పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, నవంబర్ 2014, శుక్రవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 12




అప్పట్లో ఇప్పటిలాగా దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఇళ్ళలో పూజలు అంతగా చేసేవాళ్ళు కాదు.. ఒక్క దసరా మాత్రం బాగా జరుపుకునే వాళ్ళం. నాకు తెలిసి, గుళ్ళలో మాత్రం అలంకారాలు చేసేవాళ్ళు. నేను కాస్త దేవుడి పూజలకి దూరంగానే ఉంటాను. దసరా రెండు రోజులుందనగా పద్మాక్షి వదిన వచ్చింది మా ఇంటికి. ఆ రోజు మా అన్న (వదిన భర్త కాదు,మా సొంత అన్న)కూడా ఇంట్లోనే ఉన్నాడు. అన్న మంచి ఉత్సాహంగా ఉన్నాడు ఏమిటో మరి సంగతి అనుకున్నాను. 

కాసేపటికి మాటల్లో అర్ధం అయిన సంగతి ఏమిటి అంటే మా వదినకి నాట్యం, సంగీతం అన్నిటిలో ప్రవేశం ఉందట. ఇంటికే టీచర్ ని పిలిచి తనతో పాటూ వాళ్ళమ్మాయి సౌమ్య కి,ఇంకా ఆసక్తి ఉన్న చుట్టుపక్కల వాళ్లకి డాన్స్, సంగీతం నేర్పుతుందట. అందులో భాగంగానే ఇంట్లోనే డాన్స్&మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఉండేలా కొత్త ఇల్లు కట్టించారు.ఆ ఇంటి గృహప్రవేశంతో పాటే ఒక సంగీతకార్యక్రమం కూడా ఏర్పాటు చెయ్యాలని, ఎలాగు గృహప్రవేశానికి వచ్చిన బంధువులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు తన కళ  ప్రదర్శించాలన్న ఆమె కల కూడా తీరుతుందని వదిన ఆలోచన. 

భార్య ఇష్టాన్నే తన ఇష్టంగా  ప్రేమించి,ప్రోత్సహించే ఆమె భర్త నుండి కూడా అంగీకారం రావటం ,దానికి కావాల్సిన ప్రయత్నాలను ఆయన చేయటం కూడా జరిగిపోతున్నాయి.ఇంతకీ ఇక్కడ నాకు తెలియని ట్విస్ట్ ఏంటంటే మా సొంత అన్న.. వదిన వాళ్ళింట్లో సంగీతం నేర్చుకుంటున్నాడట..! అందులో భాగంగా రేపటి కార్యక్రమం లో మా అన్న కూడా వదినతో పాటూ తన కళ ప్రదర్శించబోతున్నాడు. ఈ మాట వినగానే ఆహా.. మా అన్న ఎంతైనా మేధావి, అరవైనాలుగు కళల్లో ఒక్కటేమిటి అన్నీ నేర్చుకోగల సమర్ధుడు.  కానిదే ఒక పక్క జాబ్ చేస్తూనే సంగీతం నేర్చుకున్నాడా .. ఇలాంటి అన్న నాకున్నందుకు ఎంతైనా గర్వించాల్సిందే అనుకున్నా మనసులో .

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది దసరా రోజు పద్మాక్షి వదిన వాళ్ళింటికి అన్న తన కొత్త కారులోన అమ్మని, అమ్మమ్మని,ఇద్దరు అక్కల్ని తీసుకెళ్ళి , చిన్న కారు కదా అందరం సరిపోమని నన్ను తన బైక్ మీద రమ్మన్నాడు మా తాతతో ( అమ్మ వాళ్ళ నాన్న) పాటూ.. అలాగే అందరం వదిన వాళ్ళింటికి చేరుకున్నాము.వదిన వాళ్ళ ఇల్లు అధునాతనంగా, చక్కని ఫర్నిచర్ తో తన అభిరుచికి తగినట్లుగా కట్టుకున్నారు.బెడ్ రూమ్ లు,పెద్ద హాలు చుట్టూ కాంపౌండ్, అప్పటికే నాటినట్లు బాగా బ్రతికి,పచ్చగా పెరిగిన మొక్కలు,ఇంటి ముందు లాన్,అన్నిటికన్నా ఆశ్చర్య పరిచేది మొదటి అంతస్తులో గదులేమీ లేకుండా పెద్ద హాల్ లో ఒక పక్కన డాన్స్, సంగీతం నేర్చుకోవటానికి, ఎప్పుడన్నా  ప్రదర్శనలివ్వటానికి వీలుగా స్టేజ్ కట్టించి, చూడగానే నృత్యమందిరం అనిపించేలాగా ఇంటీరియర్ డెకరేషన్ చేయించారు .


వదిన అభిరుచికి హ్యాట్సాఫ్ అనాలనిపించేలా ఉంది ఇల్లు. ఎన్ని ఆస్తులున్నా అనుభవించే అదృష్టం కూడా ఉండాలన్నట్లు.. ఇల్లు కట్టిస్తే డబ్బులు వడ్డీ దండగని,ఇప్పటికీ తాతల కాలంనాటి మట్టిమిద్దె లో ఉండే అమ్మమ్మ, మంచి బెడ్ రూమ్ లు ఉండే ఇల్లు కొందామా నాన్నా అంటే తక్కువ రేటుకి వస్తుందని ఆ చివర చూస్తె ఈ చివర కనిపించేలా 4 బారు గదులున్న ఇల్లు కొని ఆ ఇళ్ళని అద్దెలకి ఇచ్చేసి, నాన్నమ్మ పేర్తో ఒక రైతు దగ్గర కొన్న ఇందిరమ్మ ఇంట్లో ఉంటాములే .. మీరందరూ ఇప్పుడు వేరే వేరే చోట్ల ఉంటున్నారు కదా అంత  ఇల్లు మాకెందుకు అంటాడు నాన్న.. ఇప్పటిదాకా అలాంటి ఇళ్ళనే చూసిన మా వాళ్లకి సిటీలో ఆధునాతనంగా ఉన్న ఈ ఇల్లు చూసి ఆశ్చర్యం,ఆవేదన,అసూయ లాంటి భావాలన్నీ ఒకేసారి వచ్చాయి. 


కొంతమంది మనుషుల సహజ లక్షణం వాళ్ళ కంటే బాగున్నవాళ్ళని, సంతోషంగా ఉండే వాళ్ళని చూసి ఓర్చుకోలేక,అసూయతో వాళ్ళని ఏదో ఒకటి అనేసి కడుపుమంట చల్లార్చుకుంటారు.ఇప్పుడు మా వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. ఊర్లో మనకన్నా ఎక్కువ ఆస్తులేమీ లేవు సంపాదన ఎంతుంటుందో ఇంత ఇల్లు కట్టాడు ఎలా వచ్చిందో అంత డబ్బు అంటూ అమ్మ,అమ్మమ్మ ,అక్కలు మొదలుపెట్టారు రహస్య పంచాయితీ. అమ్మో మాటలే రానట్లుందే అమ్మ కూడా బయటి వాళ్ళనేసరికి చిన్నగా తనకి తోచిన మాటలు అందిస్తుంది మా అమ్మమ్మకి, అక్కలకి.నాకెందుకో వీళ్ళు అలా మాట్లాడటం నచ్చలేదు. కానీ ఏమి చేస్తాం ఎంతైనా "నా పెద్దలు కదా..  దైవంతో సమానం.  వాళ్ళని ఏమీ అనకూడదు". 

భోజనాలు అయ్యాయి.మా వాళ్ళు "కడుపుమంట"తో సరిగా తిన్నారో లేదో పాపం.. ఇంతలో అసలు కార్యక్రమం మొదలయ్యింది.మా కజిన్ వదిన, మా సొంత అన్న,వాళ్ళ మ్యూజిక్ ట్రూప్ సినిమాలో కచేరీ సీన్ లో చూపించినట్లు  స్టేజ్ ఎక్కి పక్క పక్కన కూర్చున్నారు."సరిగమలు.. గలగలలు .. ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము" పాట  వదిన పాడుతుంటే మా అన్న ఫ్లూట్ వాయిస్తున్నాడు. మా అన్న అని చెప్పటం కాదు కానీ తెల్లని లాల్చీ పైజమా వేసుకుని సాగరసంగమంలో కమల్ హాసన్ లా ఉన్నాడు.  

వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకు "ఇది కధ కాదు" సినిమాలో శరత్ బాబు, జయసుధ .. సరిగమలు .. గలగలలు అని పాడుతున్నట్లు,"సాగరసంగమం" లో జయప్రద, కమల్ హాసన్ నాద వినోదము నాట్యవిలాసము అని పాడు తున్నట్లు అనిపించింది. నా మొహం.. పెళ్ళైన వదినతో అన్నకి ఈ పోలిక పెట్టటం బాలేదు కానీ అక్కడ సీన్ అలా వుందని నా భావం .. ఏమి చేస్తాం నాకలా గుర్తొచ్చింది అంతే.. 

నేను బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కానీ మా వాళ్లకి ఎందుకో నచ్చినట్లు, సంతోషంగా ఉన్నట్లు అనిపించలేదు. ఎప్పుడూ  ఎవర్నో ఒకర్ని కదిలించుకోకపోతే నిద్రపట్టదు కదా నాకు..  నా పక్కనే కూర్చున్న చిన్నక్కని చిన్నగా కదిపాను.అక్కా వాళ్ళిద్దరి ప్రొగ్రామ్ చూస్తే నీకేమనిపిస్తుంది అన్నా..  నాకొచ్చిన మహత్తరమైన ఆలోచన తనకి వచ్చిందా లేదా తెలుసుకుందామనే ఉత్సాహంతో.. చిన్నక్క నాకేసి ఒకసారి చూసి ఆ... నీకేమనిపించిందో చెప్పు ముందు అంది. మనకసలే కడుపులో ఏమన్నా ఉంటే (విషయాలు) బయటికి కక్కిందాకా మనసుకి శాంతి ఉండదు కదా.. 

నాకనిపించిన జయసుధ,శరత్ బాబు,జయప్రద,కమల్ హాసన్ గురించి చెప్పగానే అక్క నన్ను చీదరగా చూసి నీ మొహమేమి కాదు నీ పోలికలు..  నువ్వు అంది. ఓహో పెళ్ళైన వదినతో అన్నకి ఆ పోలిక పెట్టటం అక్కకి నచ్చినట్లు లేదు. అందుకే అలా అంది ఎంతైనా ఆడవాళ్ళు కదా తోటి ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఇష్టపడరులే అనుకునేలోపే చిన్నక్క పక్కనే కూర్చున్న పెద్దక్కని పిలిచి నేను చెప్పిన విషయం అక్కకి చెప్పి ఈయన గారికి ఆయన గారిని చూస్తే కమల్ హాసన్ గుర్తోచ్చాడట .. నాకైతే "శృతిలయలు" సినిమాలో రాజశేఖర్, జయలలిత "తెలవారదేమో స్వామీ" పాట గుర్తొస్తుంది అన్నది.ఆ సినిమాలో జయలలిత, రాజశేఖర్ అంత  బాగుంటారా??  నేనా సినిమా చూడలేదే అన్నాను అక్కతో. 

మంచిపని చేశావులే ఈ సారి ఎప్పుడన్నా సినిమా చూడు తెలుస్తుంది అంది పెద్దక్క.మొత్తానికి అనుకున్న కార్యక్రమాలన్నీ అనుకున్నట్లే అయ్యాయి. అక్కడున్నంత సేపు ఒక్క మా అన్న తప్ప ఎవరూ సంతోషంగా లేరు. మా అమ్మమ్మ,అమ్మ,అక్కలు,తాత అందరూ వాళ్ళ సొమ్మేదో పోయినట్లు బాధపడుతున్నారు,అక్కలు బొద్దుగా ముద్దుగా ఉండే వదిన వాళ్ళమ్మాయి సౌమ్యని బండది బండది అంటూ అక్కసుగా పిలుస్తున్నారు. నాకేమీ అర్ధం కాలేదు కానీ ఇల్లుని చూసి మానవ సహజమైన ఈర్ష్యా, అసూయలు అనుకున్నా.. వచ్చేటప్పుడు మా అన్న పద్మాక్షి వదినకి,వాళ్ళాయనకి తనతో మ్యూజిక్ ప్రోగ్రాం ఇప్పించినందుకు థ్యాంక్స్ చెప్పి మమ్మల్ని ఇంటికి బయల్దేరదీశాడు.. 

ఈర్ష్యా,అసూయలు ఒకరి కంటే మనం బాగుండాలన్న స్ఫూర్తిని కలిగిస్తే సంతోషమే కానీ మనకి లేనిది ఇతరులకి ఉందని,దాన్ని దూరం చేసి సంతోషించాలనే దుర్మార్గపు ఆలోచనలు కలిగిస్తే అది ఇతరుల జీవితానికి,ఒక్కోసారి మన జీవితానికి, ఈ రెండు కాకపోతే మధ్యలో ఈ విషయంలో ఏమీ సంబంధం లేని వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యే ప్రమాదం లేకపోలేదు... తప్పు చెయ్యటం ఎంత తప్పో,తప్పు చేసే వాళ్ళని ఖడించకుండా మౌనంగా ఉండే వాళ్ళది కూడా అంతే తప్పు.
                     



2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

కధ బాగుంది,కధలో చెప్పిన పాటలు బాగున్నాయి. ఆ పాటలన్నీ నాకు ఇష్టం కూడా.
శ్రుతిలయలు సినిమాలో తెలవారదేమో స్వామీ పాట సుమలత,రాజశేఖర్ లది కదా మరి జయలలిత పాట ఎక్కడ వుంది ?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

Swarna M గారూ..
కధ నచ్చినందుకు,మీ వ్యాఖ్యకి థ్యాంక్సండీ ..
పాట గురించి మీ సందేహం తీరాలంటే ఈ పాట చూడండి ..

https://www.youtube.com/watch?v=8nc7CTjlpUI

Related Posts Plugin for WordPress, Blogger...