పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, నవంబర్ 2014, శుక్రవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 12




అప్పట్లో ఇప్పటిలాగా దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఇళ్ళలో పూజలు అంతగా చేసేవాళ్ళు కాదు.. ఒక్క దసరా మాత్రం బాగా జరుపుకునే వాళ్ళం. నాకు తెలిసి, గుళ్ళలో మాత్రం అలంకారాలు చేసేవాళ్ళు. నేను కాస్త దేవుడి పూజలకి దూరంగానే ఉంటాను. దసరా రెండు రోజులుందనగా పద్మాక్షి వదిన వచ్చింది మా ఇంటికి. ఆ రోజు మా అన్న (వదిన భర్త కాదు,మా సొంత అన్న)కూడా ఇంట్లోనే ఉన్నాడు. అన్న మంచి ఉత్సాహంగా ఉన్నాడు ఏమిటో మరి సంగతి అనుకున్నాను. 

కాసేపటికి మాటల్లో అర్ధం అయిన సంగతి ఏమిటి అంటే మా వదినకి నాట్యం, సంగీతం అన్నిటిలో ప్రవేశం ఉందట. ఇంటికే టీచర్ ని పిలిచి తనతో పాటూ వాళ్ళమ్మాయి సౌమ్య కి,ఇంకా ఆసక్తి ఉన్న చుట్టుపక్కల వాళ్లకి డాన్స్, సంగీతం నేర్పుతుందట. అందులో భాగంగానే ఇంట్లోనే డాన్స్&మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఉండేలా కొత్త ఇల్లు కట్టించారు.ఆ ఇంటి గృహప్రవేశంతో పాటే ఒక సంగీతకార్యక్రమం కూడా ఏర్పాటు చెయ్యాలని, ఎలాగు గృహప్రవేశానికి వచ్చిన బంధువులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు తన కళ  ప్రదర్శించాలన్న ఆమె కల కూడా తీరుతుందని వదిన ఆలోచన. 

భార్య ఇష్టాన్నే తన ఇష్టంగా  ప్రేమించి,ప్రోత్సహించే ఆమె భర్త నుండి కూడా అంగీకారం రావటం ,దానికి కావాల్సిన ప్రయత్నాలను ఆయన చేయటం కూడా జరిగిపోతున్నాయి.ఇంతకీ ఇక్కడ నాకు తెలియని ట్విస్ట్ ఏంటంటే మా సొంత అన్న.. వదిన వాళ్ళింట్లో సంగీతం నేర్చుకుంటున్నాడట..! అందులో భాగంగా రేపటి కార్యక్రమం లో మా అన్న కూడా వదినతో పాటూ తన కళ ప్రదర్శించబోతున్నాడు. ఈ మాట వినగానే ఆహా.. మా అన్న ఎంతైనా మేధావి, అరవైనాలుగు కళల్లో ఒక్కటేమిటి అన్నీ నేర్చుకోగల సమర్ధుడు.  కానిదే ఒక పక్క జాబ్ చేస్తూనే సంగీతం నేర్చుకున్నాడా .. ఇలాంటి అన్న నాకున్నందుకు ఎంతైనా గర్వించాల్సిందే అనుకున్నా మనసులో .

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది దసరా రోజు పద్మాక్షి వదిన వాళ్ళింటికి అన్న తన కొత్త కారులోన అమ్మని, అమ్మమ్మని,ఇద్దరు అక్కల్ని తీసుకెళ్ళి , చిన్న కారు కదా అందరం సరిపోమని నన్ను తన బైక్ మీద రమ్మన్నాడు మా తాతతో ( అమ్మ వాళ్ళ నాన్న) పాటూ.. అలాగే అందరం వదిన వాళ్ళింటికి చేరుకున్నాము.వదిన వాళ్ళ ఇల్లు అధునాతనంగా, చక్కని ఫర్నిచర్ తో తన అభిరుచికి తగినట్లుగా కట్టుకున్నారు.బెడ్ రూమ్ లు,పెద్ద హాలు చుట్టూ కాంపౌండ్, అప్పటికే నాటినట్లు బాగా బ్రతికి,పచ్చగా పెరిగిన మొక్కలు,ఇంటి ముందు లాన్,అన్నిటికన్నా ఆశ్చర్య పరిచేది మొదటి అంతస్తులో గదులేమీ లేకుండా పెద్ద హాల్ లో ఒక పక్కన డాన్స్, సంగీతం నేర్చుకోవటానికి, ఎప్పుడన్నా  ప్రదర్శనలివ్వటానికి వీలుగా స్టేజ్ కట్టించి, చూడగానే నృత్యమందిరం అనిపించేలాగా ఇంటీరియర్ డెకరేషన్ చేయించారు .


వదిన అభిరుచికి హ్యాట్సాఫ్ అనాలనిపించేలా ఉంది ఇల్లు. ఎన్ని ఆస్తులున్నా అనుభవించే అదృష్టం కూడా ఉండాలన్నట్లు.. ఇల్లు కట్టిస్తే డబ్బులు వడ్డీ దండగని,ఇప్పటికీ తాతల కాలంనాటి మట్టిమిద్దె లో ఉండే అమ్మమ్మ, మంచి బెడ్ రూమ్ లు ఉండే ఇల్లు కొందామా నాన్నా అంటే తక్కువ రేటుకి వస్తుందని ఆ చివర చూస్తె ఈ చివర కనిపించేలా 4 బారు గదులున్న ఇల్లు కొని ఆ ఇళ్ళని అద్దెలకి ఇచ్చేసి, నాన్నమ్మ పేర్తో ఒక రైతు దగ్గర కొన్న ఇందిరమ్మ ఇంట్లో ఉంటాములే .. మీరందరూ ఇప్పుడు వేరే వేరే చోట్ల ఉంటున్నారు కదా అంత  ఇల్లు మాకెందుకు అంటాడు నాన్న.. ఇప్పటిదాకా అలాంటి ఇళ్ళనే చూసిన మా వాళ్లకి సిటీలో ఆధునాతనంగా ఉన్న ఈ ఇల్లు చూసి ఆశ్చర్యం,ఆవేదన,అసూయ లాంటి భావాలన్నీ ఒకేసారి వచ్చాయి. 


కొంతమంది మనుషుల సహజ లక్షణం వాళ్ళ కంటే బాగున్నవాళ్ళని, సంతోషంగా ఉండే వాళ్ళని చూసి ఓర్చుకోలేక,అసూయతో వాళ్ళని ఏదో ఒకటి అనేసి కడుపుమంట చల్లార్చుకుంటారు.ఇప్పుడు మా వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. ఊర్లో మనకన్నా ఎక్కువ ఆస్తులేమీ లేవు సంపాదన ఎంతుంటుందో ఇంత ఇల్లు కట్టాడు ఎలా వచ్చిందో అంత డబ్బు అంటూ అమ్మ,అమ్మమ్మ ,అక్కలు మొదలుపెట్టారు రహస్య పంచాయితీ. అమ్మో మాటలే రానట్లుందే అమ్మ కూడా బయటి వాళ్ళనేసరికి చిన్నగా తనకి తోచిన మాటలు అందిస్తుంది మా అమ్మమ్మకి, అక్కలకి.నాకెందుకో వీళ్ళు అలా మాట్లాడటం నచ్చలేదు. కానీ ఏమి చేస్తాం ఎంతైనా "నా పెద్దలు కదా..  దైవంతో సమానం.  వాళ్ళని ఏమీ అనకూడదు". 

భోజనాలు అయ్యాయి.మా వాళ్ళు "కడుపుమంట"తో సరిగా తిన్నారో లేదో పాపం.. ఇంతలో అసలు కార్యక్రమం మొదలయ్యింది.మా కజిన్ వదిన, మా సొంత అన్న,వాళ్ళ మ్యూజిక్ ట్రూప్ సినిమాలో కచేరీ సీన్ లో చూపించినట్లు  స్టేజ్ ఎక్కి పక్క పక్కన కూర్చున్నారు."సరిగమలు.. గలగలలు .. ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము" పాట  వదిన పాడుతుంటే మా అన్న ఫ్లూట్ వాయిస్తున్నాడు. మా అన్న అని చెప్పటం కాదు కానీ తెల్లని లాల్చీ పైజమా వేసుకుని సాగరసంగమంలో కమల్ హాసన్ లా ఉన్నాడు.  

వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకు "ఇది కధ కాదు" సినిమాలో శరత్ బాబు, జయసుధ .. సరిగమలు .. గలగలలు అని పాడుతున్నట్లు,"సాగరసంగమం" లో జయప్రద, కమల్ హాసన్ నాద వినోదము నాట్యవిలాసము అని పాడు తున్నట్లు అనిపించింది. నా మొహం.. పెళ్ళైన వదినతో అన్నకి ఈ పోలిక పెట్టటం బాలేదు కానీ అక్కడ సీన్ అలా వుందని నా భావం .. ఏమి చేస్తాం నాకలా గుర్తొచ్చింది అంతే.. 

నేను బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కానీ మా వాళ్లకి ఎందుకో నచ్చినట్లు, సంతోషంగా ఉన్నట్లు అనిపించలేదు. ఎప్పుడూ  ఎవర్నో ఒకర్ని కదిలించుకోకపోతే నిద్రపట్టదు కదా నాకు..  నా పక్కనే కూర్చున్న చిన్నక్కని చిన్నగా కదిపాను.అక్కా వాళ్ళిద్దరి ప్రొగ్రామ్ చూస్తే నీకేమనిపిస్తుంది అన్నా..  నాకొచ్చిన మహత్తరమైన ఆలోచన తనకి వచ్చిందా లేదా తెలుసుకుందామనే ఉత్సాహంతో.. చిన్నక్క నాకేసి ఒకసారి చూసి ఆ... నీకేమనిపించిందో చెప్పు ముందు అంది. మనకసలే కడుపులో ఏమన్నా ఉంటే (విషయాలు) బయటికి కక్కిందాకా మనసుకి శాంతి ఉండదు కదా.. 

నాకనిపించిన జయసుధ,శరత్ బాబు,జయప్రద,కమల్ హాసన్ గురించి చెప్పగానే అక్క నన్ను చీదరగా చూసి నీ మొహమేమి కాదు నీ పోలికలు..  నువ్వు అంది. ఓహో పెళ్ళైన వదినతో అన్నకి ఆ పోలిక పెట్టటం అక్కకి నచ్చినట్లు లేదు. అందుకే అలా అంది ఎంతైనా ఆడవాళ్ళు కదా తోటి ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఇష్టపడరులే అనుకునేలోపే చిన్నక్క పక్కనే కూర్చున్న పెద్దక్కని పిలిచి నేను చెప్పిన విషయం అక్కకి చెప్పి ఈయన గారికి ఆయన గారిని చూస్తే కమల్ హాసన్ గుర్తోచ్చాడట .. నాకైతే "శృతిలయలు" సినిమాలో రాజశేఖర్, జయలలిత "తెలవారదేమో స్వామీ" పాట గుర్తొస్తుంది అన్నది.ఆ సినిమాలో జయలలిత, రాజశేఖర్ అంత  బాగుంటారా??  నేనా సినిమా చూడలేదే అన్నాను అక్కతో. 

మంచిపని చేశావులే ఈ సారి ఎప్పుడన్నా సినిమా చూడు తెలుస్తుంది అంది పెద్దక్క.మొత్తానికి అనుకున్న కార్యక్రమాలన్నీ అనుకున్నట్లే అయ్యాయి. అక్కడున్నంత సేపు ఒక్క మా అన్న తప్ప ఎవరూ సంతోషంగా లేరు. మా అమ్మమ్మ,అమ్మ,అక్కలు,తాత అందరూ వాళ్ళ సొమ్మేదో పోయినట్లు బాధపడుతున్నారు,అక్కలు బొద్దుగా ముద్దుగా ఉండే వదిన వాళ్ళమ్మాయి సౌమ్యని బండది బండది అంటూ అక్కసుగా పిలుస్తున్నారు. నాకేమీ అర్ధం కాలేదు కానీ ఇల్లుని చూసి మానవ సహజమైన ఈర్ష్యా, అసూయలు అనుకున్నా.. వచ్చేటప్పుడు మా అన్న పద్మాక్షి వదినకి,వాళ్ళాయనకి తనతో మ్యూజిక్ ప్రోగ్రాం ఇప్పించినందుకు థ్యాంక్స్ చెప్పి మమ్మల్ని ఇంటికి బయల్దేరదీశాడు.. 

ఈర్ష్యా,అసూయలు ఒకరి కంటే మనం బాగుండాలన్న స్ఫూర్తిని కలిగిస్తే సంతోషమే కానీ మనకి లేనిది ఇతరులకి ఉందని,దాన్ని దూరం చేసి సంతోషించాలనే దుర్మార్గపు ఆలోచనలు కలిగిస్తే అది ఇతరుల జీవితానికి,ఒక్కోసారి మన జీవితానికి, ఈ రెండు కాకపోతే మధ్యలో ఈ విషయంలో ఏమీ సంబంధం లేని వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యే ప్రమాదం లేకపోలేదు... తప్పు చెయ్యటం ఎంత తప్పో,తప్పు చేసే వాళ్ళని ఖడించకుండా మౌనంగా ఉండే వాళ్ళది కూడా అంతే తప్పు.
                     



9, నవంబర్ 2014, ఆదివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 11



పడుకున్న నాకు బయట మాటలు వినిపించి మెలకువొచ్చింది. ఎవరా చూద్దామని బయటికి రాగానే ఎదురుగా మా అమ్మమ్మ తరుపు దగ్గరి  బంధువులు పద్మాక్షి వదిన, అన్నయ్య కనపడ్డారు. నాకు మా వదిన పద్మాక్షి పేరు వెరైటీగా అనిపిస్తుంది . కామాక్షి,మీనాక్షి లాగా పద్మాక్షి ... పద్మాక్షి అంటే పద్మముల వంటి నయనములు (పద్మనయన) కలదని అర్ధమట. వదిన నిజంగా పేరుకు తగినట్లు ఉంటుంది.. అన్నయ్య ఒక గవర్న్ మెంట్ బ్యాంక్ లో మేనేజర్ గా జాబ్ చేస్తున్నాడు. వాళ్లకి ఒక పాప,బాబు .సొంత ఊరినుండి ఎప్పుడో హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ హ్యాపీగా సెటిలయినట్లే.

నన్ను చూడగానే మాధవ్ ఎలా ఉన్నావ్,కాలేజ్ విశేషాలేంటి అంటూ ఆప్యాయంగా పలకరించారు అన్న,వదిన. మాటల్లో తెలిసిన విషయం ఏంటంటే మా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మా అన్న,వదిన వీళ్ళకి అన్ని రకాల సహాయం చేస్తూ తోడుగా ఉంటున్నారని,అందువల్లే మా వాళ్లకి కొత్త ప్రదేశం అనే సమస్య లేకుండా పోయిందని అర్ధమయ్యింది. పద్మాక్షి వదినని చూస్తే  నాకు అప్రయత్నంగానే కావ్య వాళ్ళమ్మ గుర్తొచ్చింది. కావ్య ఏమి చేస్తుందో అనుకుని మళ్ళీ నన్ను అంత అవమానించిన మనిషితో నాకెందుకులే అనిపించింది.

కాసేపు కూర్చుని ఆ కబుర్లు,ఈ కబుర్లు వూరిదగ్గర బంధువుల విషయాలు ఇలా లోకాభిరామాయణం అంతా  మాట్లాడాక దసరా షాపింగ్ కి అమ్మని, అమ్మమ్మని తీసుకెళ్ళారు అన్నా,వదిన. ఇక్కడికొచ్చాక అమ్మలో చాలా మార్పు వచ్చింది. మా ఇంట్లో నాన్న,నాన్నమ్మ ముందు మాట్లాడకుండా మౌనంగా వుండే అమ్మ ఇక్కడ బాగానే అందరితో కలిసిపోయి మాట్లాడుతూ సరదాగా షాపింగ్ లకి, పక్క న ఇళ్ళల్లో చిన్న చిన్న పార్టీలకి వెళ్తుందని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది.ఎంతైనా సిటీ జీవితం వేరు.ఎవరి పనులు వాళ్ళవి ,ఎవరి లోకం వాళ్ళది. అనుభవించగలిగిన వాళ్లకి అంతా  స్వేచ్చ ,సంతోషమే..

అందరూ వెళ్ళాక నేనొక్కడినే ఇంట్లో ఉన్నాను. టీవీ చూస్తూ కాసేపు కూర్చున్నాక అక్కడే టీపాయ్ మీద వాక్ మాన్ కనపడింది. పెద్దక్క దనుకుంటాను. ఇప్పుడు సెల్ ఫోన్ లాగా అప్పట్లో చదువుకునే,ఉద్యోగాలు చేసే యువతరం దగ్గర తప్పకుండా వాక్ మాన్ వుండేది. అందులో ఇష్టమైన పాటలు లిస్టు రాసుకుని వెళ్లి మరీ ఆడియో కాసెట్లు  రికార్డ్ చేయించి అవే పాటలు అరిగిపోయే దాకా వినేవాళ్ళం.. నా వాక్ మాన్ రూమ్ లోనే మర్చిపోయ్యి వచ్చాను సరే   కాసేపు పాటలు విందామని  వింటుంటే అన్నీ ఇంగ్లీష్ పాటలే . పెద్దక్కకి అమెరికా వెళ్లాలని తెగ పిచ్చి .పెళ్ళంటూ చేసుకుంటే అమెరికాలో ఉద్యోగం చేసుకునే వ్యక్తినే చేసుకోవాలని ఒక గట్టి కంకణం కూడా కట్టుకుంది. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు పాటలు కూడా ఇంగ్లీష్ వే  వింటుందన్నమాట..

రెండు మూడు ఇంగ్లీష్ పాటలయ్యాక  "బావలు సయ్యా మరదలు సయ్యా"  అంటూ పాట  వస్తుంది . అమ్మ నాయనో ఇదేంటి ఈ పాట .. మేము ఇప్పటిదాకా వింటే " దొరకునా ఇటువంటి సేవా " అని పాడుకునే భక్తి  పాటలో లేకపోతే  "ఓ నాన్నా నీ మనసే వెన్నా" లాంటి సెంటిమెంట్ పాటలు వింటాం, చూస్తాం కానీ ఇదేంటీ ఘోరంగా ఈ పాట? ఆ ఆడియో రికార్డింగ్ షాప్ వాడు పొరపాటున రికార్డింగ్ డాన్స్ పాట మా అక్క కాసేట్ లో రికార్డ్ చేసినట్లున్నాడు లేకపోతే ఇలాంటి పాటలు ఉంటాయని కూడా అక్కకి తెలుసా పాపం అనుకుని టక్కున పాట  ఆపేసి అక్క కోసం ఎదురు చూస్తున్నా ఈ విషయం చెప్పాలని.

ఒక గంటలో అక్క ఇంటికి రాగానే  మొహమాటపడుతూనే ఈ విషయం అక్కకి చెప్పా .. దానికి అక్క పెద్దగా నవ్వి ఏంటి మాధవ్ చిన్నపిల్లాడిలా మాట్లాడతావ్.. "బావలు సయ్యా మరదలు సయ్యా" నాకు చాలా ఇష్టమైన పాట స్పీడ్ గా, రిధమ్ తో చాలా బాగుంటుంది. అందుకే కావాలని చెప్పి రికార్డ్ చేయించా. అయినా నా వాక్ మాన్ ఎందుకు తీశావ్  అది నాకు అన్నయ్య అమెరికా నుండి వాళ్ళ ఫ్రెండ్ తో తెప్పించాడు తెలుసా ? పాడయితే రిపేర్ చేయించటం కూడా కుదరదు  అంటూ అంతెత్తున ఎగిరింది అక్క నామీద .ఆ దెబ్బకి రికార్డింగ్ డాన్స్ పాట సంగతి మర్చిపోయ్యా. మరే ఇంతోటి వాక్ మాన్ నాకు వాడటం రాక పాడు చేస్తాను .. నాకు తెలియదా వాక్ మాన్ గురించి అని కోపం వచ్చింది. కానీ కాసేపటి తర్వాత  ఛీ అక్కేదో మామూలుగా అంటే నేను కోపం తెచ్చుకోవటం తప్పు . ఎంతైనా పెద్దక్క  కదా .. !! ఇంట్లో వాళ్ళ మీద ఎవరన్నా కోపం తెచ్చుంటారా ? అని నాకు నేనే సర్ది  చెప్పుకున్నాను.

ఈలోగా బయటి వెళ్ళిన అందరూ వచ్చారు. అన్న రాలేదు. ఇంకా అన్న రాలేదేంటి అనగానే మా చిన్నక్క అందుకుని  ఆయనగారు అప్పుడే ఎందుకొస్తారు మధ్యలో ఎన్నెన్ని పనులు అంటూ మా నాన్నమ్మ లా రాగం తీసింది.దానికి మా వాళ్ళంతా నవ్వులు నాకేమీ అర్ధం కాలేదు.. నాకే విషయాలు చెప్పరు కదా వీళ్ళు . సాయంత్రానికి  అందరూ టీవీ దగ్గర చేరారు "అంతరంగాలు అనంత మానస చదరంగాలు" అంటూ మొదలెట్టి "ఓ విధీ విచిత్రాల నిధీ"  దాకా చూస్తూ కధల్ని,నటుల్ని కామెంట్ చేస్తూ చూస్తున్న వాళ్ళని చూస్తే  అంత నచ్చకపోతే అలా కామెంట్స్ చేస్తూ చూడటం ఎందుకు వేరే ప్రోగ్రామ్స్ చూడొచ్చు కదా అనిపించింది .. ఎదుటి వాళ్ళని ఏదో విధంగా విమర్శించటం మనుషుల జన్మహక్కనుకుంటా...

కాసేపటికి అన్న వచ్చాడు  మాధవ్ నీకు పండక్కి బట్టలు అంటూ ప్యాకెట్ అందించాడు. తీసి చూడగానే ఎప్పటిలాగే బారు చొక్కా, లూజు ప్యాంటు ఈ డ్రెస్ వేసుకుంటే  ఏదో సినిమాలో బాబుమోహన్ డ్రెస్ లా ఉంటుందని అన్నకి చెప్పాలనుకుని కూడా వద్దులే పాపం మళ్ళీ అన్న ఫీల్ అవుతాడు అనుకుని బట్టలు లోపల పెట్టటానికి వెళ్లాను. అన్న భోజనం చేస్తూ అమ్మమ్మతో అంటున్నాడు ఈ దసరాకి కారు కొనాలనుకుంటున్నాను. ముందు కొంచెం డబ్బు మీరు కట్టండి మిగతాది ఇన్స్టాల్ మెంట్స్ లో నేనే కట్టుకుంటాను అన్నాడు అమ్మమ్మతో. అప్పంటే మీ నాయన  ఏమంటాడో నాయనా అంది అమ్మమ్మ అందుకే ఇప్పుడు నువ్వు ఇవ్వు నేను తర్వాత ఇప్పిస్తా అన్నాడు అన్న. మొత్తానికి ఈ దసరాకి అన్న కార్ కొంటున్నాడన్నమాట. నాకు అన్నని చూస్తే చాలా గర్వంగా,సంతోషంగా అనిపించింది .

అదే మాట చిన్నక్కతో అనగానే నీ మొహంలే ఆయనేమన్నా కారు సొంతగా కొంటున్నాడా నువ్వంత గర్వించటానికి .ముందు అమ్మమ్మ అప్పు ఇస్తుంది తర్వాత కొన్నాళ్ళకి నేను నెల నెలా ఫైనాన్స్ వాళ్లకి అప్పు కట్టలేను నానా అంటే అప్పుడు నాన్నే చచ్చినట్లు మిగతా డబ్బు ఇస్తాడు. అది ఆయన గారి ప్లాన్ అంటూ మహా కచ్చగా తన మనసులో మాటల్ని నాదగ్గర వెళ్ళగక్కింది .. అమ్మబాబోయ్ "నువ్వు డ్రాప్ చేస్తే కానీ కాలేజ్ కి వెళ్లను"  అని మా అన్న ముందు అనే చిన్నక్కేనా ఇలా మాట్లాడుతుంది అనిపించింది. మళ్ళీ అంతలోనే ఏదోలే కోపతాపాలు మనుషులకి కాకపొతే మానులకి వస్తాయా ఎంతైనా చిన్నక్క కదా .. !!  అనుకుని ఆ విషయం మర్చిపోయాను .


  కొంతమంది మనుషుల నోటి ప్రభావమో,లేకపోతే అంతబాగా ఆలోచిస్తారో తెలియదు కానీ, కొన్ని మాటలు వందశాతం నిజమవుతాయని చెప్పటానికి  అన్న కారు గురించి మా చిన్నక్క నాతో చెప్పిన మాటలు ఉదాహరణ.. రెండు సంవత్సరాల తరవాత కారుకి కట్టాల్సిన అప్పు కోసం ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మారిన మా అన్న ఇంటి అడ్రెస్, ఫోన్ నెంబర్ కోసం మా వూరిలో ఇంటికి ఫోన్ చేయటం, అప్పుడు ఇంట్లోనే ఉన్న నేను నన్ను కాబట్టి అడిగారని గొప్పగా అన్న కొత్త ఫోన్ నంబర్,అడ్రెస్ చెప్పటం .. ఆ నెంబర్ పట్టుకుని  వాళ్ళు డబ్బు కోసం అన్నని నిలదీయటం తప్పని పరిస్థితిలో నాన్న మిగతా అప్పు కట్టటం , అంతా ఆరోజు చిన్నక్క చెప్పింది చెప్పినట్లే జరిగింది. కానీ ఇక్కడ నింద  మళ్ళీ నా మీదే పడింది. ఫైనాన్స్ కంపెనీ వాళ్లకి నా ఫోన్ నెంబర్ ఎందుకు చెప్పావురా ఆ మాత్రం తెలియదా అంటూ .. అన్న నా మీద విరుచుకు పడ్డాడు.

నువ్వు కావాలని నెంబర్ మార్చావని తెలియక వాళ్లకి చెప్పేశాను అయినా  నువ్వు అప్పు కట్టేసి ఉంటావనుకున్నాను,అందుకే వాళ్లకి నెంబర్ చెప్పాను చెప్పకూడదని నాకు తెలియలేదు అన్నాను..నాకు అర్ధం కాని విషయం ఎప్పటికైనా అప్పు కట్టాలి కదా.. అంటే నేను నెంబర్ చెప్పకపోతే అన్న వాళ్లకి  ఎప్పటికీ అప్పు కట్టేవాడు కాదా? అది తప్పు కాదా ?? అలా మా అన్నకి కారు, నాకేమో తెలివి తక్కువగా ఫైనాన్స్ కంపెనీ వాళ్లకి అన్నని పట్టించాననే అపనింద  మిగిలిపోయింది..  ఏంటో ... ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఎందుకు మాట్లాడాలో ( మా అమ్మమ్మ బాషలో లోకజ్ఞానం ) నాకు ఎప్పటికైనా తెలుస్తుందో లేదో .. ??

కధ  మరీ  ఎక్కడికో ముందుకు వెళ్లిపోయింది  కదా..  వస్తున్నా వెనక్కి .మళ్ళీ దసరా పండగ రోజున హైదరాబాద్ లోని మా అన్న ఇంటికి.


1, నవంబర్ 2014, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 10


 

ఛా ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను ఎవరికీ  అనవసరంగా చనువు ఇవ్వకూడదని,ఎవరిని తొందరగా నమ్మ కూడదని, కానీ మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటాను.చాలా బాధగా ఉంది లోలోపల కసిగా కూడా ఉంది. నన్ను ఒక అమ్మాయి పర్స్ దొంగతనం చెయ్యమని ఇంకో అమ్మాయి అడగటం తలచుకుంటేనే పిచ్చి కోపం వస్తుంది . ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా బయటికి వస్తున్న నాకు వెనక నుండి మాధవ్ మాధవ్ అని కావ్య పిలవటం వినిపిస్తూనే ఉంది కానీ ఆగాలనిపించలేదు.లంచ్ తర్వాత క్లాస్ కి వెళ్ళాలనిపించలేదు. డైరెక్ట్ గా రూం కి వెళ్లాను. హేమంత్ రూమ్ లోనే వున్నాడు పెళ్ళికి వెళ్ళొచ్చి బాలేదని రెస్ట్  తీసుకుంటున్నాడు. హేమంత్ ని చూడగానే అసలు వీడివల్లే తన చెల్లెలు పరిచయం అయ్యింది లేకపోతే  నేను అమ్మాయిలతో పరిచయం ఎందుకు చేసుకుంటాను అనుకుని హేమంత్ తో ఏమీ మాట్లాడకుండా వెళ్లి పడుకున్నాను. సాయంత్రానికి సోహిల్,రఫీ,దివాకర్ రూమ్ కి వచ్చారు. 

నన్ను చూసి ఏమైంది మాధవ్ అని అడిగి ఉదయం కాలేజ్ లో పేషెంట్ విషయం గురించి బాధపడుతున్నాను అనుకుని అందరూ ఫ్రెష్ అయ్యి భోజనాల తర్వాత మొన్న వెళ్ళిన పెళ్లి ఫోటోలు చూద్దామని కూర్చున్నారు. దివాకర్ మంచి ఫోటోగ్రాఫర్.  అప్పట్లో రీల్ కేమెరాలే కదా..  కెమెరా మెడలో వేసుకుని తిరుగుతూ కనపడ్డ ప్రతి పుట్టని,గుట్టని ఫోటోలు తీస్తూ మమ్మల్ని ఆ ఫోటోలు చూడమని,మెచ్చుకొమ్మని, వాటి గురించి విశ్లేషించమని చావగొట్టేవాడు.అందరూ ఫోటోలు చూడటం కాగానే దివాకర్ ఫ్రెండ్ మా సీనియర్ సుధాకర్ దొరై మా రూమ్ కి వచ్చాడు ఇతను తమిళనాడులో పుట్టినా తన చదువంతా ఇక్కడే జరిగింది.తను పాటలు చాలా బాగా పాడతాడు. కానీ వచ్చిన చిక్కేమిటంటే తమిళ పాటలు పాడి, వాటి అర్ధాలు కూడా చెప్తూ చావ గొట్టి చెవులు మూసేవాడు.వాడు,వాడి అరవ గోల.  కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది. ఎవరికీ తెలియని విషయాలు వాళ్ళకే తెలిసినట్లు, వాటన్నిటిని మాలాంటి అజ్ఞానులకి చెప్పేసి అందరినీ ఎడ్యుకేట్ చేయటమే వాళ్ళ పని అన్నట్లు ప్రవర్తిస్తారు. ఎదుటివాళ్ళకి వాటి గురించి ఆసక్తి ఉందా లేదా అని కూడా తెలుసుకోరు.. 

ఇవాళ రూమంతా అందరితో సందడిగా, సరదాగా ఉన్నా నాకు మాత్రం మనసు చిరాగ్గా ఉంది.ఇంక అక్కడ ఉండాలనిపించలేదు. వెళ్లి పడుకున్నా గానీ నిద్రపట్టలేదు. ఇంతలో ఫోన్ రింగవ్వగానే హేమంత్ వచ్చి  మాధవ్ నీకే ఫోన్ అంటూ పిలిచాడు. ఎవరా అని వెళ్లి ఫోన్ తీయగానే అటునుంచి నాన్న. కుశల ప్రశ్నలయ్యాక మాధవ్ ఎలాగూ  త్వరలో దసరా హాలిడేస్ కదా వీలుంటే ఒక రెండు రోజులు ముందే వచ్చేయ్ .. హైదరాబాద్ వెళ్దువుగాని అందరు నిన్ను రమ్మన్నారు అన్నాడు. హమ్మయ్య వెతకబోయిన తీగ దొరికినట్లు అనిపించింది. ఇక్కడ ఉండలేని పరిస్థితిలో నాన్న రమ్మనటం హాయిగా అనిపించింది. సరే నాన్న  వచ్చేస్తా అన్నాను. 

ఫోన్ పెట్టేసి రూమ్ లోకి రాగానే నా ఆలోచనలు ఇంటి వైపు మళ్ళాయి. అన్న B.tech, అక్క ఆయుర్వేద డాక్టర్ కోర్స్ అవ్వగానే ఇద్దరి ఉద్యోగాల కోసం ఈ సంవత్సరమే హైదరాబాద్ కి వెళ్ళారు. వాళ్ళతో పాటు వాళ్లకి వంట చేయటానికి,తోడుగా కూడా ఉంటుందని అమ్మ,అమ్మమ్మ కూడా వాళ్ళతో వెళ్ళారు. మా నానకి ఎలాగు మా అమ్మ దగ్గర ఉన్నా, లేకపోయినా పర్వాలేదు కాబట్టి మా నాన్నమ్మ, నాన్న ఆయన జాబ్ చేస్తున్న ఇంటిదగ్గరే ఉంటున్నారు.ఇంక చిన్నక్క కూడా ఒక్కతే  ఎందుకని అన్న దగ్గరే ఉంటూ లా చదువుతుంది.చిన్నప్పుడు ఎప్పుడూ అతి తెలివిగా అడ్డదిడ్డంగా వాదించే మా చిన్నక్కని నాన్నమ్మ అనేదట నువ్వు నందిని పంది పందిని నంది చేయగల సమర్దురాలివే నువ్వు వకీలుగా  బాగా పనికొస్తావు అని. ఆమాట నిజం చేయాలన్న ధృడ సంకల్పంతో మా అక్క ఇప్పుడు "లా" చదువుతుందన్నమాట. 

నేను ఇక్కడ కాలేజ్ లో చేరటం, ఎప్పుడైనా లీవ్ వచ్చినా నానే వచ్చి వెళ్ళటంతో ఇంటికి ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఇన్నాళ్ళ తర్వాత అందరు నన్ను రమ్మని పిలవటం చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే లగేజ్ సర్దుకుని రెడీగా ఉంచుకుని నిద్రపోయాను. ఉదయాన్నే రఫీకి,సోహిల్ కి చెప్పి ఇంటికి బయల్దేరాను.ముందు నాన్న దగ్గరికి వెళ్లి, నాన్నమ్మని పలకరించి రాత్రికి హైదరాబాద్ బయల్దేరాను.తెల్లారేసరికి హైదరాబాద్ బస్టాండ్ కి చేరుకొని నాన చెప్పిన అడ్రెస్ ఎంత జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్లినా దారి తప్పిపోయాను. కాయిన్ బాక్స్ నుంచి ఇంటికి ఫోన్ చేయగానే అప్పుడే నిద్ర లేచిన అన్న ఫోన్ తీసి అంత  క్లియర్ గా ఉన్న అడ్రెస్ కూడా తెలుసుకోలేవా అంటూ కసిరి ఆటో అతనికి నేను చెప్పినట్లు చెప్పు అంటూ కరెక్ట్ అడ్రెస్ చెప్పాడు.మొత్తానికి ఎలాగో ఇల్లు చేరాను. 

మంచి పోష్ లొకాలిటీలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అది. అన్నకి అప్పుడే కొత్తగా ఉద్యోగం వచ్చింది.అద్దె,ఖర్చులు అన్నీ నాన్నే చూస్తున్నాడు .అన్న కోసం నాన్నఎంతైనా ఖర్చు చేస్తాడు. అన్న ఏమి చేసినా ఉపయోగకరంగా,  తెలివిగా చేస్తాడని మా నాన్నకే కాదు మా ఫ్యామిలీ అందరి నమ్మకం.అందుకే ఎంత నమ్మకం లేకపోతే  అన్నని నమ్మి అమ్మమ్మ, అమ్మ,ఇద్దరు అక్కలు ఇంత  పెద్ద సిటీలో ఉంటారు.. నాకు కూడా అనిపించింది ఎంతైనా అన్న సమర్దుడే అని.అందరు నిద్రలేచి టిఫిన్,కాఫీలయ్యాక పెద్దక్క జూనియర్ డాక్టర్ గా చేస్తున్న హాస్పిటల్ కి, అన్న ఆఫీస్ కి,చిన్నక్క కాలేజ్ కి రెడీ అవుతున్నారు.చిన్నక్క బయటికి వస్తూనే అన్నని పిలిచింది తనని కాలేజ్ లో డ్రాప్ చేయటానికి. అన్న నాకు లేట్ అవుతుంది ఇవాల్టికి మాధవ్ తో వెళ్ళొచ్చు కదా అనగానే లేదు నన్ను నువ్వే డ్రాప్ చెయ్యాలి లేకపోతే కాలేజ్ కి వెళ్ళను అంది. సరే పద అంటూ అన్న,చిన్నక్క వెళ్లిపోయారు 

అక్కకి  నన్ను కాలేజ్ కి తీసుకెళ్లటం ఇష్టం లేదని అర్ధం అయ్యింది. ఫీల్ అవుతున్న నా దగ్గరికి మా కవరింగ్ మాస్టర్ అమ్మమ్మ వచ్చి ఏమీలేదులే నాయనా నువ్వు ఇక్కడ కొత్త కదా అందుకని అన్నని రమ్మందిలే అక్క, నువ్వేమీ వేరేగా ఆలోచించగాకు అంది. హాలిడేస్ ఇవ్వటానికి ఇంకా రెండ్రోజులు ఉండటంతో అందరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ నేనే పనిపాటా లేనట్లు ముందే వచ్చి కూర్చున్నా.. ఈ లోగా అమ్మ టిఫిన్ పెట్టగానే తినేసి ప్రయాణ బడలికతో అలాగే పడుకుని నిద్రపోయాను. మధ్యానానికి ఎవరివో కొత్త గొంతులు వింటూ మెలకువ వచ్చింది.


Related Posts Plugin for WordPress, Blogger...