పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

20, ఫిబ్రవరి 2013, బుధవారం

మీరైతే ఏం చేస్తారు???




నిన్న "వనజవనమాలి" గారు "మాంగల్యం తంతునానేనా" మంత్రం ఒక అలకారప్రాయంగా మారిపోయిందని, చిన్న విషయాలకే విడాకుల దాకా పోతున్న మన వివాహ వ్యవస్థను గురించి  చక్కని పోస్ట్  రాశారు.. అది చదివిన తర్వాత  నాకు కూడా ఈ మధ్యే ఎదురయిన ఒక సమస్యను
ఇక్కడ చెప్పాలనిపించింది

వివాహ బంధం పవిత్రమైన ఒక ప్రమాణం .. " నిన్ను నేను ఎప్పటికీ నీడలా కాపాడతానని భర్త,నీ వెంట నడిచి నీ అడుగులో అడుగవుతాను " అని 
భార్య ఒకరికొకరు చేసుకునే బాసలే పెళ్ళికి ఆరంభం.. 
కానీ ఆ పెళ్ళే ఒక అబద్ధం తో మొదలైతే అప్పుడు పరిస్థితి ఏమిటి??


ఇది ఈ మధ్యే జరుగుతున్న ఓక కేస్ కి సంబంధించిన వివరాలు :

ఈ కేస్ లో జంటకి  2008 లో ఎంగేజ్ మెంట్ అయ్యింది.ఎంగేజ్ మెంట్ రోజు అతని తల్లిదండ్రులు, బంధువులు అందరూ వచ్చి దగ్గరుండి జరిపించారు.. తర్వాత లగ్న పత్రిక రోజున ఒప్పుకున్న కట్నం లో కొంత ఇచ్చి లగ్నపత్రిక రాసుకున్నారు.ఆ లగ్నపత్రిక రాసుకునే రోజు పెళ్ళికొడుకు తండ్రి మీరిచ్చిన కట్నం మాకు సరిపోదు పెళ్లి ఖర్చుల కోసం మరో లక్ష రూపాయలు ఇవ్వమని అడిగారు.దానికి అమ్మాయి తరపు వాళ్ళు మేము ఇవ్వలేము ఇప్పటికి ఒప్పుకున్న వరకు మాత్రమే ఇస్తామని అన్నారు.అప్పుడు పెళ్ళికొడుకు తండ్రి అంత గతిలేని వాళ్ళు ఎందుకు మీకు ఈ సంబంధం అంటూ తిట్టి అవమానకరంగా మాట్లాడారు... పెద్దలు సర్దిచెప్పి లగ్నపత్రిక రాయించుకున్నారు.

పెళ్లిరోజు నాటికి అమ్మాయి వాళ్ళు ఎంత ఎదురుచూసినా,ఫోన్ లు చేసినా ఇదిగో వస్తున్నాము అదిగో వస్తున్నాము అంటూ మాట్లాడుతూనే తీరా పెళ్ళి సమయం మించి పోయిన తర్వాత పెళ్ళికొడుకు ఒక్కడే వచ్చి,మీరు మా నాన అడిగిన డబ్బులు ఇస్తామని ఒప్పుకోకుండా గొడవపడ్డారు అందుకనే మా వాళ్లకి ఈ పెళ్లి ఇష్టం లేక రాలేదు. మీకు అభ్యంతరం లేకపోతె నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నా జాబ్ నాకుంది మీ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని పెద్దమనుషులను అడిగాడు. బంధువులందరూ వచ్చి ఉన్నారు.  ఎలాగూ పెళ్ళికొడుకు మంచి వ్యక్తిలాగానే ఉన్నాడు.. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సమస్య ఏముందిలే అని పెద్దమనుషులు నచ్చచెప్పటం తో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ పెళ్లి జరిగిపోయింది.

ఎన్నిసార్లు వీళ్ళిద్దరూ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రయత్నించినా వాళ్ళు మాట్లాడలేదు... రెండు నెలలు భార్యా,భర్త ఇద్దరూ అబ్బాయి పని చేస్తున్న దగ్గర కలిసి ఉన్నారు.రెండు నెలల తర్వాత అబ్బాయి వాళ్ళ అన్నయ్య వీళ్ళ ఇంటికి వచ్చాడు. పెళ్లి జరిగిన కొన్నాళ్ళ వరకు తన తల్లిదండ్రులు మాట్లాడటం లేదు, తన దగ్గరికి రావటం లేదు అన్న బాధలో వున్న భర్త తన అన్నయ్య రాకతో సంతోషించాడు అలాగే ఈ అమ్మాయి కూడా.. ఇక అప్పటి నుండి ఆ అబ్బాయి తల్లిదండ్రులు, అక్కలు,అమ్మమ్మతాతయ్య,పిన్ని ఇలా అందరూ ఆ అబ్బాయికి ఫోన్ లు చేసి మాట్లాడటం మొదలు పెట్టారు. కానీ ఈ అమ్మాయికి మాత్రం అత్తింటి వారు ఎవరూ ఫోన్ చేయరు,మాట్లాడరు.. కోడలిగా వాళ్ళు అంగీకరించలేదు. దీనికి తోడూ భర్త లో కూడా ఈ అమ్మాయి వలన నావాళ్ళు నాకు దూరమయ్యారు  అన్న ఆలోచన మొదలయ్యింది. 

అతని బంధువులు ఎవరు ఫోన్ చేసినా,ముఖ్యంగా వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి చెప్పే మాట "నువ్వు జాగ్రత్త ఆ అమ్మాయి నీ డబ్బు కోసం ఆస్తి కోసం మేము రాకపోయినా నిన్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళు గతిలేని వాళ్ళు " ఆ అమ్మాయి, తన తరపు వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకు, వాళ్ళను నీ ఇంటికి రానివ్వకు అని చెప్పేవాళ్ళు. ఇవే ,మాటలను అతను భార్యను అంటూ నీ వాళ్ళు రావద్దు అంటూ,నువ్వు నా డబ్బు కోసమే మా వాళ్ళు రాకపోయినా నన్ను పెళ్లి చేసుకున్నావు అనటం, మా వాళ్ళు నీ వల్లనే నాకు దూరమయ్యారు లేకపోతె వాళ్లకి నేనంటే చాలా ప్రేమ అంటూ ఈ అమ్మాయిని,తన తరపు వాళ్ళని అనుక్షణం మాటలతో హింసించేవాడు. కొన్నాళ్ళకి నేను మా అన్నయ్య దగ్గర ఉండి జాబ్ చేస్తాను అక్కడే ఉందాము అనటం మొదలు పెట్టాడు. ఇలా గొడవలు పడుతూ ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న ల దగ్గర కూర్చుని ఈ అమ్మాయిని అక్కడికి రమ్మన్నాడు సరేనని ఆ అమ్మాయి అత్తగారింటికి  వెళ్ళింది. 

అక్కడికి వెళ్ళిన అమ్మాయిని తన వాళ్ళ ముందే ఇష్టమొచ్చినట్లు తిట్టి,కొట్టి నాకు మరో 10 లక్షలు కట్నం తీసుకుని వస్తేనే రా అంటూ అందరూ కలిసి బయటికి గెంటేసారు.. ఇదేమని వాళ్ళ పెద్దల్ని అమ్మాయి పెద్దలు అడిగితె "మీతో మాకు సంబందం లేదు మేము పెళ్ళికి రాలేదు" ఇదే వాళ్ళ సమాధానం.ఇలా రెండు సంవత్సరాల పాటూ ఈ అమ్మాయిని పుట్టింట్లోనే వదిలేసి అతను ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా అతను, అతని తరపు బంధువులు ఆ అమ్మాయిని పట్టించుకోకుండా వదిలేసారు. పోలీస్ కేస్ పెట్టినా ప్రయోజనం లేదు, పెళ్ళికి వాళ్ళు ఎవరూ రాలేదు కాబట్టి వాళ్ళను మేము అరెస్ట్ చేయము అతనెక్కడో వాళ్లకి తెలియదట అని పోలీసుల సమాధానం. 

అప్పుడు ఆ అమ్మాయి తన భర్త ఆచూకీ కోసం హ్యూమన్ రైట్స్ కమిషన్ ను  ఆశ్రయించింది. అప్పుడు 498 కేస్ నమోదు చేసారు పోలీసులు. తమ్ముడ్ని ప్రోత్సహించి గొడవలు పెట్టి ,అతన్ని దాచిపెట్టిన అభియోగం కింద ఎంక్వైరీ కి వచ్చిన అతని అన్న చెప్పిన సమాధానం మా తమ్ముడు గత పది సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ ట్రీట్మెంట్ కోసం నేనే నా తమ్ముడిని హాస్పిటల్ లో ఉంచాను ఆ అమ్మాయి కి మేము కావాలనే చెప్పలేదు  అని చెప్పాడు.

ఇప్పటికి అతని అన్నని, నాన్నని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు నిందితుడు భర్తని మాత్రం మొన్నటిదాకా మానసిక వ్యాధి కోసం ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియదు అని కేస్ పెండింగ్ లో పెట్టారు... 

 చట్టం ,న్యాయం ఆ అమ్మాయికి పరిష్కారం కల్పించే సంగతి ఎలా ఉన్నా నైతికంగా ఆలోచిస్తే ఈ విషయంలో తప్పు ఎవరిది ??

కొడుకు గత పది సంవత్సరాలుగా పిచ్చివాడు అని తెలిసి కూడా ఎంగేజ్ మెంట్ చేసి, కట్నం తీసుకుని, పెళ్ళికి రాకుండా తప్పుకోవటం మోసం కాదా ??
 
 పెళ్లి జరిగిన క్షణం నుండీ అతనికి నెగటివ్ ఫెలింగ్స్ కలుగచేసి భార్యా,భర్త విడిపోవటానికి కారణమైన అతని కుటుంబ సభ్యులు పెళ్ళికి రాలేదు కాబట్టి వాళ్ళు ఈ నేరంలో భాగస్వాములు కారా ???

పిచ్చివాడైన కొడుక్కి ఎంగేజ్ మెంట్ ఎందుకు చేసారంటే అతని తండ్రి సమాధానం "ఎంగేజ్ మెంట్ కి రాకపోతే నా కొడుకు మమ్మల్ని చంపుతాను అన్నాడు అందుకే వచ్చాము" అని.. పిచ్చి కొడుకు చంపుతాను అంటే తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఇప్పించాలి కానీ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా??
 

 మేము పెళ్ళికి రాలేదు కదా అప్పుడైనా మానుకోకుండా  మీరు పెళ్లికి  ఎందుకు ఒప్పుకున్నారు అని అబ్బాయి తల్లిదండ్రుల వాదన.. పెళ్లిరోజు దాక వస్తామని మోసం చేసి,చివరి క్షణం లో రాకుండా మానేస్తే ఆ పెళ్లి ఆగిపోతే 
ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి ?? 

కొడుకును దగ్గర పెట్టుకుని అతని అవసరాలను అన్నిటినీ చూసుకునే తండ్రి కోడలిని మాత్రం నీతో మాకు సంబంధం లేదు, మా ఇంటికి రావద్దు అనటం న్యాయమేనా??

పెళ్లి సమయంలో మా వాళ్ళు రాకపోయినా పర్వాలేదు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చి, తర్వాత నీ వల్ల  నా కుటుంబం నాకు దూరమయ్యింది వాళ్ళే నాకు ముఖ్యం అంటూ వాళ్ళతో కలిసి పిచ్చి నాటకం ఆడుతున్న ఆ భర్త నుండి, ఈ సమస్య నుండి అమ్మాయికి దొరికే పరిష్కారం ఏమిటి??

అసలు ఈ విషయంలో ఎవరు బాధితులు ?? ఎవరు నిందితులు ??

బ్లాగర్లు ఈ విషయం లో మీ అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తాను..



11, ఫిబ్రవరి 2013, సోమవారం

Happy BirthDay To " నా చిన్నిప్రపంచం "



  
నా చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

నా హృదయంలో నిలిచిపోయే భావాలు  ..
నన్ను నేను తెలుసుకునే అనుభవాలు..
సంతోషంలో నా పెదవులపై నిలిచే  చిరునవ్వులు..
బాధలో నా కంటి నుండి జారే చిన్ని చినుకులు..
నా చుట్టూ ఉన్న మనుషుల  ప్రేమ,అభిమానం అసూయ,ద్వేషాలు..
జయాపజయాలు , పొగడ్తలు, అభినందనలు, అవమానాలు 

అన్నిటిని తనలో ఇముడ్చుకుని  ప్రతి రోజూ ఒక  కొత్త పాఠాన్ని నేర్పుతూ, 

ఎప్పుడూ నన్ను వదలకుండా నాతో ఉండే "నా చిన్నిప్రపంచం" నాకు చాలా ఇష్టం.

" నా చిన్నిప్రపంచం " నాకు కేవలం బ్లాగ్ మాత్రమే  కాదు .. 
నా ప్రియనేస్తం.. నా అంతరంగానికి అక్షర రూపం.
" నా చిన్నిప్రపంచం " పేరుకే చిన్నది కానీ ఎల్లలు లేనిది ... మంచి స్నేహితులను, వ్యక్తులను , కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. 
లోకాన్ని , మనుషుల ప్రవర్తనలను బ్లాగ్ ల ద్వారా కూడా చూసే అవకాశం  కల్పించింది.ఈ నెట్ ప్రపంచంలో నా పేరుకు  ఒక గుర్తింపును తెచ్చింది.

ఇన్నేళ్ళ నా బ్లాగ్ ప్రయాణంలో నేను ఏదో సాధించానని చెప్పను, కానీ నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి..నెట్ ప్రపంచం అయినా బయటి ప్రపంచం అయినా ఎదుటి వాళ్ళ  మనోభావాలు, ఆలోచనలు మనకి నచ్చినా  నచ్చక పోయినా వారి అభిప్రాయాలను గౌరవిస్తే చాలు, ఇతరులను జడ్జ్ చేసే ముందు మన అర్హత ఏమిటో కూడా తెలుసుకుంటే మంచిది అన్న విషయాన్నీ ఎప్పుడూ గుర్తుంచుకుంటాను...

" నా  చిన్నిప్రపంచాన్ని"  ఈ  ప్రపంచానికి పరిచయం చేసి  ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయ్యింది.నాకు చాలా ఇష్టమైన "నా చిన్నిప్రపంచం"  పుట్టినరోజు ఈ రోజు...


 నా చిన్నిప్రపంచానికి ఎప్పుడూ వస్తూ నా ఆలోచనలను, భావాలను మెచ్చుకుని అభినందించే మిత్రులకు,అప్పుడప్పుడు వచ్చి, నా చిన్నిప్రపంచంలో కనిపించే బ్లాగర్లకు అందరికీ "నా చిన్నిప్రపంచం" పుట్టినరోజు సందర్భంగా కృతఙ్ఞతలు ...

  

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఎక్కడికి " e " పరుగు ఎందుకని " e " ఉరుకు...





ఒకప్పుడు కేవలం ఉత్తరాల ద్వారా,ఫోన్ ల ద్వారా అందుబాటులో ఉండే మానవ సంబందాలు ఇప్పుడు నెట్ ప్రపంచం పరిధిలోకి వచ్చేశాయి .. ఎప్పుడూ టీవీయేనా కాస్త అలా నెట్ ప్రపంచం లో కూడా విహరిద్దాం అని గృహిణులు కూడా అనుకునే రోజులు ప్రస్తుతం..మెయిల్స్,మెసెంజర్స్,చాటింగ్ లు అయిపోయి ఇప్పుడు బ్లాగ్స్, ఫేస్ బుక్ ,ట్వీటర్స్, ఆర్కుట్‌, గూగుల్‌ ప్లస్‌ ఇప్పుడు ఇవే సామాజిక సంబంధాలు (సోషల్‌ నెట్‌వర్క్‌)..   

సోషల్‌ నెట్‌వర్క్‌ అంటే కేవలం ఇవే కాదు మన ఆసక్తులను బట్టి వంటలు,క్రాఫ్టు,పెయింటింగ్స్,ఇంటీరియర్ డెకరేషన్,మన ఆసక్తులను షేర్ చేసుకోవటం, కుటుంబ,ఆరోగ్య  సమస్యలను చర్చించటం ఇలా ఏ  విషయాలను నేర్చుకోవాలంటే వాటి గురించి నిపుణులు, మామూలు గృహిణులు కూడా నిర్వహించే సైట్ లు ఎన్నో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి..ఇలా మనకిష్టమైన వారితో పరిచయం చేసుకుని,అభిప్రాయాలను పంచుకునే  వీలుంటుంది... ఆధునిక పరిజ్ఞానాన్ని, "e " పరిచయాలను ఉపయోగించుకుని కెరీర్ లో కూడా మంచి అవకాశాలను యువత అందుకుంటున్నారు .ఇంకా దేశ  విదేశాల్లో ఉండేవారు కూడా ఎక్కడో దూరాన ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా "ఈ"సంబంధాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండటం,కొత్త కొత్త పరిచయాలను ఏర్పరచుకోవటం  కూడా సంతోషించదగిన విషయమే..

బ్లాగ్స్ మన అభిప్రాయాలు,ఆలోచనలు పంచుకోవటానికి చక్కని వేదిక అని నాలాగా చాలా మంది బ్లాగ్స్ రాయటం మొదలుపెట్టారు.కానీ ఈ బ్లాగ్స్  కొందరు చేయి తిరిగిన రచయిత్రులు,రచయితలకే తగినదిగా ఈ మధ్య కాలం లో అనుకుంటున్న తర్వాత బ్లాగ్స్ రాయాలి అంటే ఇతర బ్లాగర్ లాగా మనం రాయగలుగుతున్నామా లేదా ?? 
జనాలకి నచ్చుతుందా  లేదా??   అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.

ఈ మధ్య కాలం లో సోషల్‌ నెట్‌వర్క్‌ లలో ఎక్కువ ప్రజాభిమానం పొందింది మాత్రం ఫేస్ బుక్ అని చెప్పొచ్చు. తమ ఇష్టా ఇష్టాలు,మూడ్స్, అభిప్రాయాలు,ఆలోచనలు ఇలా భావవ్యక్తీకరణకు అనువైన వేదికగా  ఫేస్‌బుక్ మారింది. ఫేస్ బుక్ మొదలై నిన్నటికి 9 సంవత్సరాలు పూర్తయిందట. ఇన్నాళ్ళకి నాకు ఫేస్ బుక్ ఉపయోగించాలన్న ఆలోచన వచ్చింది. నాకు ఫేస్ బుక్ అకౌంట్ మా తమ్ముడు 2009 లోనే తీసినా దాన్ని నేను ఎప్పుడూ ఓపెన్ చేయలేదు. కానీ ఈ  మధ్య  కొత్త సంవత్సరం నేను చేసిన కొత్త పనుల్లో ఫేస్ బుక్ ఉపయోగించటం మొదలు పెట్టటం కూడా ఒకటి.. 

ఫేస్ బుక్ ఓపెన్ ఐతే చేసాను కానీ ఇందులో ఫ్రెండ్స్ గా ఎవరిని యాడ్ చేసుకోవాలి,ఏమి పోస్ట్ చేయాలి ఇవన్నీ ఎప్పుడూ సమస్యే.. పైగా నా క్లోజ్ ఫ్రెండ్స్  లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ ఫేస్ బుక్ గురించి ఉన్న ఫీలింగ్ ఏంటంటే "ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ అంటే తప్పకుండా తెలిసిన వాళ్ళే అయి ఉంటారు.. ఆ పరిచయం ఎంత వరకైనా ఉండొచ్చు"  అనే మాటలు విని ఉన్నాను. దాంతో నాకు ఎవరిని ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. ఫ్రెండ్ రిక్వెస్ట్ లు చాలానే వస్తుంటాయి.వాటిలో కొన్ని ఫేక్ అకౌంట్స్ కూడా ఉంటాయి.అలాగే  మనకెవరో తెలియని వాళ్ళని వాళ్ళు ఎంత గొప్ప వాళ్లైనా ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకోలేము .. అలాగని అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉండరు కాబట్టి నా ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ చాలా వరకు తెలిసిన వాళ్ళు, నా బ్లాగ్ ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన రచయితలూ, సింగర్స్ ను ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకున్నాను...ఇలా రచయితలు,సింగర్స్ లో కూడా ఫేక్ ప్రోఫైల్స్ ఉంటున్నాయన్నది కూడా తెలిసిందే.. అలాగే మన ఇష్టాలకి, అభిరుచులకి దగ్గరగా ఉండే గ్రూప్స్ లో కూడా మంచి ఫ్రెండ్స్ మనకి దొరకవచ్చు... 

ఇదిలా ఉండగా ఈ మధ్య ఫేస్ బుక్ లో కొందరు వ్యక్తులు మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళతో క్షమాపణలు చెప్పించి,సైబర్ చట్టాల కింద అరెస్ట్ చేయించి,వాళ్లకి తగిన బుద్ధి చెప్పటం లో సఫలీకృతులయ్యారు మహిళలు... కానీ నాకనిపించింది. "ఈ ప్రపంచంలో చాలామంది మనస్సులో వుండే మాటలే ఆ నలుగురి నోటి ద్వారా బయటికి వచ్చాయి" అని..సమాజంలో గౌరవప్రదమైన స్థానం లో ఉన్నవాళ్ళే చాలామంది బయట ఉద్యోగాల కోసం,ఇంకా ఇతరత్రా వ్యాపకాల కోసం తిరిగే మహిళలు, లేదా ఇలా సామాజిక సంబంధాలు కలిగిన మహిళలు అంటే ఏదో తప్పు చేసే వాళ్ళే అన్నట్లుగా చెప్పుకోవటం ఈ రోజుల్లో సర్వ సామాన్యంగా మారిపోయింది..దీనికి కారణం కొంతమంది  ఆడవాళ్ళ  ప్రవర్తన  కావచ్చు,కొందరు ఆడవాళ్ళ ప్రవర్తన వలన కొందరికి కొన్ని నష్టాలు కూడా కలిగి ఉండొచ్చు. కానీ అందరూ అలాంటి వాళ్ళే అని,అందరూ తప్పు చేసే వాళ్ళే అన్నట్లుగా మాట్లాడటం మాత్రం తప్పు.. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని మాట్లాడితే ఏదో సినిమాలో చిరంజీవి  "నోరా వీపుకి చేటు తేకే" అని అన్నట్లుగా ఉంటుందనేది ఇప్పటికి చాలా విషయాల్లో అర్దమవుతుంది ..

ఏది ఏమైనా చిన్నప్పుడు వక్తృత్వ పోటీల్లో టీవీ,దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని వలన కలిగే లాభాలు అలాగే నష్టాలను కంఠతా పట్టి చెప్పినట్లు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఉన్న " e  " సంబంధాల విషయం లో అయినా ఏ   సంబంధాల విషయంలో అయినా కూడా వాటి   పరిమితులు, లాభ,నష్టాలను ఎప్పుడూ మనసులో ఉంచుకుని, "అతి సర్వత్ర వర్జయేత్"  అన్న విషయం గుర్తుంచుకుని, మన వల్ల  ఇతరుల జీవితాలకు నష్టం కలగకుండా "నొప్పించక తానొవ్వక" అన్నట్లు  మసలుకుంటే  అందరికీ  మంచిదేమో.. మన పరిధులలో మనం ఉంటున్నాం, మన మనసుకు తెలుసు మనం చేసేది మంచా చెడా అనేది అని ఎంత  అనుకున్నా నైతిక విలువలను, ప్రపంచాన్నిదృష్టి లో పెట్టుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఆడవాళ్ళైనా, మగవాళ్లైనా అందరికీ  ఉంటుంది...

మాటలకైనా
చేతలకైనా " హద్దులున్నాయి జాగ్రత్త "అన్నది ప్రతి మనిషీ గుర్తుంచుకోవాల్సిన విషయం 




Related Posts Plugin for WordPress, Blogger...