పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, జనవరి 2016, ఆదివారం

పండరీపురం, తుల్జాపూర్ @ మహారాష్ట్ర



ఎప్పుడో చిన్నప్పుడు భక్తతుకారం సినిమాలో చూసిన పాండురంగడి దర్శనభాగ్యం మాకు ఇన్నాళ్ళకి కలిగింది.మహారాష్టలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న ‘పండరీపురం’ అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి.శ్రీహరి తనని నిండు మనసుతో వేడుకున్న భక్తులను కాపాడటానికి,దర్శనమివ్వటానికి అప్పటికప్పుడు ప్రత్యక్షమైన సంఘటనలెన్నో పురాణాల్లో ఉన్నాయి.అలా తన భక్తితో శ్రీ మహావిష్ణువునే ఎదురుచూసేలా చేసిన మహాభక్తుడు భక్త పుండరీకుడు. ఆ భక్తుడి పేరుమీదే పాండురంగడిగా వెలిశాడు.శ్రీమహావిష్ణువు  పాండురంగడిగా శిలారూపుడైపోయిన పుణ్యప్రదేశమే పండరీపురం.ఇక్కడ ప్రవహించే భీమా నదిని చంద్రభాగా నది అని పిలుస్తారు.ప్రధానాలయానికి దగ్గరలోనే భీమా నది ప్రవహిస్తూ ఉంటుంది.అక్కడే పుండరీకుని ఆలయం ఉంది.

పురాణాల ప్రకారం దుర్వ్యసనాపరుడైన పుండరీకుడనేవాడు తల్లిదండ్రులను వేధించి,బాధించి చివరికి తప్పు తెలుసుకుని పశ్చాత్తాప హృదయంతో తన తల్లిదండ్రులకు సేవ చేశాడు. తన భక్తుడైన పుండరీకుడ్ని పాండురంగడు పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. ఆ సమయంలో మాతాపితల సేవలో నిమగ్నమయిన పుండరీకుడు మాధవసేవకు మించినది మాతాపితల సేవ అని తలచి,తాను మాతాపితల సేవలో ఉన్నానని, ఒక ఇటుక విసిరి, ఆ ఇటుక పడిన చోట నిరీక్షించమని పాండురంగడికి చెప్పాడట. అప్పుడా శ్రీహరి తన భక్తుడి కోసం వేచి చూస్తూ ఆ ఇటుక పడిన చోటే శిలారూపుడై పోయాడట.


ఇక్కడ పాండురంగడి దర్శనం ముఖ దర్శనం,పాద స్పర్శా దర్శనం అని రెండువిధాలుగా  ఉంది.ముఖ దర్సనం అంటే గర్భగుడికి ముందు నుండి వెళ్ళి దూరం నుండే స్వామిని చూసి వచ్చేయాలి.పాద స్పర్శాదర్సనం మాత్రం క్యూ లైన్లలో రావాలి.అంత దూరం వెళ్లి స్వామిని దూరం నుండి చూస్తే  ఎలా అని పాద స్పర్శా దర్శనం కోసం క్యూలోనే వెళ్ళాము.ఇక్కడ రేటు కొద్దీ టికెట్ సదుపాయం లేదు అందరూ ఒకే క్యూలో వెళ్ళాలి.మేము వెళ్ళినరోజు ఆదివారం కావటంతో విపరీతంగా జనం ఉన్నారు.అందరూ మహారాష్ట్ర వాళ్ళే. తెలుగు భక్తులు వచ్చారేమో కానీ మాకైతే కనపడలేదు.అప్పటిదాకా ఎక్కడాలేని క్యూ మాకు తిరుమలని గుర్తుచేసింది.ప్రధానాలయంలోకి రాగానే చాలా దూరం నుండే సరిగా కనపడీ కనపడకుండా స్వామి  ముఖ దర్శనం చేసుకుంటున్న భక్తులను చూశాక ఇంతసేపు క్యూ లైన్లలో ఉన్నా స్వామిని దగ్గర నుండి చూడొచ్చులే అని అలసట అంతా మాయమయ్యింది. 


ఘనాఘన సుందరా కరుణా రసమందిరా అంటూ పాండురంగడిని కీర్తిస్తూ తరించిన భక్తతుకారాం విగ్రహం గర్భగుడికి పక్కనే ఉంటుంది.ముందు భక్తతుకారం దర్శనం చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్తాము.గర్భగుడిలో పాండురంగడు నడుముమీద చేతులు పెట్టుకుని,ధగధగలాడే అలంకరణలో జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు నీవు అన్నట్లు దర్శనమిస్తాడు.స్వామిని పాదాలు తాకి,తలను పాదాలమీద ఉంచి నమస్కరించుకోవచ్చు.గర్భాలయం నుండి బయటికి రాగానే పక్కన చిన్న ఆలయాల్లో రుక్మిణీమాత,సత్యభామ,రాధాదేవి అందరూ నడుము మీద చేతులు పెట్టుకుని నిలబడి దర్శనమిస్తారు.ఇక్కడ ప్రసాదం రాజ్ గిరా లడ్డూ.. మహారాష్ట్రలో ప్రతిచోటా కనపడే ఈ లడ్డూ కొనాలా,వద్దా? ఎప్పుడూ తినలేదు కదా ఎందుకులే అని డౌట్ తో చాలాసార్లు కొనాలని కూడా ఆగిపోయాను. కానీ ఇక్కడ  స్వామివారి ప్రసాదంగా దేవస్థానం వాళ్ళు ఆ లడ్డూ అమ్మటం ఆశ్చర్యంగా అనిపించింది. 


పండరీపూర్ లో మరొక చూడదగిన ప్రదేశం శ్రీ గజానన్ మహారాజ్ సంస్థాన్.ఇక్కడ accommodation చాలా బాగుంది. యాత్రీనివాస్ పేరుతో యాత్రికులకి ఇచ్చే కాటేజెస్ ఒక పెద్ద ఫామిలీ అందరికీ సరిపోయేలా నీట్ గా ఉన్నాయి.ముందుగానే ఆన్ లైన్ లో కూడా రూమ్స్ తీసుకోవచ్చు.విశాలమైన ఆవరణలో ఉన్న గజానన్ మహారాజ్ పాలరాతి మందిరం ,ధ్యానమందిరం అన్నీ చాలా అందంగా,పరిసరాలు ప్రశాంతంగా ఉన్నాయి.

 శ్రీ గజానన్ మహారాజ్ సంస్థాన్
గజానన్ మహారాజ్ మందిరం

తుల్జాపూర్ భవానీమాత మహారాష్ట్రలోని  షోలాపూర్ పట్టణానికి 45  కి.మీ దూరంలోని తుల్జాపూర్ లో కొలువై ఉంది.ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఇచ్చిన  భవానీమాతగా  అమ్మ ఇక్కడ ప్రసిద్ధి.ఈ క్షేత్రం రాష్ట్రకూటులు,యాదవరాజుల కాలం నుండే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.ఇక్కడి నుండే అమ్మవారు శ్రీరాముడు లంకకి వెళ్ళటానికి దారి చూపించిందని పురాణ కధనం.గుడికి వెళ్ళే దారంతా ఎప్పటిలాగే కొండలు అడవులు.ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించే భక్తులు కాలినడకన వస్తూ కనిపిస్తారు. 

 అమ్మవారి  భక్తుల మొక్కుబడి 

ఆలయం దగ్గరలో ఉన్న పూజా సామాగ్రి అంతటిలో ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపిస్తుంది.అమ్మకి సమర్పించే గాజులు,చీరలు అన్నీ ఆకుపచ్చవే కనిపిస్తాయి.
  
అమ్మవారి పూజా సామాగ్రి

ప్రధాన ఆలయానికి ముందుగా రాజా షాహాజి మహారాజ్ ద్వారం కనపడుతుంది.అతిపురాతనమైన ఈ సమున్నత మహా ద్వారం అప్పటి అపూర్వమైన కట్టడాలకి నిదర్సనంగా అనిపిస్తుంది.

రాజా షాహాజీ మహాద్వార్


ఇక్కడినుండి మెట్లు దిగి లోపలి వెళ్తే విశాలమైన ప్రాంగణంలో అన్నీ పురాతన కట్టడాలే చాలా అందంగా కనిపిస్తాయి.ముందుగా సిద్ధివినాయకుడిని దర్శించుకుని తర్వాత అమ్మని దర్శించుకున్నాము.ఇక్కడ యాత్రికులు చాలా ఎక్కువగా ఉండటంతో అమ్మదర్శనం హడావుడిగా జరిగింది.మహారాష్ట్ర భక్తులు అమ్మవారికి బోనాలు తీసుకుని వచ్చారు.గిన్నెల్లో,చిన్నచిన్న గంపల్లో రకరకాల ఆహార పదార్ధాలను తెచ్చి అమ్మకి సమర్పిస్తున్నారు.ఆలయ ప్రాంగణంలో మరో విశేషం చింతామణి ఆలయం.ఇక్కడ చింతామణి శిల భక్తుల మనసులో కోరిక తీరుతుందా లేదా అని కదలటం ద్వారా తెలియచేస్తుందని  భక్తుల నమ్మకం.ఆలయ ప్రాంగణంలో ఉన్న యజ్ఞ మండపంలో నవరాత్రులప్పుడు ప్రత్యేకమైన యజ్ఞాలు చేస్తారట.ఇక్కడ షాపింగ్ కూడా వెరైటీగా చాలా బాగుంది.


అమ్మ దయ ఉంటే  అన్నీ ఉన్నట్లే  అమ్మ కరుణా కటాక్షాలు 
ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ .. జై తుల్జాభవానీ దేవ్యై నమః

28, జనవరి 2016, గురువారం

ఔరంగాబాద్ -- భద్ర మారుతి to పంచక్కి


The traveler sees what he sees, the tourist see what he has come to see.
GPS హెల్ప్ తో మాకింత వరకు తెలియని కొత్త ప్రదేశాలు,ప్రాంతాలు,భయపెడుతూనే అడ్వెంచరస్ గా అనిపించిన కొండ,లోయల దారులు ఎన్నో చూసి చివరికి ఎల్లోరా దగ్గర ఒక టూరిస్ట్ గైడ్ సూచనల ప్రకారం మేము కూడా టూరిస్టులమైపోయాము.అందులో భాగంగా భద్రమారుతి గుడితో పాటు, మేము చూడాలనుకోకుండా చూసినవి  ఔరంగజేబు సమాధి,పంచక్కి. 

తెలియకుండా చూసినా వైవిధ్యంగా బాగుంది అనిపించింది ఎల్లోరాకి 4కి.మీ దూరంలో ఖుల్తాబాద్ భద్రమారుతి టెంపుల్.ఇప్పటిదాకా ఎక్కడా లేనట్లుగా పడుకుని ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఈ భద్రమారుతి గుడి ప్రత్యేకత.ఆంజనేయ స్వామి  సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడే కాసేపు పడుకున్నాడని ఒక కధ ఉంటే, పూర్వం భద్రావతీ నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు.మహారాజుకు రాముడిపై అమితభక్తి. ఎప్పుడూ శ్రీరాముడ్ని భజనలు, స్తోత్రాలతో స్తుతించేవాడట.ఒకరోజు భద్రకూట్ అనే సరోవరం దగ్గర భద్రసేనుడు శ్రీరాముడి భజనలు చేస్తుండగా విని తన్మయుడైన ఆంజనేయ స్వామి అక్కడే నిద్రపోయాడట.భద్రసేన మహారాజు రామభక్తికి మెచ్చి అతని కోరిక మేరకు ఇక్కడ భద్ర మారుతిగా  కొలువయ్యాడని పురాణ కధనం.

భద్రమారుతి ఆలయం

షాజహాన్,ముంతాజ్ బేగంల మూడవకొడుకుఆలంగిర్("ప్రపంచాధినేత")అని పిలిపించుకున్న ఔరంగజేబ్ .గుజరాత్ రాష్ట్రం లో దాహోడ్ నగరంలో 1618 నవంబరు 3న జన్మించి, 1707 మార్చి 3న మరణించాడు. ఇతని సమాధి ఔరంగాబాద్ లోని ఖుల్దాబాద్ గ్రామంలో వుంది.ఈ సమాధి అప్పటి రాజుల tombs కి విరుద్ధంగా చాలా చిన్న స్థలంలో ఉంది. ఇక్కడంతా చాలా నిశ్శబ్దం.నవల్స్ లో, కధల్లో రాసినట్లు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది, అక్కడంతా ఏదో స్తబ్ధత అన్నట్లుంది.ఇక్కడ రకరకాల అత్తర్లు (scent) ఏవేవో డిజైన్స్ ఉన్న బాటిల్స్ లో అమ్ముతున్నారు.

పైథానీ శారీస్ .. ఔరంగాబాద్ లోని పైథాన్ నగరం పేరుతో  ఉన్న ఈ చీరల్ని మగ్గాలతో నేస్తారు. పైటంచులకి నెమళ్ళు ఈ చీరల ప్రత్యేకత.అయినా ఇప్పుడు ఏ చీరలు ఎక్కడైనా దొరుతున్నాయి కూడా ...షాపింగ్ అది కూడా చీరలంటే అంత  సరదా లేకపోయినా ఆ చీరల ప్రత్యేకత, అవి తయారయ్యే ప్రదేశం చూడొచ్చని వెళ్ళాము.


బీబీ కా మక్బరా ఆగ్రాలోని తాజ్ మహల్ ని పోలిన దీన్ని ‘ది తాజ్‌మహల్‌ ఆఫ్‌ డెక్కన్‌’ Dakkhani Taj అంటారు.ఔరంగాబాద్ లో ప్రాముఖ్యత చెందిన చారిత్రిక కట్టడాల్లో ఇది ఒకటి.ఔరంగజేబ్‌ కుమారుడు ప్రిన్స్ ఆజమ్ షా దీన్ని అతని తల్లి ,ఔరంగజేబ్‌ భార్య అయిన రబియా ఉద్ దురాని జ్ఞాపకార్ధం నిర్మింపచేశాడు.మేము ఇక్కడికి వెళ్ళేసరికే బాగా చీకటి పడటంతో  తాజ్ మహల్ సరిగా చూడలేకపోయాము.అక్కడిదాకా వచ్చాము కదా అని చీకట్లోనే  లోపలికి  వెళ్లి చూసొచ్చాము.కొంచెం వెలుతురూ ఉండగా వస్తే  బాగుండేది అనిపించింది.ఇక్కడ సరైన లైటింగ్ కూడా లేదు.
 డెక్కన్ తాజ్ మహల్
 
పంచక్కిWater Mill ఔరంగాబాద్ వచ్చిన  వాళ్ళు తప్పకుండా చూసే ప్రదేశాల్లో ఇది ఒకటి.దీన్ని 17వ శతాబ్ధంలో నిర్మించారు.భూగర్భంలో ఉన్న మట్టి పైపుల ద్వారా వచ్చే నీటిని ఉపయోగించి పవర్ జెనరేట్ చేయటం ద్వారా చక్కి అంటే విసుర్రాయిని తిప్పి గోధుమలని పిండి చేసి యాత్రికులకు,సాధువులకు భోజనం పెట్టేవారట.17 వ శతాబ్దపు ఇంజినీరింగ్ అద్భుతంగా దీన్ని వర్ణిస్తారు.బాబా షా ముసాఫిర్ అనే సూఫీ ప్రవక్త దర్గా దీనికి పక్కనే ఉంది. 


27, జనవరి 2016, బుధవారం

దౌలతాబాద్ (దేవగిరి) కోట @ ఔరంగాబాద్


దూరం నుండి కొండమీద కనిపిస్తున్న కోట

ఈ మధ్య ఒక కొటేషన్  చదివాను మన పూర్వీకులు చరిత్రలు సృష్టించటానికి  ప్రయత్నిస్తే  ఇప్పటిరోజుల్లో మన  చరిత్రలు ఇతరులకి తెలియకుండా చేరిపేయటం ఎలా అని ఆలోచిస్తున్నామట.ఏచరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం అంటుంటారు కానీ రాజుల చరిత్రలు చదువుతుంటే రాజ్యం వీరభోజ్యం అన్నమాట నిరూపించుకుంటూ,ప్రజలని కన్న బిడ్డలుగా పాలింఛి,పరమత సహనాన్ని చాటిన రాజులు కొందరైతే,ఇతర మతాలవారిని నానా కష్టాలు పెట్టి,నిరంకుశ పాలనతో చెడ్డపేరు తెచ్చుకున్నవారు కొందరు. రాజులే పోయినా రాజ్యాలు పోయినా అప్పటి ఎందరో  రాజుల చరిత్రలకు మౌనసాక్ష్యాలు ఇప్పుడు శిధిలమై పోయిన కోటలు. జున్నార్ లో శివాజీ మహారాజ్ జన్మించిన శివనేరి కోట తర్వాత మేము మహారాష్ట్రలో చూసిన మరో కోట దౌలతాబాద్ (దేవగిరి) కోట.   
కోట ప్రవేశద్వారం

ఎల్లోరా  వెళ్ళే దారిలోనే ఔరంగాబాద్ కి 15 కి.మీ దూరంలో ఇండియాలో ఉన్న దుర్భేద్యమైన కోటల్లో ఒకటిగా పేరొందిన సుప్రసిద్ధ దౌలతాబాద్ (దేవగిరి) కోట ఉంది.ఈ కోట మొత్తం ఎత్తు సుమారు 183 మీటర్లు(600 అడుగులు).ఎత్తైన కోన్ ఆకారం కొండమీద కట్టిన ఈ కోట వెళ్ళే దారిలో చాలా దూరం నుండే కనిపిస్తూ ఉంటుంది.దౌలతాబాద్ చరిత్ర 12వ  శతాబ్దం నాటిది.ఆకాలంలో దేవగిరి దక్కన్ పీఠభూమిలోని హిందూ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది.దేవగిరి అంటే దేవుళ్ళు నివసించే కొండ అని అర్ధం.యాదవ రాజ వంశానికి చెందిన గొప్ప యోధుడిగా పేరొందిన రాజా భిల్లమరాజు ఈ దేవగిరి కోటని నిర్మించారు.ఇది రాళ్ళని చెక్కి నిర్మించిన శత్రు దుర్భేద్యమైనకోట.దేవగిరిని 1296 లో ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ హస్తగతం చేసుకున్నాడు.యాదవులు, దక్కన్ బహుమనీ సుల్తానులు,మొఘల్స్, మరాఠాలు, నిజాంలు ఇలా ఎందరో ఆక్రమించి పరిపాలించిన ఈ కోట 1724 A.D.వరకు హైదరాబాద్ నిజాం పాలకుల ఆధీనంలో ఉంది.పాలకులు మారినప్పుడల్లా వారికి అనుకూలంగా మార్పులు,చేర్పులు చేసిన ఈ కోటలో  ఎన్నో కట్టడాలున్నాయి.


మహమద్ బిన్ తుగ్లక్ (1325-1251)  
దేవగిరిని దౌలతాబాద్(సంపదల నగరం)గా పేరు మార్చి, రాజధాని మధ్యలో ఉండటం వలన  ఉత్తర, దక్షిణ రాజ్యాలకు అనుకూలంగా ఉంటుందని 1327-1329 మధ్య కాలంలో రాజధానిని ఢిల్లీనుండి దౌలతాబాద్ కి మార్చి పౌరులందరూ అక్కడికి తరలి వెళ్లాలని ఆజ్ఞాపించాడు.700 మైళ్ళ ప్రయాణంలో అష్టకష్టాలు పడ్డ ప్రజలు అనేకమంది మార్గమధ్యంలోనే మరణించారు.పరిస్థితులు అనుకూలించక కనీసం రెండు సంవత్సరాలు కూడా అక్కడ ఉండలేక మళ్ళీ రాజధానిని ఢిల్లీకి మార్చాడు.ఇదొక వృధా ప్రయాసగా, పిచ్చిచేష్టగా చరిత్రలో మిగిలిపోయినా దేవగిరి మాత్రం దౌలతాబాద్ గా స్థిరపడింది. సుల్తానులందరిలో మత,సాహిత్య,తత్త్వశాస్త్ర యుద్ధవిద్యలలో ప్రావీణ్యం కలిగి, దురదృష్ట మేధావి గా పేరుపొందిన మహమద్ బిన్ తుగ్లక్ చరిత్రలో నిలిచిపోయిన సంఘటన దౌలతాబాద్ రాజధాని మార్పు.అందుకే ఇప్పటికీ ఎవరైనా పనికిరాని పనులు చేస్తే పిచ్చి తుగ్లక్ పనులు అంటుంటారు .

తానీషా - చీనీ మహల్ 
గోల్కొండ సుల్తాన్ అబుల్‌ హసన్‌ (తానీషా ) -1672-87 హిందువులైన మాదన్నను ప్రధానమంత్రిగాను, అక్కన్నను సైనికాధికారిగాను నియమించి ఆనాటి మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు (1658-1707) ఆగ్రహానికి గురయ్యాడు. దీనికితోడు మహారాష్ట్ర రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీతో ఆయన చేసుకున్న సంధి మరింత ఆగ్రహాన్ని కలిగించింది.1687 ఫిబ్రవరి 7న ఔరంగజేబు స్వయంగా గోల్కొండ కోటను ముట్టడించి,1687 అక్టోబర్‌ 3న కోట తలుపులు తెరిపించి  అబుల్‌ హసన్‌ (తానీషా)ని బందీగా చేసి తెచ్చి,దౌలతాబాద్‌ కోటలో బంధించాడు.13 సంవత్సరాల పాటు దౌలతాబాద్ కోటలో బందీగా జీవించి 1700లో అక్కడే మరణించాడు తానీషా.గోల్కొండ నవాబులందరిలో ప్రజాభిమానం పొందిన తానీషాను బంధించిన చీనీ మహల్ ఈ కోటలో ఉంది.

హరపాలదేవుడు 
కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ చేసిన దండయాత్రను ఎదిరించి పోరాడిన యాదవరాజు హరపాల దేవుడిని బందీగా పట్టుకుని  బతికుండగానే అతని చర్మం వొలిచి చర్మాన్ని,శరీరాన్ని దేవగిరి కోటగుమ్మానికి వేలాడదీసిన ఒళ్ళు గగుర్పొడిచే రక్త చరిత్ర కూడా ఈ కోటకుంది.


కోటలోకి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.ఎత్తైన కోట గోడలు నున్నగా నల్లటి గట్టి రాళ్ళతో శత్రువులు ఎక్కి లోపలికి ప్రవేశించలేనట్లుగా ఉంటాయి.కోట లోపలికి ప్రవేశించే ద్వారాలకి బలమైన చెక్క తలుపులు, తలుపులకి బలమైన ఇనుప మేకులతో ఏనుగులు కూడా లోపలి ప్రవేశించలేనంత గట్టిగా ఉంటాయి.
 మహాకోట్ ప్రవేశ ద్వారం 

 కోటలో ఎక్కువగా కనపడేవి ఫిరంగులు(cannons) మిలటరీ స్ట్రాటెజీతో నిర్మించిన 
ఈ కోటలోకి ప్రవేశించగానే  చుట్టూ అమర్చిన ఫిరంగులు కనిపిస్తాయి

2వ ప్రవేశ ద్వారానికి రెండువైపులా సైనికుల గదులు
A watchtower
ఇక్కడి నుండి ముందుకి వెళ్ళగానే ఒకవైపు భరతమాత గుడి కనిపిస్తుంది. ఈ ఆలయం యాదవరాజులు హిందూ ఆలయంగా,సుల్తాన్లు మసీదుగా ఉపయోగించారట.ఇప్పుడీ ఆలయంలో భరతమాత విగ్రహం ఉంది.ఈ ఆలయం మొత్తం 150 స్తంభాల మీద, చాలా విశాలమైన ఆవరణలో ఉంది.

 భరతమాత ఆలయం 

భరతమాత ఆలయానికి సమీపంలో ఉన్న హాథీ లేక్ 
Hathi Haud - 47.75 m in length, 46.75 m in width and 6.61 m in depth. 

ఇక్కడి నుండి కొంచెం ముందుకి రాగానే చాంద్ మినార్  కనిపిస్తుంది.చూడటానికి కుతుబ్ మినార్ లాగా  కనిపించే  210 ft (70 m)  ఎత్తున్న చాంద్ మినార్ ను 1435 A.D. లో గుజరాత్ పై విజయానికి గుర్తుగా అల్లా ఉద్దిన్ బహమనీ / అహ్మద్ షా 2 నిర్మింపచేశాడు. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళటానికి అనుమతి లేదు.

చాంద్ మినార్

ఇక్కడి నుండి ముందుకు వెళ్ళగానే వచ్చే ద్వారం  కాలాకోట్ 

ఇది దాటిన తర్వాత చీనీ మహల్ కనిపిస్తుంది. గోల్కొండ చివరి సుల్తాన్ తానీషా,బీజాపూర్ చివరి సుల్తాన్ సికందర్ లను ఔరంగజేబ్ ఈ చీనీమహల్  లోనే బందీలుగా ఉంచాడట.ఈ కట్టడానికి బ్లూ కలర్ చైనా పింగాణీ టైల్స్ తాపడం చేయించారు కాబట్టి చీనీమహల్ / China Palace  అనే పేరు వచ్చింది.

చీనీమహల్ / China Palace

చీనీ మహల్ మీద అంటించిన చైనా టైల్స్ 

ఇక్కడ ఉన్న మరో వింత..  పొట్టేలు తలతో ఉన్న ఫిరంగి. - Mendha Tope (Ram's Head Cannon). ఎత్తైన ఒక బురుజు మీద 180 డిగ్రీస్ లో చుట్టూ తిరిగేలా(Rotate) అమర్చిన ఈ ఫిరంగి మీద Kila - Shikan Tope i.e.the fort breaker cannon అని రాసి ఉంటుంది.చాలా దూరంలో ఉన్న శత్రువుల మీద కూడా దాడిచేయగల ఈ ఫిరంగిని ఔరంగజేబ్ మహమద్ హుసేన్ అరబ్ (artisan) అనే అతనితో తయారు చేయించాడని దీనిమీద రాసి ఉంటుంది.
Mendha Tope (Ram's Head Cannon)

మేము ఎల్లోరా చూసి దౌలతాబాద్ కోటకి వచ్చేటప్పటికే సాయంత్రం అయ్యింది.అక్కడి గార్డులు 6 గంటల వరకు మాత్రమే లోపల ఉండాలని చెప్పటంతో ఇంకా పైకి వెళ్ళకుండా కాలా కోట్ నుండి తిరిగి వెనక్కి వచ్చేశాము.

ఇంకా పైకి కోటలోకి వెళ్తే 40 అడుగుల లోతు  కందకం,దానిమీద ఇనప వంతెన ఉంటుంది.యాదవరాజులు నిర్మించిన అసలు దేవగిరి కోట ఇక్కడే మొదలవుతుంది.కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా కోటచుట్టూ కందకం అందులో మొసళ్ళు,విషసర్పాలు ఉండేవట.ఇనప వంతెన దాటిన తర్వాత ఇక్కడి నుండి చీకటి దారి వస్తుంది.దీన్ని Gate Of Andheri అంటారు.ఈదారి అంతా చీకటిగా ఉంటుంది.టార్చ్ ఉంటె వెళ్ళొచ్చు లేదా అక్కడ కాండిల్స్ పట్టుకుని దారి చూపించే వాళ్ళు ఉంటారట.అప్పట్లో రాజులు శత్రువులని కోటలోకి రాకుండా,శత్రువుల నుండి తప్పించుకోవటానికి ఇలాంటి ఏర్పాట్లు చేశారు.ఈ దారికి చివరిలో ఇనపకుంపటి లాంటిది ఉంటుంది.శత్రువులు వచ్చినప్పుడు దానిలో మంట వెలిగిస్తే ఆ మార్గమంతా చాలా వేడి వ్యాపించి అందులో ఎవ్వరూ నడిచి వెళ్ళే వీలు లేకుండా పోయేది. పైన దుర్గా cannon , కాలాపహాడ్ cannon ఉన్నాయి.వినాయకుడి గుడి,జనార్ధన స్వామి  పాదుకలు,దత్త పాదుకలు,శివలింగం ఉన్నాయి. 

ఒక మొఘల్ మందిరం బారాదరి ఉంటుంది.దీన్ని షాజహాన్ (A.D1627-1658). 1636 లో నిర్మించాడు.13 హాల్స్ ఉన్న ఈ బారాదరిని అప్పటి రాజులు వేసవి విడిదిగా ఉపయోగించేవారట.

 "బారాదరి" కింద నుండి తీసిన ఫోటో

కోటని పూర్తిగా చూడలేకపోయమని కొంచెం ఫీల్ అయినా చిన్నప్పుడు చదివిన దానికంటే ఇప్పుడు ప్రత్యక్షంగా   చరిత్రజరిగిన ప్రదేశాన్ని చూడటం,ఒకప్పుడు అక్కడ ఆధిపత్యం కోసం జరిగిన పోరాటాలని గుర్తుచేసుకోవటం,అప్పట్లో వాళ్లు ఇక్కడ నడిచారు,ఇలా కొండలమీద కోట కట్టుకుని ఇన్ని  మెట్లు ఎలా ఎక్కేవారో?ఇంతింత పెద్ద రాళ్ళను అంత ఎత్తుకి ఎలా చేర్చారో? అనుకుంటూ ఒకప్పటి వారి వైభవాన్ని,యుద్ధ వ్యూహాల్లో వాళ్ళ ఆలోచనాశక్తిని ఊహించటానికి ప్రయత్నించటం కూడా ఆనందమే అనిపిస్తుంది.అంతంత కోటలు కట్టుకుని,ప్రశాంతత లేకుండా జీవితమంతా తిరుగుబాట్ల నుండి,ఆక్రమణల తప్పించుకోవటానికి పోరాడుతూనే ఉన్న చక్రవర్తుల చరిత్ర గుర్తొస్తే రాజుల సొమ్ము రాళ్ళపాలు అని కొంచెం బాధ కూడా కలుగుతుంది.

కోట ద్వారాల పక్కన శిల్పాలు

దౌలతాబాద్ కోట దగ్గర ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో జామకాయలకి ఎర్రటి రంగు రాసి పెట్టారు. 
మహారాష్ట్రలో ఎక్కడ చూసినా జామకాయలు చాలా ఎక్కువగా కనిపించాయి,బాగున్నాయి కూడా.


కోటలో మేము ... 

25, జనవరి 2016, సోమవారం

ఎల్లోరా శిల్పాలు - కైలాస్ నాధ్ టెంపుల్



సృష్టి రహస్యం,సృష్టికి ప్రతిసృష్టి, ఎల్లోరా గుహలని సమీపించగానే గుర్తొచ్చే మాటలు.శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు అన్నట్లు, నిజంగా మనుషులే చెక్కారా అనిపించే మహాద్భుతం జగత్ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలు.. సహ్యాద్రి పర్వతాలను సుతారంగా చెక్కి,అందమైన శిల్పాలతో ఉన్న ఇక్కడి అద్భుతమైన గుహలు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి.వరసగా పేర్చినట్లున్న పర్వతసానువుల్లో మలచిన అందమైన గుహలు.ఎల్లోరా గుహాలయాలు మూడు మత వ్యవస్థలు. హిందూ,బౌద్ధ,జైన మతాలకు సంబంధించిన శిల్పాలు చెక్కి ఉన్నాయి.గుహలంటే ఏదో లోపలి సొరంగాల్లా ఉంటాయనుకున్నాము కానీ శిల్పాలన్నీ విశాలమైన గదులలో అమర్చిన అందమైన అలంకరణలుగా అనిపిస్తాయి 

ఇవి మొత్తం 34 గుహలు. 1 నుండి 12 వరకు గుహలు బౌద్ధ మతానికి , తరవాతి 16 గుహలు హిందూ మతానికి, 30 నుండి 34 వరకు జైనమతానికి సంబంధించిన గుహలు ఉన్నాయి. వీటిని అపూర్వసంగమం అని చెప్పొచ్చు. క్రీ.శ 500 - 700 కాలంలోని బౌద్ధ గుహలు వీటన్నిటిలో ప్రాచీనమైనవి. ఈ గుహలన్నీ కూడా ఇప్పటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నరోజుల్లో కట్టిన కట్టడాల కంటే విభిన్నంగా అనిపిస్తున్నాయి.ఎన్ని వందల మంది శిల్పులు,నిపుణులు కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించారో అనిపిస్తుంది.అద్భుతలోకంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. 

 కైలాసనాధ  దేవాలయం-  Cave 16
 నీలాకాశానికి ,పచ్చని భూమికి మధ్యలో కనిపించే ఈ కైలాస దేవాలయం ఒక మనోహర దృశ్యం.

కైలాస్ టెంపుల్

16 వ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయంగా చెప్తారు.ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాధలను శిల్పాలుగా చెక్కారు. ఈ కైలాస దేవాలయాన్ని చెక్కటానికి కనీసం 100 సంవత్సరాలు పట్టి ఉంటుందని అంచనా.లోపలికి  వెళ్లగానే కనపడే ఒక్కో శిల్పం ఒక్కో అద్భుతం.మామూలుగా ఏ భవనాన్నైనా కిందనుండి పునాదులతో నిర్మిస్తారు కానీ ఈ కైలాస దేవాలయాన్ని మాత్రం కొండ శిఖరాగ్రం నుండి ప్రారంభించారట.Top to bottom carving technique లో నిర్మించిన పురాతన హిందూ ఆలయం  ప్రపంచవ్యాప్తంగా ఇదొక్కటే.ఆలయం అంతా  ఏనుగుల శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి.


ఈ ఆలయంలో శిల్పాలు,కట్టడాల ఫినిషింగ్ కూడా రాళ్ళను ఏదో చెక్కినట్లు లేకుండా ప్లానింగ్ తో ,ఆర్కిటెక్చర్ టెక్నిక్స్ తో కట్టినట్లు నీట్ గా ఉండటం,వాటిమీద చెక్కిన నగిషీలు,అందమైన డిజైన్లలో అప్పటి కళాకారుల నైపుణ్యం  కనిపిస్తుంది.కైలాస దేవాలయం మూడు భవంతులుగా ఉంటుంది.ఈ ఆలయం మొత్తం చూడాలంటే ఎంత సమయం అయినా సరిపోదేమో అనేన్ని ఆశ్చర్యం కలిగించే శిల్పాలు కట్టడాలు ఉన్నాయి.ఎటు చూసినా శిల్పాలే మనచుట్టూ ఉన్నట్లుంటాయి.ఎత్తైన కొండమధ్యలో చెక్కిన ఈ ఆలయం మధ్యలోకి వెళ్తే బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లు,చూడటానికి రెండు కళ్ళు చాలనట్లుగా అనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఖచ్చితంగా ఏవో అద్భుతశక్తులు వున్నాయేమో అనిపిస్తుంది.

కైలాస్ టెంపుల్ ధ్వజస్తంభం 

కైలాస్ టెంపుల్ లో భారీ ఏనుగు

మేము వెళ్ళినప్పుడు సందడి చేస్తున్న స్కూల్ పిల్లలు

ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి 
అప్పుడు  వేసిన రంగు ఇప్పటికి ఉంది.

ధారాతీర్ధం 
29 వ గుహ దగ్గర పై నుండి జలపాతం కురుస్తుంది. దీనినే ధారా తీర్ధం అంటారు. 
ఇక్కడ వనవాస సమయంలో సీతా దేవి స్నానం చేసిందని దీన్ని సీతాస్నాన గృహం అని పిలుస్తారు. 


21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిలో ఉందని చరిత్ర. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరాణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.అన్నిచోట్లా శివలింగాలు,శివతాండవ శిల్పాలు చాలా బాగున్నాయి.అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూస్తాం.
 Cave - 29

29 వ గుహలో శివాలయం  

శివపార్వతుల కల్యాణం

కైలాసపర్వతం ఎత్తబోతున్న రావణుడిని 
శివుడు తన కాలితో కిందికి తొక్కటం

 రుద్రతాండవం చేస్తున శివుడు 

Cave - 32 జైన గుహలు 

జైన గుహలు - ఈ చిన్ని వాకిలి లోనుండి లోపలి వెళ్తే 
కనపడుతుంది .. అద్భుతమైన శిల్పకళా ప్రపంచం

ఎంట్రన్స్ లో వుండే ఆలయం 

జైన గుహలో శిల్పాలు

బుద్ధ గుహలు Cave -10

ధ్యాన బుద్ధుడు

మా అందరికీ చాలా నచ్చిన ఎల్లోరా గుహలలో ఇవి కొన్ని మాత్రమే .. ఎంత చూసినా తరగని,ఇంకా ఏవో మిస్ అయ్యామే అనిపించే శిల్పకళా  సంపద ఎంతో  ఈ గుహల్లో ఉంది...మానవమాత్రులకి మాత్రమే సాధ్యం కాని విధంగా చెక్కిన ఈ శిల్పాల మీద కానీ, చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా దుమ్ముధూళీ లేకుండా శుభ్రంగా ఉన్నాయి.దేవాలయాలలో కన్నా ఎక్కువ యాత్రికులు ఇక్కడే కనిపించారు. మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపించటం విశేషం.

ఎల్లోరాలో మా చెల్లి వాళ్ళాయన,మా అమ్మ,తమ్ముడు


Related Posts Plugin for WordPress, Blogger...