీవితంలో చూసే ఎంతో మంది మనుషుల ఆలోచనా విధానాలని,వ్యక్తిత్వాలను కళ్ళముందుంచుతాయి.

నాన్నా పులి కధలో .. మూడోసారి కూడా పిల్లాడు పిలిచినప్పుడు తండ్రి వెళ్లి ఉంటే పిల్లాడు బ్రతికేవాడు కదా.!కొన్నిసార్లు మోసపోయినా దానివల్ల మంచి జరిగితే మంచిదే కదా..అనే నాన్న క్యారెక్టర్ ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మళ్ళీ ఎదుటివాళ్ళకి సహాయం చేయగల మంచి మనసున్న మనుషుల్ని గుర్తుచేస్తుంది.

"భార్యంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత,పిల్లలంటే మొయ్యాలనిపించే బరువు" ఎంతో ఇష్టపడి ఇంటికి తెచ్చుకునే భార్య,కోడలు ఎలా ఉండాలో సింధుతులాని పాత్ర అలాగే ఉంది.పిచ్చి భర్త,అప్పులపాలైన అత్తగారి ఇల్లు వదిలి రమ్మని తండ్రి అడిగినా వెళ్ళకుండా,తన నగలు కూడా ఇచ్చేసి, కష్టాల్లో బాధ్యతల్లో పాలుపంచుకుని,మంచి భార్య,కోడలు అంటే ఇలాగే  ఉండాలి అనిపిస్తుంది. 

నేను ఒకప్పుడు మా వాళ్లకి ఉద్యోగం కోసం వస్తే మీ నాన్న కుదరదు అన్నాడు,అప్పట్లో మీకు డబ్బుందని గర్వం ఉండేది అనే ఇంటి ఓనర్.. ఒకప్పుడు తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నీకోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని మాటలతో హింసిస్తూ ఆనందించే మనషుల ప్రవర్తనని చూపిస్తుంది.

అన్న కూతురి  స్కూల్ ఫీజ్ కోసం ఫ్రెండ్ దగ్గర హెల్ప్ కోసం వెళ్తే వెడ్డింగ్ ప్లానర్ గా పంపిన ఫ్రెండ్ మంచితనం గురించి గొప్పగా ఫీల్ అయ్యేలోపే, తనతో ఎంగేజ్ మెంట్ జరిగి,తన తండ్రి చనిపోయి,ఆస్తులు పోవటం వలన  ఆగిపోయిన అమ్మాయి పెళ్లి అని,కావాలనే అక్కడికి తనని పంపిన ఫ్రెండ్ ని చూస్తే, మన పక్కనే ఉంటూనే సమయం చూసి,  దెబ్బకొట్టాలనుకునే ఇలాంటి శాడిస్ట్ మనుషుల్ని మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసిన జ్ఞాపకం తప్పకుండా వస్తుంది. 

తమ్ముడి కూతురి పెళ్ళికి వచ్చి,తమ్ముడు తనని మోసం చేసి ఆస్తి ఎలా తీసుకున్నాడో చెప్పే ఎమ్మెస్ నారాయణ ప్రస్తుత కాలంలో సొంత అన్నదమ్ముల చేతిలో మోసపోయి, ఆస్తులు పోగొట్టుకుని వీధుల్లో పడుతున్న ఎంతోమందికి ప్రతిరూపంలా అనిపించాడు.ఆస్తి కోసం తోడబుట్టిన వాళ్ళని పిచ్చివాళ్ళని చేయటానికి, అవసరమైతే చంపటానికి కూడా వెనుకాడని కొందరు మనుషులు గుర్తొచ్చారు. 

గెలుపంటే పెద్ద పెద్ద కార్లు,ఆస్తులు,అంతస్తులు సంపాదించటమే కానీ విలువలు అంటూ అన్నీ కోల్పోయి,వీధుల్లో తిరగటం కాదని గట్టిగా నమ్మే వ్యక్తి రాజేంద్రప్రసాద్. తండ్రి అప్పుల కోసం ఆస్తులు వదిలేసిన హీరోని ఎగతాళి చేస్తుంటాడు.వాళ్ళు మాత్రమే గొప్ప అనుకుని,ఎదుటి వాళ్ళని అసమర్ధులు అనుకునే ఇలాంటి వాళ్ళని మన చుట్టూ చాలా మందిని చూస్తుంటాము.

లైఫ్ లో పట్టుకోవటం గొప్పా,వదిలేయటం గొప్పా? గెలవటం గొప్పా, వోడిపోవటం గొప్పా? అన్న రాజేంద్ర ప్రసాద్ మాటలకి "రావణాసురుడు సీతని పట్టుకుని రాముడి చేతిలో చచ్చాడు,వదిలేసుంటే బతికుండేవాడు. కౌరవులు జూదంలో గెలిచారు, యుద్ధంలో పోయారు అదే జూదంలో ఓడిపోయ్యుంటే హాయిగా బ్రతికిపొయ్యే వాళ్ళు. కాబట్టి కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదలటం,గెలవటం కంటే ఓడిపోవటం మంచిది" అని చెప్పే మాట నిజమే కదా మన పురాణాల్లో ఉన్నగొప్పనీతిని చాలా ఈజీగా, సింపుల్ గా చెప్పేశాడు అనిపించింది. 

అందరితో మంచి అనిపించుకోవాలి అనుకునేవాళ్ళు భారతంలో కర్ణుడి లాగానే అందరికీ అన్నీఇచ్చేసి,ఏమీ లేకుండానే పోతారు అని రాజేంద్రప్రసాద్ అనే మాట కొన్నిసార్లు నిజమే కదా? అనిపిస్తుంది..

ఇంక ఉపేంద్ర గురించి తమిళనాడులో మహా ఘోరమైన,భయానకమైన  రౌడీగా పరిచయం
చేయబడినా అతని నటన,హావభావాలు అంత పెద్ద రౌడీలాగా ఏమీలేడే  అనిపించేలా ఉన్నాయి..భార్య స్నేహ మీద గౌరవం, ప్రేమతో మంచివాడిగా నటించే మంచి భర్త,చెల్లి కోసం తాపత్రయపడే  మంచి అన్న.. మొత్తానికి మంచి విలన్ ఉపేంద్ర. 

పాప పెద్ద టెడ్డీ అడిగితే,చిన్న టెడ్డీ అయినా సరే కొనివ్వటం, స్టేజ్ మీద షో చూడాలన్న పాప కోసం తను డాన్స్ వేయటం,వదినని  టీజ్ చేశాడని పోకిరీని చితక్కొట్టటం,పాప స్కూల్ ఫీజ్ కోసం తనని పెళ్ళి చేసుకోబోయి, క్యాన్సిల్ అయిన అమ్మాయి పెళ్ళికి వెడ్డింగ్ ప్లానర్ గా వెళ్లి,నీకు బాధగా లేదా అంటే మా నాన్న పోయిన బాధ ముందు ఇదెంత అనటం,ప్రేమించిన అమ్మాయి కోసం,తండ్రి మీద ఉన్న చెడ్డ పేరు పోగొట్టటం కోసం ప్రాణాలకు కూడా తెగించటం ఇలా అన్నివిషయాల్లో తనవాళ్ళను,ముఖ్యంగా చిన్న పాపని సంతోషంగా ఉంచాలని తపన పడే హీరోని చూస్తుంటే చిన్నప్పటి నుంచి,ఇప్పటికీ కూడా మనకోసం చిన్నవైనా,పెద్దవైనా త్యాగాలు చేసే మన తమ్ముడు కానీ, అన్నకానీ తప్పకుండా గుర్తొస్తారు .. నాకు మా తమ్ముడు గుర్తొచ్చినట్లు :)

నమ్మిన విలువల కోసం ఎంత కష్టాన్నైనా అనుభవించి,ఒక మంచి కొడుకు, తోబుట్టువు,స్నేహితుడు,భర్త,ముఖ్యంగా మంచిమనిషి అంటే ఇలా ఉండాలి అనిపించే ఇలాటి S/O సత్యమూర్తి లు చాలామంది ఉంటారు.గెలుపు, సంతోషం అనేవి ప్రతి మనిషి కోరుకుంటాడు,కానీ ఎవరికి ఎలాంటి గెలుపు సంతోషాన్ని ఇస్తుంది అనేది ఆ మనిషి మనసుకి సంబంధించిన విషయం.తండ్రి వదిలి పెట్టిన బాధ్యతల కోసం పోరాడుతూనే మా నాన్న లేకపోతే నేను జీరోనా అని ప్రశ్నించుకుని, కాదు I Am Some Thing అని ప్రూవ్ చేసుకున్న విరాజ్ ఆనంద్ కధ నాకు నచ్చింది.

బ్రతికుండగానే తీసుకున్నఅప్పులు ఎగ్గొట్టటానికి,బాధ్యతల నుండి తప్పుకో వటానికి,అక్రమాస్తుల్నికాపాడుకోవటానికి, తోడపుట్టిన వాళ్లకి ఇవ్వవలసిన ఆస్తుల్ని కూడా మాకే కావాలంటూ ఏళ్లతరబడి కోర్టుల్లో దావాలు నడుస్తున్న ఈరోజుల్లో, తండ్రి చస్తే మహా అయితే 2,3 నెలల్లో మర్చిపోవచ్చు కానీ కోట్ల ఆస్తి ఎన్నాళ్ళకి సంపాదించాలీ,ఆయనకీ మంచి పేరు ఉంటే ఏంటి? ఊరంతా తిడితే ఏంటీ< అనుకునే ప్రాక్టికల్  మనుషులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు. 

 తండ్రి చేసిన అప్పులకోసం ఆస్తులు వదిలే కొడుకులు కూడా ఉంటారా?మరీ సినిమా కాకపోతే అనేది కొందరిసందేహం.. ఇంక ఈ సినిమా ఇంతకు ముందు చూసిన కొన్ని సినిమాల్లా అనిపించటాలు, సాధ్యాసాధ్యాలు ఇవన్నీవదిలేస్తే వెనకటి రోజుల్లో వచ్చే"మంచి మనసుకు మంచి రోజులు" లాంటి సినిమాల్లాగా మంచి వాళ్లకి కొన్నాళ్ళు కష్టాలు వచ్చినా మళ్ళీ తప్పకుండా మంచి జరుగుతుందని,కొన్ని సార్లు కోట్ల విలువ చేసే డబ్బు కూడా చేయలేని గొప్ప పనులు మంచితనంతో సాధించొచ్చు అని చెప్పిన ఈ సినిమా,అల్లు అర్జున్ యాక్షన్,కొన్ని డైలాగ్స్ ,పాటలు నాకు నచ్చాయి. 

చల్ చలే చలో .. లైఫ్ సే మిలో 
ఇదో కొత్త చాప్టర్ .. Just Say Hello




రాజ్యం గెలిచినోడు రాజవుతాడు 
రాజ్యం విడిచినోడే రామచంద్రుడు 
యుద్ధం గెలిచినోడే వీరుడు శూరుడు 
యుద్ధం విడిసోటేడే దేవుడు



Related Posts Plugin for WordPress, Blogger...