పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

5, అక్టోబర్ 2015, సోమవారం

డైలీ సీరియల్సు - లైఫు లెసన్సు




సాయంత్రం పని కాగానే బాల్కనీలో నాతో పాటూ కూర్చుని టీ తాగుతూ ఒక పావుగంటన్నా నాతో  కబుర్లు చెప్పటం మా పనిమనిషి రత్నానికి ఒక అలవాటు. అదేదో టీవీ యాడ్ లో పనివాళ్ళకి కూడా మనతో పాటూ మంచి కప్పుల్లో టీ లేదా కాఫీ ఇస్తేనే సంస్కారం ఉన్నట్లు అని చెప్పారు కదా అని మా పనమ్మాయికి  కూడా ఏదో ఒక పాత గ్లాసులో కాకుండా ఒక మంచి కప్పులోనే టీ ఇచ్చి దానితో కలిసి ఆ ముచ్చట్లు,ఈ ముచ్చట్లు,వాళ్ళ ముచ్చట్లు వీళ్ళముచ్చట్లు చెప్పుకోవటం నాకు కూడా మంచి టైమ్ పాస్. 

టీ తాగుతూ బాల్కనీలో నుండి కనపడే వచ్చిపోయే అమ్మాయిల్ని చూస్తూ ఆడపిల్లలు,వాళ్ళ చదువులు, సంస్కారాలు, వేషధారణలు,వాళ్ళ మీద జరుగుతున్న విపరీతాల గురించి మాట్లాడుతున్న మా రత్నాన్ని చూస్తుంటే నాకంటే నువ్వే నయం కదే ఎన్ని విషయాలు తెలుసు నీకు!! అనిపించింది.ఎంతైనా వందిళ్ళ టీవీ ఛానల్ కదా దానికి ఆ విషయాలన్నీ తెలియటం న్యాయమేలే అనుకుని, ఊర్లో  ఆడపిల్లల సంగతి సరే కానీ మీ అమ్మాయిల సంగతేంటి పెద్దమ్మాయికి సంబంధాలు చూస్తున్నానన్నావు కదా ఆమధ్య, మరి మిగతా ఇద్దరు అమ్మాయిలూ ఏమి చేస్తున్నారు అని అడిగి అంతలోనే అబ్బా అనవసరంగా అడిగానే.. ఎప్పటిలాగే ఇప్పుడిక ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అంటూ ఏడుపు సీన్ క్రియేట్ చేస్తుందా? అని అనుకుంటుండగానే నేనే ఆశ్చర్యపోయే ఝలక్ ఇచ్చింది మా రత్నం.

లేదమ్మా ఇంతకు  మునుపు తెలియక పెళ్ళికొడుకుల కోసం ఆ పెళ్ళిళ్ళ పేరయ్యలు,మ్యాట్రిమోనీలు (అబ్బో) అంటూ తెగ తిరిగినం, కానీ ఇప్పుడింక ఆ అగత్యం లేదనిపిస్తుందమ్మా అంది.ఆశ్చర్యపోవటం నా వంతయ్యింది, తను పాచిపని చేసినా కూతుళ్ళకి మంచి స్థాయిలో పెళ్ళిచేయాలని కలలు కంటూ, తీవ్రంగా సంబంధాలు వెతుకుతూ, ఎప్పుడైనా ఇంకా మీ అమ్మాయికి పెళ్లి కుదరలేదా అనగానే చేతిలో ఉన్న వస్తువుల్ని ఉన్నపళాన వదిలి పడేసి మరీ ముక్కు చీదే  రత్నంలో  ఇంత ధీమా ఎలా వచ్చిందబ్బా కొంపతీసి మన ముఖ్యమంత్రులు,ప్రధానమంత్రి గారు ఆడపిల్లలకి డబ్బుతో పాటు వరుడ్ని కూడా వెతికి పెట్టే పధకాలేమన్నా పెట్టారా ఏంటి అని (మనసులో) ఆశ్చర్యపోతూ..ఏంటి రత్నం విశేషం? మొత్తానికి సంబంధాలు కుదిరినట్లున్నాయే నాకు చెప్పలేదా ఏంటి అనగానే.. మీకు చెప్పకుండా ఉంటానామ్మా అని  కొనసాగించింది.  

మా పెద్దపిల్లని మన వీధి చివర ఉంటారే గతంలో రాజవంశానికి చెందిన అరుణ్ బాబు అనగానే నాకెక్కడలేని ఆత్రం వచ్చింది.సంతోషంతో అతను మీ అమ్మాయి అందం చూసి (ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ రత్నం కూతుళ్ళు రత్నంలా కాకుండా అందంగానే ఉంటారు )పెళ్ళి చేసుకుంటానన్నాడా ఏంటి కొంపతీసి అనగానే అబ్బ మీరూర్కొండమ్మా చెప్పేది పూర్తిగా వినకుండా ఓ ఓ ఓ ఆత్రపడతారు వాళ్ళింట్లో ఆళ్ళ బామ్మగారికి ఒళ్ళు బాలేదంటే కొన్నాళ్ళు సూస్కోడానికి మా పెద్దదాన్ని అక్కడ పెట్టానమ్మా అంది.ఏంటి పెద్దామెకి ఒళ్లుబాలేదంటే చూస్కోవటం అంటే.. ఆయాగా పెట్టావా? అయినా ఇంటర్ చదివిన పిల్లని అలా ఆయాగా పెట్టటానికి నీకు మనసెలా ఒప్పింది, నువ్వు తల్లివేనా అంటూ ఆగ్రహావేశాలతో, సంఘసంస్కర్తలందరినీ గుర్తు చేసుకుని మరీ నీకంత గతిలేకపోతే ఎంతో కొంత సాయం చేసి డిగ్రీ చదవించే వాళ్ళం కదా అప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆపిల్లకి తగ్గ సంబంధాలు కూడా వచ్చేవి అంటూ లెక్చర్ ఇస్తున్న నన్ను చిద్విలాసంగా చూస్తున్న రత్నాన్ని చూస్తే నాకింకా ఒళ్ళు మండిపోయింది.

అమ్మా అది డిగ్రీ చదివినా,మేము సంబంధాలు ఎతికినా ,మహా అయితే ఏ  క్లర్కో, టీచర్నో తేగలం అంతే కానీ  మాకు రాజవంశంలో సంబంధం ఎలా వస్తుందమ్మా? అందుకే ఈ ఏర్పాటు అంది. ఆ ఇంటికి ఆయాగా వెళ్తే రాజవంశం సంబంధం ఎలా వస్తుందే నాకేమీ అర్ధం అయ్యి చావట్లేదు నీ గోల అనగానే అందుకేనమ్మా ఎప్పుడూ ఆ ఫేస్ బుక్,బ్లాగులు,పుస్తకాలు అనకుండా అప్పుడప్పుడు టీవీలో సీరియళ్ళు కూడా చూడమనేది.జీ తెలుగు లో "మూగమనసులు" అనే సీరియల్ వచ్చిద్దమ్మా అందులో వీరోయిన్ ధరణి అచ్చం మా పెద్దమ్మాయిలాగానే పెద్ద పెద్ద కళ్ళు,వాలుజడ అందంగా ఉంటాది. ఈరో ఇంట్లో  ఆయాగా చేరి తన అందంతో మాత్రమే కాకండా తన మంచి, గొప్ప, కడిగినముత్యం లాంటి మనసుతో ఈరో గారి మనసు దోచేసి పెళ్లి సేసుకోడమే కాదు వాళ్ళ రాజ్యానికి ? రాణి కూడా అయిపోయింది.. వింటున్న నాకు నోరూర్కోదు కదా "ఆ .. ఆ ఇప్పుడలాగే చేసుకున్నా తర్వాత తక్కువ చూపు చూస్తారు" అంటున్న నన్ను ఓసి పిచ్చిదానా!! అన్నట్లు చూస్తూ అందుకేనమ్మా సీరియల్ చూడమని చెప్పింది.

అప్పుడు ఆయాగా వచ్చిన ఈరోయిన్ ధరణీ పెళ్ళి కాగానే ఇప్పుడు తన పెద్ద పెద్ద కళ్ళను ఇంకాస్త పెద్దవి చేసి చూస్తే చాలు ఈరో ఆదిత్య చలిజొరం వచ్చినోడ్లా గడ గడ వణుకుతూ అక్కడే ఒకటికి కూడా పోయేలా,ఆమె నాతో మాట్లాడితేనే మహాభాగ్యం అనుకుని పని పాటా మానేసి తన కొంగు పట్టుకుని తిరిగేలా చేసింది.చివరికి ధరణి వాళ్ళమ్మ (అత్తగారు) కూడా కుక్కలాగా చీదరించుకున్నా ఈరో ఆదిత్య ఏమీ అనడు తెలుసామ్మా??

అందుకేనమ్మా నేను డిసైడ్ అయినాను

మా పెద్దదాన్ని "మూగమనసుల్లో" ధరణి లాగా రాజా గారింట్లో ఆయాగా పెడతా..రాజాగారు మా అమ్మాయిని పెళ్ళిచేసుకుని,మా అమ్మాయి పెద్ద పెద్ద కళ్ళ చూపులకి భయపడుతూ ,పదునైన మాటలకి బదులు చెప్పలేక నీళ్ళు నములుతూ, అందులో ధరణి అమ్మ అల్లుడ్ని తిట్టినట్లు నా చీత్కారాలకి కూడా వణికిపోతూ, మా చుట్టూ తిరిగేలా చేస్తా.. 

రెండోదాన్ని "వరూధినీ పరిణయం" నాటికలో వరూధిని లాగా ఒక సెకండ్ హాండ్ లూనా కొనిచ్చి,కాసిన్ని జంతికలు, అరిసెలు, అప్పడాలు సంచీలో పోసి, అయ్యి అమ్మటానికి ఎల్లినప్పుడు ఎవరో ఒక గొప్పింటి బిజినెస్ మాగ్నెట్ అబ్బాయి కారు కింద కావాలనే పడి, పరిచయాలు పెంచుకుని రమ్మని చెప్పా. తర్వాత నేను,నా మొగుడు ఎంటర్ అయ్యి మాకిష్టం లేకపోయినా ఏదో వాళ్ళే బలవంతపెట్టినట్లుగా ఒప్పుకుని,వాళ్ళింటికి కోడల్ని చేస్తా.. పెళ్ళయ్యాక మా అమ్మాయి అచ్చం ఆ ఈరోయిన్ వరూధిని లాగానే కొయ్యముక్కకి చీర కట్టినట్లు ఒకచోట నిలవకుండా ఎగురుకుంటా, మొగుడ్ని,వాడి తరపు బంధువుల్ని నానా కూతలూ కూస్తూ ,వెటకారాలు చేస్తూ తిరిగినా ఏమీ అనలేని ఈరో పార్దూలాగా తయారుచేస్తా..

ఇంక మూడో పిల్ల కాస్త చిన్నది కాబట్టి "మంగమ్మగారి మనవరాలు" సీరియల్ లోగా ఏ ఇండస్ట్రియలిస్ట్ మంగమ్మో, పుల్లమ్మో తమకన్నా తక్కువ స్థాయి వాళ్ళైతే మాటవింటారని,పెత్తనం చేద్దామని సంబంధం కోసం వస్తారు కదా! అప్పటిదాకా ఎయిట్ చేసి, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ముందు అమ్మా మీ కాళ్ళు నొక్కుతాం అంటూ పెళ్లి చేసి,ఒక పిల్లో, పీచో కాగానే ఈరోయిన్ స్వర్ణ లాగా ఆ ముసల్దాన్ని ఏంటే ముసల్దానా నీ పెత్తనం అని విదిలించి కొట్టినా,నువ్వే కావాలి స్వర్ణా ,నువ్వే  దేవతవి అంటూ దేబిరించే ఈరో సాకేత్ లాంటి మొగుడ్ని నా చిన్నపిల్లకి తెస్తా ..

ఇంత  విన్నాక కూడా పాపం ఏదో దానికి తెలియని విషయాలేవో నాకు తెలుసన్న అజ్ఞానంతో .. అవన్నీ సీరియల్స్ రత్నం!! నిజంగా జరుగుతాయా?ఒకవేళ జరిగినా అంత  పెద్దస్థాయిలో ఉన్నవాళ్ళు కోడలు అలా చేస్తుంటే నోర్మూసుకుని ఊరకుంటారా? అలాంటి హీరోలు నిజజీవితంలో ఉండరు ఆ ధరణి,వరూధిని,స్వర్ణ లాగా కళ్ళు అమ్మోరిలా ఇంతింత పెద్దవి చేసి, జెండాకర్రలా పైకి, కిందికి ఎగురుతూ,ఇంట్లో అందరినీ మాటలు అంటూ ఉంటె ఎవరు పడతారు చెప్పు?లక్షలు,కోట్లు కట్నాలు ఇస్తేనే సరైన పెళ్ళిళ్ళు కావట్లేదు,అయినా సరిగా ఉండట్లేదు. ఇలాంటి ఆలోచనలు మంచివి కాదు.నీ మేలు కోరి చెప్తున్నా ..

అనేంతలోనే రత్నం అందుకుని,అమ్మా మధ్యానం 12 కి "బతుకు జట్కాబండి" వస్తది చూశారా? ఇలాంటి వాళ్ళని "జీయిత" చెర్నాకోలతో కొట్టి మరీ లాక్కొచ్చి,మొగుడ్ని వదిలి పెట్టిన పెళ్ళాల్ని,పెళ్ళాన్ని వదిలిపెట్టిన మొగుళ్ళని కలుపుద్ది.ఎవడైనా ఆమె మాట వినకపోతే మీద మీదకి పొయ్యి, కొట్టటానికి కూడా ఎనకాడదు. ఆ ప్రోగ్రాం కి అప్పటిదాకా కత్తులతో పొడుచుకుని,,సుత్తులతో బాదుకున్న జంటలు వచ్చినా సరే చిలకా ,గోరింకల్ల్లాగా నవ్వుతా కలిసి కొంపకి పోయేటట్లు చేస్తది ఆయమ్మ "జీయిత". అవసరమైతే మొగుడు,వాడి తల్లిదండ్రులు అడుక్కు తిన్నా సరే ఆడి ఆస్తంతా భార్య పేరు మీదే ఎట్టిస్తది. ఎవడైనా ఎక్కువ చేశాడా డొమెస్టిక్కు వయలిన్స్,ఇంకా ఎయ్యెయ్యొ చట్టాల కింద లోపల తోపిస్తా అంటది.దెబ్బకి ఎంతటి వాడైనా దారికి రావాల్సిందే .. అందుకేనమ్మా ఇయ్యన్నీ చూసినాక నాకు చాలా ధైర్యం వచ్చింది. నా పిల్లల గురించి నాకింకేమీ బెంగలేదు. .

అదమ్మా నా ఆలోచన నీక్కాబట్టి చెప్పా ..ఎవరితో అనకమ్మోయ్ అంటూ ఇంక ఎల్లొస్తానమ్మా సీరియల్స్ వచ్చే టైమైంది, నువ్వు కూడా కుదిర్తే చూడమ్మా ఇయ్యే కాదు ఇంకా చానా మంచి సీరియల్స్ వస్తాయ్ అంటూ వెళ్తున్న దాన్ని చూస్తే వింటున్న నేను వెర్రిదాన్నా అది వెర్రిదా  అర్ధం కాలేదు."తీవ్రవాదులకన్నా తీవ్రంగా ఉన్నాయే దీని ఆలోచనలు" టీవీ ఇప్పుడిలా ఉపయోగ పడుతుందా అనుకుంటూ,సరే వెళ్లిరా అంటూ దాని వెనకే వెళ్లాను,దానితో పాటూ దాని ఆలోచనల్ని కూడా గుమ్మం బయట వదలటానికి.

జనానికి కొత్త కొత్త తెలివితేటలూ,ఆలోచనలు నేర్పుతున్న డైలీ సీరియల్స్ గురించి 
ఈమధ్య స్వాతిలో వచ్చిన కార్టూన్



Related Posts Plugin for WordPress, Blogger...