చిన్నప్పటినుండి ప్రతి సంవత్సరం శ్రీశైలం వెళ్ళటం మాకు ఇష్టమైన తీర్ధయాత్ర.అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఉండే శిలాఫలకం చదువుతూ అవన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి, మనం చూడగలమా అనుకునేదాన్ని.నా
భక్తిప్రపంచం బ్లాగ్ లో శివుడి పాటలు స్తోత్రాలు పోస్ట్ చేస్తున్నప్పుడు
ఎప్పుడైనా నెట్ లో
ద్వాదశ జ్యోతిర్లింగాలు చూస్తూ జ్యోతిర్లింగాలు చూడాలన్న కోరిక
పెరిగిపోయింది... మా
ఫ్యామిలీ అందరితో కలిసి సాయినాధుని షిరిడి తో పాటు,మహారాష్ట్ర లోని త్రయంబకేశ్వర్ , భీమశంకర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలు దర్శనం చేయించటం ఆ శివయ్య దయ.. జీవితంలో మరిచిపోలేని సంతోషకరమైన, అద్భుతమైన తీర్ధయాత్ర.
షిరిడీలో బాబా దర్శనం అయ్యాక రాత్రికి రెస్ట్ తీసుకుని ఉదయాన్నే త్రయంబకేశ్వర్ వెళ్ళాలనుకున్నాము..షిరిడీ నుండి నాసిక్ 83 km...అక్కడినుండి త్రయంబకేశ్వర్ 30 km...మొత్తం 2 గంటల ప్రయాణం.కార్తీకమాసం చివరి రెండు రోజుల్లో జ్యోతిర్లింగాలు చూడబోతున్నామన్న ఆనందం ముందు నిద్ర,చలి ఏమీ గుర్తురాలేదు.ఉదయాన్నే నాసిక్ బయల్దేరాము.ఆరోజు గురువారం దారంతా షిరిడీ చుట్టుపక్కల గ్రామాల నుండి బాబా పల్లకీలు మోసుకుంటూ కాలినడకన వస్తున్న భక్తులు చాలా చోట్ల కనిపించారు.దీన్ని "సాయిచరణ్ పాదయాత్ర" అంటారట.
దాదాపు గంటన్నరలో నాసిక్ చేరుకున్నాము.నాసిక్ జిల్లా కేంద్రం.మహారాష్ట్రలో 3వ పెద్దజిల్లా,కుంభమేళా సమయంలో ఎక్కువగా వినపడే పేరు కూడా..ఇక్కడ వనవాస కాలంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు కాబట్టి నాసిక అన్న పేరు వచ్చిందని పురాణాల్లో చెప్తారు. పంచవటి,ముక్తిధామ్,పాండవుల గుహలు అన్నీ తిరిగి వచ్చేటప్పుడు చూడాలనుకుని త్రయంబకేశ్వర్ బయల్దేరాము.
నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ వెళ్ళే దారిలో మాకు తెలియని కాయిన్ మ్యూజియం
GPS లో కనపడింది.
ఈ మ్యూజియం గురించి పూర్తి వివరాలు,ఫోటోలుఈ పోస్ట్స్ లో చూడొచ్చు.
మనీ మ్యూజియం - నాసిక్
K. G. Maheshwari Photo Art Gallery - Nasik
త్రయంబకేశ్వరం వైపు వెళ్తున్న దారంతా కొండలు కనిపిస్తూ ఉన్నాయి.ఆ కొండని
అంజనేరి పర్వత్ అంటారు. ఈ కొండమీదే అంజనాదేవి తపస్సు చేయగా ఆంజనేయ స్వామి జన్మించాడని చెప్తారు.ఇక్కడ ఆంజనేయ స్వామి,అంజనా దేవి దేవాలయాలు ఉన్నాయట.
|
అంజనేరి పర్వత్ - నాసిక్ | | | | | |
సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న త్రయంబకేశ్వర్ చేరుకున్నాక గైడ్స్ వచ్చి ఆ చుట్టుపక్కల ప్లేసెస్ చూపిస్తామని అడుగుతుంటారు.మాకెలాగూ ఆ ప్రదేశం కొత్త కాబట్టి ఒక గైడ్ ని మాట్లాడుకొని ముందుగా కుశావర్త కుండంలో స్నానం చేయటానికి వెళ్ళాము.
|
కుశావర్త తీర్ధం |
ప్రధానాలయానికి దగ్గరలోనే ఉన్న కుశావర్త కుండం వోల్‌వోకర్ శ్రీరావ్‌జీ సాహెబ్
పాఠ్‌నేకర్ క్రీ.శ. 1690-91లో నిర్మించాడట. ఈ కుశావర్త తీర్థం పన్నెండు
సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం. ప్రపంచ నలుదిశల నుంచీ నాగసాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు.గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ
కుశావర్త కుండంలో స్నానమాచరించడంవల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణేతిహాసం.
అప్పట్లో వర్షాభావంతో తీవ్రమైన కరవు ఏర్పడటంతో తన తపశ్శక్తి ద్వారా వరుణుడిని మెప్పించి అక్షయమైన ఒక సరస్సును నిర్మించాడు.ఆ నీటి ఫలితంగా పరిసర ప్రాంతాలు చిగురించి,నివాసయోగ్యం కాగానే ఎక్కడెక్కడి ఋషులు అక్కడికి చేరి నివాసం ఉంటూ..గౌతముని మీద అకారణంగా అసూయ పెంచుకున్నారట.
ఓసారి గౌతమమహర్షి తన పొలంలో మేస్తున్న ఆవుని వెళ్ళగొట్టటానికి ఓ దర్భను విసిరాడట.
సూదిమొన గుచ్చుకుని అది ప్రాణం విడిచింది .సమయం కోసం చూస్తున్న తోటి ఋషులు నీకు గోహత్యాపాతకం అంటుకుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు తగిన ప్రాయశ్చిత్తం చేసుకొమ్మన్నారు. గోహత్యా పాతకం చుట్టుకున్న
గౌతముడు, దాన్ని తొలగించుకోవటానికి అహల్యాదేవితో కలిసి బ్రహ్మగిరిమీద
108 శివలింగాలను ప్రతిష్టించి తపస్సు చేశాడట. తపస్సు మెచ్చిన శివుడు గంగను ప్రసాదించి,ఈ గంగ గౌతమి అనే పేరుతో ప్రవహిస్తుంది,నేను త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఈ గౌతమీ తీరంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తాను అని వరమిచ్చాడు.
గంగమ్మ ప్రవాహ వేగాన్నిఆపలేని గౌతమ మహర్షి ఒకచోట వెలసిన నీటి ప్రవాహం చుట్టూ కుశ అనే గడ్డి వేసి ఎటూ
వెళ్లకుండా చేసి స్నానం చేశాడట అదే తీర్ధరాజం కుశావర్త కుండంగా వాడుకలోకి
వచ్చింది. చల్లటి నీటితో ఆహ్లాదకరంగా ఉన్న ఈ కుశావర్త కుండంలో మేము కూడా స్నానాలు చేశాము.ఇక్కడి గుడులు,పరిసరాలు అన్నీ నల్లటి రాతి కట్టడాలు. ప్రాంగణంలోనే ఉన్న కేదారేశ్వర స్వామిని ,కుశావర్తంలోకి నీరు వచ్చే ప్రదేశంగా చెప్పే చోట శేషశయనుడుగా లక్ష్మీదేవితో కలిసి ఉన్న విష్ణుమూర్తికి నమస్కరించుకుని,జ్యోతిర్లింగరూపంలో త్రిమూర్తులు కొలువైన త్ర్యంబకేశ్వర ఆలయానికి బయల్దేరాము.
|
కుశావర్త కుండం దగ్గరలోని శివాలయం |
త్రయంబకేశ్వర ఆలయాన్ని క్రీ.శ.1755-1786 మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించాడట.గుడిచుట్టూ ఎత్తైన నల్లటి గట్టిరాతి ప్రహరీ గోడలున్నాయి.లోపలి వెళ్ళగానే పైన 2 బంగారు కలశాలతో నల్లని రాతితో చెక్కిన , సమున్నతమైన గోపురం శిల్పకళ చాలా కొత్తగా అందంగా కనిపిస్తుంది.లోపలి వెళ్లగానే అక్కడి ఆలయ ప్రాంగణంలో గర్భాలయంలో ఉన్నలాంటి శివలింగమే ఉంటుంది.అక్కడ నమస్కరించుకుని గర్భగుడికి దగ్గరగా ఉన్న క్యూలైన్ నుండి వెళ్ళాము. ఆలయ ప్రాంగణం బయటే కాదు లోపల కూడా చాలా విశాలంగా,భక్తులు తక్కువగానే ఉండటం వలన ప్రశాంతంగా ఉంది.
గర్భగుడిలోని స్వయంభువైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అన్ని ఆలయాల్లో శివలింగంలాగా లేదు. శివలింగం ఉండాల్సిన ప్రదేశం గొయ్యిలాగా ఉండి అందులో బ్రహ్మ,విష్ణు శివ రూపాల్లా చెప్పబడే 3 చిన్న శివలింగాలు కనపడతాయి.శివలింగం గర్భగుడిలో కిందకి ఉంది.కనీసం మూడు మెట్లు దిగి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది.బయటినుండే దర్శనం చేసుకోవాలి. అందుకే చాలా జాగ్రత్తగా చూస్తూ దర్శనం చేసుకుంటేనే జ్యోతిర్లింగ స్వరూపం అర్ధమవుతుంది.ఈ మూడు లింగాల్లో శివరూపం అని చెప్పేచోట ఎప్పుడూ నీరు వస్తూ శివుడికి అభిషేకం జరుగుతుందట. ఆ నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు మేము గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో కూర్చుని అక్కడ పూజారితో అభిషేకం చేయించుకుని స్వామి దర్శనం చేసుకున్నాము.గర్భాలయానికి దగ్గరగా ఉన్న మండపంలో కూర్చుని త్రయంబకేశ్వరుణ్ణి ఎదురుగా ఉన్న అద్దంలో,గర్భగుడి వాకిలి మీద ఉన్న టీవీ స్క్రీన్ మీద ఎంతసేపైనా చూడొచ్చు.
అభిషేకాలు చేయాలనుకుంటే ఉదయం ఆరుగంటలకి మాత్రమే గర్భగుడిలోకి అనుమతిస్తారట.ఇక్కడ గర్భగుడిలోకి ఆడవాళ్ళకి ప్రవేశం లేదు.అభిషేకం చేయాలనుకుంటే మగవాళ్ళు మాత్రమే లోపలి వెళ్లి అభిషేకం చేసి రావాలి. శివలింగంలో బ్రహ్మ రూపం కూడా ఉందని అందుకే ఆడవాళ్ళని గర్భగుడిలోకి రానివ్వరని తెలుస్తుంది.ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం తర్వాత మేము చూసిన రెండవ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం... శివయ్య సన్నిధిలో ఉన్నంత సేపు చుట్టుపక్కల పరిసరాలతో సంబంధం లేకుండా, మనసు తేలికైనట్లు,ముఖ్యంగా అంతదూరాన ఉన్న శివయ్యని చూసినందుకు చాలా సంతోషంగా అనిపించింది..కార్తీకమాసం చివరి రోజున మహిమాన్వితమైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం కలగటం నిజంగా శివయ్య మా మీద చూపించిన కరుణ, మా అదృష్టం.
గుడి నుండి బయటికి రాగానే బయటంతా రకరకాల రుద్రాక్షలు,పూసలు,శంఖాలు
రోడ్లమీదే పెట్టి అమ్ముతున్నారు. రుద్రాక్షమీద శివలింగం,నాగపడగలు ఉన్న
రుద్రాక్షలు చెట్టుకొమ్మలకే ఉన్నట్లు చెక్కిన రుద్రాక్షలు వింతగా ఉన్నాయి.
|
వెరైటీ రుద్రాక్షలు |
ఇక్కడినుండి మా ప్రయాణం మా గైడ్ చెప్పిన ప్రకారం గోదావరి జన్మస్థానం బ్రహ్మగిరికి.
నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ , మహాదేవాయ, త్రయంబకాయ,
త్రిపురాంతకాయ, త్రికాలాగ్ని- కాలాయ, కాలాగ్నిరుద్రాయ, నీలకంఠాయ,
మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః