పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

8, జనవరి 2013, మంగళవారం

స్ఫూర్తి ప్రదాత ... స్వామీ వివేకానంద





స్వామీ వివేకానంద 
(జనవరి 12, 1863 - జూలై 4, 1902)

స్వామీ వివేకానంద రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా అంతర్జాతీయ వేదికలపై పరిచయము చేసి, హిందూ మతప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన ఆధ్యాత్మిక నాయకుడు,ప్రపంచాన్ని జాగృతం చేసే శక్తిసామర్థ్యాలు కలిగినవాడు.

" మన దేశానికిఉక్కు కండరాలు, ఇనుప నరాలు, వజ్ర సంకల్పం 
కలిగిన యువకులు కావాలి ’’
‘‘లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. దాని కోసమే కృషి చెయ్యాలి"
 అంటూ యువతరాన్ని జాగృతం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన చనిపోయి ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన బోధనలు యువతరానికి స్ఫూర్తిదాయకాలు..  ఆయన చెప్పిన ప్రతి వాక్యం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది.. తన బోధనలు, రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత..

వివేకానందుని భోధనలేవీ వర్తమానానికి చెందనివి కాదు.ఆయన ఆధునాతన భావాల్ని ప్రజలకు అందించారు.వారి దూరదృష్టికి కేవలం తక్షణ భవిష్యత్తే ముఖ్యం కాదు.చాలా ముందు తరాల వారిపై కూడా దృష్టి సారించి అప్పటి ఘటనలకు కూడా ప్రాధాన్యం  ఇచ్చారు. ఒక్క మతమే కాక శాస్త్రవిజ్ఞానం, కళ, సారస్వతం, చరిత్ర, రాజకీయాలు, స్త్రీలు ఇలా మానవులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఆయన భావనలు సమగ్రమైనవి ..

 నిజమైన మతం -

."ఒక వితంతువు కన్నీరు తుడవలేని,అనాధ నోటికి పట్టెడన్నం అందించలేని భగవంతుని పట్ల గానీ,మతం పట్లకానీ నాకు విశ్వాసం లేదు" 
భారతదేశంలో వర్గరహితమైన,కులరహితమైన సమాజం వర్ధిల్లాలని అభిలషించారు.స్వామీజీ అభిప్రాయం లో ఆదర్శ సమాజం కుల,వర్గ రహితమైనదే కాక,వేదాంత ప్రతిపాదిత పరమార్ధాన్ని,ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించగలదై ఉండాలి.మూర్ఖుని మానవునిగానూ,మానవుని దైవంగానూ మార్చగలిగిన సాధనమే మతం.ప్రపంచంలోని మతాలన్నీ నిజమైనవే,అనుసరణీయమైనవే.సర్వమత సహనంలో మనకు విశ్వాసం ఉండాలి.ఎవరినీ నిరసించవద్దు.తోటివారికి చేయూతనిస్తే మంచిదే అలా చేతకాకపోతే  వారి దారిన వారిని పోనీయటం మానవత్వం అనిపించుకుంటుంది

 దేశం - సమస్యలు

పేదరికం,నిరక్షరాస్యత,కులతత్వం, మొదలైనవి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు.. స్వామీజీ కాలంలో కూడా ఇవి ఉన్నాయి.ప్రస్తుతమున్న సమస్యలు తొలగినా కొత్త సమస్యలు తలెత్తవచ్చు.సమస్యలు లేని జీవితాన్ని  ఊహించలేము. స్వామీజీ దృష్టిలో  సమస్యలకు పరిష్కారం ప్రతిదేశం తమదైన ఆలోచనా సరళిని ఉపయోగించి, తమ సమస్యలకు పరిష్కారాలను ఆలోచించవలసిందే.. ప్రజల నడత,చిత్త శుద్ధి,సరియైన ప్రయత్నం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చు.."లక్ష్యంపై ఉన్న శ్రద్ధ లఖయ సాధన పై చూపిస్తే విజయ రహస్యం తెలిసినట్లే.."

 స్త్రీలు - సమస్యలు

భారతదేశం లో స్త్రీత్వం అంటే మాతృత్వమే. నిస్వార్ధత,త్యాగశీలత, సహనము, ఈ గుణవిశేషాలతో విలసిల్లే స్త్రీమూర్తే మాతృమూర్తి.మన స్త్రీలు ఎక్కువ విద్యావంతులు కాకపొయినా పవిత్రతలో వారికి వారే సాటి.మానవుల్లో స్త్రీలు వేరు,పురుషులు వేరు అనే భావనను పెంచిపోషించరాదు. స్త్రీ పురుష భేధాన్ని మర్చిపోయి,అందరు మానవులు సమానమే అనే భావన రానంతవరకు స్త్రీ జనోద్ధరణకు అవకాశం ఉండదు. 

ఏ దేశం కాని.జాతి కానీ స్త్రీలకు తగిన గౌరవం, సమున్నత స్థానం ఈయదో అది ఉన్నతస్థాయిని పొందలేదు.శక్తికి సజీవ స్వరూపాలైన స్త్రీలను సగౌరవంగా చూని కారణంగానే భారతజాతి హీన స్థితికి దిగజారింది."ఎక్కడైతే నారీలోకం గౌరవించబడుతుందో అక్కడే దేవతలు హర్షంతో ప్రజలను దీవిస్తారు".మొత్తం మానవ జాతి ఒక్కటే, అందరూ సర్వసమానతాభావాన్ని ప్రోత్సహిస్తూ ఒకరి సాహచర్యాన్ని మరొకరు కోరుకుంటూ పరస్పర సహకారంతో జీవిస్తే జీవితం ఆనందమయం అవుతుంది.

మనిషి - ఆత్మవిశ్వాసం

వ్యక్తి తనను తాను ఎలా భావిస్తాడో అదే అవుతాడు.తాను బలహీనుడిని అని భావిస్తే బలహీనుడవుతాడు. బలవంతుడిని అని భావిస్తే బలవంతుడౌతాడు .కార్యసాధనా యత్నంలో సంభవించే ఆటంకాలను,పొరబాట్లను లెక్కచేయకూడదు.ఓటములను లక్ష్యపెట్టకూడదు.తిరోగమనాలను కూడా సహించాలి.అనుకున్నదిసాధించటానికి వేల ప్రయత్నాలు చేయాల్సి వచ్చినా వెనుకాడకూడదు.

బలహీనతను తొలగించుకోవాలంటేదాన్ని గురించే చింతిస్తూ కూర్చోకూడదు. బలాన్ని సమకూర్చుకునేప్రయత్నం చేయాలి..ఎవరేమన్నా పట్టించుకోకు నీ విశ్వాసాన్ని సడలనీయకు... ఎవరో ఒక వ్యక్తిని నమ్ముకోకుండా నీయందు నీవు పూర్తి విశ్వాసముంచుకో..అన్ని శక్తులు నీలోనే వున్నాయి.అది తెలుసుకుని వాటిని వినియోగించు."వ్యక్తికి బలమే జీవనం బలహీనతే మరణం.నిరాశకు తావివ్వకుండా గమ్యాన్ని చేరు"

  మానవసేవ - మాధవసేవ

"ప్రతి వ్యక్తిలోనూ పరబ్రహ్మ శక్తి ప్రజ్వరిల్లుతుంటుంది.పేదప్రజలకు సేవ చేయటం ద్వారా ప్రజలు తనకు సేవ చేయాలని పరమాత్మ ఆకాంక్షిస్తాడు".నరకప్రాయమైన ఈ ప్రపంచం లో ఒక వ్యక్తి  హృదయానికి కనీసం ఒక్క రోజైనా శాంతిని,సంతోషాన్ని అందించగలిగితే అదే నిజమైన సేవ అవుతుంది..  తన సహచరులకు మంచి చేసే ఆలోచన లేని సన్యాసి ఒక మూర్ఖుడే కానీ సన్యాసు కాబోడు..

ఆనందం అంటే??

జీవితంలో కొంతమందికి కొన్ని అవసరం కావచ్చు.కానీ అందరికీ అన్నీ అవసరం కాదు. మనకి ఎన్ని హంగులు, ఆర్భాటాలు ఉన్నాయన్న దానిమీద మన సంతోషం ఆధారపడదు.సంతోషం అనేది ఒక మానసిక స్థితి. "ఆనందం అనేది మనసులో ఉండేదే" కదా!అభివృద్ది అవసరమే! పురోగతి కావలసినదే!కానీ అవి ఎంతవరకు అందరికీ ఆనందాన్ని పంచగలుగుతున్నాయి? ఈ విషయాలను మనం తప్పక మనస్సులో ఉంచుకోవాలి...


1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో
ఇందులో స్వామి బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు -
“One infinite pure and holy—
beyond thought beyond qualities I bow down to thee”






 


 







నేను చదివి,సేకరించే పుస్తకాల్లో, కొటేషన్స్ లో వివేకానంద పుస్తకాలు కూడా ఉంటాయి. ఎప్పుడు పుస్తకాలు కొన్నా వివేకానందుడివి కూడా సేకరించటం అలవాటయ్యింది.మంచి మాటలు ఎవరు చెప్పినా విని ఆచరించటం తప్పు కాదు .. ఇతరులకు సందేశాలను ఇచ్చేంత గొప్పవాళ్ళం కాకపొయినా ఇలాంటి మహనీయుల మాటలను అప్పుడప్పుడన్నా గుర్తుచేసుకుంటే ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మహానుభావులకి,మూర్ఖులకు తేడా తెలుసుకుని,మనం కనీసం మంచి మనిషిగా ఐనా ఎలా బ్రతకాలో తెలుసుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.

నాకు చాలా ఇష్టమైన వివేకానందుని మాటల్లో ఒకటి..
 "వ్యక్తులు ప్రపంచంలోని మొత్తం ధనసంపద కంటే విలువైనవారు" 


వివేకానందుడి 150 వ జయంతి సందర్భంగా ...


Related Posts Plugin for WordPress, Blogger...