పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, ఫిబ్రవరి 2015, గురువారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 17



సరె..  ఛాలెంజ్ ఏంటో చెప్పండి మరి అన్నాను నేను.అప్పుడే చెప్తే అందులో మజా ఏముంది రా.(ప్రస్తుతం కిక్కు,కిక్కు దొబ్బటం అంటున్నట్టు అప్పట్లో మజా అనేవాళ్ళన్నమాట).అయినా నువ్వు చాలా స్తితప్రగ్నుడివి కదా ఛా ఏంటో ఇంత భారీ పదాలు మాట్లాడటానికి కూడా కష్టమే.. అదే "స్థితప్రజ్ఞుడు".  ఎలాంటి సిట్యువేషన్ అయినా నీ పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఫేస్ చేయగలవు కదా అందుకే వెయిట్ అండ్ సీ అంటూ అప్పటికి ఆ సమావేశం ముగించారు.

సమావేశం అయిపొయింది కానీ వాళ్ళ మాటలు నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి.వాళ్ళ పిశాచి మెదళ్ళలో ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారో ఏంటో?  కావ్య నన్ను హెల్ప్ అడగటం ఏంటో ? నేనిలా వీళ్ళలో ఇరుక్కోవట మేంటో అనుకుంటూ ఆలోచిస్తూ నిద్ర పట్టేసింది.అప్పటి నుండి ఏరోజు ఏమి చేస్తారో అని నా బ్రతుకు దినదిన గండంగా అయిపోయింది. మొత్తానికి ఎదురు చూసిన శుభ ముహూర్తం రానే వచ్చింది. 

ఆరోజు సాయంత్రం అందరం సరదాగా సినిమాకి వెళ్దాం రా మాధవ్ "నీకోసం" సినిమా చాలా బాగుందంట.నేను రానులే అనేంతలోపే ఏం మేమైతే నీ మాట వినాలి నువ్వు మాకోసం సినిమాకి కూడా రావా అన్నాడు సోహిల్.సరే పద వస్తాను అని అందరం బయల్దేరాము.నేను,పెద్ద మాధవ్ ఒక బైక్,హేమంత్, సోహిల్ దివాకర్ ఒక బైక్ మీద సినిమాకి బయల్దేరాము.అప్పటికే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరికీ బైకులు కొనేశారు .నేను కూడా ఇంక నాన్నని అడగాలి అని డిసైడ్ అయ్యాను.

మొత్తానికి టౌన్ కి దూరంగా ఉన్నసినిమా హాల్ కి సినిమా మొదలైన తర్వాత వెళ్ళాము .సినిమాలో హీరో ఎవరో రవితేజా అంట.ఆ చింపిరి గడ్డం,పొడుగు మొహం,అప్పటి మా అందరి ఫ్యాషన్ లాగానే ఒంటి మీద లూజుగా వేలాడేలా పొడుగు చెర్మాస్ షర్ట్స్ వేసుకున్నాడు హీరో. చిరంజీవి, వెంకటేష్,నాగార్జున,బాలకృష్ణలాంటి హీరోల సినిమాలే చూసిన నా కళ్ళకి వీడేమి హీరోరా నాయనా అనిపించింది.కానీ ప్రస్తుతం వస్తున్నకొందరు హీరోలని చూసి మళ్ళీ అప్పటి "నీకోసం" చూస్తే ఏంటో అప్పుడలా అనుకు న్నాం  కానీ వీళ్ళ కన్నారవితేజానే బాగున్నాడే  అనిపిస్తుంది ఇప్పుడు

సినిమా అంతా కొత్త కొత్తగా ఉంది.ఫ్యాక్షన్ కధలతో పాటూ అమ్మాయిల హాస్టల్ కి అబ్బాయిలు వెళ్ళటం,అబ్బాయిల రూమ్స్ కి అమ్మాయిలు  రావటం అంతా ప్రస్తుతం బయట జరుగుతున్నట్లే ఉంది స్టోరీ. కొన్ని సినిమాలు చూస్తే ఈ సినిమా వాళ్ళు ఎంత రిసెర్చ్ చేసి తీస్తారో కదా కొన్ని విషయాలు అనిపిస్తుంది.ఇంక హీరో ప్రేమించాడు కాబట్టి హీరోయిన్ ప్రేమించాల్సి వచ్చింది అన్నట్లు వుంది వాళ్ళ ప్రేమకధ.ఇద్దరి మధ్య ప్రేమ కలగాలంటే ఉండాల్సిన బలమైన కారణాలేమీ ఆ సినిమాలో కనపడలేదు. 

సినిమా చివరికి వచ్చేసరికి ప్రేమకోసం హీరోయిన్ తండ్రిని హీరో చంపటం అవసరమా అనిపించింది.అదే మాట సోహిల్తో అంటే నీ మనసులో నీ ఇష్టాలు కొన్ని నువ్వు ఫిక్స్ అయినట్లే వాడి మనసులో వాడూ అలా ఫిక్స్ అయ్యాడు ఏం చేస్తాం? అన్నాడు.వీళ్ళు ప్రతీమాట నన్ను టీజ్ చేస్తూ మాట్లాడటం నాకు రవితేజాకి వచ్చినంత పిచ్చికోపం తెప్పిస్తుంది. 

సినిమా అయిపొయింది.ఆహా క్లైమాక్స్ లో ఆ హీరోయిన్ హీరో కోసం ఎంత త్యాగం చేసింది?నిజంగా ఆడవాళ్ళంటే ఇలాగే ఉండాలి అనిపించింది. మళ్ళీ అందరం బయల్దేరాము. కొంచెం దూరం వెళ్ళగానే సోహిల్ బైక్ ఆగిపోయింది. చూస్తే పెట్రోల్ ట్యాంక్ ఖాళీ... అరె వచ్చేముందు నేను చూడలేదురా ఇప్పుడెలా అంటూ సోహిల్..  మాధవ్..  నువ్వు,పెద్ద మాధవ్ బైక్ దగ్గర ఉండండి .మేము దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ తీసుకువస్తాము. అంటూ మమ్మల్నిద్దరినీ వదిలి దివాకర్, సోహిల్,హేమంత్ వెళ్ళిపోయారు. 

సరేనని ఇద్దరం ఒక గంట వెయిట్ చేసినా వాళ్ళురావటం లేదు.ఇప్పటిలాగా అప్పుట్లో తలుచుకోగానే ఎవరు,ఎక్కడ,ఎలా?అని తెలుసుకునే సెల్ ఫోన్ లేదు కదా.. ఒక గంట తర్వాత పెద్ద మాధవ్ ఏంటి వీళ్ళింతసేపు రావట్లేదు?
కొంపతీసి ఏమన్నా జరిగిందా ఏంటి అసలే హైవే అంటూ కంగారుపడుతూ, 
నన్ను కంగారుపెడుతూ మాధవ్ ఇటువైపు ఇప్పుడు బస్సులేమీ రావు.నేను ఏదైనా లారీ ఎక్కేసి వెళ్లి చూసొస్తా నువ్వు ఉంటావా బైక్ దగ్గర భయమేమీ లేదు కదా అన్నాడు.సరే ఏమీ భయం లేదులే వెళ్లి చూసి త్వరగారా అనగానే అటుగా వస్తున్న లారీని ఆపేసి అందులోకి ఎక్కి వెళ్ళిపోయాడు పెద్దమాధవ్. 

గంట,రెండు గంటలు ఎంత గడిచినా వెళ్ళిన వాళ్ళు ఎవరూ రావటం లేదు.
నాక్కూడా కంగారు మొదలైంది.ఏమైంది వీళ్ళకి.దగ్గరలో మనుషులే కనపడటం లేదు.కూర్చోటానికి కూడా ఏమీ లేదు.చుట్టూ చీకటి,గజ్జెల శబ్దంలా కీచురాళ్ళ అరుపులు,చిన్నప్పుడు చూసిన దెయ్యం సినిమాలు,మా ఇంటి ఎదురుగా వేపచెట్టు మీద ఉన్న దెయ్యం అన్నీ వరసగా గుర్తొకొస్తున్నా యి.ఈ వేపచెట్టు మీద దెయ్యాన్ని నాకు పరిచయం చేసింది మా నానమ్మే! చిన్నప్పుడు ఎప్పుడైనా అన్నం తినక పోయినా, ఆమె చెప్పిన పని ఏదన్నా చెయ్యకపోయినా ఆ దెయ్యాన్నిపిలుస్తానని,ఆమె ఏమి చెప్తే దెయ్యం అది చేస్తుందని భయపెట్టేది.కానీ నేను పెద్దయ్యాక వివేకానందుడి స్ఫూర్తి నన్ను భయపడకుండా చేసింది.. అవునూ ఇంతకీ నాకు నిజంగానే భయం లేదా లేక నేను అలా అనుకుంటున్నానా? అనే సందేహం కూడా వచ్చింది ఆ క్షణం.. 

సరే దెయ్యం సంగతి అలా ఉంచి ఈ బైక్ తో ఇప్పుడు నన్ను ఏ పోలీసో చూసి ఈ బండి ఎక్కడిది? దీని కాగితాలు ఏవి అని పీక్కు తింటాడో  ఏంపాడో ..  చూద్దాం అంటూ బైక్ పైన పాకెట్ లో ఎంత వెతికినా నాకు బండి కాగితాలేమీ దొరకలేదు కానీ, ఒక చిన్న స్లిప్ కనిపించింది.తీసి చూస్తే ఏదో లెటర్. అది నాకే.. సోహిల్,హేమంత్ రాశారు.మాధవ్ "భయపడితే చచ్చినట్లే" అన్న నీ సూక్తి,అలాగే తలచుకుంటే ఎవరినైనా మార్చొచ్చు,ఏ పనైనా చేయించొచ్చు అనే నీ నమ్మకంతో, నువ్వు నా బైక్ తో సహా తెల్లారేసరికి మన రూమ్ కి రావాలి.పైసా డబ్బు ఎవరికీ ఇవ్వకూడదు,అయినా నువ్వు ఇవ్వలేవులే ఇందాకే నీ పర్స్ నేను తీసేశాను..! ఒక వేళ ఎవరినైనా రిక్వెస్ట్ చేసి పెట్రోల్ ఇప్పించుకున్నా నీకింకా పూర్తిగా బైక్ నడపటం రాలేదని మాకు తెలుసు.  అందుకే బైక్ అక్కడే వదిలేశాను.. సో ఏమి చేస్తావో ఆలోచించుకో. మాధవ్ ఇంకో విషయం అక్కడ దెయ్యాలు కూడా ఉన్నాయట జాగ్రత్త..ఇదే మన ఛాలెంజ్.

ఆ లెటర్ చదివిన నాకు తల తిరిగిపోయింది. తడిమి చూస్తే  నిజంగానే నాజేబులో పర్స్ లేదు.ఆ చీకట్లో లెటర్ లో రాసిన దెయ్యాల విషయం గుర్తొచ్చింది,ఆ సమయంలో కనపడని దెయ్యాల కంటే ఎదురుగా కనపడే మీరే చాలా ప్రమాదకరం రా అనిపించింది నాకు  ఆనలుగురి గురించి.ఇంక ఇప్పుడు ఏమి చేయాలి.నేనొక్కడిని అయితే ఎలాగో ఏదో ఒక లారీ రిక్వెస్ట్ చేసి ఎక్కొచ్చు.కానీ బైక్ ఎలా?సరే అయినా ఎవరినైనా లారీ వాళ్ళని అడిగి చూద్దాం అనుకుని ప్రయత్నాలు ప్రారంభించాను. కనీసం ఎవరు,ఏంటి అని కూడా చూడకుండా,ఆగకుండా వెళ్ళిపోతున్నారు.సాటి మనిషిని గురించి ఆలోచించే ఓపిక,తీరిక,కోరిక ఇప్పుడెవరికీ లేవని తెలిసినా ఆశతో ప్రయత్నిస్తూనే ఉన్నాను.కొంతమంది ఆపినా బైక్ ఎలా ఎక్కిస్తాం అంటూ వెళ్ళిపోతున్నారు.ఒకడైతే డబ్బెంత ఇస్తావ్ అని అడిగి,పర్స్ పోయిందనగానే కధలు చెప్పకు అంటూ వెళ్ళిపోయాడు.

ఇప్పుడెలా? తెల్లారేసరికి వెళ్ళకపోతే పోటీలో నేను ఓడినట్లే అనుకుని ఆలోచిస్తుండగానే పంజాబ్ వాళ్ళ లారీ ఒకటి వచ్చి ఆగింది.చాలా పెద్ద లారీ అది.అందులో నుండి దిగిన సిక్కు డ్రైవర్ ఏంటి బాబూ పరిస్థితి అని అడిగి నేను బండిలో పెట్రోల్ అయిపోయింది,పర్సు కూడా పోయింది అనగానే పెట్రోల్ నేను ఇవ్వనా అన్నాడు. నువ్వు పెట్రోల్ ఇచ్చినా నాకు డ్రైవింగ్ రాదయ్యా నాయనా అంటే  అనుమానం వస్తుందని కాదండీ బండి రిపేర్ కూడా ఉంది,ఇప్పుడు డ్రైవింగ్ చేయటం కూడా వీలవ్వదు అందుకే బండిని మీ లారీలోకి ఎక్కిస్తే నేను టౌన్ లో దిగి,రిపేర్ చేయిస్తా అన్నాను.. అబ్బో నాకు అబద్ధాలు చెప్పటం కూడా బాగానే వస్తుందే..అంటే సమయానికి తగు మాటలాడటం నాకు కూడా వచ్చు అనుకున్నాను మనసులో.

ఇంతలో ఆ సిక్కు డ్రైవర్ అలాగే భాయ్ బైక్ ఎక్కిద్దాం అంటూ వాళ్ళ క్లీనర్ని, ఇంకా బండిలో ఉన్న మరో ఇద్దరినీ పిలిచి ఏవో పెద్ద రాడ్స్ సహాయంతో మొత్తానికి బైక్ లారీలోకి ఎక్కించారు.పాపం నా బైక్ ఎక్కిస్తున్నప్పుడు ఆ డ్రైవర్ చేతి వాచ్ కూడా డామేజ్ అయ్యింది.అయినా ఏమీ అనలేదు. పాపం సిక్కులు ఎంత మంచివాళ్ళు అందుకే కదా దేశరక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల్లో ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు అనిపించింది.మొత్తానికి అక్కడి నుండి టౌన్ కి నా ప్రయాణం మొదలయ్యింది.

ఇప్పుడు టౌన్ లో దిగిన తర్వాత పరిస్థితి ఏంటి,ఈ బైక్ ని రూమ్ దాకా తోసుకుని వెళ్ళలేను,పైగా ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళ ప్రాబ్లం ఒకటి ఎవరన్నా పట్టుకుంటే ఇవ్వటానికి కనీసం పైసా కూడా లేదు."Dimag ki batti jala de" అనుకుని తీవ్రంగా ఆలోచిస్తే , Ek idea jo badal de aap ki duniya .. అంటూ ఒక ఐడియా వచ్చింది. (ఈ యాడ్స్ అన్నీ అప్పుడు లేవు ఇప్పటివే కానీ అప్పటి పరిస్థితికి తగినట్లు ఉన్నాయని వాడానన్నమాట.! చదువరులు గమనించగలరు )

ఐడియా వచ్చిన వెంటనే ఆ సర్దార్జీని భాయ్ ఏదైనా బైక్ సర్వీస్ సెంటర్ ముందు ఆపండి అంటూ బజాజ్ సర్వీస్ సెంటర్ ముందు ఆపించి, మానవత్వం ఇంకా మిగిలే ఉంది అనుకుంటూ డ్రైవర్ కి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పి,బైక్ ని సర్వీసింగ్ చేయించమని  సర్వీస్ సెంటర్లో ఇచ్చేసి, అడ్రెస్ చెప్పి బైక్ ఉదయాన్నేతెచ్చిస్తే ,అక్కడే డబ్బు ఇస్తానని చెప్పి,రూమ్ కి వెళ్ళిపోయాను.ఇప్పుడిలా చెప్పటానికి ఈజీగానే ఉంది కానీ ఆరోజు నేను పడ్డ టెన్షన్ దేవుడికే తెలుసు. 

నా ఫ్రెండ్స్ అప్పటికింకా రూమ్ కి రాలేదు .నన్ను అక్కడ ఇరికించి ఎక్కడ తాగి తందనాలు ఆడుతున్నారో వెధవలు అనుకుని,ఒళ్ళు మండిపోయింది.  ఇక ఇప్పుడు తీరిగ్గా కూర్చుని నా తెలివితేటలకి నేనే ఆశ్చర్యపోయాను. ఉదయం పది గంటల కల్లా సర్వీస్ చేయించి కొత్తగా మెరుస్తున్న బైక్ , నా నలుగురు ఫ్రెండ్స్ రూమ్ దగ్గరికి ఒకేసారి ఎంటర్ అయ్యారు.నన్ను,సర్వీస్ చేయించిన బైక్ ని చూసిన నా ఫ్రెండ్స్ కి నోటమాట రావటం లేదు.సోహిల్ బైక్ సర్వీసింగ్ చేయించినందుకు చచ్చినట్లు డబ్బు తీసి ఇచ్చాడు. నేను సరిగా గమనించలేదు కానీ ఆ క్షణంలో వాళ్లకి నా మీద కోపమో,కక్షో తీవ్ర స్థాయిలోనే ఉంది.

లోపలికి వస్తూ మాధవ్ ఏమో అనుకున్నాము నీకు చావు తెలివితేటలు చాలా ఉన్నాయే అన్నాడు సోహిల్.అంటే వాళ్ళ తెలివితేటలు మేధావులవి, నావి మాత్రం చావు తెలివి తేటలన్నమాట ఏంటో మనుషులు,మనస్తత్వాలు  అనుకుని, సోహిల్ నీ బైక్ సర్వీసింగ్ డబ్బులు నేను ఇచ్చేస్తాలే,నాకు ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తెలియలేదు.సరే ఇప్పుడు నేను గెలిచాను ఇప్పుడిక  నాకిచ్చిన మాట గురించి ఆలోచించండి అన్నాను. అలా నా చాలెంజ్ గెలిచిన ఆనందం నన్నునిలవనివ్వటంలేదు.ఆరోజు కాలేజ్ లేదు.కానీ ఈ విషయం కావ్యకి ఇప్పుడే చెప్పాలి .ఇంటికే వెళ్తాను,ఆంటీ ఏమనుకోరు కదా అనుకుంటూ కావ్య ఇంటికి బయల్దేరాను.


Related Posts Plugin for WordPress, Blogger...