పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

12, అక్టోబర్ 2015, సోమవారం

కాకతీయ సామ్రాజ్ఞి - రాణీ రుద్రమదేవి




రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం .. నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

చిన్నప్పుడు అసెంబ్లీలో చాలా శ్రద్ధగా పాడుతూ ప్రతిరోజూ గుర్తు చేసుకునే వీరులలో రుద్రమదేవి ఒకరు.చరిత్ర, రాజుల పాలన అంటేనే యుద్ధాలు,పోరాటాలు,కుట్రలు కుతంత్రాలు.కాకతీయ వంశానికి చెందిన రాణీ రుద్రమదేవి ధీరవనిత, ధైర్యసాహసాలకి మారుపేరు, శత్రువులకి  సింహస్వప్నం,భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన రాణుల్లో రుద్రమదేవి ఒకరు. 800 వందల ఏళ్ళ క్రితమే ఇప్పుడు సర్వసామాన్యమైన మహిళా సాధికారతను సాధించటమే కాదు శత్రువు ఎంతగొప్ప వీరుడైనా తన పేరు చెప్తేనే వణికిపోయేలా రాజకీయ, యుద్ధవిద్యల్లో ఆరితేరిన యోధురాలు.తన శౌర్య పరాక్రమాలతో శత్రురాజులను గడగడలాడించటమే కాదు,ప్రజారంజకంగా ,ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు కలగకుండా చూసి, శత్రుదుర్భేధ్యమైన కోటలు,ప్రజల జీవనాధారమైన నీటి కోసం సముద్రాలను తలపించే చెరువులు కట్టించి సుపరిపాలన అందించిన కాకతీయ సామ్రాజ్ఞి. తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటూ కర్ణాటక, తమిళనాడు,మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ లలో రాజ్యం వీరభోజ్యం అనే మాట నిజం చేస్తూ దక్షిణాపధంలో సువిశాల సామ్రాజ్యాన్ని నెలకొల్పింది.

కాకతీయుల రాజధాని ఓరుగల్లు. కాకతీయ పాలకుల్లో ప్రముఖుడైన గణపతి దేవుడి చిన్న కుమార్తె రుద్రమ. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి పరిస్థితుల ప్రకారం రుద్రమదేవిని కుమారుడిగా పెంచి, అన్ని విద్యలు నేర్పించి, తన ప్రతినిధిగా ప్రకటించాడు గణపతిదేవుడు.ఆడపిల్ల అని భయపడకుండా కూతురిని కొడుకులాగా పెంచి రాజ్యార్హతను కల్పించిన గణపతిదేవుడు నిజంగా గొప్పతండ్రి. రుద్రమదేవి చక్రవర్తిగా క్రీస్తు శకం 1262 - 1289 అంటే 27 సంవత్సరాల పాటు పాలన సాగించింది. రుద్రమదేవి పాలనా కాలమంతా యుద్దాలతోనే గడిచింది.ముందుగా స్త్రీ  అధికారాన్ని, పాలనని  సహించలేని సామంతులు, దాయాదులే అంతర్గత శత్రువులుగా  చేసిన తిరుగుబాట్లన్నిటినీ సమర్ధవంతంగా తిప్పికొట్టింది రుద్రమ. ఓరుగల్లు కోటను ముట్టడించిన దేవగిరి యాదవ మహారాజు మహాదేవుడిని యుద్ధంలో ఓడించి బంగారు వరహాలను పరిహారంగా పొంది అతన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టింది.రుద్రమదేవి జరిపిన పోరాటాలన్నిటిలో ఆమెకు అండగా నిలిచిన సేనా నాయకులు ప్రసాదాదిత్య,గోనగన్నారెడ్డి, మల్లికార్జున నాయకుడు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు.

ఇటలీ దేశ రాయబారి మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించి రుద్రమను అత్యంత సమర్దురాలైన పాలనా దక్షత గల చక్రవర్తిగా అభివర్ణించాడు.కాకతీయుల వంశ చరిత్ర,పాలన,సాధించిన విజయాలు చాలావరకు వారు వివిధప్రదేశాల్లో వేయించిన శిలాశాసనాల్లో తెలుస్తుంది.ఓరుగల్లుకోట,రామప్పగుడి,వేయి స్తంభాలగుడి, కాకతీయుల శిల్పకళాపోషణకు,నైపుణ్యానికి నిదర్శనాలు.రుద్రమకాలంలోని కాకతీయుల సేనాని జాయప్ప పేరిణీ శివతాండవం సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం,సాహిత్యం,నృత్యం,శిల్పకళ ఎంతో  గొప్పగా విలసిల్లాయి.

14 ఏళ్లకే రాజ్యాధికారం చేపట్టిన రుద్రమకు 25 వ ఏట నిడదవోలు రాజు చాళుక్య వీరభధ్రుడితో వివాహం జరిగింది. వీరికి ముమ్ముడమ్మ,రుద్రమ్మ  ఇద్దరూ ఆడపిల్లలే.. తనకు పుత్ర సంతానం లేకపోవటంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్ముడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడిని దత్త పుత్రుడిగా యువరాజుగా పట్టాభిషేకం చేసింది.ఎన్నోసార్లు ఓటమి పాలైన వల్లూరు రాజు అంబదేవుడు రుద్రమదేవి మీద కక్ష కట్టి,రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించి,1289 లో పాండ్యులు,చోళులు,ఇతర సామంత రాజుల దాడిలో యుద్ధంలో ఎదురుగా రుద్రమను గెలవలేక, యుద్ధవిరామ సమయంలో శివపూజ చేసుకుంటున్న రుద్రమను దొంగచాటుగా చంపించాడని నల్గొండ చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తుంది.ఆ తర్వాత రాజ్యం చేపట్టిన ప్రతాపరుద్రుడి పరిపాలనా కాలం అంటా కూడా యుద్దాలతోనే గడించింది.కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాల కారణంగా ముస్లింరాజుల  దండయాత్రల్లో ఓటమి పాలయ్యాడు.యుద్ధంలో బందీగా చిక్కిన ప్రతాపరుద్రుడిని ఢిల్లీ తరలిస్తుండగా మార్గమధ్యంలోని నర్మదా నదిలో దూకి చనిపోయాడని 1423లో రెడ్డిరాణి వేయించిన అనితల్లి కలువచేరు తామ్రశాసనంలో తెలుస్తుంది. 

చిన్నప్పుడెప్పుడో చదివిన వీరనారి రాణీ రుద్రమదేవి చరిత్ర మళ్ళీ ఇప్పుడు గుణశేఖర్  రుద్రమదేవి - The warrion Queen సినిమా వలన గుర్తుకొచ్చింది. మనం ఎప్పుడో  చదివిన ఇలాంటి గొప్ప చరిత్రని ఇప్పటి వాళ్లకి  సినిమా ద్వారా  తెలియచేసిన దర్శకుడు,నిర్మాత గుణశేఖర్ ప్రయత్నం అభినందనీయం. మహేష్ బాబు " అర్జున్" సినిమాలో మధుర మీనాక్షి ఆలయం సెట్ లాగానే ఈ సినిమాలో కాకతీయసామ్రాజ్యం అప్పటి కోటలు,ఆలయాల్లో శిల్పకళ, కాకతీయుల కీర్తి తోరణాలు అన్నిటినీ ఆర్ట్  డైరెక్టర్ తోటతరణి డిజైన్ చేసిన ఆర్ట్ వర్క్ చాలా బాగుంది.

రుద్రమదేవి పాత్రకి తగినట్లుగా అనుష్క బాగుంది.ఒక్క సినిమాలోనే రుద్రమదేవి వీరత్వం చూపించటం అంటే సినిమా అంతా యుద్ధాలే ఉంటాయి కాబట్టి అలాంటి సీన్స్ కొన్నే ఉన్నాయి. అనుష్క,నిత్యామీనన్ చాలా అందంగా  కనిపించారు. రాణా  మామూలు సినిమాల్లో హీరో గా కంటే మొన్న బాహుబలిలో ఇప్పుడు ఈ సినిమాలో రాజుల పాత్రలకే చక్కగా సరిపోయాడు అనిపించింది. మహామంత్రి శివదేవయ్య గా ప్రకాష్ రాజ్ యుక్తిగా రాజుకి సలహాలిస్తూ  రాజ్యాన్ని కాపాడటం అప్పటి రోజుల్లో ఇలాంటి మంత్రులు ఉండబట్టే రాజులు అంత చక్కగా పరిపాలించేవారు అనిపిస్తుంది.కృష్ణంరాజు  "తాండ్రపారాయుడు" ముసలివయసులో  ఇలా ఉండేవాడన్న మాట అనిపిస్తుంది :) ఇక సినిమాలో అందరికీ నచ్చిన, మెచ్చిన అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్ర బాగుంది. బయటికి బందిపోటుగా ఉంటూ రుద్రమదేవికి సహకరించి, శత్రువుల్ని మట్టుబెట్టే   గోనగన్నారెడ్డి గురించి  ఈ సినిమా ద్వారా ఎక్కువగా తెలిసిందని చెప్పొచ్చు.తెలంగాణా యాస సరిగ్గా అలాగే మాట్లాడుతూ అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఒకప్పటి "ద్యావుడా..." లాగా ఇప్పటి "గమ్మునుండవో" లాంటి మాటల్ని కొన్ని వర్గాల అభిమానులు కొన్నాళ్ళపాటు మర్చిపోకుండా తలుచుకుంటారేమో.బందిపోటుకి తెలంగాణా భాష పెట్టి ,రాజులకి పెట్టకపోవటం కొంతమందికి నచ్చలేదట, 

సినిమాలో అందరికీ నచ్చిన కొన్ని అల్లు అర్జున్ డైలాగ్స్ :

నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా,ఈడా ఉంటా..

పద్మవ్యూహంలో ఇరుక్కోనికి నేను అభిమన్యుడ్ని  కాదు వ్యూహకర్తల
అమ్మామొగుడు శ్రీ కృష్ణుడసంటోడ్ని.

ఉంటే  వైకుంఠo లేకపోతే ఊకుంటం

పులిపాలు పిండేటోనికి బర్రెపాలు పిండుడు పందెమేందిరా

నా చర్యలకి ఆశ్చర్యపోవుడు తప్ప నన్ను చెరసాలలో వేసేటోడు పుట్టలే

మంచికి మంచి తోడు  అన్నట్లు చాళుక్యవీరభద్రుడు,గోనగన్నారెడ్డి,మంత్రి శివదేవయ్య లాంటి వాళ్లతోడు ఎంతటి వీరులకైనా అవసరం అనిపిస్తుంది.ఏడు కోటల నిర్మాణం,వాటి ఉపయోగంలో యుద్ధతంత్రం బాగుంది.వేలమంది సైనికులు రుద్రమని పాములాగా చుట్టుముట్టినప్పుడు గద్ద రూపంలో సైనికులతో గోనగన్నారెడ్డి ఎంట్రీ, అక్కడి యుద్ధవ్యూహం బాగున్నాయి.మనం చిన్నచిన్న సమస్యలకే భయపడిపోతుంటాం అలాంటిది అప్పటి మన రాజులు ఎదురుగా కత్తులు పట్టుకుని వచ్చే శత్రువులని ఎంత ధైర్యగా ఎదుర్కున్నారో కదా,అందుకే చరిత్రలో వీరులుగా నిలిచిపోయారు అనిపిస్తుంది.ప్రస్తుతం మనకి అప్పటి రాజుల్లాగా ధైర్య సాహసాలు,దాతృత్వం లాంటి గొప్ప లక్షణాలు లేకపోయినా,వారి దాయాదుల్లాగా కుట్రలు,కుతంత్రాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి..ఎంతైనా మంచికి వారసులున్నట్లే చెడుకి కూడా ఉంటారు కదా..!

రుద్రమదేవికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఒక ప్రత్యేకత.తెలుగు చరిత్ర గురించి దర్శకుడు గుణశేఖర్ చెప్పిన ఈ చరిత్ర  India’s first historical stereoscopic 3D film గా చరిత్రలో నిలిచిపోతుంది.మన చరిత్ర,సంస్కృతిని ఇప్పటి తరాలకు తెలియచేసే ఇలాంటి సినిమాలు ఇంకా వస్తే బాగుంటుంది.మొత్తానికి మొన్న బాహుబలి, ఇప్పుడు రుద్రమదేవి చిన్నప్పుడు NTR  కాలంలో వరసగా వచ్చే రాజుల సినిమాల జ్ఞాపకాలను గుర్తుచేశాయి.

చరిత్ర ఎప్పటికీ గొప్పదే ఆ చరిత్రను సృష్టించిన వీరులు,వారి సాహసాలు ఇంకా గొప్పవి. చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన,  స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నతమైన రూపం రుద్రమదేవి. ఓరుగల్లు భద్ర కాళికి వీరభధ్రుడు తోడై సృష్టించిన వీరనారి రుద్రమదేవి చరిత్ర సినిమాగా బాగుంది. 

రుద్రమదేవి -  The warrion Queen



Related Posts Plugin for WordPress, Blogger...