గత సంవత్సర కాలమంతా రాష్ట్రమంతా ఏమవుతుందో,ఎటుపోతుందో తెలియని అయోమయ,అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది .. కొన్ని కోట్ల ప్రజల చిరకాల స్వప్నంగా తెరమీదకు వచ్చిన తెలంగాణా ఉద్యమం ఒకరి కంట కన్నీరు,ఒకరి కంట పన్నీరు అన్నట్లు ముగిసింది ..
ప్రత్యేక తెలంగాణా ఇవ్వటం తప్పని ఎవరూ అనరు ఎందుకంటే అది అక్కడి ప్రజల ఆకాంక్ష, వారి హక్కు .. కానీ అదే సమయం లో ఒక వర్గ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ చేసిన విభజన అనివార్యం అయినప్పటికీ మరొక వర్గ ప్రజల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా వారి కనీస విజ్ఞప్తులను కూడా పట్టించుకోకుండా మూసిన తలుపుల వెనక, ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలిపివేసి,ఏ సమస్యకూ తగిన పరిష్కారం లేకుండా విభజన జరగటం మాత్రం ఎవరూ హర్షించలేకపోయారు..
ఏది ఏమైనా జరిగిన దాన్ని గుండెల్లోనే దాచుకుని ఇప్పటికి మనం ఏమీ కోల్పోలేదు అనే ఆత్మస్థైర్యం తో తెలంగాణా సోదరులకు శుభాకాంక్షలను అందించారు సీమాంధ్రులు ... ఆంద్రా వాళ్ళు ఏమి చేస్తారులే ,ఉద్యమాలు చేస్తారా .. విధ్వంసాలు చేయగలరా ... ఏదో బడికి వెళ్ళే చిన్న పిల్లలతో ర్యాలీలు చేయిస్తారు ... మహా అయితే రోడ్ల మీద పిచ్చి వేషాలు వేస్తారు అంతే కదా .. వారికోసం పోరాడే సరైన నాయకుడు కూడా లేడు అని ఆంధ్రా వారిని చిన్న చూపు చూసిన నాయకులకు ప్రజలు చెప్పిన సమాధానం చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది.
గొర్రె కసాయి వాడ్నినమ్మినట్లుగా మేము వెళ్లి మళ్ళీ ఓట్లడిగి మీ ఆంధ్రాని అభివృద్ధి చేస్తాము అంటే నమ్మేస్తారులే అనుకున్న నాయకుల అంచనాలు , ఏమో .. ఏమవుతుందో ఎప్పటి నుండో వున్న ప్రధాన పార్టీ కదా గెలవకుండా ఉంటుందా అన్న కొందరి గట్టి నమ్మకాలను ఒమ్ము చేస్తూ .. సీమాంధ్ర ప్రజల నిర్ణయం విస్మయానికి గురి చేసింది...
చర్యకి ప్రతిచర్య లాగా మనం చేసే ప్రతిపనికి తగిన ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని మరిచిపోయిన నాయకులు ప్రజల మనోభావాలను కించపరిస్తే ఎదుర్కోవాల్సిన పరిణామాలను విస్మరించి చరిత్ర హీనులుగా మిగిలిపోయారు.. అటు తెలంగాణాలో మేము తెలంగాణా ఇచ్చాము కాబట్టి మమ్మల్ని దేవతలుగా పూజిస్తారు అన్న కాంగ్రెస్ ఆశా నిరాశ అయింది ..
ఎన్నికల ఫలితాల రోజు టీవీలో గెలిచిన స్థానాల్లో కాంగ్రెస్ ఎదురుగా "0" అంకెను చూసిన ప్రతి ఆంధ్రుడికి ఏమీ తినకుండానే కడుపు నిండినంత సంతోషం కలగటం లో ఆశ్చర్యం లేదు .. ఏది ఏమైనా తెల్లవారి అరాచక పాలన నుండి విముక్తులు కావటానికి భారతీయులు చేసిన పోరాటాన్ని ప్రతిబింబించేలా సీమాంధ్రులు చేసిన ఈ తిరుగుబాటు చాలా గొప్పది.. అరవటాలు,కరవటాలు ఎందుకు "కీలెరిగి వాత పెట్టటం" అంటే ఇదే అంటూ నాయకుల నాటకాలకు తెర దించిన ప్రజల విచక్షణ గొప్పది ... విభజన పాపం ఒక్క కాంగ్రెస్ పార్టీదే అని అనుకున్నా ... తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు అన్ని పార్టీల వాళ్ళు ఎవరికి వాళ్ళు విభజనకు సహకరించారనేది కూడా బహిరంగ రహస్యం...
ఏది ఏమైనా కోటి ఆశలతో , అన్ని శక్తులను కూడగట్టుకుని కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగా ఎవరినో ఒకరిని నమ్మక తప్పని పరిస్థితుల్లో,ఒక కొత్త నాయకత్వానికి పట్టం కట్టారు సీమాంధ్రులు .. మనకి వున్న వనరులు,అవకాశాలను, అన్నిటినీ సమీకరించి, వినియోగించి నమ్మిన వారిని వంచించకుండా, స్వార్ధచింతన లేకుండా పాలన సాగించి సీమాంధ్ర ప్రదేశ్ కోలుకుని, అభివృద్ధి చెందేలా కొత్త నాయకత్వం అడుగేయాలని ఆకాంక్షిస్తూ ... ప్రజా తీర్పుతో గెలిచిన విజేతలకు,తెలంగాణా,సీమాంధ్ర ప్రజలకు అభినందనలు !
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి