పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, సెప్టెంబర్ 2016, సోమవారం

తమిళనాడు యాత్రా విశేషాలు - రామేశ్వరం



చిదంబరం తర్వాత రామేశ్వరం చేరుకున్నాము.భారత భూభాగం నుండి నాలుగుపక్కలా నీళ్ళు ,మధ్యలో ఉన్న రామేశ్వరం ద్వీపం అద్భుతమైన ప్రదేశం.సహోదరులైన రామలక్ష్మణుల మధ్య ఎంత కష్టమొచ్చినా చెక్కుచెదరని ప్రేమాభిమానాలు, తనను కాపాడటానికి రాముడు వస్తాడని అచంచలమైన మనస్సుతో (లోపల తిట్టుకుంటూ బయట పొగుడుకుంటూ కాకుండా) ఎదురుచూసే సీతమ్మని చేరుకొని, ఆమె నమ్మకం నిలబెట్టటానికి రాముడి కఠినదీక్ష,జంతువులమైనా మాశక్తి చాటుతామన్న వానరసైన్యం స్వామిభక్తి,  ఉడతసాయం,రామనాథేశ్వరునిగా వెలసిన శివయ్య పరిపూర్ణ అనుగ్రహం,అడుగడుగునా ఉన్న పవిత్ర తీర్ధాలు,త్రేతాయుగంలోనే కాదు కలియుగమైనా తలచుకుంటే మానవుడే మహనీయుడు కావచ్చని నిరూపించిన శ్రీ APJ.అబ్దులకలాం గారు జన్మించిన గొప్పప్రదేశం రామేశ్వరంలో అడుగుపెట్టటం ఎన్నోజన్మల పుణ్యఫలం అనిపిస్తుంది. రామేశ్వరం వెళ్ళేటప్పటికి తెల్లవారుఝాము 3 అయ్యింది.రోడ్ బ్రిడ్జ్ మీదనుండి పంబన్ రైల్  బ్రిడ్జ్, రాత్రి నిశ్శబ్దంలో నిశ్చలంగా ఉండి, సన్నగా శబ్దం చేస్తున్న సముద్రాన్ని చూడటం చాలా బాగుంది. 


రామేశ్వరము తమిళనాడులో చెన్నైకి 572 కి.మి దూరంలో రామనాథపురం జిల్లాలో ఉంది .భారత ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడి బంగాళాఖాత సముద్రానికి 10మీటర్ల ఎత్తులో శంఖు ఆకారంలో ఉండే చిన్న ద్వీపం రామేశ్వరం.రామేశ్వరం అంతా రామమయమే కాదు అద్భుతాలకు నిలయం కూడా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో సేతుబంధేతు రామేశం అని  వర్ణించే రామేశ్వరం జ్యోతిర్లింగాలలో ఏడవది.హిందువులలో కాశీయాత్రకు ఉన్నంత ప్రాధాన్యత రామేశ్వరానికి ఉంది.కాశీ వెళ్లిన వాళ్ళు రామేశ్వరాన్ని కూడా దర్శిస్తేనే కాశీయాత్ర పూర్తయినట్లని నమ్మకం.భారతదేశానికి తూర్పున పూరీ జగన్నాధుడు, ఉత్తరాన బదరీనాధ్,పశ్చిమాన ద్వారక,దక్షిణాన రామేశ్వరం చార్ ధామ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో దక్షిణాన వెలసిన రామేశ్వరం అద్వితీయమైన క్షేత్రం.రామేశ్వరంలో సముద్రానికి శాంతిసముద్రమని పేరు.ఇక్కడే శ్రీ రాముడు రామసేతును  నిర్మించి లంకకు చేరాడు.


బ్రహ్మ మనవడైన  రావణాసురుడిని సంహరించి ఆ బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవటానికి మహర్షుల ఉపదేశం ప్రకారం రాముడు సీతా,లక్ష్మణ సమేతంగా  రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయాలని ఆంజనేయుడిని కైలాసం నుండి శివలింగం తెమ్మని చెప్తాడు కానీ చెప్పిన సమయానికి ఆంజనేయుడు అక్కడికి చేరుకోలేకపోవటంతో సీతాదేవి స్వయంగా సైకత లింగాన్ని చేయగా దాన్నే శ్రీరాముడు ప్రతిష్టించి షోడశోపచారాలతో అభిషేకాలు,పూజ పూర్తి చేసిన తర్వాత ఆంజనేయుడు కైలాసం నుండి శివలింగాన్ని తీసుకువచ్చి జరిగిన విషయం తెలుసుకుని సైకత లింగాన్ని తొలిగించటానికి విశ్వప్రయత్నం  చేస్తాడు.చివరికి విఫలమై శ్రీరాముడిమీద అలిగిన ఆంజనేయుడిని ఓదార్చి, హనుమంతుడి తెచ్చిన విశ్వనాధ లింగానికి ముందుగా పూజలు జరుగుతాయని వరమిస్తాడు.ఇప్పటికీ అలాగే ముందుగా ఆంజనేయుడు తెచ్చిన శివలింగానికి పూజలు జరుగుతాయి. ముందుగా విశ్వనాధ లింగాన్ని చూసిన తర్వాతే గర్భగుడిలోని రామనాధ స్వామిని దర్శించాలి.  రాముడు ప్రతిష్టించిన రామనాథేశ్వర స్వామి శివలింగం పరమ పవిత్రమైనది, శైవులకు, వైష్ణవులకు పవిత్ర పుణ్యక్షేత్రం.


ద్రవిడ శిల్పకళారీతిలో నిర్మించిన విశాలమైన ఈ ఆలయం నిర్మాణంలో పన్నెండో శతాబ్ది నుంచి ఎంతో మంది రాజులు పాలు పంచుకున్నారు. ఆలయ మూడు ప్రాకారాల్లోనూ మూడ మండపాలు ఉన్నాయి. మూడో ప్రాకారంలోని మండపం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అటూ ఇటూ 1200 రాతిస్తంభాలతో సుమారు కిలోమీటరున్నర విస్తీర్ణంలో ఉన్న ఈ మండపం అతి పొడవైనదిగా పేరు తెచ్చుకుంది. ఆలయ గోపురం 126 అడుగుల ఎత్తుతో తొమ్మిది అంతస్తులతో  అరుదైన శిల్పకళతో అద్భుతంగా ఉంటుంది.ఆలయం ప్రాంగణం చాలా పెద్దది.


ఆలయంలోపలికి వెళ్లేముందే ఆలయం సమీపంలో ఉన్న సముద్ర తీర ప్రాంతమైన అగ్నితీర్థంలో స్నానం చేసి వెళ్ళాలి.సీతాదేవి కోసం లంకకి వెళ్లే సమయంలో రాముడు ఇక్కడ ఉన్న అనేక తీర్ధాల్లో స్నానం చేయటం వలన రామేశ్వరంలోని తీర్ధాలన్నీ ఎంతో  పవిత్రమైనవిగా,పాపాలను తొలగించేవిగా విశ్వాసం.

అగ్ని తీర్ధం

ఇక్కడి గుడిలోపల  22 తీర్థాలు ఉన్నాయి. ముందుగా ఇక్కడి తీర్థాల్లో స్నానం చేసిన తరవాత అప్పుడు దైవదర్శనానికి వెళతారు. ఒక్కొక్క తీర్థం చిన్న చిన్న బావుల్లా,కోనేరుల్లాగా ఉంటాయి.ఇక్కడ తీర్ధాల్లో స్నానం చేస్తే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం.బావిలోనుండి నీళ్ళు  బక్కెట్లతో తోడి భక్తుల మీద పోస్తారు. ఆలయంలోపల ఉన్న తీర్ధాలన్నిటిలో చివరిది కోటి తీర్ధం ఇందులో అనేక పుణ్యనదుల నీరు కలిసి ఉంటుందని నమ్మకం.ఆ నీటితోనే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు.గుడిలోకి వెళ్లేముందే సెల్ ఫోన్స్ కానీ,ఇంకేమీ వస్తువులు దగ్గర లేకుండా చూసుకోవాలి.లేకపోతే స్నానాలు చేసేటప్పుడు  ఇబ్బంది అవుతుంది.ఎక్కడైనా ఒక నదిలో స్నానం చేసి గుడికి వెళ్తుంటాం కానీ ఇక్కడ ముందు సముద్రంలో స్నానం చేసి,తర్వాత ఆలయమంతా తిరుగుతూ 22 బావుల్లో నీళ్లతో స్నానం చేయటం ఈ క్షేతం ప్రత్యేకత.మేము కూడా ఈ తీర్ధాలలో స్నానం చేశాము.ఎవరైనా ఒక గైడ్ ని పెట్టుకుంటే ఒక్కొక్కరికి  కొంత డబ్బు చొప్పున తీసుకుని మనల్ని అన్ని బావుల దగ్గరికి తీసుకెళ్లి ,తిప్పుతూ వాళ్ళే నీళ్ళు  తోడి, తలమీద పోస్తారు.మేము కూడా అలాగే గైడ్ ని తీసుకెళ్ళాము.గైడ్ లేకపోతే  ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో అక్కడ క్యూలో జనాల్ని చూశాక అర్ధమయ్యింది.


గర్భగుడి పక్కనే ఉన్న విశ్వనాధ లింగాన్ని దర్శించుకున్న తర్వాత రామనాధస్వామిని దర్శించాలి.
ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధనీ దేవి.


ఆలయ ప్రాంగణంలోనే ఉన్న పూజా స్టాల్స్ లో ప్రసాదాలు


రామేశ్వరుని దర్శించుకుని బయటికి వచ్చాక చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. శ్రీరామచంద్రుడు సీతమ్మకోసం  లంకకి వెళ్ళటానికి ఇక్కడికి వచ్చి,వానర సైన్యంతో కలిసి రావణుడి మీద యుద్ధానికి సిద్ధమైన ఈ ప్రదేశంలో అడుగడుగునా రాముడి జ్ఞాపకాలే,రాముడి చరిత్రే.ఇన్ని సౌకర్యాలున్న ఈ రోజుల్లో సముద్రాన్ని కూడా దాటి,ఈ ద్వీపంలోకి వచ్చాము.కానీ ఆరోజుల్లో ఎంత ధైర్యంగా ముందడుగు వేసి,తన సైన్యాన్ని నడిపించి,శత్రువుపై  విజయం సాధించిన రాముడు ఎప్పటికీ "రామచంద్రుడతడు రఘువీరుడే" అనిపించింది.

రామేశ్వరంలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు 
ప్రతిచోటా ఇలా బోర్డ్ పెట్టటం వలన easy  గా తెలుసుకొని వెళ్లొచ్చు

గంధమాదన పర్వతం రామనాధ స్వామి దేవాలయానికి 3 కి.మీ దూరంలో ఎత్తైన శిఖరమే గంధమాదన పర్వతం.ఇక్కడ శిఖరం మీద రెండు అంతస్తులతో దేవాలయం ఉంటుంది.ఇక్కడ పైన ఉన్న చిన్న గదిలో రాములవారి పాదముద్రలుంటాయి.సముద్ర ఘోషకు దూరంగా ప్రశాంత వాతావరణంలో కూర్చుని రాములవారు తన సైన్యంతో యుద్ధానికి సంబంధించిన చర్చలు జరిపేవారట.హనుమంతుడు ఇక్కడినుండే లంకకి లంఘించాడని పురాణకధనం.ఇక్కడి నుండి చూస్తే రామేశ్వరం చుట్టుపక్కల అంతా చాలా అందంగా కనిపిస్తుంది. నీలాకాశం,సముద్రంతో కలిసిపోయిందా అన్నట్లు నీలంగా సముద్రం,ఆకుపచ్చని తోటలు చాలా మంచి view ఇక్కడినుండి  ఉంటుంది. 

 గంధమాదన పర్వతం
గంధమాదన పర్వతం నుండి కనిపిస్తున్న సముద్రం,పరిసరాలు

రావణుడిని వ్యతిరేకించిన విభీషణుడు రాముడిని కలిసి శరణు కోరగా విభీషణుడిని సోదరుడిగా భావించిన రాముడు ,పట్టాభిషేకం జరిపించిన ప్రదేశమే రామేశ్వరంలోని కోదండరామాలయం.రామేశ్వరం నుండి 10 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ రాముడు, విభీషణుడి మధ్య అప్పటి ఘట్టాలను వివరించే చిత్రపటాలు ఉంటాయి. 

కోదండరామాలయం

జటామకుట తీర్ధం - ఇక్కడ ఉన్న కోనేరులో రాములవారు తన జటలను తడిపి స్నానం చేయటంవలన దీనికి జటామకుట తీర్ధం అని పేరు వచ్చింది.ధనుష్కోటికి వెళ్లేదారిలోనే ఆ తీర్ధం ఉంటుంది. నాలుగు వైపులా మెట్లున్న ఈ కోనేరుకి గ్రిల్స్ పెట్టారు
జటామకుట తీర్ధం


రామతీర్ధం, లక్ష్మణ తీర్ధం

రావణుడిని అంతం చేశాక లంక నుండి తిరిగి వచ్చే సమయంలో సీతాదేవి  దాహం తీర్చటానికి రాముడు సముద్రం మధ్యలో  బాణం వేయగా మంచి నీరు పైకి వచ్చాయట.సముద్రం మధ్యనుండి వచ్చే ఈ ఆ నీరు ఇప్పటికీ మంచినీళ్ళుగానే ఉండటం విశేషం.

విల్లుండి తీర్ధం

ధనుష్కోటి - రామేశ్వరానికి దక్షిణం వైపున్న చిన్నగ్రామం ధనుష్కోటి.రామేశ్వరం నుండి 35 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది. రావణుడి లంకలో ప్రవేశించటానికి రాముడు వానరుల సహాయంతో ఇక్కడి నుండే లంకకు రామసేతు వంతెనని నిర్మించి,రావణవధ తర్వాత లంక నుండి తిరిగి వచ్చేటప్పుడు వానరులు తాము కట్టిన రామసేతుని పగలగొట్టినట్లు చెప్తారు.శ్రీరాముడు కూడా ధనుస్సు కొనతో వారధిని పగలగొట్టటం వలన ఈ ప్రాంతానికి ధనుష్కోటి అనే పేరు వచ్చింది.రామేశ్వరం  నుండి ధనుష్కోటి వరకు రైల్వే లైన్ ఉండేది.1964 లో వచ్చిన పెద్ద తుఫానులో ప్రయాణీకులతో వస్తున్న రైలు కూడా కొట్టుకుపోయింది.అప్పటినుండి ధనుష్కోటి గ్రామం లేకుండా పోయింది.ఆతర్వాత రైల్ లైన్ సరిచేసినా ట్రాక్ ని ఇసుకతిన్నెలు కప్పివేయటంతో దాన్ని పూర్తిగా ఉపయోగించటం మానేశారు. ధనుష్కోటి దగ్గర మహోధధి(బంగాళాఖాతం),రత్నాకర(హిందూమహాసముద్రం)సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే యాత్ర పూర్తయినట్లు కాదని భావించేవారు.కానీ ప్రస్తుతం అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవటంతో రామేశ్వరంలోనే పూజలు జరిపిస్తున్నారు.ఇప్పుడు ధనుష్కోటికి వెళ్లే రోడ్డుమార్గం కూడా అనుకూలంగా లేనందువలన కొంచెం దూరంలోనే మన వెహికల్స్ ఆపేస్తారు.అక్కడ బీచ్ చాలా బాగుంది సముద్రాన్ని చూస్తుంటే అనంతజలవారాశి అనే ఇదేనేమో అనిపిస్తుంది.ఆకాశం,సముద్రంలో నీళ్లకి తేడా లేనంత నీలంగా సముద్రం విస్తరించి ఉంది.అప్పట్లో ఇదంతా ఆ శ్రీరాముడు నడయాడిన నేల కదా అనిపిస్తుంది.

ధనుష్కోటి దగ్గర సముద్రం

అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు

రెండుపక్కలా నీళ్లు, మధ్యలో చిన్నరోడ్డు 
ధనుష్కోటి దగ్గర భారతదేశ చివరి భూభాగం

ఇక్కడ చిన్న పాకల్లో మంచినీళ్లు ,కూల్ డ్రింక్స్, గవ్వలతో చేసిన అలంకరణ వస్తువులు అమ్ముతారు.
ధనుష్కోటి బీచ్ షాపింగ్ :)
ధనుష్కోటి old navy watchtower

ధనుష్కోటి బీచ్ నీలంగా,స్వచ్ఛంగా ఉన్న సముద్రంతో చాలా ఆహ్లాదకరంగా ఉంది.విపరీతమైన ఎండగా ఉన్నా, సముద్రం అలలతో  ఆడుతూ ఎంత సమయమైనా అక్కడ ఉండాలనిపిస్తుంది.కాసేపు అక్కడే ఉండి రామేశ్వరం నుండి వెనక్కి బయలుదేరాము.

పంబన్ బ్రిడ్జ్ కి వచ్చే దారిలోనే కలాం గారి ఇల్లు ఉంటుంది.మేము ట్రిప్ అనుకున్నప్పుడే ముఖ్యంగా చూడాలనుకున్న వాటిల్లో కలాంగారి ఇల్లు ఒకటి.చాలా ఇరుకు గొందుల్లోనుండి వెళ్ళాలి.రామేశ్వరంలో జన్మించి,అక్కడ తిరిగిన మహనీయుడు ఒకప్పటి మన రాష్ట్రపతి శ్రీ A.P.J.అబ్దుల్ కలాం గారు.ఆయన Wings of Fire పుస్తకంలో రాసిన వారి ఇల్లు,పరిసరాలు, ఇంటికి దగ్గర్లోనే ఉన్న మసీదు అన్నీ మారిపోయినా ఆయన పుట్టి,పెరిగిన ప్రదేశాన్ని చూడటం,అక్కడ నిలబడగలగటం కూడా ఆనందమే  అనిపిస్తుంది.భవనములోని మొదటి ఫ్లోర్ లో వారి జీవిత విశేషాలను తెలిపే Mission Of Life Galleryలో చిత్ర ప్రదర్శన,పుస్తకాలను ఉంచారు.ఇక్కడ కావాలనుకుంటే పుస్తకాలు కూడా కొనుక్కోవచ్చు.

Former President A.P.J. Abdul Kalam House
  
ఈ పుస్తకం కలాం గారి లైబ్రరీ నుండి తెచ్చుకోవటం(కొనుక్కునే )
 నాకైతే చాలా గొప్పగా అనిపిస్తుంది. 
 
రామేశ్వరంలో కలాం గారి పేరుతో ఉన్న షాప్.

భారత భూభాగాన్ని,రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ సముద్రం మీద నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ -పంబన్ బ్రిడ్జ్  ఇంజినీరింగ్‌ అద్భుతాల్లో ఒకటి.పంబన్ రైల్వే స్టేషన్ నుండి మండపం రైల్వే స్టేషన్ని కలుపుతుంది. స్టీమర్లు, నౌకలు లాంటివి వచ్చినప్పుడు బ్రిడ్జి రెండుగా విడిపోయి పైకి లేస్తుంది. మధ్యలోనుంచి నౌకలు వెళ్లగానే మళ్లీ యథాస్థానంలోకి వస్తుంది. అంతపెద్ద సముద్రంలో బ్రిడ్జ్ నిర్మించటం,దానిమీద రైల్ వెళ్ళటం అంతా అద్భుతంగా ఉంటుంది.పక్కనే ఉన్న రోడ్ బ్రిడ్జ్ మీద నుండి  నీలిరంగు సముద్రం,  దాని మధ్యలో దృఢంగా నిలబడి ఉన్న ఆ బ్రిడ్జ్ చూడటం గొప్ప అనుభూతి.గూగుల్ Map లో చూసినప్పుడు చుట్టూ సముద్రం మధ్యలో ఉన్న చిన్నద్వీపం ఎంతో భయంగా అనిపించినా, అక్కడికి వెళ్లిన తర్వాత మాత్రం ఆ పరిసరాలు, సముద్రం,బ్రిడ్జి వాటి ఔన్నత్యాన్ని చూడటంలో అన్ని భయాలు మర్చిపోతాము.అక్కడ ఎంతసేపున్నా విసుగనిపించదు.రామేశ్వరం  వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు యాత్రికులు కాసేపు ఈ బ్రిడ్జ్ మీద ఆగకుండా వెళ్ళలేరు.ఒక్కోసారి ఇక్కడ ఆగిపోయే వాహనాలతో ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది.
తళ తళా, మిల మిలా మెరుస్తున్న శాంత సముద్రం 
 Pamban Bridge India’s first sea bridge
 




శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి

India నుండి pamban Bridge శ్రీలంక నుండి రామసేతు మధ్యలో రామేశ్వరం 

ఇవీ మా రామేశ్వరం యాత్రా విశేషాలు.శివయ్య కొలువై ఉన్న పుణ్యక్షేత్రంలో  అడుగుపెట్టాలన్నా,స్వామి దర్శనం కావాలన్నా పరమేశ్వరుడి అనుమతి కావాలట.శివయ్యనే కాదు ఏ దైవదర్శనం కావాలన్నా పుణ్యం చేసుకోవాలని,ప్రాప్తం ఉండాలని మా అమ్మమ్మ అనేది.ఆ ప్రాప్తం మాకు కలిగించిన శివయ్యకు మనసారా నమస్కరిస్తూ ఇక్కడినుండి మా ప్రయాణం కన్యాకుమారికి.

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మా ఢిల్లీ ప్రయాణం..2015



పోయిన సంవత్సరం (2015)  ఢిల్లీలో ఉన్న "SFIO -Serious Fraud Investigation Office" లో  Legal Consultants postsకి apply చేశాను.aplications short listing process అయ్యాక  Interview సరిగ్గా 4 రోజులుందనగా ఇంటర్వ్యూకి ఢిల్లీ రమ్మని  Call Letter  పోస్ట్ లో వచ్చింది.

Interview Call Letter చూడగానే నాకు కంగారు మొదలయ్యిది. Interview కి సెలెక్ట్ అయ్యాము సరే, ఢిల్లీ వెళ్ళటం ఎలా? ఇప్పుడు వెళ్లకపోతే మంచి అవకాశం పోతుందేమో ? వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేసాను.నాకంటే ఎక్కువ కంగారుపడ్డ మా తమ్ముడు సరే ఆలోచిస్తా ఉండు అంటూ కాసేపాగి ఫోన్ చేసి మా ఫ్రెండ్ సాంబ ఫ్యామిలీ తో అక్కడే ఉంటున్నాడు కదా  ఫోన్ చేసి అడగనా అన్నాడు. సాంబ అంటే మా తమ్ముడి చిన్నప్పటి ఫ్రెండ్ Ch.సాంబశివారెడ్డి.  LKG నుండి మా ఊర్లో సిస్టర్స్ కాన్వెంట్ లో చదివారు మా తమ్ముడు,వాడి ఫ్రెండ్స్ .ఆదివారం, ఎప్పుడన్నా సెలవలు వచ్చినా అందరూ ఒకచోటచేరి అందరి ఇళ్లకు వెళ్తూ ఉండేవాళ్ళు.అలాగే మా ఇంటికి కూడా వస్తూఉండేవాళ్లు.నన్ను అక్కా అంటూ పిలుస్తూ అభిమానంగా మాట్లాడేవాళ్ళు, ఇప్పటికీ అందరూ కలుస్తూ ఉంటారు.సరే సాంబ అయితే మనకేం సమస్య కానీ తనేమంటాడో అడుగు మరి అనగానే తమ్ముడు సాంబాకి ఫోన్ చేయటం,సాంబ వెంటనే అక్క జాబ్ కోసం అయితే ఖచ్చితంగా రావాలి కదరా తప్పకుండా రండి  నాకేమి ఇబ్బంది లేదు అనటంతో హమ్మయ్య అక్కడికి వెళ్ళి ఉండటం ఎలా, అక్కడ మనకేమీ తెలియదు కదా అన్న పెద్ద సమస్య తీరిపోయింది.

ఇక వెళ్ళటం ఎలా? ట్రైన్ అంటే ఒకటిన్నర రోజు పడుతుంది.అంతసేపు జర్నీ చేయలేము కాబట్టి  Flight కి వెళదామా  అన్నాడు తమ్ముడు. ఎలాగూ అక్కడ సాంబ ఉన్నాడు కాబట్టి అమ్మని,చెల్లిని కూడా ఢిల్లీ తీసుకెళదాం చూస్తారు కదా అని,అంతే మాప్రయాణానికి అంతా సిద్ధం అయిపోయింది. సెప్టెంబర్ 23 రాత్రి 7 గంటలకి Flight.అమ్మ,తమ్ముడు,చెల్లి,మాబాబు,నేను ప్రయాణానికి సిద్ధమయ్యాము. 

  

2015సెప్టెంబర్23 - నాకు ఒక పక్క Interview టెన్షన్,మరో వైపు మా అందరికీ ప్రయాణం సంతోషం, weight ప్రకారం లగేజ్ ఎంత ఉండాలో అంత అన్నీ రెడీ చేసుకుని, 23 సాయంత్రం క్యాబ్ లో Airport కి బయలుదేరాము.మాచెల్లి వాళ్ళాయనకి ఢిల్లీ రావటం కుదరకపోవడంతో Airport దాకా వచ్చి మాకు Happy journey చెప్పి వెళ్ళిపోయారు. Check in process పూర్తయ్యాక  Flight  గంట లేట్ అవ్వటంతో Waiting Lounge లో ఫుడ్,షాపింగ్స్ అన్నీ చూస్తూ టైమ్ తొందరగానే గడిచిపోయింది.ఇంతలో విమానం రానే వచ్చింది.boarding gate దగ్గరికి వెళ్లి క్యూలో aerobridge లోనుండి విమానంలోకి ఎంటర్ అయ్యాము.ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్న తర్వాత   Flight takeoff సీట్ బెల్ట్స్ పెట్టుకొమ్మని, మొబైల్స్ ఆఫ్ చెయ్యమని,లేదా Flight మోడ్ లో పెట్టమని safety instructions, emergency procedures చెప్తారు. details of the flight  destination, expected duration of flight, weather అన్నీ captain announce చేస్తారు.అన్నీ అయ్యాక ఇక విమానం కదిలింది.2గంటల్లో ఢిల్లీ చేరిపోయామని captain announcement వినిపించింది.మొత్తానికి safe గా నేలమీదకి దిగాము. విమానంలో నుండి దిగి  అక్కడినుండి బస్ లో ఢిల్లీ  airport లోకి ఎంటర్ అయ్యాము. అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకుని టాక్సీ కోసం బయటికి వచ్చాము.మొత్తానికి 30 గంటల ప్రయాణం 2 గంటల్లో పూర్తి చేసుకుని ఇలా మా ప్రయాణం పూర్తయ్యింది. 

 

ఇక ఢిల్లీ అప్పటికే  పూర్తి నిర్మానుష్యమైపోయింది. హైదరాబాద్ లో  ఎప్పుడూ చూడని వాతావరణం అక్కడ కనిపించింది. ట్యాక్సీలో  ఇంటికి వెళ్లేసరికి రాత్రి పన్నెండు అయ్యింది. మా తమ్ముడి ఫ్రెండ్ సాంబ వాళ్ళ కాలనీ మెయిన్ గేట్లోనే  మాకోసం ఎదురుచూస్తున్నాడు.చిన్నప్పట్లాగే  అక్కడే అందర్నీ సరదాగా మాట్లాడుతూ పలకరించి ఇంటికి తీసుకెళ్ళాడు.అడ్రెస్ చెప్పి ఊర్కోకుండా ఆ చీకట్లో  అక్కడ మాకోసం ఎదురుచూడటమే ఒక ఆశ్చర్యం అనుకుంటే ఇంటికెళ్ళాక సాంబ వాళ్ళావిడ శిరీష మరొక ఆశ్చర్యం. మేమంతా తనకి చాలా తెలిసిన వాళ్ళలాగా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్ళి ఫ్రెష్ అవగానే భోజనం చేయాల్సిందే నేను మీకోసం చేసాను అని పట్టుపట్టింది.మేము హైదరాబాద్ లో Flight ఎక్కేముందే ఫోన్ చేసిన సాంబ వంట చేపిస్తాను ఆ airport లో ఏమి తింటారు అన్నాడు మేము వద్దులే తినేసి వస్తాము అన్నా కానీ, మాకోసం వంట చేయించి రెడీగా ఉంచారు.మేము భోజనం చేసి కబుర్లు చెప్పుకుని మాకు కొత్త ప్రదేశం అన్న ఫీలింగ్ కూడా లేకుండా హాయిగా నిద్రపట్టింది. సంవత్సరం అయినా ఇప్పటికీ ఢీల్లీ ప్రయాణం సంతోషమైన జ్ఞాపకంగా మిగిలిపోవటానికి ముఖ్య కారణమైన సాంబ, శిరీషకి ఎంత thanks చెప్పినా తక్కువే అనిపిస్తుంది.

శిరీష నేను ఎప్పటికీ మర్చిపోలేని మంచి అమ్మాయి,మంచి స్నేహితురాలు,మంచి భార్య అని చెప్పొచ్చు.ఇంటికి ఎవరైనా బంధువులొస్తే రెండురోజులున్నా గానీ వీళ్ళకి సేవలు చేయాల్సొచ్చిందే అనుకుంటూ తప్పనిసరిగా చేస్తుంటాము కానీ శిరీష, భర్త  చిన్నప్పటి స్నేహితులకోసం కోసం మేమెవరో తనకి తెలియకపోయినా సొంత మనుషుల్లాగ మాతో కలిసిపోయింది. మేము ఉదయం లేచేసరికే మేము అంతమందిమి  ఉన్నా, ఇల్లు శుభ్రంగా ఊడ్చి,తుడిచి ఇంటిముందు మార్బుల్ మీదే చాక్ పీస్ తో ముగ్గువేసింది.పనిమనుషుల్ని అందర్నీ నమ్మలేము కదక్కా అందుకే నేనే అన్ని పనులు చేసుకుంటాను అంది. ఇంట్లో కూడా అన్నీ తను సొంతగా తయారు చేసిన డెకరేటెడ్ వస్తువులు,ఫోటో ఫ్రేమ్స్ , వాకిలికి పువ్వుల కర్టెన్స్ ఇలా ఇల్లంతా చాలా నీట్ గా అందంగా ఉంచింది.సాంబ ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్తాడని వంటచేసి లంచ్ బాక్స్ , మాకోసం పూరీ,కూర, మా బాబు కోసం పూరీలు బయట తినటానికి బాక్స్ లో కూడా చేసి పెట్టింది.గుంటూరు సిటీలో పుట్టి పెరిగి, MCA చదివిన శిరీషకి face book , Whats app అన్నీ తెలుసు కానీ అవేమీ ఓపెన్ కూడా చేయదట. ఏముందక్కా అందులో అమ్మా వాళ్ళు,ఫ్రెండ్స్ అందరూ ఫోన్ లో మాట్లాడతారు ఇంక వాటిలో రెగ్యులర్ గా నేను చేసేదేముంది అంటున్న శిరీషని చూస్తే నాకు ఆశ్చర్యంగా, face book లో అకౌంట్ లేకపోతే తప్పు, పాపం అన్నట్లు ఒకటికి రెండు అకౌంట్లు కూడా తీస్తూ , మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడేవాళ్ళున్న ఈ రోజుల్లో శిరీషలాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అనుకున్నాను.సాంబ అదృష్టవంతుడు అనిపించింది."మీరు  చికెన్ బాగా చేస్తారట కదా ఆంటీ సాంబ చెప్పాడు, చిన్నప్పుడు మీ ఇంటికొస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చికెన్ చేసి పెట్టేవాళ్ళట " అని శిరీష అనగానే ఎప్పుడో  తిన్న వంట రుచిని భార్యతో చెప్పి మెచ్చుకున్నందుకు మా అమ్మ ఆనందానికి అవధులు లేవు.అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది,ఏమీ లేనిదే ఎగిరెగిరి పడుతుంది అని పెద్దల మాట నిజమే అనిపిస్తుంది కొందరిని చూసినప్పుడు.

 లోటస్ టెంపుల్ 

2015సెప్టెంబర్24 - Interview మధ్యాహ్నం కావటంతో ఉదయాన్నే లోటస్ టెంపుల్ కి వెళ్ళాము.చిన్నప్పుడు historical monuments లో చార్టులు తెచ్చి కట్ చేసి white Paper మీద అతికించే రోజుల్లో లోటస్ టెంపుల్ చూసాము. మళ్ళీ ఇలా ఇన్నాళ్లకి నిజంగా చూస్తున్నాము అనిపించింది. ఉదయమే వెళ్లటంతో వాతావరణం చల్లగా చుట్టూ ఆకుపచ్చని గార్డెన్ మధ్యలో లోటస్ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది.బయటే చెప్పులు వదిలేసి లోపలికి  వెళ్ళాలి.లోపల ప్రార్ధనా మందిరం ఉంది.అక్కడినుండి పర్యావరణ్ భవన్ కి ఇంటర్వూకి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు అదే సరిపోయింది.అక్కడ మరో వింత, ఇంటర్వ్యూకి అందరికంటే ఎక్కువ హైదరాబాద్ నుండి లాయర్స్  వచ్చారు .బయటికి రాగానే ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాము. చుట్టూ పచ్చటి పార్కులు ,వాటర్ ఫౌంటెన్, ఎదురుగా కనపడుతున్న రాష్ట్రపతి భవన్ అంతా అద్భుతమే. 9 దశాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు అఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90 వేల యుద్ధజవానుల స్మృత్యర్థం నిర్మించిన అపురూప కట్టడం ముందు నిలబడటం చాలా సంతోషంగా అనిపించింది.అక్కడినుండి రాష్ట్రపతిభవన్ దగ్గరికి వెళ్ళేసరికే చీకటి పడింది.కాసేపు అక్కడ ఉండి సరోజినీ నగర్ మార్కెట్ కి వెళ్ళాము.ఇక్కడ షాపింగ్ చాలా బాగుంది దొరకని వస్తువులు ఉండవేమో అనిపిస్తుంది. కానీ రేట్లు అడిగి బేరం చేసే టాలెంట్ కూడా ఉండాలి.షాపింగ్ చేసి, నేపాలీ మోమోస్ తిని అప్పటికే బాగా చీకటి పడటంతో ఇంటికి చేరుకున్నాము.
ఇండియా గేట్
రాష్ట్రపతి భవన్


సరోజినీనగర్ మార్కెట్

2015సెప్టెంబర్25 - ఉదయాన్నే తాజ్ మహల్ వెళ్లాలని మా ఆలోచన కానీ శుక్రవారం తాజ్ మహల్ కి సెలవట.తాజ్ మహల్ చూడలేకపోవటం మాకు కొంచెం బాధ అనిపించింది, ఏముందక్కా అది చూసేది సమాధి అంది శిరీష, ఏంట్రా అలా అంటావు అంటే ఏమోనక్కా నాకలాగే అనిపిస్తుంది అంది.ఆమాట నిజమేనని నాకు ఆ తర్వాత మహారాష్ట్ర ఔరంగాబాద్ లో మినీ తాజ్  మహల్ చూసిన తర్వాత అనిపించింది.సాంబ అక్షరధామ్ వెళ్ళండి బాగుంటుంది అనటంతో ..ఉదయాన్నే cab  మాట్లాడుకుని, ఛత్తర్ పూర్ లో కాత్యాయనీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళాము. ఆద్యకాత్యాయనీ శక్తిపీఠం చాలా బాగుంది.అక్కడినుండి కుతుబ్ మీనార్ వెళ్ళాము. 1193 లో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన ఈ చారిత్రిక కట్టడానికి  ఎత్తయిన ఇటుకుల మినార్ అని పేరు.5 అంతస్తులతో, చుట్టూ బాల్కనీలతో నిర్మించారు.మొదటి మూడు అంతస్తులను ఎర్రటి ఇసుకరాయితో,నాలుగు,ఐదు అంతస్తులను మార్బుల్, ఇసుకరాయితో నిర్మించారు.దీనికి దగ్గర్లోనే ఒక మసీదు, అసంపూర్తిగా మిగిలిపోయిన మరొక మినార్,తుప్పు పట్టని ఇనప స్థంభం, మండపాలు రకరకాల శిల్పకళతో చాలా కట్టడాలున్నాయి.ఎత్తైన ఈ కట్టడం చాలా దూరంనుండే అందంగా కనపడుతూ ఉంటుంది.ఇక్కడ కూడా వెంటనే బయటికి రావాలనిపించదు ఎత్తైన ఆ కట్టడాన్ని తల పూర్తిగా పైకెత్తి చూడాల్సిందే.మొత్తం ఫొటోలో కవర్ చేయటం కూడా కష్టమే. 

ఆద్యకాత్యాయని శక్తి పీఠం

కుతుబ్ మినార్
ఎర్రకోట

ఎర్రకోట జండావందనం రోజే కాదు ఎప్పుడూ జనంతో నిండిపోయే ఉంటుందేమో అనేంత జనం ఉన్నారు.ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది.ఆ ఎండలోనే కాసేపు అక్కడ తిరిగి, అక్షరధామ్ "స్వామి నారాయణ్ అక్షరధామ్" కి వెళ్ళాము.ఢిల్లీ నుండి యమునా నది మీదుగా అక్షరధామ్ చేరుకుంటాము. అదొక మానవ నిర్మిత మహాద్భుతం అని చెప్పొచ్చు.దాదాపు వంద ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం చూడటానికి ఎంత సమయమైనా సరిపోదనిపిస్తుంది.ఎటు చూసినా అద్భుతమైన శిల్పకళ, పచ్చటి గార్డెన్లు,అందులో జాతీయనాయకులు, పురాణ పాత్రల రకరకాల కంచు విగ్రహాలు ఉంటాయి. అసలు ఇనుము వాడకుండా ఎర్రటి ఇసుకరాళ్ళు,పాలరాతితో అందమైన గోపురాలతో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ్ విగ్రహం,ఇంకా ఇతర దేవతా మూర్తులు చాలా అందంగా ఉంటాయి.
అక్షర్ ధామ్
అక్షర్ ధామ్ లోపలి వింతైన,అందమైన శిల్పకళ

మధ్యాహ్నం లంచ్ ఆంధ్రాభవన్ లో మా cab driver కి అక్కడే తినాలనిపించిందేమో భోజనం అక్కడే బాగుంటుంది.అయినా మీరు  ఆంధ్రా నుండి వచ్చి ఆంధ్రాభవన్ లో భోజనం చేయకుండా వెళ్తే ఎలా అంటూ అక్కడికే భోజనానికి తీసుకెళ్లాడు.తినటానికి కూడా అంత సేపు క్యూలో వెయిట్ చేయించిన డ్రైవర్ మీద కాసేపు కోపం వచ్చినా లంచ్ మాత్రం చాలా బాగుంది.ఈమధ్య ఎక్కడ చూసినా క్యూలో నిలబెట్టి పెట్టే భోజనాల్లా కాకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోబెట్టి మరీ మళ్ళీ మళ్ళీ అడిగి భోజన పెట్టటం కూడా  బాగుంది
  
ఆంధ్రాభవన్ లంచ్

తాజ్ మహల్ చూడకపోయినా ఇంటికైనా తీసుకెళ్ళాలని ఢిల్లీహాట్ లో తాజ్ మహల్ కొన్నాము, అక్కడున్న పాలరాతి బొమ్మలు,వస్తువుల నైపుణ్యం,అందాలు చూడాలే కానీ చెప్పలేము.రేట్లు కూడా అలాగే ఉన్నాయి.ఇక్కడ కూడా బేరాలు చేయాల్సిందే.online లో ఆర్డర్ చేసినా పంపిస్తామని చెప్పారు. షాపింగ్ కూడా అయ్యాక ఇంటికి బయలుదేరాము.

 

డిన్నర్ అయ్యాక అందరం కాసేపు కబుర్లు చెప్పుకుని మళ్ళీ ఉదయం ఆరుగంటలకే Flight కావటంతో రెస్ట్ తీసుకుని ఉదయాన్నే airport కి వచ్చేసి 2 గంటల్లో హైదరాబాద్ నేలమీద దిగిపోయాము.మేము 2 గంటల్లో ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేసరికి మా మరిది గారు ఆ రెండుగంటలు హైదరాబాద్ ట్రాఫిక్ లో Airportకి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఇవీ మా ఢిల్లీ కబుర్లు.ఈ ప్రయాణంలో మా అందరికంటే ఎక్కువ సంతోషించింది మా అమ్మ.మా అమ్మ అక్కాచెల్లెళ్లు,అన్న పిల్లల్లో టెక్కీలు చాలా మంది విదేశాల్లో ఉన్నా చాగంటిగారి ప్రవచనంలో చెప్పినట్లు విమానంలోనో, విమానం దగ్గరో ఫోటో దిగి అమ్మా,నాన్నలకి చూపించిన వాళ్ళే కానీ అమ్మని విమానం ఎక్కించిన వాళ్ళు ఇప్పటిదాకా లేరు,వాళ్లందరిలో మొదటిగా మా తమ్ముడు తనని విమానం ఎక్కించాడని ఆ సంతోషం :) ఈరోజుకి మేము ఢిల్లీ వెళ్ళి సంవత్సరం పూర్తయినా ఈమధ్యే వెళ్లినట్లుంది.కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తొచ్చినా సంతోషంగా ఉంటాయి.అలాంటిదే మా ఢిల్లీ ప్రయాణం కూడా :)


2015 సెప్టెంబర్ 26 - ఢిల్లీ To హైదరాబాద్

Today's beautiful moments are tomorrows beautiful memories.

Related Posts Plugin for WordPress, Blogger...