పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

9, జులై 2015, గురువారం

మంచి - చెడు - ఆదర్శం - అవార్డులు


 


మంచివాడికి మరొక మంచివాడు ఆదర్శం
దేశానికి మంచి చేయాలనుకునే రాజకీయ నాయకుడికి ఒకప్పటి గొప్ప నాయకుడు ఆదర్శం
మంచిమనసుతో  పేదవాళ్ళకి సేవ చేయాలనుకునే ప్రజాసేవకులకు నిస్వార్ధ సేవకులు ఆదర్శం

 అలాగే ... 

దొంగలకి గజదొంగ ఆదర్శం
చెడ్డవాడికి మహా  చెడ్డవాడు ఆదర్శం
మోసగాడికి మరొక మోసగాడు ఆదర్శం
నీచుడికి అంతకంటే పెద్ద నీచుడు ఆదర్శం
స్వార్ధపరుడికి తనకంటే గొప్ప స్వార్ధపరుడు ఆదర్శం

మనుషులందరికీ  చాలా ఆదర్శాలు ,ఆశయాలు ఉంటాయి. కానీ కొందరికి మాత్రం డబ్బు కోసం, సమాజంలో పేరు ప్రతిష్టలకోసం, తాము చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవటం కోసం రాజకీయాలు, ప్రజాసేవలు చేయటం (చేస్తున్నట్లు నటించటం ) మహా ఇష్టం..

రాజకీయాల్లో అవినీతి అందరికీ తెలిసిందే దాని గురించి కొత్తగా మాట్లాడేదేమీ లేదు కానీ ఈ రాజకీయాన్ని మించిన రాజకీయం ఇప్పుడు స్వచ్చంద సంస్థల్లో జరుగుతుంది. ఒకప్పుడు చారిటీస్ అంటే నిస్వార్ధంగా తమకున్నదాన్లోనే పేదలకు సేవ చేస్తూ ఎవరైనా దాతలు ఇచ్చిన వాటిని పేదవారి  బాగోగులకే వినియోగిస్తూ బతికిన ఎందరో సమాజసేవకులని మనం చూశాము..కానీ ఇప్పుడు కొందరు నిరుద్యోగులకి పునరావాస కేంద్రాలుగా,ఈజీ మనీ కోసం, గొప్ప సేవకుడనే పేరు కోసం ఆరాటపడే కొందరు మోసగాళ్ళకి నిలయాలుగా  స్వచ్చంద సంస్థలు తయారయ్యాయి అన్నది వాస్తవం.

అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు , మహిళా సమాజాలు ఇలా ఇంకా ఎన్నో లెక్కలేనన్ని సేవాసంస్థలు ప్రస్తుతం ఉన్నాయి. కానీ వీటిలో ఎంతవరకు నిజమైన సేవజరుగుతుంది అన్నది ప్రశ్నార్ధకం. పసిపిల్లల్ని, ముసలివాళ్ళని అడ్డుపెట్టుకుని సొసైటీలో బాగా డబ్బున వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము అంతమందిని పోషిస్తున్నాము, ఇంతమందిని ఉద్ధరిస్తున్నాము  అని లెక్కలు  చెప్పి, డొనేషన్స్  తెచ్చుకోవటం, ఆ చందా డబ్బులతో ఆ ఆశ్రమ నిర్వాహకులు పండగ చేసుకోవటం ఇలాంటివన్నీ ఇప్పుడు సర్వ సామన్యమయ్యాయి. ఇలాంటి మోసపూరితమైన సంస్థలని నియంత్రించాల్సిన ప్రభుత్వం, అధికారులు చూసీ చూడనట్లుగా ఉండటం, అవసరమైతే ఈ సేవకులకి వారి అండదండలు అందించటం కూడా పరిపాటే ..

నిన్న మా వూళ్ళో  ఉత్తమసేవా  అవార్డు అనాధ పిల్లలకు "సేవ" చేసిన నిజమైన సేవకులకి కాకుండా ఆశ్రమంలోని అనాధపిల్లలతో ఆయనకీ "సేవ"  చేయించుకోవటం (తలకి హెన్నాలు పెట్టించుకోవటం, వంట చేయించుకుని తినటం, వగైరాలు ) మాత్రమే  కాకుండా, ఆ  పిల్లలతో వేరే వూర్లో ఉన్న అతని కుటుంబ సభ్యులందరికీ ఊడిగం చేయించిన ఒక అనాధ ప్రజా సేవకుడికి రావటం, ఇలాంటి గొప్ప సేవకులు,నాయకులు అందరూ ఒక చోటికి చేరి,  ఉత్తమ సేవా అవార్డులు ఇచ్చి పుచ్చుకోవటం చూస్తే

"నాకు నువ్వు ... నీకు నేను ఒకరికొకరం నువ్వు , నేను" అంటూ
"ఒకే జాతి పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్లు"
"దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు " 
"సినిమా వాళ్ళు ఉత్తమ నటన అవార్డుల్ని వాళ్ళలో వాళ్ళు పంచున్నట్లు" అనిపించింది.
అయినా ఇలాంటి నిజజీవిత నటుల ముందు పాపం ఆ సినిమా నటులు ఎంతమాత్రం పోటీపడగలరు !!!

కాబట్టి ప్రజాసేవకులూ ఇప్పటి నుండి మీకు మంచి ప్రజాసేవకులు ఆదర్శం కాకూడదు..ఇలాంటి దొంగ సేవకులే ఆదర్శంగా తీసుకుంటే మీకు కూడా వచ్చే సంవత్సరం అయినా ఆ గొప్ప అవకాశం వస్తుందేమో ప్రయత్నించండి.




3, జులై 2015, శుక్రవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 22



మెడిసిన్ ఆరు సంవత్సరాలు సుదీర్ఘంగా పుస్తకాలు చదివే ఒక కోర్స్ మాత్రమే కాదు..మనుషుల శారీరక,మానసిక స్థితిగతులను తెలుసుకోగలిగిన,జీవన్మరణ సమస్యలను సైతం పరిష్కరించగలిగే ఒక అద్భుత శాస్త్రం కూడా. ఫిజీషియన్స్(బాస్) ,రెసిడెంట్ ఫిజీషియన్స్( కాలేజ్ చదువు అయిన తర్వాత ట్రైనింగ్ లో ఉన్న డాక్టర్స్ ), ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ తో టీమ్స్ ఉండేవి. పేషెంట్స్ ని చెకప్ చేసి వాళ్లకి కావాల్సిన మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి సీనియర్ డాక్టర్ రెసిడెంట్ డాక్టర్స్ వేరే పేషెంట్స్ ని చూడటానికి వెళ్లిపోయేవాళ్ళు. ఇంక మా పని ఆ పేషెంట్స్ దగ్గర కూర్చుని వాళ్ళ కేస్ డైరీలు,టెస్ట్ రిపోర్టులు స్టడీ చేస్తూ వాళ్ళ ని మాట్లాడిస్తూ, వాళ్ళ రోగ చరిత్ర తో పాటూ జీవిత చరిత్రలు కూడా తెలుసుకోవటమే..కొంతమంది వింటున్నామా,  లేదా అని కూడా తెలుసుకోకుండా, వాళ్ళ పుట్టుపూర్వో త్తరాలు అలా చెప్తూనే ఉంటారు.పేషెంట్స్ ని విసుక్కుని, కసురుకుంటూ మాట్లాడకూడదని,వాళ్ళతో అనునయంగా మాట్లాడుతూ, అభిమానంగా  పలకరించటం,వాళ్ళని శ్రద్ధగా చూస్తున్నామని ఫీల్ అయ్యేలా చేయటం కూడా చికిత్సలో( patient care) ఒక భాగమే అని మా సీనియర్స్ మొదటి మాటగా చెప్పేవాళ్ళు.

అలా అప్పటి రోజుల్లో కలిసిన ఒక పేషెంట్ మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుండి పోయాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్  అయిన అతనికి కాన్సర్ సీరియస్ స్టేజ్ లో జాయిన్  అయ్యాడు.భార్యా,ఇద్దరు పిల్లలు అందరినీ  చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని బాగా చదివించి మంచి ఉద్యోగాల్లో సెటిల్ చేసి,పెళ్ళిళ్ళు చేశాడు.భార్య ఉన్నన్ని రోజులు ఇద్దరూ కలిసి ఉంటూ హాయిగా సాగిన అతని జీవితం ఆమె పోయాక పిల్లల మీద ఆధార పడాల్సి వచ్చింది. కొన్నాళ్ళు అలాగే అడ్జస్ట్ అయి పిల్లల దగ్గర ఉన్నా,ఒకరోజు కోడలు కనీసం పకోడీలు అడిగినా చేసి పెట్టలేదని అలిగి ఇంటినుండి వెళ్ళిపోయి ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాడట. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి రిటైర్ మెంట్ బెనిఫిట్స్ తో కాలం గడిపాడు. ఇప్పుడీ అనారోగ్యం మూలంగా మళ్ళీ అతనికి ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఇతను వాళ్ళని కాదనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇతన్ని వద్దనుకుని అతనికోసం చివరిదాకా ఎవరూ రాలేదు.

అతని చరిత్ర విన్నాక తర్వాత  ఇతను పకోడీల కోసం అలిగి ఇంటినుండి వెళ్ళిపోవాలా? ఇంత చిన్న కారణాలకి కూడా ఇలా సిల్లీగా ప్రవర్తించే వాళ్లుంటారా  అనిపించింది, .. కానీ నాకు ఆ తర్వాత (కొన్ని సంవత్సరాల తర్వాత) మనసు కోరుకున్నది దక్కకపోతే మనిషి పడే బాధ ఏమిటో తెలిసింది... అది ఇతరుల దృష్టిలో ఎంత చిన్నదైనా సరే!!

కాలేజ్ విషయాలకేముంది ఎప్పుడూ ఉండేవే, ఉరుకులు పరుగులతో చదివితేనే కానీ పూర్తవ్వని సిలబస్,చదువు గురించి,పోటీల గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ వేడెక్కిన బుర్ర కాలేజ్ లైఫ్ అంతా ఇలాగే గడిచిపోతున్నా మధ్య మధ్యలో ఫ్రెండ్స్,సరదా అల్లర్లు లేకపోతే పిచ్చేక్కే ప్రమాదం కూడా ఉంది.మొత్తానికి వీకెండ్ వచ్చింది, ఆరోజు సాయంత్రం అందరం కాలేజ్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యాక స్నాక్స్ తింటూ మా ఫ్రెండ్స్ మ్యూజికల్ నైట్ ప్లాన్ చేశారు. సోహిల్ హిందీ పాటలు చాలాబాగా పాడతాడు.అప్పటి సినిమాల్లో బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి పాడితే వాళ్ళ గొంతేనేమో అనిపించేలా పాడినట్లు,మా సోహిల్ కూడా అచ్చం  హిందీ గాయకుడు రఫీని,కిషోర్ కుమార్ ని అనుకరిస్తూమంచి పాటలు పాడేవాడు.

ఇంక అప్పట్లో కొత్తగా వచ్చిన టైటానిక్ సినిమా ఐతే మా స్టూడెంట్స్ కి తెగ నచ్చేసింది. ఆరోజుల్లో  టైటానిక్ సినిమా పోస్టర్స్ లేని స్టూడెంట్ రూమ్స్ లేవు అంటే అతిశయోక్తి కాదేమో.."Every night in my dreams I see you, I feel you" ఈ పాట ఐతే తెలుగు పాటేనేమో అనిపించేలా పాడుకునే వాళ్ళు అందరూ.. ఇక మా క్లాస్మేట్ సుధాకర్  దొరైరాజ్ అయితే తమిళ పాటలు తెగ పాడేవాడు.మాకు అర్ధం కాదురా బాబూ అంటే ,ఫీల్ బాగుంటుందిరా వినండి అంటూ పాటలతో చంపేవాడు.అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నా నేను మాత్రం సండే కావ్య వాళ్ళింటికి వస్తానని చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నాను.వెళ్ళాలా వద్దా? వెళ్తే వీళ్ళంతా ఇంకా ఎక్కువ కామెంట్ చేస్తారేమో, వెళ్ళకపోతే కావ్య ఫీల్ అవుతుందేమోనని ఆలోచనల మధ్య మొత్తానికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాను.చాలాసేపు నిద్రపట్టలేదు, ఎప్పటికో నిద్రపోయిన నాకు నిద్రలో కూడా "Every night in my dreams" పాట వినిపిస్తూనే ఉంది.

ఉదయాన్నే అందరికంటే  ముందే మెలకువొచ్చింది.సండే కావటంతో అందరూ బద్ధకంగా పడుకునే ఉన్నారు. నేను కావ్య వాళ్ళింటికి వెళ్ళటానికి రెడీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాను. ఏంటో ఇంతకుముందు ఎన్నిసార్లు కావ్య వాళ్ళింటికి వెళ్ళినా ఏమీ అనిపించలేదు కానీ ఈసారెందుకో కొంచెం కంగారుగా  అనిపిస్తుంది.ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఒకటికి పదిసార్లు ఆలోచించి ఉన్నవాటిలోనే ఏదో సెలెక్ట్ చేసినా అంతగా నచ్చలేదు..కానీ ఏమి చేయను నాకున్న డ్రెస్సుల్లో అదే కొంచెం మంచిది.మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అన్న కొన్న డ్రెస్ అది.ఎంతైనా హైదరాబాద్ స్టైల్ కదా కొంచెం బాగానే ఉంది.5 అడుగులకి పైన ఇంకొంచెం ఎక్కువ ఎత్తుగా ఉండే నాకు అప్పటి ఫ్యాషన్ పొడుగు షర్టులు ఇంకాస్త పొడవుగా అనిపించేవి

ఇంక మొహం మీద ఎంత పౌడర్ కొట్టినా నా మొహాన నల్లమచ్చ పోవటం లేదు. చిన్నప్పుడు చామనఛాయ గా  ఉండే మా ఇద్దరు అక్కలు మొహం నున్నగా, తెల్లగా రావటానికి రోజ్ వాటర్, Astringent లు మానాన్న క్లినిక్  లో ఫ్రీగా దొరికే కాటన్ మీద వేసి రుద్దుతూ ఉంటె చూసి,వాళ్ళకంటే ఇంకా ఎక్కువ నల్లగా ఉన్న నేను కూడా తెల్లగా అవ్వాలని,Astringent అనుకుని,నాన్న క్లినిక్ లో ఉండే ఏదో యాసిడ్ తో మొహం రుద్దుకోవటంతో ఆరోజుకి కమిలినట్లుగా అయిన నా మొహం తర్వాత కాలినట్లుగా అయ్యింది.తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా తెల్లబడలేదు సరికదా మొహమంతా నల్లగా మచ్చలాగా  మిగిలిపోయింది. అయినా పెద్దలు చెప్పినట్లు మనిషికి కావాల్సింది అంతః సౌందర్యం కానీ బాహ్య సౌందర్యం కాదు కదా..

మొత్తానికి మేకప్ పూర్తి  చేసి,బ్రేక్ ఫాస్ట్ ఏదో తిన్నాననిపించి,పది గంటలకల్లా కావ్య ఇంటికి బయల్దేరాను.వాకిట్లోనే కావ్య వాళ్ళ పప్పీ భౌ భౌ అంటూ స్వాగతం చెప్పింది.దాని అరుపులకి బయటికి వచ్చిన ఆంటీ రా మాధవ్ నీకోసం కావ్య వెయిట్ చేస్తుంది అంది..ఆంటీ ఆమాట మామూలుగానే అన్నా.. నాకెందుకో ఆ మాట ఎక్కడో టచ్ చేసింది. "కావ్య నాకోసం ఎదురుచూస్తుంది" అనేమాట వినటం నాకెందుకో చాలా సంతోషంగా అనిపించింది,మీరు కూడా నీ బొంద అందులో ఏముంది అనుకుంటున్నారా? కొన్ని మాటలు,సందర్భాలు అనుభవించిన వాళ్ళకే అందులో ఉన్న ఆనందం తెలుస్తుంది.ఎలాంటి విషయాలు  ఎవరికి  ఎంత ఆనందాన్ని కలిగిస్తాయి అని చెప్పే కొలతలు ఉంటే  లోకంలో ఇన్ని అపార్ధాలు,బాధలు ఎందుకు? అందరూ ఆ కొలతల ప్రకారం వాళ్ళకిష్టమైన వాళ్ళని ఇంప్రెస్ చేసేయొచ్చు.కానీ కాలానుగుణంగా, ప్రతి సందర్భాన్ని బట్టి మారేవే కదా మనుషుల భావోద్వేగాలు.. వాటిని అంచనా వేయటం ఎవరి తరమూ కాదు.

ఇంతలో కావ్య లోపలి నుండి వచ్చింది.అంతకుముందే తలస్నానం చేసి తడి ఆరటానికి అలాగే వదిలేసిన జుట్టు, తెల్లగా ,చిన్నగా ఉన్న మొహం మీద అంతకంటే చిన్న  స్టిక్కర్ బొట్టు, బుగ్గన సొట్టతో, తెలుపురంగు కాటన్ పంజాబీ డ్రెస్ లో కావ్య  చాలా అందంగా కనిపిస్తుంది.ముఖాన చిన్న చిరునవ్వుతో నా ముందు ఉన్న చైర్ లో  కూర్చుంటున్న కావ్యని చూస్తూ నన్ను నేనే కాదు ఈ లోకాన్నే మర్చిపోయాను.ఈ అమ్మాయి కూడా నాలాగే ప్రత్యేకంగా తయారు కాలేదు కదా అనిపించింది.. ఒక అమ్మాయిని ఇంతగా  గమనించటం, వర్ణించటం నా జీవితంలో ఇదే మొదటిసారి అనుకుంటాను.
  
"తెరచి ఉంచేవు  సుమా త్వరపడి నీ హృదయమూ
బిరా బిరా ఏ  సుందరియో చొరపడితే ప్రమాదము"
అని ఎవరో కవిగారు చెప్పినట్లు నా విషయంలో ఆ ప్రమాదం జరిగిపోయినట్లు అనిపిస్తుంది.నా ప్రమేయం లేకుండానే నా మనసులోకి కావ్య ప్రవేశించింది.ఇది నా మనసుకు కలిగిన ఆలోచనా లేక నా ఫ్రెండ్స్  మాటల ప్రభావమా అనే ఆలోచన కూడా నాకా సమయంలో రాకపోవటం నా అదృష్టమా? దురదృష్టమా? కాలమే తేల్చాలి.. 

ఎక్కడినుండో నను నేను మరచినా నీతోడు పాట  వినిపిస్తుంది నిజమా ?? భ్రమా ??


Related Posts Plugin for WordPress, Blogger...