పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, ఆగస్టు 2011, బుధవారం

బాపుబొమ్మల హరివిల్లు - లీలాజనార్దనం

లీలాజనార్దనం
కందుకూరి రుద్రకవి




పదహారవ శతాబ్దానికి చెందిన రుద్రకవి జనార్ధనాష్టకమును రచించారని పరిశోధకుల అభిప్రాయం.
శ్రీ కృష్ణదేవరాయలి ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఇతనొకడని అంటారని నేను నెట్ లో తెలుసుకున్న సమాచారం.
వేమన పద్యాలకి వినురవేమ అని వున్నట్లు ఈయన రాసిన జనార్దనాష్టకం "కందుకూరి జనార్దనా" అంటూ ముగిసే ఎనిమిది పద్యాలు
నాకు ఈ జనార్దనాష్టకం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే "బాపు బొమ్మల హరివిల్లు"
పుస్తకంలో ఈ జనార్ధనాష్టకంలోని అష్టవిధ నాయికలను బాపు గారు ఎంతో అందంగా చిత్రీకరించారు.
అందమైన నాయికలను వర్ణించిన ఆ జనార్ధనాష్టకానికి లీలాజనార్దనం అనే టైటిల్ తో బాపు వేసిన ఈ అష్టవిధనాయికల బొమ్మలు మరింత అందాన్ని ఆపాదించాయి..

స్వాధీనపతిక
చెప్పినట్లువిని,కోరినట్లు జరుపు మగడు కల స్త్రీ



సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ
జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా
మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

విప్రలబ్ద
చెప్పిన ప్రదేశానికి ప్రియుడు రాక మోసం చేయగా రాయబారం పంపిన స్త్రీ



ఆనపెట్టిన రాకపోతివి ఆయెఁబో అటుమొన్ననూ
పూని పిలువఁగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ
నేను చూడఁగఁ గడచిపోతివి నీటుచేసుక నిన్ననూ
కానిలేరా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

విరహోత్కఠిత
సంకేత స్థలమునకు ప్రియుడు రానందున విరహముచే చింతించు స్త్రీ



నిన్నరాతిరి చవికెలోపల నీవుచెలి కూడుంటిరా
ఉన్నమార్గము లన్నియును నే నొకతెచేతను వింటిరా
విన్నమాత్రము కాదురా నిను వీధిలోఁగనుగొంటిరా
కన్నులారా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

అభిసారిక
తనను తాను బాగా అలంకరించుకుని ప్రియుని కోసం సంకేత స్థలమునకు పోవు స్త్రీ



దబ్బు లన్నియుఁ దెలిసికొంటిని తప్పుబాసలు సేయకూ
మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ
ఉబ్బుచేసుక తత్తఱంబున నొడలిపైఁ జెయివేయకూ
గబ్బితనమున, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ఖండిత నాయిక
ప్రియునియందు పరస్త్రీ సంగమ చిహ్నములను చూసి అసూయపడు స్త్రీ



బిత్తరంబున మొలకకెంపులు పెదవి నెవ్వతె ఉంచెరా
గుత్తమైనమిటారిగుబ్బలగుమ్మ యెవ్వతె మెచ్చెరా
చిత్తగించక జీరువారను చెక్కి లెవ్వతె నొక్కెరా
కత్తిగోరుల, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

కలహాంతరిత
భర్తను అవమానించి తర్వాత పరితపించు స్త్రీ



అండబాయక కూడియుంటిమి ఆయెఁబోయెను నాఁటికి
ఖండిమండిపడంగ నేటికి? కదలు మెప్పటిచోటికి
ఉండరా నీమాటలకు నే నోర్వఁజాలను మాటికి
గండిదొంగవు దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ప్రోషిత పతిక
కార్యసిద్ధికై భర్త దేశాంతరము వెళ్ళగా ఆందోళనపడు స్త్రీ



అలుక లన్నియుఁ దీఱ నివు నాయండ కెప్పుడు వస్తివి
పిలిచి నవరత్నాలసొమ్ములు ప్రేమతో నెపుడిస్తివి
వలచి వలపించియును గూరిమి వదలకెప్పుడు మెస్తివి
కలసి వేడుక దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

వాసక సజ్జిక
ప్రియుడు ఇప్పుడే వస్తాడని పడకగదినీ,తనను అలంకరించుకును స్త్రీ



జంటనేత్రములంటి చూచితె జాజిపూవులు పూచెరా
మింటిత్రోవను జూచుచుండఁగ మేఘవర్ణము గప్పెరా
కంటిలో నొకపండువెన్నెల కాయుచున్నది యేమిరా
కంటిలేరా! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!

ప్రవత్యుత పతిక


మధ్యా - ధీర


అష్టవిధ నాయికలు మాత్రమే కాక బాపు లీలాజనార్ధనంలో
ప్రవత్యుత
పతిక, మధ్యా - ధీర
ఈ రెండుకూడా వున్నాయి.


2 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

బాపు గారి బొమ్మల్లో లీలా జనార్దనం ఏదో వార పత్రిక లోపలి అట్టల్లో వేసేవారు.
అదిచూసి ఆకర్షితునడై లీలాజనర్ధనం చదివా !! మళ్ళీ మీ టపా ద్వారా ఇంకో సారి చదవాలి అనిపించింది. ధన్యవాదములు !!

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదములు ఆత్రేయ గారు.
బాపు బొమ్మల హరివిల్లు బుక్ లో ఈ లీలా జనార్ధనం చూడగానే బ్లాగ్ లో పెట్టాలనుకున్నాను..
టపా నచ్చినందుకు ధన్యవాదములు..

Related Posts Plugin for WordPress, Blogger...