పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

26, మార్చి 2015, గురువారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 20




మా చిన్నక్క ఇంటికి రాలేదని అందరూ టెన్షన్ పడుతుండగానే ఇక్కడ ఉంటె ఇంకా బంధువులకి ఏమేమి విషయాలు  తెలిసి, ఇంకా ఊర్లలో ఏ ప్రచారాలు జరుగుతాయో అని భయపడి,నాన్న,నాన్నమ్మ అందరినీ తీసుకుని ఊరికి బయల్దేరారు.ఎలాంటి పరిస్థితినైనా సరిదిద్దగలడనే సమర్ధుడైన  అన్నయ్య మీద మానాన్నకి గట్టి నమ్మకం కదా అందుకే చిన్నక్క విషయం ఏమీ భయంలేదులే, ఫ్రెండ్ ఇంటికే వెళ్ళింది,వచ్చేస్తుంది. అని అన్నయ్య ఇచ్చిన భరోసాతో సమస్యని అన్నకే వదిలిపెట్టి ఊరికెళ్ళారు నాన్న, నానమ్మ .వాళ్లటు వెళ్ళగానే మా అమ్మమ్మ పక్కింటికి పరిగెత్తింది, ఎందుకో నాకేమీ అర్ధం కాలేదు. 5 నిమిషాల తర్వాత తిరిగొచ్చిన అమ్మమ్మ పెద్దక్క,అమ్మతో రహస్యంగా చెప్పే విషయం ఏంటంటే "పక్కింట్లో ఉన్న అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడట".. పక్కింట్లో అబ్బాయి ఇంట్లోనే ఉండటానికి అక్క ఇంటికి రాకపోవటానికి కారణం  ఏంటి ?

అంతకుముందైతే డిమ్ బల్బ్ లా వెలిగినా వెలగనట్లుండే  నా మెదడు ఈమధ్య మా కాలేజ్ జనాలు,పరిసరాల పుణ్యమా అని కాస్త లేట్ గా అయినా ట్యూబ్ లైట్ లా వెలగటం మొదలెట్టింది.అలా వెలిగిన నా బుర్రకి అర్ధం అయిన విషయం ఏంటంటే పక్కింటి అతను,మా చిన్నక్కతో ఫ్రెండ్లీగా ఉండేవాడట,చదువులో ఏదన్న డౌట్స్ ఉన్నా,ఏదైనా సహాయం కావాలన్నా చేసేవాడట "అభిమానంతో".. కాబట్టి,ఇద్దరూ కలిసి ఎక్కడికన్నా వెళ్ళారా లేక... ? ఏంటి విషయం ? అని మా పెద్దల సందేహం.. ఎంతైనా  ఇలాంటివి ఈరోజుల్లోనే కాదు మన తాతముత్తాతల కాలం నుండి ఉన్నవే కదా..అందుకే మా పెద్దలకి కూడా సందేహం వచ్చింది..కానీ నాకు కోపం వచ్చింది. ఏంటీ మనుషులు సొంత అన్నకేమో చెల్లెళ్ళు అక్రమ సంబంధం అంట కడతారు! సొంత కూతుర్ని,మనవరాల్ని పక్కింటి అబ్బాయితో మాట్లాడిందని ఇప్పుడిలా అనుమానిస్తున్నారు అసలు మా పెద్దల ఆలోచనా విధానం కరెక్టేనా అనిపిస్తుంది. 

3 వ రోజు మధ్యానం మా చిన్నక్క ఇంటికి వచ్చింది.మా అమ్మమ్మ కోపంగా ఎక్కడికెళ్లావే,ఇంట్లో చెప్పాల్సిన పనిలేదా అంటూ కోపంగా అరుస్తూ ఇంకా సేపుంటే కొట్టేదే అనుకున్న సమయానికి అన్న అడ్డంవచ్చి ఉండమ్మా, ఏదో జరిగిపోయింది కదా!వదిలేయ్ ఇప్పటి నుండి చెప్పకుండా వెళ్ళదులే వదలమని అడ్డుకున్నాడు.అప్పటిదాకా అమ్మమ్మ గొడవకి అవమానంగా ఫీలవుతున్న మా చిన్నక్క..అన్న దగ్గరికి వెళ్లి చూడన్నా అమ్మమ్మ ఎలా మాట్లాడుతుందో? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మా, నాన్న పెళ్ళికి వెళ్ళారని తోడు ఉండమంటే ఉన్నాను,సరిగ్గా ఇప్పుడే వాళ్ళింట్లో ఫోన్ రిపేర్, అయినా మొన్న పెద్దక్కకి ఫోన్ చేసి చెప్పాను కదా అని మళ్ళీ ఫోన్ చేయలేదు, అన్న దగ్గర గారాలు పోతున్న చిన్నక్కని చూస్తే .. అన్నముందు ఇంత  ప్రేమగా మాట్లాడుతూ అన్నవెనక అన్నకి,కజిన్ భార్యకి లింక్ పెట్టి అవమానకరంగా మాట్లాడుతూ, మొన్న ఎంగేజ్ మెంట్ రోజు కూడా రుసరుసలాడుతూ తిరిగిన మనిషి తనేనా అన్నంత అనుమానం వచ్చింది నాకు.కానీ అదే "ఆర్ట్ ఆఫ్ లివింగ్"  అని ఆరోజు నాకు తెలియలేదు.మొత్తానికి ఆ సమస్య అలా ఆరోజుకి తీరింది.

ఇంక నేను కూడా రెండు రోజులు సెలవలు అయిపొవటంతో కాలేజ్ దారి పట్టాను.రూమ్ కి రాగానే అందరూ ఎంగేజ్ మెంట్ ఎలా జరిగింది అంటూ పలకరించి, మాధవ్ నువ్వు చాలెంజ్ గెలిచావు కదా అందుకే మేమందరం నీమాట విని ఇప్పటినుండి పార్టీలు,గీర్టీలు అన్నీ మానెయ్యాలి అనుకుంటున్నాము అన్నారు.ఆ మాటలు వినగానే నేను వింటున్నది నిజమేనా అనే సందేహం కలిగింది ఒక్క క్షణం.తర్వాత చాలా ఆనందం కలిగింది.థ్యాంక్స్ రా నా మాట విన్నందుకు అంటూ సంతోషంగా కాలేజ్ కి బయల్దేరాను,ఎప్పటిలాగే లంచ్ అవ్వగానే కావ్య,నేను లైబ్రరీలో కూర్చునుండగా కావ్య మా అన్న నిశ్చితార్ధం గురించి అడిగింది.బాగానే జరిగిందని చెప్పాను కానీ అక్కడ అన్న గురించి ఇద్దరు అక్కలు మాట్లాడిన మాటలు,తర్వాత చిన్నక్క చేసిన పని అన్నీ నా మనసులో అదోరకమైన బాధని కలిగిస్తున్నాయి. 

నా మూడ్ కనిపెట్టిన కావ్య ఏంటి మాధవ్ అలా ఉన్నావ్ అంది. నాకు చిన్నప్పటి నుండి ఉన్న బలహీనత ఎవరైనా ఏ  విషయమైనా  అడిగితే చాలు మనసులో ఉన్నదంతా చెప్పేదాకా ఆగలేను,ఇప్పుడు కూడా అలాగే కావ్య అడగ్గానే మా అన్న,కజిన్ భార్య సంబంధం గురించి,మా కజిన్ వాళ్ళ గృహప్రవేశం అప్పుడు మా అన్న డబ్బుతోనే వాళ్ళు ఆ ఇల్లు కట్టుకున్నారని, మా కజిన్ భార్య కోసమే ఆ డబ్బు మా అన్న ఇచ్చాడని మా అక్కలు ,అమ్మమ్మ,అమ్మ చెప్పుకున్నవిషయాల దగ్గరనుండి, మా చిన్నక్క ఎక్కడికో వెళ్లి, రెండురోజులు ఇంటికి రాని విషయం వరకు మొత్తం చెప్పేశాను. 


అంతా విన్న కావ్య మాధవ్ ఈ లోకం తీరే అంత.మనిషి వెనక ఎన్నైనా మాట్లాడతారు కానీ మనిషి ముందు ఏమీ బయటపడరు మంచి అనిపించు కోవాలి కదా మరి.. కానీ కొన్ని సార్లు మనసులో మాట చెప్పేస్తే ..తప్పకుండా గొడవలు వస్తాయి,ఎదుటి వాళ్ళ దృష్టిలో మనం  చెడ్డ వాళ్ళమౌతాము అందుకే కొన్ని విషయాలు అలా మనసులో ఉంచుకోవటమే మంచిది.కానీ ఇక్కడ మీ అన్న గురించి మీ అక్కలు అలా మాట్లాడటం తప్పే అనిపిస్తుంది. మీ అన్న తీసుకెళ్ళకపోతే  కాలేజ్ కూడా వెళ్ళని చిన్నక్క అతని గురించి ఇలా ఆలోచిస్తుందని తెలిస్తే ఎంత బాధపడతాడో కదా!ఒక ఆడ మగ క్లోజ్ గా మూవ్ అయ్యి,అన్ని విషయాలు షేర్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళ మధ్య చెడు సంబంధం ఉందని ఎందుకనుకోవాలి?ఇంక మీ పెద్దలు మీ అక్కల మాటలు విని కొడుకుని అనుమానిస్తారు, అదే అక్క ఒక్కరోజు ఇంటికి రాకపోతే పక్కింటి అబ్బాయితో కలిపి మీ అక్కని కూడా అనుమానిస్తారు. అంటే మీ పెద్దలకి వాళ్ళ సొంత పిల్లల మీదే అనుమానమా?ఇది వాళ్ళ పెంపకాన్ని వాళ్ళే అనుమానించుకున్నట్లు కాదా?


అయినా మీ పెద్దలు అనుమానించినట్లు మీ కజిన్ భార్యకి మీ అన్న డబ్బుతో ఇల్లు కట్టుకోవాల్సిన అవసరమేంటి? అంత పెద్ద బ్యాంక్ ఉద్యోగి అయిన మీ కజిన్ సంపాదన కంటే నిన్న మొన్న ఉద్యోగంలో చేరిన మీ అన్న జీతం ఎక్కువా?ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాల్ని బట్టి చూస్తే వాళ్ళే మీ కంటే ముందు హైదరాబాద్ లో స్థిరపడి ఉన్నారు,వాళ్లకి మీ అన్న డబ్బు ఆశించాల్సిన అవసరం ఉంటుందని నేననుకోను.నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట.. మీ వాళ్లకి "మేమే అందరికంటే గొప్ప, అందరూ మాకంటే పనికిమాలిన వాళ్ళే" అనిపించే సుపీరియారిటీ  కాంప్లెక్స్ ఎక్కువనుకుంటా ..!తప్పు ఎవరు చేసినా తప్పే మాధవ్ అది మీ పెద్దలైనా సరే..

సంస్కారాలు,జ్ఞానోదయాలు బయటివాళ్ళకి నేర్పటం కాదు ముందు మనకి,మన కుటుంబ సభ్యులకి ఆ సంస్కారం ఉందా,లేదా చూసుకోవాలి! "ఇంట గెలిచి రచ్చ గెలవాలి" అంతే  కానీ "ఉట్టికెగర లేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు" ఇంట్లో చెత్త ఇంట్లోనే పెట్టి,నలుగురూ చూసే రోడ్డు శుభ్రం చేసినట్లు బయటికి నీతులు,విలువలు భోధించగానే సరిపోదు, ముందు మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే ఎదుటివాళ్ళకి చెప్పాలి. మాధవ్ నేనేదో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడినట్లు అనుకోకు..ఇంకో సంవత్సరం తర్వాత  మనం సమాజంలో వైద్యులుగా పిలవబడతాం.బాధ్యతాయుతమైన ఒక వృత్తికి సంబంధించిన చదువు చదువుతున్న మనం ఈ మాత్రం ఆలోచించగలగాలి. 

నువ్వింకా మీ ఇంట్లో అందరి కన్నా చివర పుట్టిన చిన్న మాధవ్ కాదు డాక్టర్ మాధవ్ అది గుర్తుంచుకో..అంటూ సారీ నా మాటలతో నిన్నేమన్నా బాధపెట్టానా? ఎదో అలా మాట్లాడేశాను ఏమీ అనుకోకు..  అంటున్న కావ్య మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి.అంతకుముందు మా పెద్దల్ని ఎవరైనా ఏమన్నా అంటే చాలాకోపం వచ్చి బాధ అనిపించేది.కానీ ఇప్పుడు కావ్య మాటలు కోపం తెప్పించకపోగా నిజమే కదా అనిపిస్తున్నాయి.దీనికి కారణం మా పెద్దల ప్రవర్తనేనా?

సరే వెళ్దామా అంటున్న కావ్య మాటతో ఆలోచన నుండి బయటికి వచ్చిన నేను అదేమీ లేదు కావ్యా నువ్వు మంచి మాటలే కదా చెప్పావు అంటూ చెప్పటం మర్చిపోయాను. హేమంత్  తో సహా మా రూమ్మేట్స్ అందరూ నేను ఛాలెంజ్ గెలిచాను కాబట్టి ఇప్పటి నుండి పార్టీలు,బార్ లు మానేస్తామని  నాతో చెప్పారు. అంటూ చాలా సంతోషంగా కావ్యతో చెప్పగానే కావ్య నవ్వుతూ మాధవ్ ఈ అమాయకత్వమే ఇక నుండైనా వదులుకో..వచ్చే సోమవారం నుండి పరీక్షలు కదా.. ఆ విషయం మర్చిపోయావా ? అందుకే వాళ్ళు అన్నీమానేసి చదువుకోవాలని ట్యూషన్స్ కూడా మాట్లాడుకున్నారు, నీతో చెప్పారా ట్యూషన్ విషయం? 

కావ్య మాటలు వినగానే నేను మళ్ళీ వాళ్ళ చేతిలో ఫూల్ అయ్యానని అర్ధమయ్యింది.ఛీ మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు వాళ్ళ స్వార్ధమే వాళ్లకి ముఖ్యం కానీ ఎదుటి మనిషి ఫీలింగ్స్,బాధలు,ఆలోచనలు ఎవరికీ పట్టవా?ఎగ్జామ్స్ కోసం ట్యూషన్ పెట్టించుకొని కనీసం ఆ విషయం కూడా చెప్పకపోగా నామీదే మళ్ళీ జోక్స్ వేసి నవ్వుకుంటూ ఉండి ఉంటారు.కొంత మంది మనషులకి తమలాగానే ఆలోచించని వాళ్ళని,మీరే గొప్ప అంటూ జేజేలు పలకని వాళ్ళని చూస్తే అదొక ఈర్ష్య,వాళ్ళ ఆలోచనలతో మనం సరిపోయామా సరేసరి, లేదా ఏంటి వీడిగొప్ప,మనమంతా కలిస్తే వీడెంత అన్నట్లు,ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు ఇలాంటి కాకిమూకంతా ఒక చోట చేరి తమకు విభిన్నంగా కనపడే వాళ్ళని పొడుచుకుతినటమే అలాంటి కుళ్లుబోతుల లక్షణం. 

ఆ క్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటినుండి ఎవరి మాటనీ వినగానే నమ్మకూడదు.ఎవరు తప్పు మాట్లాడినా వెంటనే ఖండించాలి. చివరికి అది  మా పెద్దలైనా సరే..!



24, మార్చి 2015, మంగళవారం

"మానస సంచర రే" - అక్కడక్కడా పనికిమాలిన విషయాలలో అదేపనిగా తిరిగే ఓ మనసా !




కొన్ని పాటలు,మాటలు వినటానికి చాలా బాగుంటాయి,వింటుంటే మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి .. వాటిలోని  అసలైన అర్ధాన్ని తెలుసుకుని వింటే మరింత నచ్చుతాయి,ఎప్పటికీ మనసులో అలా గుర్తుండిపోతాయి.."మానస సంచర రే"  గీతం  అందరికీ తెలిసినదే కానీ ఆ పాటకి అర్ధం మాత్రం  నెట్ లో డా . తాడేపల్లి పతంజలి గారి "తెలిసిన పాటలు - తెలియని మాటలు" వివరణ చూసి, ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను.. 


"మానస సంచర రే" - నాకు అర్ధమైన అర్ధ వివరణలు

"రే" - ఒరేయ్ (తక్కువ వారిని పిలవటానికి ఉపయోగించే పదం ) తో 
మనసును "రే" అని సంభోదిస్తూ .. 

అక్కడక్కడా పనికిమాలిన విషయాలలో అదేపనిగా తిరిగే ఓ మనసా! 

శ్రీకృష్ణ పరబ్రహ్మానికి సంబంధించిన విషయాలు వింటూ,చదువుతూ అందులోనే ఆనందాన్ని అనుభవించు.

ఓ మనసా సంతోషంతో నాట్యంచేసే నెమలి పింఛాన్ని అలంకరించుకున్న తల వెంట్రుకలు కలిగిన శ్రీ కృష్ణుని ధ్యానించు.

తనను కొలిచే వారికి మందార కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చే శ్రీ కృష్ణుని యందు మనస్సు నిలుపు.

కష్టమనే  గ్రీష్మానికి ఎండిపోయిన హృదయాలయందు పిల్లనగ్రోవి అనే  తీయని ప్రవాహాన్ని నింపే శ్రీ కృష్ణుని నిరతము ధ్యానించు.. 

అంటూ ఇంకా చాలా మంచి వివరణలతో ఉన్న ఈ  పాట చాలా బాగుంది. 


మానస సంచర రే ..



మానస సంచర రే .. మానస సంచర రే
బ్రహ్మణి  మానస సంచర రే 
మానస సంచరరే బ్రహ్మణి  మానస సంచర రే

మదశిఖిపింఛా  అలంకృత చికురే
మహనీయ కపోల విజితముకురే

మానస సంచరరే బ్రహ్మణి  మానస సంచర రే 
బ్రహ్మణి  మానస సంచర రే
మానస సంచరరే బ్రహ్మణి  మానస సంచర రే

శ్రీరమణీకుచ దుర్గవిహారే
సేవక జనమందిర మందారే

మానస సంచరరే బ్రహ్మణి  మానస సంచర రే 
 బ్రహ్మణి  మానస సంచర రే
మానస సంచరరే బ్రహ్మణి  మానస సంచర రే

పరమహంస  ముఖ చంద్రచకోరే
పరిపూరిత మురళీరవ ధారే

మానస సంచరరే బ్రహ్మణి  మానస సంచర రే 
బ్రహ్మణి  మానస సంచర రే
మానస సంచరరే బ్రహ్మణి  మానస సంచర రే


21, మార్చి 2015, శనివారం

ఉగాది శుభాకాంక్షలు


శ్రీ మన్మధనామ సంవత్సర 
ఉగాది శుభాకాంక్షలు


నవ వసంతుని వెంట గొని 
ఇల నడచి వచ్చెను ఉగాది 





14, మార్చి 2015, శనివారం

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 19




అన్నయ్య  నిశ్చితార్దానికి వెళ్ళటానికి రెడీ అవుతున్న నన్ను హేమంత్ వచ్చి మాధవ్ రేపు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది కదా రేపు మధ్యానం నుండి వెళ్ళినా రాత్రికల్లా హైదరాబాద్ వెళ్ళిపోతావు.ఎల్లుండి ఉదయం కదా నిశ్చితార్ధం పైగా అక్కడ నువ్వు లేందే పూర్తి కాని పనులేమీ లేవు కదా అన్నాడు. అంటే ఏంటి వీడి ఎగతాళి నాతో? మా వాళ్లకి నా అవసరమేమీ లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు ..అందుకే ఇంటి విషయాలు ఎవరి దగ్గరా మాట్లాడకూడదు. సరేలే ఎలాగు రేపు క్లాస్ ముఖ్యమైనదే కాబట్టి క్లాస్ కి వెళ్లి,అలాగే కావ్యకి కూడా ఒక మాట చెప్పి, మధ్యానం నుండి వెళ్దాం అనుకున్నాను నేను కూడా ..రెండో రోజు ఉదయమే కాలేజ్ కి వెళ్లి,కావ్యకి విషయం చెప్పగానే చాలా హ్యాపీగా, అన్నయ్యకి కంగ్రాట్స్ చెప్పమని చెప్పింది.ఇంక మధ్యానం రూమ్ కి వచ్చీ రాగానే అన్నం కూడా సరిగా తినాలనిపించని ఆనందంలో నా లగేజ్ తీసుకుని,హేమంత్ బైక్  మీద బస్టాండ్ కి వెళ్ళి హైదరాబాద్ బస్ ఎక్కేసాను. 

అన్నయ్య ఎంగేజ్ మెంట్ గురించి ఆలోచిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో మొదటి పెళ్ళి,అందరూ చాలా సంతోషంగా ఉండుంటారు.ఇంతకీ ఆ అమ్మాయి ( కాబోయే వదిన ) ఎవరో? మా వాళ్ళు నాకే విషయాలు ముందే చెప్పరు కదా.. అయినా మా పెద్దలు ఏ  పని చేసినా ఆచి,తూచి జాగ్రత్తగా చేస్తారు.. అలాగే ఈ సంబంధం కూడా అన్ని విధాలుగా సరిపోయిందే అయ్యుంటుంది.మా అన్నయ్య ఆరోజుల్లోనే ఇంజినీరింగ్ చదివి ఇంజినీర్ గా హైదరాబాద్ లో ఉద్యోగం  చేయటమంటే మాటలా?ఈ మాటే నేనోసారి సోహైల్ తో అంటే  అరేయ్ మాధవ్ నువ్వేంట్రా నీ అన్నయ్య ఒక్కడే ఇంజినీర్ అన్నట్లు మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో ఇంటికో ఇంజినీర్ ఉంటున్నాడు అని ఎగతాళిగా మాట్లాడాడు.వాడు వాడి కుళ్ళు చేష్టలు!అయినా ఎవరి గొప్ప వాళ్ళది.వాడికెందుకో అంత కడుపుమంట?ఇలా ఏవేవో ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపట్టేసిన  నాకు హైదరాబాద్ వచ్చింది అని కండక్టర్ కేకలకి మెలకువొచ్చింది. 

అప్పటికి రాత్రి పదకొండయ్యింది.ఇప్పుడు ఫోన్ చేసి అన్నయ్యని రమ్మన్నా రాడు,ఎందుకులే అదేదో నేనే వెళ్దామని ఆటోని పిల్చి విజయనగర్ కాలనీకి అని చెప్పి కూర్చున్నాను.ఇందాక నయం హేమంత్ పాపం పని మానుకుని వచ్చి మరీ నన్ను బస్ దగ్గర దింపాడు అని మనసులో అనుకుని,అంతలోనే సరేలే.. అదంటే ఏదో చిన్న టౌన్ కాబట్టి హేమంత్ వచ్చాడు. పాపం అన్న ఇంత  పెద్ద సిటీలో  ట్రాఫిక్ లో రావటమంటే కష్టం కదా నా అన్న గురించి నేనిలా అలోచించొ చ్చా అని నా మనసుకు సర్ది చెప్పుకున్నాను.ఛీ ఈ మనసు ఎప్పుడూ ఇంతే అనవసర విషయాల గురించి ఎక్కువగా అలోచించి, మనకి మనమే బాధపడేలా చేస్తుంది.సిటీలోకి అరగంట పైనే ప్రయాణించిన తర్వాత VNC అని పిలవబడే విజయనగర్ కాలనీకి వచ్చింది ఆటో.. దిగి ఆటోకి డబ్బులిచ్చి లోపలి వెళ్లాను. 

అక్కలు,అమ్మ,అన్న అందరూ ఎవరి రూమ్స్ లో వాళ్ళున్నారు.అక్కడే హాల్లో ఉన్న నాన్నమ్మ ఏమి నాయనా ఎట్టా వచ్చావు? ఇప్పుడు బస్ లు ఉన్నాయా  అంది.లేవు నాన్నమ్మా ఆటోలో వచ్చా అనగానే ఆశ్చర్య పోయినట్లుగా అరుస్తూ ఆటోలోనా? ఎన్ని డబ్బులు వదిలించుకున్నావు? అయినా బస్సులో అయితే ఒక పది రూపాయల్తో వచ్చేవాడివి కదా అంటున్న నాన్నమ్మని చూస్తే పిచ్చి కోపం వచ్చింది.మనసులో.. నీకు అటో,బస్సుల రేట్ల తేడా గురించి కూడా తెలిసిందా? అయినా నీ సొమ్మేం పోయింది? ఏమైనా చెప్తావు,ఆ సిటీ బస్సుల్లో దారి తెలియక తప్పిపోతే నా చావుకొస్తుంది అనుకునేలోపే అక్కడికొచ్చిన నాన్న ఇప్పుడు బస్సులుండవులేమ్మా అంటూ నన్ను బతికించాడు. ఏంటి మాధవ్ ఎలా ఉంది చదువు? ఎక్జామ్స్ ఎప్పుడు అంటూ భోజనం చెయ్యి, అని నాన్న అనేలోపే బయటికి వచ్చిన అమ్మ మాధవ్ అన్నం తిందువుగాని రా.. అంటూ పిలిచింది.

ఇంతకీ నేను గమనించనేలేదు ఇంట్లో ఫంక్షన్ హడావుడే లేదు.అదే మాట అమ్మనడిగితే ఫంక్షన్ అమ్మాయి వాళ్ళింట్లో కదా ఇక్కడేముంది అంది.నిజమే కదా అనుకుని తిని,అన్నయ్యని కూడా పలకరించి, నిద్రపోయాను. ఉదయాన్నే అమ్మ పిలుపుకి లేచిన నాకు అసలే ఎప్పుడూ స్టైల్  గా ,నీట్ గా ఉండే అన్నయ్య మంచి  డ్రెస్ వేసుకుని తయారయ్యి, ఆరోజు పెళ్లికళ లో ఇంకా మెరిసిపోతూ ఎదురుగా కనిపించాడు.అన్నయ్యని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.ఇప్పుడు సరిగా గుర్తులేదు కానీ కళ్ళలో ఆనంద భాష్పాలు కూడా వచ్చినట్లున్నాయి.నేను కూడా ఫ్రెష్ అయ్యి,బయటికి వచ్చేసరికి మా పెద్దక్క,చిన్నక్క,అమ్మ,మా కజిన్,వదిన (కజిన్ భార్య) అందరూ అమ్మాయి వాళ్ళింటికి తీసుకెళ్ళాల్సిన వస్తువులను సర్దుతూ బిజీగా కనిపించారు.ఆ దృశ్యం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.ఇంతలో నాన్నమ్మ తన సహజ శైలిలో వీళ్ళంతా కలిసి ఆర్భాటాల కోసం డబ్బు వృధా చేస్తారో ఏమో అని కంగారు పడుతూ ఇదెందుకు,అదెందుకు అంటూ మధ్య మధ్య అందర్నీ అదిలిస్తూ ఉంది. 

ఇంతలో మా కజిన్ భార్య (వదిన) అబ్బా..మామ్మగారూ  చిన్న చిన్న విషయాల దగ్గర కక్కుర్తి పడితే మనల్ని వాళ్ళు లేకిగా అనుకుంటారు.వాళ్ళేమన్నా తక్కువ వాళ్ళా మనకంటే వాళ్ళ హోదానే ఎక్కువ.అందుకని మీరేమీ కంగారు పడకండి అన్నీ మేము  చూసుకుంటాము కదా అంది.వాళ్ళ మాటల్లో నాకు అర్ధమయిన విషయం  ఏంటంటే  అమ్మాయి వాళ్ళ నాన్న ఏదో పెద్ద బిజినెస్,అమ్మాయి కూడా B.tech చదివింది.మా కజిన్,వదిన వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు కూడా.అన్నయ్య కజిన్ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు జరిగిన పరిచయం పెళ్లిదాకా వచ్చింది.మా అన్నని చూసి నచ్చిన అమ్మాయి పెద్దలే  ఈ పెళ్లి సంబంధం గురించి మాట్లాడారట మా వదిన ద్వారా.. అయినా మా అన్నయ్య నచ్చని అమ్మాయిలూ ఉంటారా?

ఇంతలో నాకు పోయినసారి మా కజిన్ భార్య గురించి మా అక్కల మాటలు గుర్తొచ్చి,అక్కడే ఉన్న పెద్దక్క దగ్గరికి వెళ్లి,అక్కా పోయినసారి అన్నయ్య గురించి ఏదేదో మాట్లాడారు.మీరు చెప్పిన శృతిలయలు సినిమా కూడా చూశాను. నిజంగా అలాంటి విషయం ఉంటే  ఇప్పుడు ఆవిడే అన్నయ్యకి సంబంధం ఎందుకు మాట్లాడుతుంది అన్నాను. మాధవ్ నీకేమీ తెలియదులే ఇదీ ఒక ప్లానే.. అయినా నీకెందుకు ఆ విషయాలన్నీ?తెలివితక్కువగా ఎక్కడపడితే అక్కడ మాట్లాడకు అంటూ అక్కసుగా మాట్లాడుతూ పెద్దక్క.నన్ను కసిరింది చిన్నక్క మాత్రం ఎందుకో చాలా అనీజీగా అక్కడుండటమే ఇష్టం లేనట్లు పక్కకెళ్ళిపోయింది.నిశ్చితార్ధమే కదా అని ఎక్కువ బంధువులెవర్నీ పిలవలేదు నాన్న.మా దగ్గరి బంధువులు కొందరు,మా ఫ్యామిలీ అంతా ఉదయం పదింటికల్లా పెళ్ళికూతురు ఇంటికి బయల్దేరాము.పెళ్ళికూతురు వాళ్ళు నిజంగానే బాగానే ఉన్నవాళ్ళు.వాళ్ళముందు మేము చాలా తక్కువగానే  అనిపించాము. 

ఎంత ఊళ్లలో పొలాలు,ఆస్తులున్నా మా వాళ్ళసలే ఆడంబరాలకి దూరంగా ఉంటారు కదా.. సిటీలో మెయింట్ నెన్స్ వేరేగా ఉంటుంది.మా వాళ్ళు కూడా అలా  ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన కానీ వాళ్ళు వింటేగా. మేము ఇప్పుడే ఆడంబరాలకి పొతే మీరు రేపు మాకేమి మిగిల్చారు అంటారు నాయనా అంటుంది మా నాన్నమ్మ. మమ్మల్ని సంతోషంగా రిసీవ్ చేసుకుని,అతిధి మర్యాదలయ్యాక, అప్పట్లో ఇప్పటిలాగా నిశ్చితార్దానికి ముహుర్తాలు ఉండేవి కాదు కాబట్టి పూజారి రాగానే కార్యక్రమం మొదలుపెట్టారు.ఇద్దరి తరపు  పెద్దలు తాంబూలాలు, అమ్మాయి, అబ్బాయి మంచి కాస్ట్లీ ఉంగరాలు మార్చుకుని,నిశ్చితార్ధ మహోత్సవం పూర్తి  చేశారు.మా అన్నని,పెళ్ళికూతుర్ని చూస్తుంటే ఎప్పటినుండో పరిచయం ఉన్నవాళ్ళలాగానే అనిపించారు.ఎంతైనా సిటీ కల్చర్ కదా.. భోజనాలయ్యాక పెళ్లి  ముహూర్తం పంతులుగారిని అడిగి మేమే చెప్తాము,ఎప్పుడంటే అప్పుడు లగ్నపత్రిక రాసుకుందాం అన్నారు అమ్మాయివాళ్ళు.సరేనని ఇంటికి బయల్దేరాము.ఈ వేడుక మొత్తం తానే అయ్యి సందడిగా తిరుగుతూ నిశ్చితార్ధం జరిపించిన మా కజిన్ భార్యని చూస్తుంటే మా అన్నకి,ఆవిడకి ఏదో తప్పుడు సంబంధం ఉందనుకుంటున్న మా అక్కల్ని చూస్తే నాకెందుకో  పిచ్చికోపం వచ్చింది.

ఇంటికి వచ్చేసరికి చీకటి పడిందని,అందరం ఉదయాన్నేవెళ్ళొచ్చులే అనుకుని నాన,నాన్నమ్మ,బంధువులు కూడా ఉండిపొయ్యారు.ఇంతలో ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసిందని వెనకనుండి నాన్నమ్మ ఎక్కడికమ్మీ చీకట్లో అని పిలుస్తున్నా వినిపించుకోకుండా చిన్నక్క వెళ్ళిపోయింది.మాధవ్ నువ్వు వెళ్ళు తోడు అనగానే బయటికి వచ్చిన నాకు చిన్నక్క ఎక్కడా కనపడలేదు.సరే తనే వస్తుందిలే అనుకుని అందరం భోజనాలు చేసి,టైం పన్నెండు అయినా చిన్నక్క ఇంటికి రాలేదు.కంగారుగా అక్క ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తూ,పెద్దక్క ఎవరో తన ఫ్రెండ్ ఇంటికి ఫోన్ చేయగానే తను అక్కడే ఉన్నానని,ఉదయాన్నే వస్తానని చెప్పిన చిన్నక్క తెల్లారి కాదు కదా రెండోరోజు రాత్రికి కూడా అక్కడే ఉండి,ఇంటికి రాలేదు. ఈ విషయం గురించి మా అన్న,పెద్దక్క,అమ్మ,అమ్మమ్మ ఏమంత టెన్షన్ పడినట్లు నాకనిపించలేదు అంటే ఇంతకుముందు కూడా ఇలాగే చేసేదేమో చిన్నక్క..అందుకే రోజూ అక్కడ ఉంది చూసే వాళ్ళు కాబట్టి పెద్ద కంగారేమీలేదు వాళ్ళలో.. కానీ ఇదంతా కొత్తగా చూస్తున్న మా నాన్న,నాన్నమ్మ పరిస్థితే వర్ణనాతీతం.

ఈ పరిస్థితి మావాళ్లకేమో కానీ నిశ్చితార్దానికి వచ్చిన మా బంధువుల్లో మాత్రం ఆసక్తిని రేపింది.బంధువులు రాబందులు అని ఎందుకు అంటారో నాకు అప్పుడే అర్ధం అయ్యింది .ఒక పక్క విషయం ఏమిటా అని మేము భయపడుతుంటే ఎదిగిన ఆడపిల్ల పరాయి ఇంట్లో రెండురోజులు ఉండటమా?? సిటీలో ఉండి,వీళ్ళువెలగబెట్టే పనులు ఇవన్నమాట అంటూ చాటుగా  బంధువులు వాళ్ళలో వాళ్ళు చెవులు కొరుక్కోవటం ఎక్కువయ్యింది.ఎప్పుడూ ఆ అమ్మాయి ఇట్టా,ఈ  అబ్బాయి అట్టా అని ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి,వాళ్ళ పెద్దల పెంపకాన్ని, అటేడుతరాలు, ఇటేడుతరాల్ని కూడా దుమ్మెత్తిపోసే మా పెద్దలకి మా చిన్నక్క చేసిన పని బంధువుల ముందు ఘోర అవమానం జరిగినట్లయింది. "మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు" అన్నట్లున్న మా పెద్దల  పరిస్థితి నాకు చాలా బాధ కలిగించింది.ఒక సంతోషం వెంటనే మరో సమస్య  "ఇంతేరా  ఈ జీవితం తిరిగే రంగులరాట్నము" పాట  మళ్ళీ ఎక్కడినుండో వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది నిజమేనా నా భ్రమా ?? 




8, మార్చి 2015, ఆదివారం

మహిళ – సమాజంలో ఎలా ఉండాలి - Article in Mana Telugu Times




మహిళా దినోత్సవం సందర్భంగా నేను రాసిన వ్యాసం manatelugutimes లో ప్రచురించారు.అంతమంది రచయితల మధ్యలో నా వ్యాసం చూసుకోవటం చాలా సంతోషంగా ఉంది. 
Thank You So Much Mana Telugu Times Team  
మహిళ – సమాజంలో ఎలా ఉండాలి - http://www.manatelugutimes.com/archives/1037

 "ఆడదే ఆధారం మన కధ  ఆడనే ఆరంభం ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం." ఇది ఒక సినిమా పాట మాత్రమే కాదు అక్షరసత్యం కూడా. పురాణ కాలం నుండి ఇప్పటిదాకా స్త్రీ ప్రధాన పాత్ర పోషించని చరిత్రే లేదంటే  అతిశయోక్తి కాదేమో.మంచి సమాజానికి మూలం మంచి కుటుంబం అయితే  ఆ మంచి కుటుంబానికి మూలం మంచి మహిళ మాత్రమే. తల్లిగా, బిడ్డగా, తోబుట్టువుగా,భార్యగా,స్నేహితురాలిగా ఇలా ఎన్నో రూపాల్లో మగువ లేని ప్రపంచాన్ని ఊహించలేము.

ఒకప్పుడు స్త్రీని వంటింటి కుందేలుగా ఉంచేశారని,మహిళలకి తీరనిఅన్యాయం జరుగుతుందని భావించిన కొందరు అభ్యుదయ భావాలు కలిగిన సంఘ సంస్కర్తలు,మేధావులు ఎన్నో శ్రమలకోర్చి ఒకప్పటి దురాచారాలైన సతీ సహగమనం ,బాల్య వివాహాలు,కన్యాశుల్కం లాంటివి నిర్మూలించి వాటి స్థానంలో వితంతు వివాహాలు,స్త్రీ విద్య లాంటి ఎన్నో మంచి కార్యక్రమాలను ప్రోత్సహించారు,మహిళల రక్షణ కోసం తగిన చట్టాలను చేసి, స్త్రీలకు సముచిత స్థానాన్ని, గౌరవాన్ని కల్పించి ఒక గొప్ప మార్పుకు కారణమయ్యారు.కానీ ప్రస్తుత పరిస్థితులని చూస్తే ప్రతి మార్పు మంచితో పాటు చెడుకు కూడా స్థానం కల్పిస్తుంది అనిపిస్తుంది.

మా అమ్మమ్మ కాలంలో ఆడపిల్లలు పెళ్లి కాగానే,పుట్టింటి వాళ్ళు పెట్టిన పసుపు-కుంకుమ,చీరె- సారే చూసుకుని మురిసిపోయి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత కూడా , అటు పుట్టిల్లు,ఇటు మెట్టిల్లు క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళమని, పుట్టింటి ఆస్తులను ఆశించే వాళ్ళము కాదని మా అమ్మమ్మ చెప్పేది. కానీ తర్వాత కాలంలో వచ్చిన NTR's women's right on father's property(1985) కుటుంబానికి సంబంధించిన ఆస్తుల విషయంలో ఎన్నో వివాదాలకి కారణమయ్యింది. అప్పటిదాకా ఇచ్చిన కట్నంతో తృప్తి పడే ఆడపిల్లలు అటు అత్తింటి వాళ్ళ ఒత్తిడివల్ల కానీ,వాళ్ళ ఇష్టపూర్వకంగా కానీ ఆస్తుల కోసం పుట్టింటి గడపను వదిలి కోర్టుల  గడపను తొక్కుతున్నారు.ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువయ్యింది.రియల్ ఎస్టేట్ పుణ్యమా అని ఊహించని రీతిలో ధరలు పెరిగిన భూముల కోసం తల్లిదండ్రుల మీద, తోడబుట్టిన సోదరుల మీద partition suit (విభజన దావా) కోసం  కోర్టులకి వస్తున్న ఆడవాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.ఆశ  ఉండొచ్చు కానీ అది దురాశ కాకూడదు కదా.. !

"సేవలతో అత్తమామ సంతసించగా పదిమందిని ఆదరించు కల్పవల్లిగా" మహిళ ఉండాలని, ఆమే ఆదర్శ మహిళ  అని ఒకప్పటి అభిప్రాయం కానీ ప్రస్తుతం పదిమందిని ఆదరించటమేమో కానీ ఇప్పుడు కుటుంబమంటే  భార్యా,భర్త,వాళ్ళ పిల్లలే.ఒకవేళ ఎవరైనా ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు అంటే..  ఎంత కలిసి ఉన్నా మనసుల్లో  ఎన్నో బేధభావాలు తప్పకుండా ఉంటాయి.దేవత సినిమాలో సావిత్రిలాగా మాకు సేవలు చేయకపోయినా పర్లేదు కానీ మా మీద ఏ 498 (a )కేసో పెట్టకపోతే చాల్లే అనుకునే తల్లిదండ్రులు,అక్కచెల్లెళ్ళు,అన్నదమ్ములు ఉన్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.కేవలం ఇలాంటి కేసులకి భయపడి,దూరంగా ఉంటేనే మంచిదనుకుని గత్యంతరం లేక కన్నకొడుకుని,తోబుట్టువుల్ని వదులుకుని ఎవరికీ వారే అన్నట్లు ఒంటరిగా ఉంటున్న కుటుంబాలు  ఎన్నో..

కుటుంబ హింసకి సంబంధించి నిజంగా హింసకి గురయిన ఆడవాళ్ళు చట్టాన్ని ఆశ్రయిస్తే మంచిదే కానీ, కేవలం భర్తని బెదిరించి లొంగదీసు కోవటానికి,అతని కుటుంబ సభ్యుల మీద కక్ష తీర్చుకోవటానికి మాత్రమే చట్టాలను ఆయుధాలుగా ప్రయోగిస్తున్న స్త్రీల పుణ్యమా అని నిజంగా బాధపడుతున్న వాళ్లకి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. పంతాలు,పట్టింపుల కోసం పిల్లల్ని కూడా బలి చేయటానికి వెనుకాడని, మాత్రుత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి వాళ్ళ వలన 498 a ipc కేసులు పెట్టే వాళ్ళందరూ ఇలాగే  తప్పుడు కేసులు పెడుతున్నారనే అపోహ కలుగుతుంది.తద్వారా నిజమైన బాధితులను కూడా న్యాయవ్యవస్థ అనుమానాస్పద దృష్టితో చూడాల్సి వస్తుంది.

ఇంక అత్యాచారాలు,ప్రేమోన్మాదాలకి నేటి సమాజంలో కొదవే లేదు.ఎదుటివారి ప్రేమ,స్నేహం లో ఎంత నిజాయితీ ఉంది అనేది తెలుసుకోవాల్సిన వివేకం ప్రతి మహిళకీ అవసరం.తమ ప్రేమ నిజమైనంత మాత్రాన ఎదుటి వాళ్ళు కూడా అంటే నిజాయితీగా ఉంటారనే నియమమేమీ లేదు కదా..ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళు.కానీ ఇప్పుడు అబ్బాయిల్ని మోసం చేసే అమ్మాయిలు కూడా ఉంటున్నారనేది నిర్వివాదాంశం.అలాగే  పరిస్థితులు ఏవైనా సరే .. పెళ్ళయ్యి, పిల్లలు ఉన్న మహిళలు కూడా ప్రేమికుడితో కలిసి ఎటో  వెళ్ళిపోతున్న కేసులు ప్రస్తుత కాలంలో నమోదు కావటం మరొక విచారించాల్సిన విషయం. మనము  ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివాళ్ళ వలన ప్రమాదం రాదని నమ్మలేని ఈ రోజుల్లో "తెలుసుకొనవె యువతీ అలా నడుచుకోనవే యువతీ" అని చెప్పే పెద్దల మాటల్ని వినటంలో తప్పులేదు కదా..!

అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారు అంటారు కదా.. అది కూడా నిజమే "తోటి ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళకి ఉండే అసూయ" గురించి చెప్పనలవి కాదేమో.స్నేహశీలిగా,అందరితో కలుపుగోలుగా ఆప్యాయంగా ఉండే మహిళలు ఉన్నట్లే  ఎవరి ముందు వాళ్లకి తగిన మాటలు మాట్లాడుతూ,ఒకరి గురించి ఇంకొకరి దగ్గర అవాకులు,చవాకులు మాట్లాడి,ఎవరి మీదైనా కోపం వచ్చిందా వాళ్ళని ఎంత ఇబ్బందులకైనా గురి చేయగల చుప్పనాతి శూర్పణఖలు కూడా ఉంటారు.ఇద్దరు ఆడవాళ్ళు ఒకచోట కలిస్తే మగవాళ్ళ గురించి మాట్లాడతారో,లేదో తెలియదు కానీ మరొక స్త్రీ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుంటారనేది జగద్విదితమే.. ఒకప్పుడు ఇవి ఇంటి అరుగుల దగ్గర,నీళ్ళ పంపుల దగ్గర జరిగితే, ఇప్పుడు విద్యాధికులైన మహిళలు సంచరించే నెట్ ప్రపంచం లో కూడా ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయట. ఒక మగవాడి వలన కూడా జరగనంత కీడు ఇలాంటి మహిళల వల్ల  మరో  మహిళకి జరగటం బాధాకరమైన విషయం.

ఎన్నో రంగాల్లో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సాధించి,ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మహిళలున్న మన ప్రపంచంలో కేవలం క్షణికమైన కోపావేశాలు,స్వార్ధం,ఈర్ష్యా ,ద్వేషం,అసూయల మూలంగా సృష్టికి కారణ భూతమైన మహిళ ఆ సృష్టినే నాశనం చేసే ఒక భయానక భూతంగా కూడా మారిపోతుంది.సృష్టిలోని ఏ జీవి  కూడా తన సహజ లక్షణాలను వదులుకోదు.అటువంటిది ప్రేమ,దయ,జాలి,ఆప్యాయత,అనురాగం,క్షమ,సహనం ఇలా ఎన్నో మంచి గుణాలకి నెలవుగా, భగవంతుడు తనకు మారుగా సృష్టించిన స్త్రీ మాత్రం తన సహజ లక్షణాలను కోల్పోయి సమాజంలో ఎన్నో అనిశ్చిత పరిస్థితులకి దారితీసేలా ప్రవర్తిస్తుంది.

తప్పుని ఖండించాలి,చెడుని శిక్షించాలి  అలాగే అది తప్పా,ఒప్పా అన్న విచక్షణా జ్ఞానాన్ని కూడా తప్పకుండా కలిగి ఉండాలి.మంచి కోసం వచ్చిన మార్పుని మంచి కోసమే ఉపయోగించాలి.మహిళలమైన మన ద్వారా మరొక మహిళకి అన్యాయం జరిగేలా  ప్రవర్తించకూడదు..అప్పుడే ప్రతి మహిళా ఆదర్శ మహిళ అవుతుంది.మంచి అమ్మ  ద్వారా మంచి పిల్లలు,మంచి పిల్లలతో మంచి కుటుంబం,మంచి కుటుంబాలతో మంచి సమాజం తయారవుతుంది ,ఎందరో మహానుభావులు మహిళల కోసం చేసిన త్యాగాలకి ఒక అర్ధం,పరమార్ధం ఏర్పడుతుంది.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలని కించపరచటానికి ఈ వ్యాసం  రాయలేదు.అందరు ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారని నా అభిప్రాయం కాదు.ప్రస్తుతం జరుగున్న కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నా ఆలోచనలను  ఇలా  పంచుకుంటున్నాను..

ప్రేమకు, సహనానికి మరో రూపమైన ఎందరో మహిళామణులు
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 


Related Posts Plugin for WordPress, Blogger...