పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

20, నవంబర్ 2010, శనివారం

బాపూ బొమ్మలు...

బాపు తెలుగు సినీప్రపంచంలో తనకంటూ చెరగని ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా,తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడకపోయినా ఇది గీసింది,తీసింది బాపూ అని గుర్తించగలిగే శైలి ఈయన సొంతం.
బాపూ అచ్చతెలుగు సినిమాలు సాధారణ కుటుంబాలలోని సమస్యలు,భార్యాభర్తల అన్యోన్యత, కుటుంబసభ్యుల మధ్యసంబంధాలను,ఎంతో చక్కగా ప్రతిబింబిస్తాయి.

బాపు సినిమాల్లో మరొక ముఖ్యమైన అంశం కధానాయిక.ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన,తెలుగు సంప్రదాయం ఉట్టిపడే నాయిక బాపు సినిమాల్లో ప్రధాన ఆకర్షణ.

అందంగా వున్న అమ్మాయిని ఎవర్ని చూసినా బాపుబొమ్మతో పోల్చటం బాపుబొమ్మ గొప్పతనం.

బాపు గురించి ఆరుద్ర గారు రాసిన కవిత...

కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె
ఊయలలూపు
కూనలమ్మా!

బాపు సినిమాల్లోని కొందరు బాపుబొమ్మలు నాకు చాలా ఇష్టం..

ముత్యాలముగ్గు ...సంగీత.


ఏదో ఏదో అన్నది మసక వెలుతురూ...
గూటిపడవలో
వున్నది కొత్త పెళ్ళికూతురు
ఒదిగి
ఒదిగి కూర్చుంది బిడియపడే వయ్యారం
ముడుచుకునే
కొలదీ మరీ మిడిసిపడే సింగారం...




మిష్టర్ పెళ్ళాం...ఆమని


సొగసు చూడతరమా..నీ సొగసు చూడతరమా
నీ
సొగసు చూడతరమా...
నీ
ఆపసోపాలు..నీ తీపిశాపాలు
ఎర్రన్ని
కోపాలు ఎన్నెల్లో దీపాలు అందమే సుమా..
సొగసు
చూడతరమా...నీ సొగసు చూడతరమా...




పెళ్ళిపుస్తకం...దివ్యవాణి.


సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను
మనసుమమత పడుగుపేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెలరాశికి సిరిజోత
నా వన్నెలరాశికి సిరిజోత




రాధాగోపాలం...స్నేహ.


మా ముద్దు రాధమ్మ రాగాలే
మువ్వగోపాల గీతాలు
చెయ్యి చెయ్యి తాళాలు అనురాగాలలో గట్టి మేళాలు
మా
ముద్దు రాధమ్మ రాగాలే......




సుందరకాండ...ఛార్మి.


ఏలో ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాల
ఎదిగే
వయసుల ఉయ్యాల...
ఎగిరే
పైటల ఉయ్యాల
ఏలో
ఏలో ఉయ్యాల ఏడేడు రంగుల ఉయ్యాల


10, నవంబర్ 2010, బుధవారం

కార్తీకమాసం....




సంవత్సరం అంతటిలో నాకు చాలా ఇష్టమైన నెల కార్తీక మాసం
దానికి చాలా కారణాలు వున్నాయి....

మొదటి కారణం నేను పుట్టిన నెల,
కార్తీకమాసం లో తెల్లవారుజామున చలిలో స్నానాలు,పూజలు,
మా పెద్దమ్మ,అత్తా వాళ్లాతో వెళ్ళే వనభోజనాలు,
మా అమ్మ,నాన్న చేసే కేదారీశ్వరవ్రతం ,
అన్నిటికంటే ముఖ్యంగా ఈ నెలలో కేదారీశ్వరవ్రతం ముందు మేము తప్పకుండా వెళ్ళే శ్రీశైలం టూర్,
పౌర్ణమి రోజున వెలిగించటానికి రోజంతా కూర్చుని తయారుచేసుకునే వత్తులు,
ఇవన్నీ ఈ నెలని చాలా హడావుడిగా,ఆనందంగా గడచిపోయేలా చేస్తాయి.

కార్తీకమాసం రాగానే నాకు నా చిన్నిప్రపంచంలోని నా వాళ్ళే కాదు మా బంధువులు కూడా గుర్తుకొస్తారు
మా ఇళ్ళల్లో కార్తీకమాసం సందడి అంతా మా అమ్మమ్మదే వుండేది.
తెల్లవారుజామున లేచి మా పెద్దమ్మ,పిన్ని,అత్త అందర్నీ లేపి చివరిగా మా ఇంటికి వచ్చేది.
అమ్మమ్మ పిలుపుతో విసుక్కుంటూనే లేచినా వెంటనే స్నానం విషయం గుర్తుకు వచ్చి సరదాగా వుండేది.
మా ఇంట్లో మోటర్ వేసుకుని స్నానం చేసి,అక్కడే గంగమ్మకి పూజ చేసి,ఏదో ఒక గుడికి వెళ్లి వచ్చేది.
మధ్యానానికి కార్తీక పురాణం పుస్తకం పట్టుకుని నా దగ్గర చేరేది.
మాఅమ్మ కదూ నువ్వైతే చదువుతావమ్మా ఇంకెవరూ నా మాట వినరు
చదివి వినిపించు అంటూ నా దగ్గర కూర్చుని నేను చదివితే వినేది.
ఎప్పుడైనా మిస్ అయితే అన్నీ కలిపి ఒకే రోజు చదివి వినిపించేదాన్ని.


నాకు వత్తులు చెయ్యటం నేర్పింది కూడా మా అమ్మమ్మే..
కార్తీకమాసం మొదలు కాకముందే పత్తిలో గింజలు తీసి వేసి,
ఆ పత్తిని సన్నని దారాలుగా లాగుతూ వత్తులు తయారు చేయటం చాలా సరదాగా వుండేది.
ఇక శ్రీశైలం టూర్ అంటే మేము, మా మామయ్య ఫ్యామిలీ ,
పెద్దమ్మల ఫామిలీ ,పిన్నీ వాళ్ళ ఫ్యామిలీ అంతా బయలుదేరేవాళ్ళము.
ఒక టూరిస్ట్ బస్సులో వెళ్ళే యాత్రికులంత వుండేది
మా బంధుగణం అంతా కలిసి...


ఇక కార్తీకమాసం వనభోజనాలు,నదిలో దీపాలు వదలటం ఇవన్నీ
మా అమ్మకి అంతగా ఇష్టం వుండదు.ఇంట్లోనే పూజ చేసుకుంటాను అంటుంది.
మా పెద్దమ్మ,అత్త,నన్ను పిలుచుకుని వెళ్ళేవాళ్ళు..
అందుకే వీటన్నిటికీ మా ఇంటి తరపున పెద్దమనిషిని నేనే అప్పట్లో...


ఇక కార్తీక పౌర్ణమిరోజు మా అమ్మమ్మ సంతానంలో మా అమ్మ,మామయ్య మాత్రమే కేదారీశ్వర వ్రతం చేసుకుంటారు.
ఒకే రోజు ఇద్దరి ఇళ్ళల్లో వ్రతం కావటంతో మా బంధువులందరూ పూజకి
ఎవరింటికి వెళ్ళాలనే విషయంలో ధర్మసంకటంలో పడేవాళ్ళు.
ఎలాగోలా ఇద్దరు ఇళ్ళకు వెళ్లి,తీర్ధప్రసాదాలు తీసుకుని,భోజనం మాత్రం అక్కడ కొందరు,ఇక్కడ కొందరు చేసే వాళ్ళు.
నేను డిగ్రీ చదివే రోజుల వరకు కార్తీక మాసం అంతా దాదాపు ఇలాగే గడచిపోయింది.
కానీ కాలానుగుణంగా కొన్ని మార్పులు తప్పవు కదా..
ప్రస్తుతం ఎవరి కుటుంబం వారిదే..ఎవరి పూజలు వాళ్ళవే...ఎవరి వ్రతాలూ వాళ్ళవే...
ఏది ఏమైనా మళ్ళీ కార్తీకమాసం వచ్చింది పూజల సందడి మొదలయింది...
పోయిన సంవత్సరం నాకు పెళ్లి కాగానే అమ్మ మాతో కూడా ఈవ్రతం చేయించింది.
అందుకే ఈ సంవత్సరం వత్తులు చేసుకోవాలి,
రోజూ దీపారాధన చేసుకోవాలి,మేము,అమ్మవాళ్ళు
వ్రతం చేసుకోవాలి.... ఎన్ని పనులో???


చిన్నప్పుడు అమ్మ నన్ను గాయనిని చేయాలని కలలు కనేది...
ఇప్పుడున్నన్ని టాలెంట్ షోలు అప్పట్లో వుండి వుంటే...
నేను ఖచ్చితంగా సింగర్ అయ్యి వుండేదాన్ని...[ఇది నా ఫీలింగ్]
అమ్మ నాతో పాటలు పాడించి టేప్ రికార్డర్లో రికార్డ్ చేసేది.
అందులో భాగంగా అమ్మ నాకు నేర్పిన ఒక పాట నేను ఇప్పటికీ మర్చిపోలేదు.
నా మనసులో చెరగని ముద్ర వేసిన ఈ పాట నాకు చాలా ఇష్టం...

శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా
భ్రమరాంబికా ధీశా భవనాశా ఓ మహేశా
మల్లికార్జునా మనవిని వినుమా
శిఖరానికి నన్ను చేర్చుకొనుమా
శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా

ఒక్క సూర్యుడు ఉదయించగనే
చిక్కటి చీకటి తొలగిపోవును
దినకోటి తేజ నిను దర్శించగ
అజ్ఞాన తిమిరమంతరించగా...
శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా

కరిగే చంద్రుని కాంచినంతనే
కడలులు ఎగయు కలువలు మురియు
కరగని సోముని ధరించు నినుగని
హృదయాబ్ది పొంగగా... మధురాత్మ విరియగా...

శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా
భ్రమరాంబికా దీసా భవనాశా ఓ మహేశా
మల్లికార్జునా మనవిని వినుమా
శిఖరానికి నన్ను చేర్చుకొనుమా...
శ్రీశైలవాసా శ్రితా భక్తపోషా........

5, నవంబర్ 2010, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు...


పోయిన సంవత్సరం దీపావళి మాఅమ్మ వాళ్ళింట్లో మా మొత్తం కుటుంబం అంతా కలిసి ఆనందంగా జరుపుకున్నాము.
ఈ సంవత్సరం అమ్మ వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.
నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు దీపావళికి మా ఇంటి దగ్గర లేకుండా వుండటం ఇదే మొదటిసారి.
పోయిన సంవత్సరం దీపావళి రోజున అనుకున్నానా... ఈ సంవత్సరం దీపావళి ఇలాజరుగుతుందని..

నా చిన్నిప్రపంచం లో అందాల ప్రమిదల
ఆనంద
జ్యోతుల ఆశలు వెలిగించు దీపాలవెల్లి;
ఆనంద
దీపావళి ఎప్పటికీ కొలువుండాలని...

శ్రీవారికి,అమ్మనాన్న,తమ్ముడుమరదలు,చెల్లి,
నా చిన్నారి మేనకోడలు దేవీ ప్రియ మీ అందరికీ
నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
బ్లాగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.



Related Posts Plugin for WordPress, Blogger...