పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, డిసెంబర్ 2014, బుధవారం

కమ్మని కలలకు ఆహ్వానం ..




2014 కొన్ని చిన్న చిన్న సమస్యలతో పాటూ వాటిని అధిగమించగల ధైర్యాన్ని,సంతోషాన్ని కూడా ఇచ్చింది. 

కొత్త ప్రదేశాలు,బాధ్యతలు,మనుషులు,పరిచయాలు,స్నేహాలు, 
ఇలా సంతోషంగా ఉన్నప్పుడు కాలం తెలియదు అంటారు కదా..!
అలాగే వేగంగా,హాయిగా వెళ్ళిపోతుంది 2014.

నాకంటూ కొన్ని చిన్న విజయాలను కూడా అందించిన 2014 
నాకు చాలా ప్రియమైనదిగా గుర్తుండిపోతుంది కూడా.. 

రాబోయే 2015 మరింత ప్రియమైనదిగా ఉండాలని కోరుకుంటూ 
2014 కి వీడ్కోలు చెప్తు

కమ్మని కలలకు ఆహ్వానం 
చక్కని చెలిమికి శ్రీకారం 
పలికిన పాటకు నా ప్రాణం 
అంకితం అన్నది నా హృదయం 

Happpy New Year  .. Happpy New Year  


 


THANK YOU 2014 -- WELCOME 2015



29, డిసెంబర్ 2014, సోమవారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 14




ఏమి చేయాలో అర్ధం కాలేదు ఇప్పుడు పంతాలు,పట్టుదలలకి పొతే ఎలా? ఎవరో ఒకరి ద్వారా పని చేయించుకోకపోతే నాకే నష్టం. పైగా నాన్న ఎంత కష్టపడితే ఆ చైన్ వచ్చింది? నాన ఎంత డాక్టర్ అయితే మాత్రం డబ్బులు ఊరికే వస్తాయా? నేను నా ఆలోచనతో బాధపడుతూ ఉండగానే అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అయ్యి కొత్తగా రిలీజ్ అయిన "ప్రేయసి రావే" సినిమాకి బయల్దేరారు.పెద్ద మాధవ్ వచ్చి ఏంటి మాధవ్ సినిమాకి వస్తావా అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది అసలే చైన్ పోయిందని నేనేడుస్తుంటే సినిమాకి పోవాలంట సినిమాకి.!అయినా ఎవడి నొప్పివాడికే బాధ కానీ పక్కవాడికి ఏముంటుంది?


ఇంతలో హేమంత్ వచ్చి సరే మాధవ్ మేము వచ్చేదాకా ఆలోచించుకో నువ్వు వెళ్దామంటే మేము సినిమా నుండి రాగానే మా పిన్ని వాళ్ళింటికి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.నాకు ఇంక తిండి కూడా తినబుద్ధి కాలేదు.మా నాన్నమ్మ ఎప్పుడూ ఒక మాట అనేది.తప్పని పరిస్థితుల్లో వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట.ఇప్పుడు నాకు కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోక తప్పదు అనుకుని కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడ్డాను. 


సాయంత్రం హేమంత్ వస్తూనే వెళ్దామా మాధవ్ అనగానే సరే పద అని ఇద్దరం బయల్దేరి వెళ్ళాము.వెళ్తున్నానే కానీ కావ్య ఎదురైతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ దేవుడు నా మొర విన్నట్లు కావ్య తన చెల్లి,తమ్ముడితో కలిసి సినిమాకి వెళ్లిందట.మేము వెళ్ళగానే ఆంటీ మాధవ్ బాగున్నావా అని పలకరించి టీ ఇచ్చారు. అది తాగేలోపే హేమంత్ విషయం అంతా చెప్పగానే ఆంటీ తన ఫ్రెండ్,CI గారి భార్యకి ఫోన్ చేసింది. అటునుంచి ఆవిడ వెంటనే నేను మా వారితో ఇవాళ చెప్తాను వాళ్ళని రేపు స్టేషన్ కి వెళ్ళమనండి అన్నారట. 


మాధవ్ రేపు స్టేషన్ కి వెళ్తే CI గారు ఆ పనమ్మాయిని పిలిపించి మాట్లాడుతారు.కేస్ పెట్టే పనిలేకుండానే పని అయ్యేలా చేస్తారులే అంది ఆంటీ .నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటిదాకా కదిపితే కన్నీళ్లు అన్నట్లుంది నా పరిస్థితి కానీ ఇప్పుడు హమ్మయ్య సమస్య ఒక కొలిక్కి వచ్చింది అనుకున్నాను. ఇంతలో ఆంటీ మాధవ్ మాకు తెలిసినావిడ ఇలా ఎవరివన్నా వస్తువులు పోయినా,ఇంట్లో మనుషులు కానీ పశువులు కానీ కనపడకపోయినా పూజలో కూర్చుని అవి ఎక్కడ ఉన్నాయి,దొరుకుతాయా లేదా అని చెప్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్దామా అంది. 


నాకేమి మాట్లాడాలో అర్ధం కాలేదు.అసలే నేను వివేకానంద శిష్యుడిని. ఇలాంటి మూఢనమ్మకాలని ప్రోత్సహించను.కానీ ఇప్పుడేమి చేస్తాం వాళ్ళ సాయం కోరి వచ్చాము కదా తప్పదు అనుకున్నా.. నా మనసులో కూడా ఏమో వెళ్తే ఒకవేళ ఏదన్నా తెలుస్తుందేమో అనే ఆశ కలిగింది.అందుకే అంటారేమో ఏదైనా తనదాకా వస్తే కానీ తెలియదు అని.సరే వెళ్దాం అనుకుని  నేను,ఆంటీ హేమంత్ బయల్దేరి వెళ్ళాము. 

వాళ్ళ ఇల్లు ఆంటీ వాళ్లకి పక్క లైన్ లో ఉంది.మేము వెళ్ళేటప్పటికి అక్కడ జాతకాలు చెప్పే ఆవిడ పూజలో కూర్చుని వుంది.నేనింకా ఎంత పెద్దావిదో అనుకున్నాను.కానీ 25 సంవత్సరాలకి మించని వయసుతో పెద్ద బొట్టు పెట్టుకుని,ఎర్రచీరలో ఎదురుగా అమ్మవారి ఫోటోకి నిమ్మకాయలదండ వేసి ధూపం వేస్తూ పూజ చేస్తుంది.ఆంటీ ఆమె దగ్గరికి వెళ్లి నన్ను చూపించి విషయం చెప్పగానే నన్ను వచ్చి ఎదురుగా కూర్చోమని చెప్పి,కాసేపు కళ్ళు మూసుకుని ప్రార్ధించి .. చైన్ గురించి నీ అనుమానం నిజమే నీ గొలుసు పనమ్మాయె తీసింది కానీ అది నీకింక దొరకదు ఆశ వదులుకో.అలాగే నీ జీవితంలో అందని దానికోసం ఆశపడి చాలా కష్టాలుపడాల్సి వస్తుంది జాగ్రత్త అంది.

నాకేమి మాట్లాడాలో అర్ధం కాలేదు.చాలా బాధ అనిపించింది.అందుకే నేను ఇలాంటివి నమ్మను అనవసరంగా వచ్చాను అనుకుంటూ ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వచ్చాను.పాపం ఆంటీ,హేమంత్ కూడా బాధపడ్డారు.రెండో రోజు కాలేజ్ నుండి మధ్యానమే వచ్చి హేమంత్ ని తీసుకుని C I తో మాట్లాడటానికి పొలీస్ స్టేషన్ కి వెళ్ళాము.మేము వెళ్ళేటప్పటికి ఎవరినో వెర్రి కేకలు పెడుతూ వార్నింగ్స్ ఇస్తున్నాడు C I .నాకు అక్కడికి వెళ్ళటమే ఇష్టం లేదు కానీ ఏమి చేస్తాం తప్పని స్థితి. 


అప్పటిదాకా ఆగ్రహంగా ఊగిపోతున్న ఆయన హేమంత్ వెళ్లి ఫలానా అని పరిచయం చేసుకోగానే నవ్వుతూ..ఆ ఆ నిన్న చెప్పారు మీకు పనిమనిషి మీద డౌట్ అంట కదా పిలిపిద్దాం మరి ఏమంటుందో? అంటూ కానిస్టేబుల్ ని పిలిచి మేము చెప్పిన పనమ్మాయి అడ్రెస్ కి పంపాడు. ఒక్క అరగంటలో పనమ్మాయి,ఆమె భర్త స్టేషన్ కి వచ్చారు.అక్కడ మమ్మల్ని చూస్తూనే కొంచెం అనుమానంగా మొహం పెట్టిన వాళ్ళిద్దరూ గొలుసు గురించి C I అడగ్గానే రాముడా దేముడా మేము అల్లాంటి వాళ్ళం కాదు సామీ. ఏదో కులానికి,కూటికి తక్కువోల్లమే గానీ ఇట్టాంటి పాడు పనులు మేమెందుకు చేస్తాం అంటూ ఏడుపు లంకించుకున్నారు. 


వాళ్ళ నాటకం అర్ధం అయిన C I సరే అయితే మీఇష్టం వాళ్ళు మీమీద దొంగతనం కేసు పెడతారంట అనగానే వాళ్ళు వెంటనే పెట్టండయ్యా నేను కూడా పెడతాను నేను కులం తక్కువదాన్నని తిట్టి,హింసించటానికే మీరంతా ఇలా దొంగకేసు పెట్టారని అని ఏడుస్తూ.. మేమేదో వాళ్ళని కులం పేరుతో దూషించినట్లుగా సీన్ క్రియేట్ చేయటానికి సిద్దపడ్డారు.ఆ దెబ్బతో C I గారికి కూడా మాటల్లేవు ఆయనెక్కడ ఇరుక్కుంటాడో అని.పైకి మాత్రం బింకంగా మీరు నిజం చెప్పకపోతే మాకు తెలుసు ఎలా కనిపెట్టాలో తర్వాత పిలుస్తాం రండి అంటూ వాళ్ళని అక్కడి నుండి పంపేశాడు. 

వాళ్ళు వెళ్ళిన తర్వాత చూశావుగా హేమంత్, వాళ్ళు అంతా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు.ఇప్పటికి ఇలా ఎన్ని చోట్ల చేశారో.. మనం వాళ్ళమీద కంప్లైంట్ రాసి FIR చేస్తేనే మంచిది.లేకపోతే వాళ్ళు మాట వినరు అంటూ ఇంక తనేమి చేయలేనని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు .ఏమి చేద్దాము మాధవ్ అన్నాడు హేమంత్..నేనేమీ మాట్లాడలేకపోతున్నాను.కేస్ పెట్టటం ఇష్టంలేదు.ఉన్న ఒక్క ఆశా పోయింది.గొలుసు దొరుకుతుందన్ననమ్మకంపోయింది.ఇంకా ఏమి మిగిలింది మాట్లాడటానికి అనుకుని ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేశాను.ఏంటి మాధవ్ అలా వచ్చేశావు నీకసలు ఏమీ తెలియదు.పాపం అంకుల్ మనకోసం ఇంత చేశాడు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా అంటున్న హేమంత్ ని చూస్తుంటే పిచ్చి కోపం వచ్చింది నాకు. 

ఇంతకీ గొలుసు దొరకలేదు పాడూ లేదు.నాకు మాట్లాడటమే ఇష్టం లేని
కావ్య ఇంటికి తీసుకెళ్ళాడు.మూఢనమ్మకాలని నమ్మని నన్ను ఆ పూజలు చేసే ఇంటికి తీసుకెళ్ళాడు.పోలీసులంటే మంచి అభిప్రాయంలేని, ఇష్టపడని నన్ను దొంగలు,జులాయిలు తిరిగే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాడు.ఇంకా ఏమి మాట్లాడాలి వీడితో అనుకుని ఆవేశంగా రూమ్ కి వచ్చేశాను.అనవసరంగా నన్ను నేను వసుదేవుడిలాగా ఊహించుకుని ఈ గాడిదలందరి (అంతే మరి హెల్ప్ చేస్తే దేవుళ్ళు లేకపోతె గాడిదలే ) కాళ్ళు పట్టుకోవటం ఎందుకు? అదేదో గొలుసు పోయిందని ఒక్కమాట మా పెద్దలకి చెప్పి,  తప్పయిందని వాళ్ళ కాళ్ళే పట్టుకుంటే సరిపోతుంది కదా అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత నా మనసు శాంతించింది... 

గొలుసుదొంగ  పనిమనిషి పని మానేసిన తర్వాత కొత్త పనిమనిషిని ఈసారి అన్ని ఎంక్వైరీలు చేసి మరీ పనిలో పెట్టారు. పనిమనిషి లేక ఒక వారం అన్నిటికీ ఇబ్బంది పడ్డ మా రూమ్ మేట్స్ కి అది కూడా నా తప్పులాగే అనిపించింది.వీడు  చైన్ తెచ్చుకోవటమేంటి,అది పోవటమేంటి మనకి ఈ తిండి తిప్పలేంటి అంటూ నాలుగు రోజులు హోటల్లో తిని కనీసం నా చైన్ పోయిందన్న బాధ కూడా లేకుండా నా గురించి మాట్లాడుకున్నారు చాటున.  పోయిన చైన్ పోగా మాటలు కూడా పడాల్సి వచ్చింది ఇంటా బయటా .. అలా నా గొలుసు సరదా మూన్నాళ్ళ ముచ్చట అయ్యింది... 


25, డిసెంబర్ 2014, గురువారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 13



హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులయ్యింది కదా కధ  చెప్పి ... 

ఫంక్షన్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మావాళ్ళు మా కజిన్ భార్య (వదిన) గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు కానీ అక్కడ పరిస్థితులేవో తేడాగా ఉన్నాయనిపించింది.అయినా నాకెందుకులే పెద్దవాళ్ళ విషయాలు అని ఆలోచించటం మానేశాను.నాకు అప్పుడే తెలిసిన ఒక కొత్త న్యూస్ ఏంటంటే అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం అందరికీ నచ్చిందట.నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే త్వరలో పెళ్ళికి రావచ్చన్నమాట.

దసరా సెలవలు,పండగ హడావుడి,అయిపోగానే మళ్ళీ కాలేజ్ కి వచ్చేశాను. వచ్చేటప్పుడు నాన్నకి చెప్పి వెళ్దామని ఊరికి వెళ్లాను. నాన అవసరమైన డబ్బుతో పాటూ నా చేతికి ఒక గోల్డ్ చైన్ ఇచ్చాడు. నాకేమీ అర్ధం కాలేదు.  అమాయకంగా చూస్తూ ఏంటి నాన్నా ఇది అనగానే నాన్న  నీకే మాధవ్ వేసుకో.. పండక్కి నీకోసం చేయించా అన్నాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అనుకోని గిఫ్ట్ అందుకోవటం ఎవరికైనా సంతోషమే కదా. అప్పటిదాకా అన్నకే కార్ కొన్నాడు కానీ నాకేమీ ఇవ్వడు నాన్నఅని నాన్న గురించి తప్పుగా ఆలోచించినందుకు నా మనసు అపరాధభావంతో  రగిలిపోయింది.

సరేనని కాలేజ్ కి బయల్దేరగానే నాన్నమ్మ జాగ్రత్త నాయనా అంది ..  ఆహా నాగురించి నాన్నమ్మ కి ఎంత జాగ్రత్త అనుకునేలోపే గొలుసు గురించి చెప్తుండా పిల్లకాయలు దొబ్బెయగల్రు జాగ్రత్తగా పెట్టెలో పెట్టుకో తియ్యంగానే  అంది.అంటే జాగ్రత్త నా గురించి కాదా అనుకుని పెద్దది కదా జాగ్రత్త చెప్తుందిలే ఎంతైనా మా నాన్నమ్మ కదా అలా తప్పుగా అనుకోకూడదు అనుకుని నాన్నకి,నాన్నమ్మ కి చెప్పి,వాళ్ళ ఆశీస్సులు తీసుకుని కాలేజ్ కి నా ప్రయాణం మొదలయ్యింది. 

రూమ్  కి వెళ్ళగానే మరొక సర్ ప్రైజ్ మా రూమ్ లోకి కొత్తగా మరో సభ్యుడు వచ్చి చేరాడు. అతని పేరు కూడా మాధవరావ్ అట. ఒకరిని పిలిస్తే ఇద్దరం పలికే ప్రమాదం ఉండటంతో నేను కొంచెం పొట్టిగా,అతను  కొంచెం పొడుగ్గా ఉన్నాడని నన్ను చిన్న మాధవ్ అతన్ని పెద్ద మాధవ్ అని పిలిచే నిర్ణయం జరిగింది.అదేంటో నన్ను చిన్నపిల్లోడని ఎవరన్నా నాకేమీ బాధ అనిపించదు ఎందుకంటే మా ఇంట్లో కూడా మా పెద్దలందరిలో నేనే చిన్న పిల్లోడిని కదా అందుకని . 

ఆరోజుకి  రెస్ట్ తీసుకుని తెల్లారగానే మా నాన ఇచ్చిన చైన్, మా అన్న కొన్న కొత్త బట్టలు వేసుకుని మరీ హుషారుగా కాలేజ్ కి బయల్దేరాను..కాలేజ్ ఎప్పటిలాగే మొదలయ్యింది. కావ్య కోసం నా కళ్ళు వెతికాయి కానీ కనపడలేదు.కనపడకపోతే పోనీ.. అయినా తనతో నాకెందుకు నన్ను అంత  అవమనించాక కావ్య ఏమన్నా మా పెద్దలా ఎంత అవమానించినా దులిపేసుకుని పోవటానికి. ఇంట్లో వాళ్ళు ఎంత అవమానం చేసినా భరిస్తాం వాళ్ళు మన దేవుళ్ళు కాబట్టి.. కానీ బయటి వాళ్లకి ఏమి హక్కు ఉంది అనుకుని అప్పటికి కావ్య విషయం మర్చిపోయాను. 

కాసేపటికే ఫ్రెండ్స్ తో క్లాస్ కి వచ్చిన కావ్య నన్ను చూడగానే పలకరింపుగా నవ్వింది.ఆమె నవ్వగానే నేను నవ్వాలా? మొహం పక్కకి తిప్పుకున్నాను.పాపం కావ్య ఫీల్ అయినట్లుంది. ఫీల్ అయితే అవ్వనీ నాకేంటి? లంచ్ టైమ్ లో కూడా కావ్య నన్ను చూడగానే మాధవ్ మాధవ్ అని పిలుస్తున్నా  వినపడనట్లు వెళ్ళిపోయాను.లేకపోతే  నన్ను పట్టుకుని పక్కన అమ్మాయి పర్స్ దొంగతనం చేయమంటుందా?

ఆరోజంతా కావ్య నన్ను పలకరించాలని చూసినా నేను మాట్లాడలేదు.ఇలాగే వారం గడిచిపోయింది.కావ్య కూడా రెండు రోజులు నన్ను మాట్లాడించాలని  ప్రయత్నించి తర్వాత మానేసింది. ఆరోజు ఆదివారం రూమ్ లోనే పడుకుని10 అయినా బద్ధకంగా లేచి ఫ్రెష్ అయి వచ్చి నా డెస్క్ లో చూసేసరికి అన్నీ ఉన్నాయి కానీ నా చైన్ కనపడలేదు.ఒక్కక్షణం గుండెఆగినట్లు అనిపించింది.పిచ్చివాడిలాగా రూమ్ లో, బాత్ రూమ్ లో, నా పెట్టెలో చివరికి ఇల్లంతా వెతికినా చైన్ కనపడలేదు. 

మా నాన్నమ్మ మాటలు గుర్తొచ్చాయి.ఎంత జాగ్రత్త చెప్పింది,పాపం నాన్న ఎంత ప్రేమగా చేయించాడు నాకోసం.. కన్నీళ్లు పొంగుతున్నాయి. రూమ్ మేట్స్ ,కొత్తగా వచ్చిన పెద్ద మాధవ్ అంతా కంగారుగా వెతికారు.దొరక్కపోతే వాళ్ళ మీద కూడా అనుమానం వస్తుందని భయపడ్డారు అందరూ. అయినా మాధవ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా.. ఇప్పుడు ఎవరినని అడుగుతావు నువ్వు అన్నాడు హేమంత్. అందరం కలిసి మాట్లాడాక మా అనుమానం వంటపని,ఇంట్లో పని ఒక్కతే చేసే పనమనిషి మీదకి మళ్ళింది.కానీ అడిగితె చెప్తుందా? 

మా  అనుమానం నిజం చేస్తూ రెండో రోజు పనిమనిషి పనికి రాలేదు. ఆరోగ్యం బాగాలేదు రెండురోజులు పనికి రానని వాళ్ళాయనతో కబురు చేసింది. ఇప్పుడు మా అనుమానం నమ్మకంగా మారింది.ఇప్పుడేమి చేయాలి?నాన్నతో
చెప్తే ఇప్పటికే నన్ను ఏమీ తెలియని,లోకజ్ఞానం లేని వెఱ్రిపీనుగ అనుకుంటున్నారు ఇంట్లో అందరూ..  ఇప్పుడీ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అందుకే నేనే సొంతగా ఈ  ప్రాబ్లెమ్ సాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యాను. 

నా బాధ చూసిన హేమంత్ టౌన్ సి.ఐ గారి భార్య,మా పిన్నిమంచి ఫ్రెండ్స్ తన దగ్గరికి వెళ్తే కంప్లైంట్స్,కేసులతో పనిలేకుండా ఈజీగా పని అవుతుంది ఏమంటావు మాధవ్  అన్నాడు.. హేమంత్ పిన్ని అంటే కావ్య వాళ్ళ అమ్మ. 
రెండురోజుల క్రితం దాకా కావ్య  పలకరించినా పలక్కుండా తిరిగిన నేను ఇప్పుడు కావ్య వాళ్ళమ్మని హెల్ప్ అడగాలా .. దేవుడా ఎందుకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తెస్తావు ?? 


21, డిసెంబర్ 2014, ఆదివారం

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన 2014




హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఈ నెల 17 న మొదలయ్యింది. పుస్తకాలంటే మా ఇంట్లో అందరికీ ఆసక్తే కాబట్టి చూసి,కొని వద్దామని బయలుదేరాము. ఈ పుస్తక ప్రదర్శనని  పుస్తక ప్రదర్శన కాదు పుస్తకాల సముద్రం అనాలేమో .. ఢిల్లీ,కోల్ కతా నగరాల తర్వాత  అతిపెద్ద పుస్తక ప్రదర్శన ఇదేనట. తిరిగే ఓపిక, కొనే ఓపిక ఉండాలే కానీ లేని పుస్తకం అటూ లేదేమో అనిపించేన్ని ఎన్నో పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి.


 ప్రవేశ టికెట్  ఒకరికి 5 రూపాయలు.ఈ టికెట్ పోయిన సంవత్సరం లేదట. ఈ సంవత్సరమే పెట్టారని ఎవరో జర్నలిస్ట్ అడిగితే  చెప్తున్నారు అక్కడి వాళ్ళు. 


తెలుగు,హిందీ,ఇంగ్లీష్,కన్నడం,తమిళం,మలయాళం ఇలా అన్ని భాషలకు సంబంధించిన సాహిత్యం, భాగవతం, భారతం లాంటి గ్రంధాలతో పాటూ సచిన్, మలాలా ఆత్మ కధలు , పిల్లలకు కావాల్సిన పుస్తకాలు,రకరకాల రైమ్స్ CD లు,GK బుక్స్ , దేశ విదేశాలకు సంబంధించిన వంటలు, ఇలా ఇంకా నాకు తెలియనివి చాలానే ఉండి  ఉంటాయి.. 


Asia Law House వాళ్ళ స్టాల్ బాగుంది.సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి కృష్ణ అయ్యర్ గారి పుస్తకాలు చాలా ఉన్నాయి ఇక్కడ. 




 పుస్తక ప్రదర్శన లో ఈసారి ఒక  విశేషం బ్లాగ్,ఫేస్ బుక్ ఫ్రెండ్స్  
తమ రచనలతో ఏర్పాటు చేసిన స్టాల్... 



బ్లాగ్స్ లో ఫేస్ బుక్ లో తెలిసిన మాలా కుమార్ గారు, ఇంకా కొంతమంది రచయిత్రులు రాసిన "తండ్రి, తనయ"  పుస్తకం కొన్నాను. రైటర్ కన్నెగంటి  అనసూయ గారు,బ్లాగర్,రైటర్ జ్యోతి,జ్ఞాన ప్రసూన గారు వారి పుస్తకాలను  గురించి చెప్పారు. 

ఓషో -- మహిళ
మహిళ గురించి ఏమి రాశారో తెలుసుకోవాలని 
ఈ పుస్తకం కొన్నాను.


 పెద్దల కోసం వంటల పుస్తకాలు 


 పిల్లల కోసం కార్టూన్స్,cd లు 



రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రచురణ సంస్థలు,ప్రజలు  ఈ ప్రదర్శనలో పాల్గొన్నా ప్రదర్శన అంతా తెలంగాణా ఆనవాళ్ళు,సాంస్కృతిక చిహ్నాలతో తెలంగాణా వైతాళికుల పేర్లు,చిత్రాలతో ఏర్పాటు చేసిన వేదికలు,ద్వారాలతో మొత్తానికి పుస్తకాల ప్రదర్శన అంతా  తెలంగాణా సాంస్కృతిక అస్తిత్వ ప్రదర్శనగా కళ కళ లాడుతుంది... 

పుస్తక ప్రపంచంలో ఎంత సేపు విహరించినా విసుగు రాలేదు. కానీ కాళ్ళ నొప్పులతో ఆగిపోవాల్సి వచ్చింది. ఇవీ "హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2014" విశేషాలు.

6, డిసెంబర్ 2014, శనివారం

OH My God - Act Of God


Act of God

An event that directly and exclusively results from the occurrence of natural causes that could not have been prevented by the exercise of foresight or caution; an inevitable accident.

మనిషి ముందు చూపుతో కనిపెట్టలేని,ముందు జాగ్రత్తతో ఆపలేని సంఘటనలని,ప్రమాదాలని ఉదాహరణకి వరదలు,భూకంపాలు,సునామీ  లాంటి అనేక ప్రకృతి వైపరీత్యాలని  Act Of God అంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం చెల్లించకుండా తప్పుకోవటానికి కొన్ని సందర్భాల్లో  "Act Of God"  Law ని  ఉపయోగిస్తుంటారు. 

ఈ  Act Of God గురించి తీసిన హిందీ సినిమా "OH My God". పరేష్ రావల్, అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా, మిథున్ చక్రవర్తి  నటించిన ఈ సినిమాలో  పరేష్ రావల్ (కాంజీలాల్ మెహతా )పరమ నాస్తికుడు. ముంబయి చోర్ బజార్ లో  దేవతా మూర్తులు,పూజా సామగ్రి అమ్మే ఒక వ్యాపారి.  దేవుడంటే నమ్మకం లేకపోయినా దేవుడికి సంబంధించిన సామాగ్రిని భక్తులకు తనకి ఇష్టమైన ధరలకు అమ్ముతూ ఉంటాడు. దేవుడే లేడని దైవభక్తిని, భక్తులను ఎగతాళి చేస్తుంటాడు. అతని భార్య సుశీల దైవభక్తురాలు. 

కృష్ణాష్టమి రోజు పరేష్ రావల్ కొడుకు  ఉట్టి కొట్టే ఫంక్షన్ లో ఆడటం చూసి అక్కడికి వెళ్లి కొడుకుని ఆపి,పక్కనే ఉన్న మైక్ లాక్కుని అన్ని ఆలయాల్లో కృష్ణుడు పాలు,వెన్న తాగుతున్నాడని ,ఒక్క గంట మాత్రమే ఈ అవకాశం  ఉంటుందని చెప్పగానే అప్పటిదాకా అక్కడున్న జనమంతా ప్రసంగం చెప్తున్న స్వామీజీని ,ఉట్టిని వదిలేసి కృష్ణుడి మందిరాలకి పరుగులు తీస్తారు. దీంతో ఆగ్రహించిన స్వామీజీ నిన్ను దేవుడు శిక్షిస్తాడని శపిస్తాడు. ఇలాంటి శాపాలకి భయపడనని ఇంటికి వచ్చిన కాసేపటికే చోర్ బజార్ లో భూకంపం  వలన పరేష్ రావల్ షాప్ ఒక్కటే కూలిపోయిందని టీవీలో న్యూస్ వస్తుంది. 

భార్యా.బంధువులు అందరు నువ్వు దేవుడిని ఎగతాళి చేసినందుకు ఆ శాపం వలనే ఇలా అయ్యిందని తిడుతూ బాధ పడుతున్నా అవేమీ లెక్క చెయ్యకుండా కూలిపోయిన శిధిలాల్లో ఇన్సూరెన్స్ పాలసీ వెతికి తీసుకుని ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్ళిన పరేష్ రావల్ కి అక్కడ ఆఫీసర్ భూకంపం Act Of God వలన అయ్యింది కాబట్టి కంపెనీ  నష్టపరిహారం ఇవ్వదు  అంటాడు.  పరేష్  రావల్ లో అప్పటిదాకా లేని భయం,బాధ కనపడుతుంది.ఇన్సూరెన్స్ ఆఫీసర్ ని చితక్కొట్టి,నాలో కూడా దేవుడే ఉన్నాడు కదా దేవుడే కొట్టాడనుకో అని చెప్పి వచ్చేస్తాడు.

ఇంటికి వచ్చాక బాగా ఆలోచించి ఈ నష్టం దేవుడి వలన జరిగింది కాబట్టి దేవుడి మీద కోర్టులో దావా వేస్తానని కోర్టుకి వెళ్తాడు. అక్కడ లాయర్లు ఇతని వింత మాటలు విని మావల్ల  కాదంటూ పారిపోతారు. అప్పుడు లాయర్ ఓంపురి ఈ కేస్ నేను చేస్తానని దేవుడికి ప్రతినిధులుగా చెప్పుకునే కొందరు ప్రముఖ స్వామీజీలకి నోటీస్ లు పంపుతాడు.దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు భగవంతుడికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కాబట్టి భగవంతుడి తరపున నష్టపరిహారం కూడా మీరే చెల్లించాలని తన కేస్ తనే వాదించుకుంటాడు పరేష్ రావల్ . 

ఇతని ఆరోపణలు సమంజసమేనని భావించిన జడ్జ్ కేస్ విచారణకి స్వీకరించగానే ఇలాగే Act Of God వలన నష్టపోయిన వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్తారు. దీంతో  స్వామీజీలు,మాతలు,అన్ని మతాలకు చెందిన మతాధిపతుల ఆగ్రహానికి గురవతాడు. వారి భక్తులు ఆగ్రహంతో   పరేష్ రావల్ మీద దాడి చేస్తారు.సరిగ్గా సమయానికి అక్షయ్ కుమార్ వచ్చి ప్రమాదంలో ఉన్న పరేష్ రావల్ ని తన బైక్ మీద ఎక్కించుకుని కాపాడతాడు. ఇంటిమీదకి కూడా వెళ్లి భార్యా బిడ్డల మీద కూడా దాడి చేయటంతో అతన్ని వదిలి అందరూ వెళ్ళిపోతారు. 

చివరికి ఒంటరిగా మిగిలిన పరేష్ రావల్ ఇంటికి కృష్ణ వాసుదేవ్ యాదవ్ (అక్షయ్ కుమార్) గా వచ్చిన గోపాలుడు (భగవంతుడు)నాస్తికుడైన పరేష్ రావల్ తో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నీ చదివించి భగవద్గీతలోని  సృష్టించేదీ భగవంతుడే ,నాశనం చేసేది భగవంతుడే అన్న మాటతో కోర్టు కేస్ గెలిపిస్తాడు.. 

భగవంతుడు ప్రతి మనిషిలో ఉంటాడు కానీ మేమే దేవుడి ప్రతినిధులమని చెప్పుకుని,దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ, విలాసాలని అనుభవిస్తున్న స్వామీజీలు,బాబాలు ఇప్పడు లోకంలో దేవుడి కంటే ఎక్కువయ్యారు. అలాంటి వాళ్ళ గురించి,వాళ్ళని గుడ్డిగా నమ్మి,నష్టపోయే జనం గురించి సంధించిన వ్యంగ్యాస్త్రమే ఈ సినిమా.  కొన్ని విషయాలు వాస్తవానికి విరుద్దంగా ఉన్నా కాసేపు సరదాగా చూడటానికి బాగుంది,దేవుడిని నమ్మే భక్తులకు సంతోషం కలిగిస్తుందీ సినిమా. 

దైవారాధన, మానవశక్తి రెండు కలిస్తేనే కార్యసాధన సాధ్యమంటాడు భగవంతుడు.  ఏ కులమైనా,మతమైనా భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉంటాడు.తన భక్తులైనా కాకపోయినా ఈ భూమి మీద జీవరాశి నంతటినీ కాపాడేది భగవంతుడే.. నమ్మిన వారిని వెన్నంటి కాపాడే సర్వాంతర్యామి సర్వకాల సర్వావస్థల్లోనూ  ఏ రూపంలోనైనా అవతరిస్తాడని భక్తుల నమ్మకం.ఆ భగవంతుడి మరో రూపం ఈస్వామీజీలు, గురూజీలే  ఐతే అందరికీ మంచిదే. 

అలాగే ప్రకృతి వైపరీత్యాలు Act Of God అని అనకూడదేమో ఎందుకంటే మనిషి తన అవసరాల కోసమో,స్వార్ధం కోసమో చేస్తున్న కొన్ని పనుల కారణంగానే ఈ భూకంపాలు, సునామీలు, వరదల లాంటి భీభత్సాలు సంభవిస్తున్నాయని, దేవుడికి భక్తుడికి మధ్య ఉండాల్సింది భక్తి అనే వంతెన మాత్రమే కానీ బాబాలు, స్వామీజీలు,గురువులనే దళారులు కాదు అనేది  అందరూ అంగీకరించాల్సిన నిజం...  

ఇది సినిమా కాబట్టి సరిపోయింది కానీ నిజంగా దేవుడి ప్రతినిధులమని చెప్పుకునే కొందరు స్వామీజీలని చిన్న మాట అన్నా తట్టుకోలేని వారి అతి విదేయ భక్తులు,శిష్యులు  చాలా మందే  ఉంటారనుకుంటాను. ఇప్పటి రోజుల్లో అలాంటి స్వామీజీలు, గురువులని ఈ సినిమాలో లాగా చేస్తే "అనుకోకుండా ఒకరోజు" సినిమాలో ఛార్మి లాగా "నీడల్లే తరుముతు ఉంది" అని పాడుకోవాల్సి వస్తుందేమో.. 

ఇంతకీ ఇప్పుడు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే తెలుగులో  కూడా వెంకటేష్,పవన్ కళ్యాణ్ హీరోలు గా "గోపాలా గోపాలా" పేరుతో ఈ సినిమా రాబోతుంది. మన సినిమా ఎలా ఉంటుందో త్వరలోనే  చూద్దాం .. 


'వసతి వాసయతీతి వా వాసుదేవః'  
మనలో తానుగా ఉండేవాడూ,తాను మనలో ఉన్న కారణంగా 
మనల్ని జీవించి ఉండేలా చేసేవాడు ఆ భగవంతుడే.. 




Related Posts Plugin for WordPress, Blogger...